Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 20

వికీసోర్స్ నుండి

రేకు: 0020-01 ఆహిరి సం: 01-119 తిరుపతి క్షేత్రం


పల్లవి :

తోరణములే దోవెల్లా
మూరట బారట ముంచినలతల


చ. 1:

కూరిమిమటములు గోపురంబులును
తేరుపడగెలే తెరువెల్లా
కోరినపండ్లు గురిసేటితరువులు
తోరములైనవెదురుజొంపములు


చ. 2:

ఆటలుఁ దిరుపులు నందపుటురువులు
పాటలు వనవైభవమెల్లా
కూటువ నెమళ్ళ కోవిల గుంపుల
పేటలఁ దేటలపెనుఁగూటములు


చ. 3:

వింజామరలును విసనకఱ్ఱలును
గొంజెగొడుగిలే కొండెల్లా
అంజనగిరిరాయఁడు వేంకటపతి
సంజీవని పరుషల కొదవఁగను

రేకు: 0020-02 మాళవి సం: 01-120 హనుమ


పల్లవి :

బాపు దైవమా మా పాలిభవమా
తీపు రాకాసినెత్తురు దీం దోందోం దోందోం దోందోం


చ. 1:

కాలనేమిపునుకిది కంచువలె లెస్స వాఁగీ
తాళమొత్తరే తత్త తత తత్తత్త
కాలమెల్ల మాభూతగణమెల్ల వీఁడె కాచె
నేలఁబడి నేఁడును ధీం ధీం ధీం ధీం ధీం ధీం ధీం


చ. 2:

పగగొని మానక పచ్చి నెత్తు రెప్పుడును
తెగి కొనుఁ దానె తిత్తి తిత్తి తిత్తితి
తగుమహోదరువీఁపు దణధణమని వాఁగీ
బిగీ -యుంచరే తోలు బింభిం బింభిం బింభింభిం


చ. 3:

మురదనుజుని పెద్దమొదలియెముకఁ దీసి
తురులూదరే తుత్తు తుత్తు తుత్తుత్తు
తిరువేంకటగిరిదేవుఁడు గెలిచిన స-
మరమునను మమ్మ మమ్మ మమ్మ మమ్మమ

రేకు: 0020-03 భూపాళం సం: 01-121 వేంకటగానం


పల్లవి :

వాడె వేంకటేశుఁడనే వాఁడె వీఁడు
వాఁడి చుట్టుఁ గైదువ వలచేతివాఁడు


చ. 1:

కారిమారసుతుని చక్కని మాటలకుఁ జొక్కి
చూరగా వేదాలగుట్టు చూపినవాఁడు
తీరని వేడుకతో తిరుమంగయాళువారి
ఆరడి ముచ్చిమి కూటి కాసపడ్డవాఁడు


చ. 2:

పెరియాళువారి బిడ్డ పిసికి పైవేసిన
విరుల దండల మెడవేసినవాఁడు
తరుణి చేయి వేసిన దగ్గరి బుజము చూఁచి
పరవశమై చొక్కి పాయలేని వాఁడు


చ. 3:

పామరులఁ దనమీద పాటలెల్లాఁ బాడుమంటా
భూమికెల్లా నోర నూరి పోసినవాఁడు
మామకూఁతురలమేలుమంగ నాచారియుఁ దాను
గీముగానే వేంకటగిరి నుండేవాఁడు

రేకు: 0020-04 ఆహిరి సం: 01-122 కృష్ణ


పల్లవి :

అంటఁబారి పట్టుకోరె అమ్మలాల యిదె
వెంటఁబారనీదు నన్ను వెడమాయతురుము


చ. 1:

కాఁగెడు పెరుగుచాడె కవ్వముతోఁ బొడిచి
లేఁగలఁ దోలుకొని అలిగిపోయీని
రాఁగతనమున వాఁడె రాతిరి నారగించఁడు
ఆఁగి నన్నుఁ గూడడిగె నయ్యో ఇందాఁకను


చ. 2:

కొలఁదిగాని పెరుగు కొసరికొసరి పోరి
కలవూరుఁ గాయలెల్లఁ గలఁచిపెట్టె
పలుకఁడు చేతిచట్టి పారవేసి పోయీనదె
చెలఁగుచు మూఁటగట్టెఁ జెల్లఁబో యిందాఁకను


చ. 3:

మట్టుపడ కిటు నూరుమారులైనా నారగించు
ఇట్టె యిందరిలోని నాన్నాళ్ళును
వెట్టికి నాకొరకుఁగా వేంకటేశుఁ డారగించె
యెట్టు నేఁ డాఁకట ధరియించెనో యిందాఁకను

రేకు: 0020-05 భూపాళం సం: 01-123 వైరాగ్య చింత


పల్లవి :

ఏమో తెలిసెఁగాని యీజీవుఁడు
నేమంపు నెరవిద్య నేరఁడాయ


చ. 1:

కపటాలె నేరిచెఁగానీ జీవుఁడు
యెపుడైనా నిజసుఖ మెఱఁగఁడాయ
కవురులే చవిగొనెఁగానీ జీవుఁడు
అపరిమితామృత మానఁడాయ


చ. 2:

కడలనే తిరిగీఁగానీ జీవుఁడు
నడుము మొదలుఁ జూచి నడవఁడాయ
కడుపుకూటికే పోయీఁగానీ జీవుఁడు
చెడని జీతముపొంతఁ జేరఁడాయ


చ. 3:

కనియుఁ గానకపోయఁగానీ జీవుఁడు
దినము వేంకటపతిఁ దెలియఁడాయ
కనుమాయలనె చొక్కెఁగానీ జీవుఁడు
తనియ నిట్టే మంచిదరిఁ జేరఁడాయ

రేకు: 0020-06 సామంతం సం: 01-124 అధ్యాత్మ


పల్లవి :

తనదీఁగాక యిందరిదీఁగాక
తనువెల్ల బయలై దరిచేరదు


చ. 1:

కడుపూ నిండదు కన్నూఁ దనియదు
కడఁగి లోనియాఁకలియుఁ బోదు
సడిఁబడి కుడిచినకుడుపెల్ల నినుము
గుడిచిన నీరై కొల్లఁబోయె


చ. 2:

చవియూఁ దీరదు చలమూఁ బాయదు
లవలేశమైన నొల్లకపోదు
చివచివ నోటికడవలోనినీరై
కవకవ నవియుచుఁ గారీని


చ. 3:

అలపూఁ దోఁపదు అడవీ నెండదు
యెలయించు భంగమయునఁ బోదు
తెలసి వేంకటగిరిదేవునిఁ దలఁపించు
తలఁపైనఁ దనకు ముందర నబ్బదు