Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 25

వికీసోర్స్ నుండి

రేకు: 0025-01 దేసాక్షి సం: 01-149 అధ్యాత్మ


పల్లవి :

ఒప్పులై నొప్పులై వుండుఁగాన
అప్పటప్పటికిఁ జూడ నదియేకా నిజము


చ. 1:

కన్నుల కిన్నియుఁజూడ కలలై వలలై
వున్నతాలు నడ్డాలై వుండుఁగాన
చిన్న చిన్న చిటిపొటి చిమ్ముదొమ్ముదిమ్ములవి
వున్నవన్నియుఁ జూడ నొకటేకా నిజము


చ. 2:

సారేకు నోరికిఁ జూడ చవులై నవ్వులై
వూరటమాటలై వుండుఁగాన
తారుమారు తాఁకు సోఁకు తప్పుదోఁపు లిన్నియు
వోరపారులేనివెల్ల వొక్కటెకా నిజము


చ. 3:

మేనికి నిన్నియుఁ జూడ మృదువై పొదువై
పూని సంపదలై వుండుఁగాన
తేనై తీపై తిరువేంకటేశ నిన్ను
కానవచ్చినదే వొక్క టేకా నిజము

రేకు: 0025-02 శంకరాభరణం సం: 01-150 వైరాగ్య చింత


పల్లవి :

పనిలేని ధనవాంఛఁ బడిపొరలిన నిట్టి -
కనుమాయలే కాక కడ నేమిగలదు


చ. 1:

కనుచూపు కాఁకలఁ గలయుట వెడయాస -
లనుభవింపుటగాక యందేమిగలదు
తనువల్లి సోఁకులఁ దగులుట మమతల -
నెనయఁ గోరుటగాక యిందేమిగలదు


చ. 2:

యెలమి నధర మాను టెరిఁగి యెంగిలి నోర
నలముకొనుట గాక యందేమిగలదు
పలులంపటములచేఁ బడుట దుఃఖంబులు
తలఁజుట్టుటే కాక తన కేమికలదు


చ. 3:

శ్రీ వేంకటాద్రీశుఁ జేరనిపనులెల్ల -
నేపగింతలే కాక యిందేమిగలదు
ఆవల సురతభోగ మనుభవింపఁబోయి
రావలయుటగాక రచనేమిగలదు

రేకు: 0025-03 సామంతం సం: 01-151 వేంకటగానం


పల్లవి :

కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు


చ. 1:

కుమ్మరదాసుఁడైన కురువరతినంబి
ఇమ్మన్నవరములెల్ల నిచ్చినవాఁడు
దొమ్ములు సేసినయట్టి తొండమాంజక్కురవర్తి
రమ్మనచోటికి వచ్చి నమ్మినవాఁడు


చ. 2:

అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి
ముచ్చిలి వెట్టికి మన్నుమోఁచినవాఁడు
మచ్చిక దొలఁకఁ దిరుమలనంబితోడుత
నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాఁడు


చ. 3:

కంచిలోన నుండఁ దిరుకచ్చినంబిమీఁదఁ గరు-
ణించి తనయెడకు రప్పించినవాఁడు
యెంచ నెక్కుడైనవేంకటేశుఁడు మనలకు
మంచివాఁడై కరుణఁ బాలించినవాఁడు

రేకు: 0025-04 గుండక్రియ సం: 01-152 అధ్యాత్మ


పల్లవి :

కడుఁ జంచలములు కడునధ్రువములు
కడు నల్పములని కాదందురు


చ. 1:

కర్మబోధ వికారంబులు
ధర్మతంత్ర సంధానములు
దుర్మదైక సందోహములు
కర్మదూరు లివి గాదందురు


చ. 2:

పరమభాగవత భవ్యమతులు
పరమబోధ సంభావకులు
తిరువేంకటగిరిదేవు సేవకులు
కరుణాధికు లివి గాదందురు

రేకు: 0025-05 గుండక్రియ సం: 01-153 వైరాగ్య చింత


పల్లవి :

పోయం గాలము వృథయై పుట్టిన మొదలుం గటకట
నీయెడ నామది నిజమై నిటుచుట యెన్నఁ డొకో


చ. 1:

కుడిచిన నాఁకలి దీరదు కడువఁగఁ గుడువఁగఁ బైపై
కడుఁబొదలెడు దీపన మిది గడచుట యిఁక నెట్లు
కుడువక మానుట యెన్నడు కోరికదీరుట యెన్నడు
తడయక నీరూపము నేఁ దలఁచుట లెన్నఁడొకో


చ. 2:

జీవుఁడుపుట్టిన మొదలునుఁ జేతికి నూఱట చాలక
యేవిధమున భుజియించిన నెడయదు దీపనము
శ్రీవేంకటపతి నా కిఁక శ్రీకరుణామృత మియ్యక
పావనమందదు నామది పాలించంద గదా

రేకు: 0025-06 లలిత సం: 01-154 అధ్యాత్మ


పల్లవి :

అతిశయమగు సౌఖ్య మనుభవింపుమన్న
హితవు చేకొననొల్ల రిందరు


చ. 1:

కడలేని విజ్ఞానగతికిఁ దోడుగారు
యెడపుల వారలె యిందరు
అడరిన మోక్షసహయు లెవ్వరు లేరు
యిడుమ పాట్లవారె యిందరు


చ. 2:

తిరమైన పుణ్యము బోధించేవారు లేరు
యెరపులవారే యిందరు
తిరువేంకటాచలాధిపుని మీఁది చిత్త
మిరపు నేయకపోయి రిందరు

రేకు: 0025-07 మాళవి సం 01-155 సంస్కృత కీర్తనలు


పల్లవి :

శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణా
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు


చ. 1:

కమలాసతీ ముఖకమల కమలహిత
కమలప్రియ కమలేక్షణా
కమలాసనహిత గరుడగమన శ్రీ-
కమలనాభ నీపదకమలమే శరణు


చ. 2:

పరమయోగిజనభాగధేయ శ్రీ-
పరమపూరుషా పరాత్పరా
పరమాతుమ పరమాణురూప శ్రీ-
తిరువేంకటగిరిదేవ శరణు