తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 61

వికీసోర్స్ నుండి


రేకు: 0061-01 ఛాయనాట సం; 01-310 వైరాగ్య చింత


పల్లవి:
తలఁప వెనక నుయ్యి తగరు ముందట దీనఁ
దొలఁగ నాకుఁ దెరువు దోపఁ దేమిసేతు

చ.1:
మమకార విముక్తి మార్గదూరము నీపై
మమతసేయక నాకు మనరాదు
మమత మేలో నిర్మమత మేలో దీని-
క్రమమున క్రమము నేఁ గాన నేమి సేతు

చ.2:
కర్మమార్గము జన్మగతికిఁ జేరువ ని-
ష్కర్మము పాతకమునకుఁ దొడవు
కర్మిగావలెనో నిష్కర్మి గావలెనో యీ-
మర్మంపు మదము మాన దేమిసేతు

చ.3:
శరణాగత రక్షకుడవైనయట్టి
తిరువేంకటగిరిదేవుఁడా
పరిపూర్ణఁడవో నీవు పరిచ్చిన్నుఁడవో ని-
న్నరసి భజింపలేనైతి నేమిసేతు


రేకు: 0061-02 మలహరిసం;: 01-311 కృస్ణ


పల్లవి:
పాలదొంగవద్దవచ్చి పాడేరు తమ-
పాలిటిదైవమని బ్రహ్మదులు

చ.1:
రోలఁ గటిపైంచుక పెద్దరోలలుగా వాపోవు
బాలునిముందర వచ్చి పాడేరు
ఆలకించి వినుమని యంబరభాగమునందు
నాలుగుదిక్కులనుండి నారదాదులు

చ.2:
నోరునిండా జోల్లుగార నూఁగి ధూళిమేనితో
పారేటిబిడ్డని వద్దఁ బాడేరు
వేరులేని వేదములు వెంటవెంటఁ జదువుచుఁ
జేరిచేరి యింతనంత శేషా-- దులు

చ.3:
ముద్దులు మోమునఁగార మూలల మూలలదాఁగే-
బద్దులబాలునివద్దఁ బాడేరు
అద్దివో శ్రీతిరువేంకటాద్రీశుఁ డితఁడని
చద్దికి మేఁడికి వచ్చి సనకాదులు


రేకు: 0౦61-03 థన్నాశి సం: 01-312 నామ సంకీర్తన

పల్లవి:
నంద నందన వేణునాద వినోదము
కుంద కుంద దంతహాస గోవర్టనధరా

చ.1:
రామ రామగోవింద రవిచంద్రలోచన
కామ కామకలుష వికారవిదూరా
థామ థామవిభవత్ప్రతాపరూప దనుజని-
ర్థూమధామ కరణచతుర భవభంజనా

చ.2:
కమల కమలవాస కమలారమణ దేవో-
త్తమ తమో గుణసతతవిదూర
ప్రమదత్ప్రదానుభవభావకరణ
సుముఖ సుధా నంద శుభరంజనా

చ.3:
పరమ పరాత్పర పరమేశ్వరా
వరద వరదామల వాసుదేవ
చిరచిర ఘననగ శ్రీవేంకటేశ్వర
నర హరినామ పన్నగశయనా


రేకు: 0061-04 కన్నడగౌళ సం: 01-313 వైరాగ్య చింత


పల్లవి:
వెలికీ వెళ్ళఁడు చలికీ వెరవఁడు
వులికీ నులికీ నులికీనయ్యా

చ.1;
రోగియై తా రుచులఁ బాయఁడు
భోగియై రతిపొందల్లఁడు
వేగి మిగిలిన వెడచీఁకటినీరు
తాగీఁ దాగీఁ దాగీనయ్యా

చ.2:
తొడికీఁ దొడుకఁడు వుడికీ నుడుకఁడు
కడికీఁ గసరఁడు కడుఁజేరఁడు
మడికీ గుడికీ మానిన మమతలఁ
బుడికీఁ బుడికీఁ బుడికీనయ్యా

చ.3:
నిండీ నిండఁడు నెరసీ నెరయఁడు
పండీఁ బండఁడు బయలీఁతలా
అండనె తిరువేంకటాధిపుఁ దలఁపుచు
నుండీ నుండీ నుండీనయ్యా


రేకు: ౦౦61-05 ధన్నాశి సం: 01-314 రామ


పల్లవి:
దేవ దేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రఘుపుంగవం

చ.1:
రాజవరశేఖరం రవికుల సుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయం
రాజారి కోదండ రాజదీక్షా గురుం
రాజీవలోచనం రామచంద్రం

చ.2:
నీల జీమూత సన్నిభ శరీరం ఘనవి
శాల వక్షం విమల జలజనాభం
తాలాహి నగహరం ధర్మ సంస్థాపనం
భూల లనాధిపం భోగిశయనం

చ.3:
పంకజాసన వినుత పరమ నారాయణం
శంకరార్థిత జనక చాప దళనం
లంకా విశోషణం లాలిత విభీషణం
వేంకటేశం సాధు విబుధ వినుతం


రేకు: 0061-06 ఆహిరి సం: 01-315 వైరాగ్య చింత

పల్లవి:
ఎడమపురివెట్టె పరహితవివేకము, లోన
గుడుసువడెఁ జదువు, మెరుఁగులువారెఁ జలము

చ.1:
లంప మేయఁగఁదొణఁగె లలితంపుమతి లోనె,
తెంపు దిగవిడిచె యెడ తెగనిమానంబు,
చంప దొరకొనియె వేటలేని తమకంబు,
యింపు ఘనమాయ నే నిఁకనేమి సేతు

చ.2:
బయలువందిలివెట్టు పనిలేనిలంపటము,
దయ విడువఁదొడఁగె చిత్తములోనికాంక్ష,
పయికొన్న మోహంబు పడనిపాట్లఁ బరచె,
లయమాయ శాంతి మెల్లనె తీరె నెరుక

చ.3:
చావుఁబుట్టువు మఱచె సంసారబంధబు,
దైవమును విడిచె యాతరికంపుఁబ్రియము
శ్రీవేంకటేశ్వరుఁడు చిత్తరంజకుఁడు యిఁకఁ
గావలసినది యతనికరుణ ప్రాణులకు