Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 280

వికీసోర్స్ నుండి

రేకు: 0280-01 సాళంగనాట సం: 03-459 అధ్యాత్మ


పల్లవి :

తిరుచు నతఁడే దినకర్మంబది
నూరిటీ రుణ మొక నూలిపోఁగునా


చ. 1:

తొల్లిటి కర్మము దోడఁ గుడుచుటకె
తెల్లమి జీవుఁడు దేహము మోచుట
వొల్లనన్నఁ బోదున్నంత గాలము
మల్లాడి హరినే మఱవఁగ వలదు


చ. 2:

కోరిన కోర్కికి గురియగు నందుకే
సారపు సంసారసంగమిది
నేరిచి బ్రదికేటి నెపమునఁ బోదది
కూరిమి హరినే కొలువఁగవలయు


చ. 3:

తెంచని యాసలఁ దిప్పుటకే పో
పంచేంద్రియముల పంతమిది
చించినఁ బోదిది శ్రీవేంకటపతి
నించి మనసులో నించగవలయు

రేకు: 0280-02 లలిత సం: 03-460 వైష్ణవ భక్తి


పల్లవి :

ఎక్కడి పుట్టుగ లిఁక నెక్కడి మరణములు
మిక్కిలి నీ ముద్రలు నా మేననున్న వివిగో


చ. 1:

కెరల పాపములకుఁ గెరల కర్మములకు
హరి నీ నామము నోరనంటితేఁ జాలు
నరకములేమి సేసు నా నేరమేమిసేసు
నిరతి నా మతిలోన నీ వుండఁగాను


చ. 2:

చిక్క నింద్రియములకు చిక్కను బంధములకు
చొక్కి హరి నీ మఱఁగు చొచ్చితిఁ జాలు
మొక్కనేలే యెవ్వరికి మొరవెట్ట నేమిటీకి
నిక్కపు మా యిలువేల్పు నీవై వుండఁగా


చ. 3:

దగ్గరవు మాయలింక దగ్గరవు దుర్గుణాలు
నిగ్గుల శ్రీవేంకటేశ నీవు గల్గఁగా
యెగ్గులేదు తగ్గులేదు యిఁక నీదాసులలోన
వుగ్గువలె నీప్రసాద మూనినది వొడల

రేకు: 0280-03 దేసాళం సం: 03-41 జోల


పల్లవి :

జోజో యని మీరు జోల వాడరో
సాజపు జయంతి నేడే సఫల మిందరికి


చ. 1:

అదె చంద్రోదయమాయ హరి యవతారమందె
మొదల జాతకర్మములు సేయరో
అదన పుత్రోత్సవమట పుణ్యాహము చేసి
కదిసి యిట్టె నామకరణముఁ జేయరో


చ. 2:

కాయము దేవకికిచ్చి గక్కన వాసుదేవుని-
కీయరో గంధాక్షత లిటు విడేలు
కాయకపు గాడిదెకు కవణము పెట్టి మరి
వీయపు చుట్టాలెల్ల వీడు వెట్టరో


చ. 3:

షోడశోపచారములఁ జొక్కించి శ్రీవేంకటేశుఁ
బాడరో ధర్మము నిల్పె భార మణఁచె
వోడించెఁ గౌరవదానవులఁ గంసాదులఁ జంపె
ఆడనే పాండవులఁ గాచెనని యర్ఘ్యమియ్యరో

రేకు: 0280-04 సాళంగం సం: 03-462 వైష్ణవ భక్తి


పల్లవి :

చరమార్థమందు నీవు చాటితివి గాన
ఇరవిది నమ్మితి నా కెదురెందు లేదు


చ. 1:

పతికిఁ జనవరైన ప్రాణధారి లెంకలకు
తతినేమి సేసినాను తప్పులేదు.
సతతము హరి నీ శరణాగతుఁడ నాకు (గాన?)
అతిపాపము సేసిన అది నాకు లేదు


చ. 2:

పారుచు నగరి డాగు పసుర మెవ్వరిచేని-
పైరు మేసినా నందు బందె లేదు
సారె నీ ముద్రలు మోచి సంసారవిషయాల
యేరీతిఁ బొరలినా యెగ్గే లేదు


చ. 3:

ధర్మానఁ గొని తెచ్చిన దాసులకు వూర వెట్టి-
అరిఁ జేయఁగఁ బని అంతలేదు
నిర్మల శ్రీవేంకటేశ నీ కరుణగల నాకు
కర్మ లోపమైనాను కడమే లేదు

రేకు: 0280-05 పాడి సం: 03-463 మాయ


పల్లవి :

నీ మాయ లింతేకాక నీరజ నాభుఁడ! యివి
నా మది నిజమనెట్టు నమ్మేదయ్యా


చ. 1:

బాలుఁడనై నేఁ జన్నుఁబాలు దాగేనాఁడు
వోలి ననుష్ఠానము లెందుండెనయ్యా
చాలి యానేనె బ్రహ్మచారి నయిన మీఁద
వాలి యవె యెందుండి వచ్చెనయ్యా


చ. 2:

నేను దినదినమును నిద్దురపోయే వేళ
పూని నిత్యకర్మము లెందుండెనయ్యా
జ్ఞానముతో మేలుకొని సంసారినైన వేళ
ఆనుకొని యెందుండి అంటుకొనెనయ్యా


చ. 3:

యేడ కర్మ మేడ ధర్మ మింతలో సన్యాసైతే
వేడుక కివియెల్లా నీ విలాసాలు
జాడ నీ మనసు వస్తే సరుగఁ గరుణింతువు
వోడక శ్రీవేంకటేశ వున్న సుద్దులేఁటికి

రేకు: 0280-06 రామక్రియ సం: 03-464 శరణాగతి


పల్లవి :

హరిహరియని వెరగందుటఁ గాక
సిరివర మాకు బుద్ధి చెప్పగదవయ్యా


చ. 1:

పాపపుకొంపలో వారు పంచమహాపాతకులు
కాపులకు పదుగురు కర్త లందుకు
తాపి కాండ్లరుగురు ధర్మాసనమువారు
చాపలమే పనులెట్టు జరగీనయ్యా


చ. 2:

పలుకంతల చేను బండ వెవసాయము
బలిమిఁ దొక్కీఁ గుంటిపసురము
తలవరులు ముగురు తగువాదు లేఁబైయారు
సొలసి ఆనాజ్ఞ కిదుఁ జోటేదయ్యా


చ. 3:

బూతాల పొంగటికే పొడమిన పంటలెల్లా
కోతవే చూచుకొని కోరు కొటారు
యీతల శ్రీవేంకటేశ యిన్ని విచారించి నీ-
చేఁతే నిలిపితి విఁకఁ జెప్పేదేఁటిదయ్యా