తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 70

వికీసోర్స్ నుండి


రేకు: 0070-01 ఆహిరి సం: 01-364 భక్తి


పల్లవి:
ఏపనులు సేసినా నిటువలెనేపో
యీపనికిఁ జొరనిపని యేటిలోపైరు

చ.1:
హరికథలమీఁదిప్రియమబ్బు నా తొంటితమ....
పరిపక్వమగుఁ దప: ఫలముగాక
గరిమె నివిలేకున్నఁ గలకాలములుఁ జేయు
నిరతంపుఁదపమెల్ల నీటిలో వ్రాత

చ.2:
నారాయణునిభక్తి ననిచెనా ధనమెల్లఁ
బారఁజల్లిన దానఫల మదియపో
కోరి యివి లేకున్న కోటిదానములైన
పేరుకొని వరతఁగలపినచింతపండు

చ.3:
వదల కిటు వేంకటేశ్వరుఁడే దైవంబనుచుఁ
జదువఁగలిగిన మంచిచదు వదియపో
పదిలముగ నీవిధము పట్టియ్యకుండినను
చదువు లసురలు మున్ను చదివేటిచదువు


రేకు: 0070-02 శ్రీరాగం సం; 01-365 భక్థి


పల్లవి:
అణురేణు పరిపూర్జుఁడైన శ్రీవల్లభుని
బ్రణుతించువారువో బ్రాహ్మలు

చ.1:
హరి నామములనె సంధ్యాది విథులొనరించు
పరిపూర్ణమతులు వో బ్రాహ్మలు
హరి మంత్ర వేద పారాయణులు హరి భక్తి
పరులైన వారువో బ్రాహ్మలు

చ.2:
యేమి చూచినను హరి యిన్నిటాఁ గలఁడనుచు
భావించువారువో బ్రాహ్మలు
దేవకీనందనుఁడె దేవుఁడని మతిఁదెలియు
పావనులు వారువో బ్రాహ్మలు

చ.3:
ఆదినారాయణుని ననయంబుఁ దమయాత్మఁ
బాదుకొలిపిన వారు బ్రాహ్మలు
వేద రక్షకుఁడైన వేంకట గిరీశ్వరుని
పాద సేవకులవో బ్రాహ్మలు


రేకు: 0070-03 దేసాక్షి సం: 01-366 హనుమ


పల్లవి:
సీతాశోక విఘాతక
పాతాళ లంకాపతివిభాళా

చ.1:
హనుమంతరాయ అంజనీతనయ వో-
వనధిలంఘనగాత్ర వాయుపుత్రా
యినకులాధిపనిజహిత జగన్నుత-
వనజోదరసేవక సత్వధనికా

చ.2:
ప్రళయాంతకరూప బలదీప రవిఫల-
గిళనప్రతాప సుగ్రీవప్రియా
కుళకదానవసంకులవిదారణ
భళిభళి జగత్పతిబలుబంటా

చ.3:
పంకజాసనుదివ్యపదవైభవ వో-
లంకిణీ ప్రాణ విలంఘన
వేంకటేశ్వరు సేవావీర మహాధీర
కింకరరాయ సుఖీభవా


రేకు: 0070-04 శ్రీరాగం సం: 01-367 భక్థి


పల్లవి:
ఇన్ని జన్మము లేఁటికి హరిదాసు-
లున్న వూరఁ దా నుండినఁ జాలు

చ.1:
హరిభక్తుల యింటియన్నము గొనువారి-
వరువుడై వుండవలెనన్నఁ జాలు
పరమభాగవత భవనంబులఁ జెడ్డ
పురువు దానయి పొడమినఁ జాలు

చ.2:
వాసుదేవుని భక్తవరులదాసులు మున్ను-
రోసినయెంగిలి రుచిగొన్నఁ జాలు
శ్రీ సతీశునిఁ దలఁచినవారి దాసాన-
దాఁసుడై వుండఁదలఁచినఁ జాలు

చ.3:
శ్రీ వేంకటేశుఁ జూచినవారిశ్రీ పాద-
సేవకుఁడై యండఁజేరినఁ జాలు
యీవిభుదాసుల హితుల పాదధూళి-
పావనమై సోఁకి బ్రదికినఁ జాలు


రేకు: 0070-05 ముఖారిసం: 01-368 ఉత్సవ కీర్తనలు


పల్లవి:
భోగీంద్రులును మీరుఁబోయి రండు
వేగిన మీఁదటి విభవాలకు

చ.1:
హరుఁడ పోయిరా అజుఁడ నీవును బోయి
తిరిగిరా మీఁదటి తిరుణాళ్ళకు
సురలు మునులును భూసురులుఁభోయి రండు
అరవిరి నిన్నాళ్ళు నలసితిరి

చ.2:
జముఁడ పోయిరా శశియు నీవును బోయి
సుముఖుఁడవై రా సురలఁ గూడి
గుములై దికృతులు దిక్కులకుఁ బోయి రండు
ప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి

చ.3:
నారద సనకసనందనాదులు
భూరి విభవములఁ బోయిరండు
దూరముగాఁ బోకిట్టే తొరలి వేంకటగిరిఁ
జేరి నన్నిట్లనే సేవించుఁడీ


రేకు: 0070-06 సామంతం సం; 01-369 అధ్యాత్మ


పల్లవి:
అతనికెట్ల సతమైతినో కడు-
హితవో పొందులహితవో యెఱఁగ

చ.1:
హృదయము తలఁపున నిరవయినఁగదా
పదిలమౌను లోపలిమాట
వెదకినచిత్తము వెర వెఱఁగదు నే -
నెదిరి నెఱఁగ నే నేమియు నెఱఁగ

చ.2:
కాలూఁద మనసు గలిగికదా నా-
తాలిమి మతిలోఁ దగులౌట
మేలిమిపతిలో మెలఁగుటేదో నే -
నేలో నే నిపుడెక్కడో యెఱఁగ

చ.3:
నేఁడని రేపని నే నెఱిఁగికదా
పోఁడిమి మతిలో పొలుపౌట
వాఁడే వేంకటేశ్వరుఁడు రాఁగలిగె
ఆఁడుజన్మమేనౌటిది యెఱుఁగ