Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 12

వికీసోర్స్ నుండి

రేకు: 0012-01 బౌళి సం: 01-072 వైరాగ్య చింత

పల్లవి: పరదేశిపట్టణమున పదుగురు నేగురుఁ గూడుక
       పరగఁగ వరి చెడ నూదర బలిసినయట్లాయ
       
చ. 1: ఊరేలెడియతఁ డలసత నూరకయుండఁగ నడుముల-
       వారలు నిక్కపుగర్తలవలె నుండినగతిని
       ధీరత చెడి తను జీవుఁడు దెలియఁగనేరక యుండిన
       ధారుణిలోపల దొంగల ధర్మాసనమాయ
       
చ. 2: వొడలంతంతకుఁ జిక్కఁగ నుబ్బినరోగము సుఖమున-
       కెడమియ్యక నానాఁటికి నేఁచిన చందమున
       తడఁబడువిజ్ఞానము గతిదప్పఁగ బలుపగుపట్నము
       కడుఁజెడఁగా, మాలవాడ ఘనమైనట్లయ
       
చ. 3: పొసఁగఁగ నిది గని యధికుడు పుక్కట కాండ్ల నందరిఁ
       బసమారిచి మొదలికర్తఁ బాలించినగతిని
       పసగలతిరువేంకటగిరిపతి నాదేహపుఁబురి నీ-
       వసమై వెన్నకు బండ్లు వచ్చినయట్లాయ


రేకు: 0౦12-02 వరాళి సం: 01-073 వైరాగ్య చింత

పల్లవి:

పోరొ పోరొ యమ్మలాల బొమ్మలాటవారము
యీరసాన మమ్ము నిట్టే యేమిసేసేరు

చ. 1:

ఊరులేనిపొలమేర వొడలు మోచుకొని నేము
తేరదేహ మెక్కుకొని తిరిగేము
వారువీరనుచు వట్టివావులు సేసుక లేని-
పేరు పెట్టుకొని లోలోఁ బిరువీకులయ్యేము

చ. 2:

బుద్దిలేనిబుద్దితోడ పొందు సేసుకొని వట్టి-
యెద్దుబండికంటి సంది నీఁగేము
నిద్దురలో తెలివంటా నీడలోని యెండంటా
వుద్దువుద్దులై లేనివొద్దిక నున్నారము

చ. 3:

మాటులేనిమాటు దెచ్చి మరఁగు వెట్టుక వట్టి-
మేటానమేట్లవలె మెరసేము
గాటమైనతిరువేంకటగిరినిలయుని-
నాటకమే నిజమని నమ్మిక నున్నారము

రేకు: 0012-03 రామక్రియ 01-074 దశావతారములు


పల్లవి: ఎవ్వఁడో కాని యెరఁగరాదు కడు-
       దవ్వులనే వుండు తలంపులోనుండు

చ.1 : ఎడయవు తనరెక్క లెగసిపోలేఁడు
       కడు దాఁగుఁగాని దొంగయుఁ గాడు
       వడిఁ గిందుపడును సేవకుఁడునుఁ గాఁడు
       వెడఁగుగోళ్ళు వెంచు విటుఁడునుఁ గాఁడు

చ.2 : మిగులాఁబొట్టివాఁడు మింటికినిఁ బొడవు
       జగడాలు తపసివేషములును
       మగువకై పోరాడు మరి విరక్తుఁడును
       తగుఁగాపుఁబనులు నెంతయుఁ దెల్లఁదనము

చ.3 : తరుణుల వలపించు తగిలి పై కొనఁడు
       తురగముఁ దోలు రౌతునుఁ గాఁడు
       తిరువేంకటాద్రిపైఁ దిరుగు నెప్పుడును
       పరమమూర్తియై పరగు నీఘనుడు

రేకు: 0012-04 శ్రీరాగం సం: 01-075 వేంకటగానం


పల్లవి :

నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు
సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సంస్తుత్యుఁడీ తిరువేంకటాద్రివిభుఁడు


చ. 1:

ఏ మూర్తి లోకంబులెల్ల నేలెడునాతఁడేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాతఁ
డేమూర్తి నిజమోక్షమియ్యఁ జాలెడునాతఁడేమూర్తి లోకైకహితుఁడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియునుఁగాఁడు యేమూర్తి త్రైమూర్తి లేకమైన
యాతఁడేమూర్తి సర్వాత్ముఁడేమూర్తి పరమాత్ముఁడామూర్తి తిరువేంకటాద్రివిభుఁడు


చ. 2:

యేదేవుదేహమున నిన్నియును జన్మించెనే దేవుదేహమున నిన్నియును నణఁగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవుఁడిజీవులిన్నింటిలో నుండు నేదేవుచైతన్య మిన్నిటికి నాధార
మేదేవుఁ డవ్యక్తుఁ డేదేవుఁ డద్వంద్వుఁడాదేవుఁ డీవేంకటాద్రివిభుఁడు


చ. 3:

యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పు నిశ్వాస మీమహామారుతము యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశుఁ డేవేల్పు పరమేశుఁడేవేల్పు భువనైకహితమనో భావకుఁడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము ఆవేల్పు తిరువేంకటాద్రివిభుఁడు

రాగము: దేసాక్షి రేకు: 0012-05 సంపుటము: 1-76 వైరాగ్య

॥పల్లవి॥ ఎంతైన దొలఁగవై తేదైన నామతికి
వింతచవిసేతుగా విషయబుద్ధి

॥చ1॥ ఎనసి జన్మముల నే నెట్ల నుండిన బోక
వెనకఁ దిరుగుదువు గా విషయబుద్ధి
అనువైనయనుభవన లనుభవించఁగఁ జేసి
వెనక మఱపింతుగా విషయబుద్ధి

॥చ2॥ కెఱలి కాంతలు నేనుఁ గినిసిననుఁ బొలయలుక
విఱిచి కలపుదువుగా విషయబుద్ధి
తఱితోడ వావివ ర్తనదలంచిననన్ను
వెఱపు దెలుపుదువుగా విషయబుద్ధి

॥చ3॥ యెడలేనియాపదల నెట్లువొరలిన నన్ను
విడిచిపోవైతిగా విషయబుద్ధి
సడిఁబెట్టి వేంకటస్వామికృపచే నిన్ను
విడిపించవలసెఁగా విషయబుద్ధి