తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 281

వికీసోర్స్ నుండి

రేకు: 0281-01 శుద్ధవసంతం సం: 03-465 శరణాగతి


పల్లవి :

ఏమి సేయుదును నా కేది బుద్ధి యంతర్యామి
యీమతులఁ జిక్కి నీచిత్తమునకు నెట్టుండునోయని చింతయ్యెడిని


చ. 1:

కులగోత్రంబులు గుణశీలంబులు
తెలియఁగ గర్వోద్రేకములు
కలసి మెలఁగినఁ గలుగదు జ్ఞానము
తొలఁగిన లోకద్రోహంబు


చ. 2:

మఱియు గృహారామక్షేత్రంబులు
జఱిగొను మాయాజనకములు
మఱవఁగ నివియే మదకారణములు
విఱిగిన సంసారవిరుద్ధము (?)


చ. 3:

అనుపమ వ్రతకర్మానుష్టానము-
లెనలేని బంధహేతువులు
తనిసితి నింక నీదాస్యంబే గతి
ఘనుఁడవు శ్రీవేంకటనాథా

రేకు: 0281-02 బౌళి సం: 03-466 వైష్ణవ భక్తి


పల్లవి :

పారవేసిన పుల్లాకు బండికల్లై మించినట్లు
కోరి నీ ముద్రలు మోచి కొండగొంటి నిదివో


చ. 1:

మూఁడుగుణములలోన మునిఁగేటివాఁడఁగాన
పోఁడిమి నాకొక బుద్ధి పుట్టదెందును
నేఁడు నీ శరణమనే నిశ్చయ మిచ్చితి గాన
వాఁడిమి నిన్నిటా నేఁ బావనమైతి నిదివో


చ. 2:

పంచభూతాల తనువు పాటించి మోచితిఁగాన
పంచేంద్రియ వికారాలు పాయవు నాకు
యెంచఁగ నీదాస్యము నా కినామిచ్చితిగాన
పంచల నా పుట్టుగు సఫలమాయ నిదివో


చ. 3:

తగిలి ఇన్నిటికి స్వతంత్రుఁడనేఁ గాను గాన
జిగి నిన్ను నెరిఁగి పూజించలేను
నగుతా శ్రీవేంకటేశ నాలో నుండుదుగాన
పగటున నిన్ను నమ్మి బ్రదికితి నిదివో

రేకు: 0281-03 బౌళి సం: 03-467 అన్నమయ్య స్తుతి


పల్లవి :

పాడేము నేము పరమాత్మ నిన్నును
వేడుక ముప్పదిరెండు వేళల రాగాలను


చ. 1:

తనువే వొళవు తలయే దండెకాయ
ఘనమై వూర్పులు రెండు కట్టిన తాళ్ళు
మనసే నీబద్ధితాడు మరి గుణాలె జీవాళి
మొనసిన పుట్టుగే మూలమైన కరడి


చ. 2:

పాపపుణ్యా లిరువంక పైఁడివెండియనుసులు
పైపైఁ గుత్తికె మేటిపై చనిగె
కోపుల నాలికెలోనఁ గుచ్చికట్టినట్టి తాడు
చూపరాని సంసారమే సూత్రపు గణికె


చ. 3:

జీవునికిని దండె సేసినవాఁడవు నీవు
వావాతి మాటలే నీపై వన్నెపదాలు
యీవి మాకు నిహపరా లిచ్చితివి మెచ్చితివి
శ్రీవేంకటేశ నీవే చేకొన్నదాతవు

రేకు: 0281-04 సాళంగనాట సం: 03-468 మాయ


పల్లవి :

తానెంత బ్రదుకెంత దైవమా నీమాయ యెంత
మానవుల లంపటాలు మరి చెప్పఁగలదా


చ. 1:

చెలఁగి నేలఁ బారేటి చీమ సయితమును
కలసి వూరకే పారుఁ గమ్మర నెందో మరలు
తలమోఁచి కాఁపురము ధాన్యములు గూడపెట్టు
యిల సంసారము దనకిఁక నెంతగలదో


చ. 2:

యేడో బాయిటఁ బారే యీఁగ సయితమును
వాడుదేర నడవుల వాలి వాలి
కూడపెట్టు దేనెలు గొందులఁ బిల్లలఁ బెట్టు
యేడకేడ సంసార మిఁక నెంతగలదో


చ. 3:

హెచ్చి గిజిగాండ్లు సయిత మెంతో గూఁడు పెట్టు
తెచ్చి మిణుఁగురుఁబురువు దీపము వెట్టు
తచ్చి శ్రీవేంకటేశ నీ దాసులు చూచి నగుదు-
రిచ్చలఁ దాని సంసార మిఁక నెంత గలదో

రేకు: 0281-05 దేవగాంధారి సం: 03-469 శరణాగతి


పల్లవి :

చెలఁగి యధర్మము వుట్టింప నీకేల సృష్టింపఁగ మరి నీకేల
పులులను లేళ్ల నొక్కకదుపుగా పులుమేపుదురటే మాధవుఁడా


చ. 1:

గొనకొని పాషండుల దుర్భాషల క్రోధము సహింపరాదు
దనుజుల పుట్టువు వారలనుచు నిజతత్త్వజ్ఞానము నీ వియ్యవు
అనిశముఁ జూచిన వారికి మాకును అంతర్యామివి నీవు
పెనఁచి చీఁకటియు వెలుఁగును నొకచోఁ బెంచెదవేలే ముకుందుఁడా


చ. 2:

ఖలుల తామసపు దేవతార్చనలు కనుఁగొనియవి యోర్వఁగరాదు
నెలకొని వారలు నరకవాసులని నీ మీఁది భక్తియు నీ వియ్యవు
పొలుపుగ నిందరిలోపలఁ గ్రమ్మరఁ బూజ గొనేటివాఁడవు నీవే
చలమునఁ బుణ్యము పాపము నొకచో సరిచేతురటవే గోవిందుఁడా


చ. 3:

సతతము నీ దాస్యద్రోహులతో సహయోగంబును సహింపదు
క్షితిలో నీ వటువంటివారలను సృజింప కేర్పడ మానవు
హితవుగ శ్రీవేంకటేశ్వర నీవే యిహపరములకుఁ గర్తవు
గతి నీ శరణాగతియని నమ్మినఁ గలవిందరికిని నారాయణా