తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 13

వికీసోర్స్ నుండి

రాగము: గుండక్రియ రేకు: 0013-01 సంపుటము: 1-77

॥పల్లవి॥ ఏఁటి విజ్ఞాన మేఁటి చదువు
గూఁటఁబడి వెడలుగతిగురుతు గనలేఁడు

॥చ1॥ ఏడుమడుకలచర్మ మింతయునుఁ దూంట్లై
గాడఁబెట్టుచుఁజీము గారఁగాను
పాడైన యిందులో బ్రదుకుగోరీఁ బ్రాణి
వీడఁదన్ను కచనెడి వెరవు గనలేఁడు

॥చ2॥ కడుపునిండిన మహాకష్టంబు నలుగడల
వెడలుచును బెనుమురుకి వేయఁగాను
యిడుమఁ బొందుచు సుఖంబిందుకే వెదకీని
వొడలు మోవఁగ జీవుఁడోపననలేఁడు

॥చ3॥ వుదకమయమగుకన్ను లురికి యేమైనఁగని
మదవికారము మతికి మరుపఁగాను
యిది యెరిఁగి తిరువేంకటేశుఁగని జీవుఁడా-
సదమలానందంబు చవిగానలేఁడు

రేకు: 0013-02 ఆహిరి సం: 01-078 వెరాగ్యచింత


పల్లవి:

 అతిదుష్తుఁడ నే నలసుఁడను
యితర వివేకం బిఁకనేది


చ. 1:

 ఎక్కడ నెన్నిట యేని సేసితినొ
నిక్కపుఁదప్పులు నేరములు
గక్కన నిన్నిట కలిగిననీవే
దిక్కుగాక మరి దిక్కేది


చ. 2:

 ఘోరపుఁబాపము కోట్లసంఖ్యలు
చేరువ నివె నాచేసినవి
నీరసునకు నిటు నీకృప నాకిఁక
కూరిమి నా యెడ గుణమేది


చ. 3:

 యేఱిఁగి చేసినది యెఱఁగక చేసిన
కొఱతలు నాయడఁ గోటు లివే
వెఱపు దీర్చి శ్రీవేంకటేశ కావు
మఱవక నాగతి మరి యేది

రేకు: 0013-03 కన్నడగౌళ సం: 01-079 వెరాగ్యచింత


పల్లవి:

 దైవకృతంబట చేఁతట తనకర్మాధీనంబట
కావలసిన సౌఖ్యంబులు గలుగ కమానీనా


చ. 1:

 ఎక్కడిదుఃఖపరంపర లెక్కడిసంసారంబులు
యెక్కడిజన్మము ప్రాణులకేలా కలిగినది
యెక్కడిమోహవిడంబన యెక్కడియాశాబద్ధము
యెక్కడికెక్కడ నిజమై యివి దాసుండీనా


చ. 2:

 యీకాంతలు నీద్రవ్యము లీకన్నూలవెడయాసలు
యీకోరికె లీతలఁపులు యిట్టే వుండీనా
యీకాయం బస్థిరమన కీదుర్దశలకు లోనై
యీకల్మషములఁ బొరలఁగ నివి గడతేరీనా


చ. 3:

 దేవశిఖామణి తిరుమల దేవుని కృపగల చిత్తము
పావనమై దురితంబులఁ బాయక మానీనా
ఆవిభుకరణరసమున నతఁడే తను మన్నించిన
ఆవేడుక లీవేడుక లాసలు సేసీనా

రేకు: 0013-04 శంకరాభరణం సం: 01-080 దశావతారములు


పల్లవి :

ఆదిమపూరుషుఁ డచ్యుతుఁడచలుఁడనంతుఁడమలుఁడు
ఆదేవుఁ డీతఁడేపోహరి వేంకటవిభుఁడు


చ. 1:

ఏకార్ణవమై ఉదకములేచిన బ్రహ్మాండములోఁ
బైకొని యుండఁగ నొక వటపత్రములోపలను
చేకొని పవళింపుచు నొక శిశువై వడిఁదేలాడిన-
శ్రీకాంతుఁ డీతఁడేపో శ్రీవేంకటవిభుఁడు


చ. 2:

అరుదుగ బలిమద మడఁపఁగ నాకసమంటిన రూపము
సరుగన భూమింతయు నొక చరణంబున గొలచి
పరగిన పాదాంగుటమున బ్రహ్మాండము నగిలించిన
పరమాత్ముఁ డీతఁడేపో పతి శ్రీవేంకటవిభుఁడు


చ. 3:

క్షీరపయోనిధి లోపల శేషుఁడు పర్యంకముగా
ధారుణియును సిరియునుఁ బాదము లొత్తఁగను
చేరువఁదను బ్రహ్మాదులు సేవింపఁగఁ జెలుఁవొందెడి
నారాయణుఁ డితఁడే వున్నత వేంకటవిభుఁడు

రేకు: 0013-05 దేసాళం సం: 01-081 వైరాగ్య చింత


పల్లవి :

అప్పులవారే అందరును
కప్పఁగఁ దిప్పఁగఁ గర్తలు వేరీ


చ. 1:

ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁ
జిక్కులు సిలుగులుఁ జింతలునే
దిక్కెవ్వరు యీ తీదీపులలో
దిక్కుముక్కులకు దేవుఁడెఁకాక


చ. 2:

యేది దలంచిన నేకాలంబును
సూదులమూఁటల సుఖములివి
కాదన నౌననఁ గడ గనిపించఁగ
పోదికాఁడు తలఁపునఁ గలడొకఁడే


చ. 3:

యెన్నఁడు వీడీ నెప్పుడు వాసీ
బన్నిన తమతమ బంధములు
వున్నతి సేయఁగ వొప్పులు నెరపఁగ
వెన్నుఁడు వేంకటవిభుఁడే కలఁడు


రేకు: 0013-06 శంకరాభరణం సం; 01-182 వైరాగ్య చింత


పల్లవి:
పాపములే సంబళమెపుడూ యీ-
యాపదఁబడి నే నలసేనా

చ.1:
ఎన్నిపురాణము లెటువలె విన్నా
మన్న మనువు దిమ్మరితనమే
నన్ను నేనే కానఁగలేనట నా

విన్న వినుకులకు వెఱచేనా

చ.2:
యెందరు వెద్దల నెట్లఁ గొలిచినా
నిందల నామతి నిలిచీనా
కందువెఱిఁగి చీకటికిఁ దొలఁగనట
అందపుఁబరమిఁక నందేనా

చ.3:
తిరువేంకటగిరిదేవుఁడే పరమని
దరి గని తెలివిఁక దాఁగీనా
తిరముగ నినుఁ జింతించినచింతే
నిరతము ముక్తికి నిధిగాదా