Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 26

వికీసోర్స్ నుండి

రేకు: 0026-01 లలిత సం: 01-156 వైరాగ్య చింత


పల్లవి :

ఎనుపోతుతో నెద్దు నేరుగట్టినయట్లు
యెనసి ముందర సాగ దేఁటి బ్రదుకు


చ. 1:

కడలేనియాసచే కరఁగికరఁగి చిత్త-
మెడమవంకకు వచ్చె నేఁటి బ్రదుకు
పొడవైన మమతతోఁ బొదలఁ బొదల మాన-
మిడుమపాట్లఁ బడె నేఁటి బ్రదుకు


చ. 2:

తెగుదెంపులేనిభ్రాంతికిఁ జిక్కి యాచార-
మెరసి గొందులు దూరె నేఁటి బ్రదుకు
పగగొన్న మోహతాపము వేరుగ విజ్ఞాన-
మిగురువెట్టక మానె నేఁటి బ్రదుకు


చ. 3:

భావింప రోఁతలోఁ బడి పొరలెడిసౌఖ్య -
మేపగింపఁడు జీవుఁ డేఁటి బ్రదుకు
శ్రీవేంకటేశుపై చిత్త మొక్కటె కాని
యేవంక సుఖము లే దేఁటి బ్రదుకు

రేకు: 0026-02 శ్రీరాగం సం: 01-157 వైరాగ్య చింత


పల్లవి :

చావుతో సరియైన సౌఖ్యంబులోఁ దగిలి
వేవేలు దురితముల వేగించు టొండె


చ. 1:

కనుఁగొనల నిరుమేను గాఁడిపారుట లొండె
చనుఁగొండలను మహచరులఁ బడు టొండె
తనివోని సురతములఁ దగిలి మునుఁగుట యొండె
ఘనమోహబంధములఁ గట్టువడు టొండె


చ. 2:

మొనసి యాశాపాశములయురులఁ బడు టొండె
కనలి పొలయలుకచేఁ గాఁగు టది యొండె
మనసు కాఁతాళమును మల్లువెనఁగుట లొండె
పనిలేని మదనాగ్నిఁ బడి పొరలు టొండె


చ. 3:

తడసి మమతల నిరంతర దైన్యమది యొండె
నడుమనే కన్నుగానక తిరుగు టొండె
యెడప కీతిరువేంకటేశుఁ దలఁపఁగలేక
పడని పాట్లనెల్లఁ బడి వేఁగు టొండె

రేకు: 0026-03 ముఖారి సం: 01-158 శరణాగతి


పల్లవి :

ఆఁకటివేళల నలపైన వేళలను
తేఁకువ హరినామమే దిక్కు మఱిలేదు


చ. 1:

కొఱమాలి వున్నవేళ కులము చెడినవేళ
చెఱఁవొడి వొరులచేఁ జిక్కినవేళ
వొఱపైన హరినామ మొక్కటే గతిగాక
మఱచి తప్పిననైన మఱిలేదు తెరఁగు


చ. 2:

ఆపద వచ్చినవేళ యారడిఁబడినవేళ
పాపపు వేళల భయపడినవేళ
వోపినంత హరినామ మొక్కటే గతిగాక
మాపుదాఁకాఁ బొరలిన మరిలేదు తెఱఁగు


చ. 3:

సంకెళఁ బెట్టినవేళ చంపఁ బిలిచిన వేళ
అంకిలిగా నప్పులవారాఁగిన వేళ
వేంకటేశునామమే విడిపించ గతిగాక
మంకుబుద్ధిఁ బొరలిన మరిలేదు తెఱఁగు

రేకు: 0026-04 ముఖారి సం: 01-159 వైరాగ్య చింత


పల్లవి :

మోసమున మాయావిమోహితుఁడై పోయి
కాసు సేయని పనికి గాసిఁబడెఁ బ్రాణి


చ. 1:

కన్నులనియెడి మహకల్పభూజము లివి
తన్నుఁ బుణ్యనిఁ జేయఁ దగిలి వచ్చినవి
వున్నతోన్నతబుద్ధి నొనగూర్ప కది దేహి
కన్న చోటికిఁ బఱపి గాసిఁబడెఁ బ్రాణి


చ. 2:

చిత్తమనియెడి మహచింతామణి దనకు
తొత్తువలె వలసి తనుఁ దోడుతేఁగలది
హత్తించి హరిమీఁద నలరింప కది వృథా
తిత్తిలో సుఖమునకు తిరిగె నీప్రాణి


చ. 3:

కామతత్వంబనెడి కామధేనువు దనకు
వేమారుఁ గోరికల వెల్లిగొలిపెడిది
యీమేను తిరువేంకటేశుఁ జేరకపోయి
కామాంధుఁడై మిగుల గతిమాలెఁ బ్రాణి

రేకు: 0026-05 దేసాక్షి సం: 01-160 అధ్యాత్మ


పల్లవి :

కొండో నుయ్యో కుమతులాల
తండుముండు తట్టుముట్టు తాఁకైనఁ గనుఁడీ


చ. 1:

కాకివోటు జముచేత కందుకుందు మరుచేత
మాకాపని గారు మనుజులాల
పోకుమని యాఁపరాదు పొమ్మని చెప్పఁగరాదు
మీకుమీకే చూచుకొండు మీరే కనుఁడు


చ. 2:

గాములిల్లు పుట్టమీఁది కప్పు తోలు పై కప్పు
నేమా యెఱఁగము నిపుణులాల
పామునోరికడి మీప్రాణపుటూరుపు గాలి
జాము జాము మేలుఁగీడు చక్కఁజేయఁ గనుఁడు


చ. 3:

రచ్చమాని చింతకిందు రాఁపులకూటమిపొందు
ముచ్చో చిచ్చో మూఢులాల
యెచ్చరికతోడ వేంకటేశుదాసులఁ గూడి
పచ్చిగచ్చు మేనితోడ భయమెల్ల బాయుఁడు

రేకు: 0026-06 నాట సం: 01-161 వైరాగ్య చింత


పల్లవి :

మందులేదు దీనికి మంత్ర మేమియులేదు
మందుమంత్రము దనమతిలోనే కలదు


చ. 1:

కదలకుండఁగఁ దన్నుఁ గట్టివేసినఁ, గట్టు
వదలించుకొనఁ గొంత వలదా
వదలించఁబోయిన వడిగొని పైపైనే
కదియుఁగాని తన్ను వదల దేమియును


చ. 2:

మనసు లోపలనుండి మరి మీఁదఁ దానుండి
యెనసిన తిరువేంకటేశుని
తనరిన తలఁపునఁ దలఁప దుష్కృతములు
తనకుఁదానే వీడుఁ దలఁకవలదుగాన