తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 1

వికీసోర్స్ నుండి

రేకు: 0001-01 సామంతం సం: 01-001 అధ్యాత్మ

పల్లవి: వలచి పైకొనఁగరాదు వలదని తొలఁగరాదు
కలికిమరుఁడు సేసినాజ్ఞ కడవఁగరాదురా
    
చ. 1: అంగడి కెత్తినట్టిదివ్వె లంగనముఖాంబుజములు
ముంగిటి పసిఁడికుంభములును ముద్దుల కుచ యుగంబులు
యెంగిలిసేసినట్టితేనె లితవులైన మెఱుఁగుమోవులు
లింగములేని దేహరములు లెక్కలేని ప్రియములు
    
చ. 2: కంచములోని వేఁడికూరలు గరువంబులుఁ బొలయలుకలు
యెంచఁగ నెండలోనీడలు యెడనెడకూటములు
తెంచఁగరాని వలెతాళ్ళు తెలివిపడనిలేఁతనవ్వులు
మంచితనములోని నొప్పులు మాటలలోనిమాటలు
    
చ. 3: నిప్పులమీఁద జల్లిననూనెలు నిగిడితనివిలేనియాసలు
దప్పికి నేయిదాగినట్లు తమకములోనితాలిమి
చెప్పఁగరానిమేలు గనుట శ్రీవేంకటపతిఁ గనుటలు
అప్పనికరుణగలిగి మనుట అబ్బురమైనసుఖములు

రేకు: 0001-02 దేసాక్షి సం: 01-002 వేంకటేశ్వరౌషధము
పల్లవి: వేదవేద్యులు వెదకేటిమందు
అదినంత్యములేని‌ ఆమందు
చ. 1: అడవిమందులుఁ గషాయములు నెల్లవారు
కడగానక కొనఁగాను
తొడిఁబడ నొకమందు దొరకె మాకు భువి-
నడియాలమైనట్టి ఆమందు
చ. 2: లలితరసములుఁ దైలములు నెల్లవారు
కలకాలము గొనఁగాను
చెలువైన దొకమందు చేరె మాకు భువి-
నలవిమీఱినయట్టియామందు
చ. 3: కదిసినజన్మరోగముల నెల్లవారు
కదలలేక వుండఁగాను
అదన శ్రీతిరువేంకటాద్రిమీఁదిమందు
అదివో మాగురుఁడిచ్చె నామందు

రేకు: 0001-03 దేసాక్షి సం: 01-003 వైరాగ్య చింత
పల్లవి: హీనదశలఁబొంది యిట్ల నుండుటకంటె
నానావిధులను నున్ననాఁడే మేలు
చ. 1: అరుదైన క్రిమికీటకాదులందుఁ బుట్టి
పరిభవములనెల్లఁ బడితిఁ గాని
యిరవైనచింత నాఁడింతలేదు యీ-
నరజన్మముకంటె నాఁడే మేలు
చ. 2: తొలఁగక హేయజంతువులయందుఁ బుట్టి
పలువేదనలనెల్లఁ బడితిఁగాని
కలిమియు లేమియుఁ గాన నేఁ డెఱిఁగి
నలఁగి తిరుగుకంటె నాఁడే మేలు
చ. 3: కూపనరకమున గుంగి వెనకకు నేఁ
బాపవిధులనెల్లఁ బడితిఁగాని
యేపునఁ దిరువేంకటేశ నా కిటువలె
నాపాలఁ గలిగినాఁడే మేలు

రేకు: 0001-04 సామంతం సం: 01-004 సంస్కృత కీర్తనలు
పల్లవి: ఏవం శ్రుతిమత మిదమేవ త-
ద్భావయితు మతఃపరం నాస్తి
చ. 1: అతుల జన్మభోగాసక్తానాం
హిత వైభవసుఖ మిదమేవ
సతతం శ్రీహరిసంకీర్తనం త-
ద్వ్యతిరిక్తసుఖం వక్తుం నాస్తి
చ. 2: బహుళమరణపరిభవచిత్తా నా-
మిహపరసాధన మిదమేవ
అహిశయనమనోహరసేవా త-
ద్విహరణం వినా విధిరపి నాస్తి
చ. 3: సంసారదురితజాడ్యపరాణాం
హింసావిరహిత మిదమేవ
కంసాంతక వేంకటగిరిపతేః ప్ర-
శంసైవా పశ్చా దిహ నాస్తి

రేకు: 0001-05 పాడి సం: 01-005 భక్తి
పల్లవి: వేదం బెవ్వని వెదకెడిని
ఆ దేవునిఁ గొనియాడుఁడీ
చ. 1: అలరిన చైతన్యాత్మకుఁడెవ్వఁడు
కలఁ డెవ్వఁ డెచటఁ గలఁడనిన
తలఁతు రెవ్వనినిఁ దనువియోగదశ
యిల నాతని భజియించుఁడీ
చ. 2: కడఁగి సకలరక్షకుఁడిం దెవ్వఁడు
వడి నింతయు నెవ్వనిమయము
పిడికిట తృప్తులు పితరులెవ్వనినిఁ
దడవిన, ఘనుఁడాతనిఁ గనుఁడీ
చ. 3: కదిసి సకలలోకంబులవారలు
యిదివో కొలిచెద రెవ్వనిని
త్రిదశవంద్యుఁడగు తిరువేంకటపతి
వెదకి వెదకి సేవించుఁడీ

రేకు: 0001-06 గుండక్రియ సం: 01-006 అధ్యాత్మ
పల్లవి: మానుషము గాదు మఱి దైవికము గాని
రానున్నా అది రాకుమన్నఁ బోదు
చ. 1: అనుభవనకుఁ బ్రాప్తమైనది
తనకుఁదానె వచ్చి తగిలికాని పోదు
చ. 2: తిరువేంకటగిరిదేవుని-
కరుణచేతఁ గాని కలుష మింతయుఁ బోదు


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.