తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 19

వికీసోర్స్ నుండి

రేకు: 0019-01 ఆహిరి సం: 01-113 వైరాగ్య చింత


పల్లవి :

ఎన్నాళ్ళదాఁకఁ దానిట్టె వుండుట బుద్ది
కన్న పోవుట పూర్వకర్మ శేషం


చ. 1:

కలకాలమెల్ల దుఃఖ మెకాఁగఁ బ్రాణికిని
వలదా సుఖము గొంతవడియైనను
కలుషబుద్దులఁ బ్రజ్ఞగల దింతయును మంటఁ
గలసిపోవుటే పూర్వకర్మ శేషం


చ. 2:

జాలి తొల్లియుఁబడ్డజాలె నేఁడునుఁగాక
మేలు వొద్దా యేమిటినై నాను
తాలిమి లో హరిఁ దలఁచక యెఱుకెల్ల
గాలిఁబోవుట పూర్వకర్మశేషం


చ. 3:

తరగని నరకబాధయు నేఁడునుగాక
దరి చేరవలదా యింతటనైనను
తిరువేంకటాద్రిపై దేవునిఁ గొలువక
గరిపడే భవమెల్ల కర్మశేషం

రేకు: 0019-02 గుజ్జరి సం: 01-114 వైరాగ్య చింత


పల్లవి :

అప్పులేని సంసార మైనపాటే చాలు
తప్పులేనిజీత మొక్క తారమైనఁ జాలు


చ. 1:

కంతలేని గుడిశొక్క గంపంతయినఁ జాలు
చింతలేని యంబలొక్క చారెఁడే చాలు
జంతగాని తరుణి యేజాతైన నదె చాలు
వింతలేని సంపదొక్క వీసమే చాలు


చ. 2:

తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదె చాలు
ముట్టులేని కూడొక్క ముద్దెఁడే చాలు
గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైనఁ జాలు
వట్టి జాలిఁ బడకుంటే వచ్చినంతే చాలు


చ. 1:

లంపటపడని మేలు లవలేశమే చాలు
రొంపి కంబమౌ కంటె రోయుటే చాలు
రంపపుఁ గోరిక కంటె రతి వేంకటపతి-
పంపున నాతనిఁ జేరే భవమే చాలు

రేకు: 0019-03 శ్రీరాగం సం: 01-115 అధ్యాత్మ


పల్లవి :

కూడువండుట గంజికొరకా తనకు
వేడుకలుగల సుఖము వెదకుటకుఁగాక


చ. 1:

కుప్ప నురుచుట కసవుకొరకా తనవు
గొప్పయవు టిది మదముకొరకా
వొప్పన వేడుకల నొరసి మనసు
నెప్పునకురాఁ దివియ నేరవలెఁ గాక


చ. 2:

కొలుచు దంచుట పొట్టుకొరకా తాఁ
గులజుఁడై మూఢుఁడౌ కొరకా
తలపోసి యున్నింటఁ దగిలి మీఁదు
తెలిసి సుఖదుఃఖములఁ దెలియవలెఁ గాక


చ. 3:

కొండ దవ్వుట యెలుక కొరకా తాఁ
గొండ యెక్కుట దిగుటకొరకా
కొండలకోనేటిపతిఁ గొలిచి తనదు
నిండి నాపదలెల్ల నీఁగవలెఁ గాక

రేకు: 0019-04 శుద్ధవసంతం సం: 01-116 వేంకటగానం


పల్లవి :

ఘనుఁ డీఁతఁడొకఁడు గలుగఁగఁగదా వేదములు
జననములుఁ గులము లాచారములుఁ గలిగె


చ. 1:

కలుషభంజనుఁ డితఁడు గలుగఁగఁగదా జగతిఁ
గలిగె నిందరి జన్మగతులనెలవు
మలసి యుతఁడొకఁడు వొడమఁగఁగదా యిందరికి
నిలువ నీడలు గలిగె నిధినాధా--నములై


చ. 2:

కమలాక్షుఁ డితఁడు గలుగఁగఁగదా దేవతలు
గమిగూడి రిందరును గండిగడచి
ప్రమదమున నితఁడు నిలుపఁగఁగదా సస్యములు
అమర ఫలియించె లోకానందమగుచు


చ. 3:

గరిమె వేంకటవిభుఁడొకఁడు గలుగఁగఁగదా
ధరయు నభమును రసాతలము గలిగె
పరమాత్ముఁడితఁడు లోపల గలుగఁగాఁగదా
అరిది చవులును హితవు లన్నియునుఁ గలిగె

రేకు: 0019-05 భైరవి సం: 01-117 గురు వందన, నృసింహ


పల్లవి :

చూడుఁ డిందరికి సులభుఁడు హరి-
తోడు నీడయగు దొరముని యితఁడు


చ. 1:

కైవల్యమునకుఁ గనకపు తాపల-
త్రోవై శ్రుతులకుఁ దుదిపదమై
పావనమొక రూపమై విరజకు
నావై యున్నాఁడిదె యితఁడు


చ. 2:

కాపాడఁగ లోకములకు సుజ్ఞాన-
దీపమై జగతికిఁ దేజమై
పాపాలడఁపఁగ భవపయోధులకు
తేపై యున్నాఁడిదే యితఁడు


చ. 3:

కరుణానిధి రంగపతికిఁ గాంచీ-
వరునకు వేంకటగిరి పతికి
నిరతి నహోబల నృకేసరికిఁ ద-
తృరుఁడగు శఠగోపంముని యితఁడు

రేకు: 0019-06 సామంతం సం: 01-118 అధ్యాత్మ


పల్లవి :

కలలోని సుఖమే కలియుగమా, వెన్న
కలిలో నెక్కడిదె కలియుగమా


చ. 1:

కడిగడి గండమై కాలము గడపేవు
కడుగఁగడుగ రొంపి కలియుగమా
బడలికె వాపవు సరమేదో చూపవు
గడిచీటియును నీవు కలియుగమా


చ. 2:

కరపేపు కఱతలే మఱపేవు మమతలే
కరకఱ విడువవు కలియుగమా
తెరచీర మఱఁగింతే తెరువేల మూసేవు
గరునేల దాఁటేవో కలియుగమా


చ. 3:

కానిదె మెచ్చేవు కపటాలే యిచ్చేవు
కానీలే కానీలే కలియుగమా
పైనిదే వేంకటపతి దాసులుండఁగ
కానవా నీ విదేమి కలియుగమా