తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 275

వికీసోర్స్ నుండి

రేకు: 0275-01 శంకరాభరణం సం: 03-430 వైరాగ్య చింత


పల్లవి :

చానిపి లోపలఁ జవిగలదా! యివి
మానిపి నీ గతి మరపుదుఁ గాకా


చ. 1:

చంచలపు గుణముల జడిసిన జీవుఁడు
మంచి గుణంబుల మలసీనా
అంచెల హరి నీ వంతర్యామివి
నించి నీ గుణమే నెరవుదుఁ గాకా


చ. 2:

బూతుల యెంగిలిఁ బుట్టిన దేహము
బాఁతిగ శుచియై పరగీనా
చైతన్య మందులో శ్రీపతివి నీవు
తత్త్వ ఫలమే నెరపుదుఁ గాకా


చ. 3:

లలి సుఖదుఃఖపు లంకె కాఁపురము
మెలుపున సాజాన మెలఁగీనా
యిలపై శ్రీవేంకటేశ్వర నీవిది
కలిగించితి విఁకఁ గాతువుఁ గాకా

రేకు: 0275-02 లలిత సం: 03-431 అద్వైతము


పల్లవి :

అన్నిటికి నారదాదు లదివో సాక్షి
యిన్నిటా మాకుఁ గలిగె నేమైనాఁ గాని


చ. 1:

భూమిలోన నెన్నియైనా పుణ్యములు గలవు
కామింప నాచారాలు కల వెన్నెనా
సామజవరదు నొక్కసారె దలఁచినందుకు
యేమియును సరిగావు యెట్టయినాఁ గాని


చ. 2:

వుత్తమలోకసుఖము లోగి నెన్నైనాఁ గలవు
యిత్తల సిరులు గల విల నెన్నైనా
చిత్తజగురుని నటు సేవించే పుణ్యమువలె
నిత్తెము గావు గాని నిచ్చలు నెంతైనను


చ. 3:

కలవు మతాలు గొన్ని కలవు ముక్తులు గొన్ని
కలవు మాయలు పెక్కు గల్పించేవి
తలఁచి శ్రీవేంకటేశు దాసుఁడైన భాగ్య మిది
గలిగె నిట్టే మాకుఁ గాణాచి గాని

రేకు: 0275-03 లలిత సం: 03-432 దశావతారములు


పల్లవి :

రామకృష్ణ నీవు నందే రాజ్య మేలుచుండుదువు
యేమి సేసే విక్కడ నీ యిరవుకే పదవే


చ. 1:

లంక విభీషణు నుంచ లక్ష్మణుని నంపినట్టు
అంకె సుగ్రీవుఁ గిష్కింధ కంపినయట్టు
వంకకు సంజీవి దేను వాయుజుని నంపినట్టు
వేంకటాద్రి పొంతనుండ వేగ మమ్ము నంపవే


చ. 1:

ఘనకిరీటము దేను గరుడని నంపినట్టు
అనుఁగుఁ గపుల నిండ్ల కంపినట్టు
వొనర గోపికలొద్ది కుద్ధవుని నంపినట్టు
ననువు శేషాద్రినుండ నన్ను పంపవే


చ. 1:

పెండిలికిఁ బరుషలఁ బిలువఁగ నంపినట్టు
అండనే ముందరఁ గంత కంపినయట్టు
వెండియు శ్రీవేంకటేశ వేఁట వచ్చి మరలితి -
వుండ (డు?) చోట నుండి నన్ను వూడిగాన కంపవే

రేకు:0275-04 రామక్రియ సం: 03-433 దశావతారములు


పల్లవి :

విచ్చేయవయ్యా వేంకటాచలముపొంత-
కచ్చుగా నేమున్నచోటి కచ్యుతనారాయణా


చ. 1:

అల్లనాఁడు లంక సాధించందరును బొగడఁగ
మల్లడి నయోధ్యకు మరలినట్లు
యెల్లగాఁ గైలాసయాత్ర కేఁగి కమ్మర మరలి
వెల్లవిరి ద్వారకకు విచ్చేసినట్లు


చ. 1:

యెన్నికతో గోమంతమెక్కి జయము చేకొని
మన్ననతో మధురకు మరలినట్లు
అన్నిచోట్లా నుండి అల్లిరము లారగించ
వెన్నుఁడవై వేడుకతో విచ్చేసినట్లు


చ. 1:

వహికెక్కఁ ద్రిపురాల వనితల బోధించి
మహి నిందిర వొద్దికి మరలినట్లు
విహగగమన శ్రీవేంకటేశ మముఁ గావ
విహితమై నామతిలో విచ్చేసినట్లు

రేకు: 0275-05 బౌళి సం: 03-434 దశావతారములు


పల్లవి :

మా దురితములు వాపి మమ్ముఁ గాచుటరుదా
శ్రీదేవీరమణుఁడ శ్రీవేంకటేశ


చ. 1:

అంబరీషుఁ బైకొన్న ఆపదలన్నియుఁ బాపి
బెంబడిఁ గాచె నీచే పెనుచక్రము
అంబరాననున్న ధ్రువు నజ్ఞానమెల్లఁ బాపె
పంబి నీ చేతనుండిన పాంచజన్యము


చ. 1:

పక్కన జరాసంధు బలమెల్ల నుగ్గాడి
నిక్కము మధురనిల్పె నీచే గద
తొక్కి హిరణ్యకశిపుఁ దునిమి ప్రహ్లాదుఁ గాచె
నిక్కి నిక్కి మెరిచేటి నీఖడ్గము


చ. 1:

వెడ రావణునిఁ జంపి విభీషణునిఁ గాచె
చిడుముడి పడక నీచే శార్ఙ్గము
యెడమీక శ్రీవేంకటేశ నేఁడు నన్నుఁ గాచె
బడిబడి నీనామపఠన నేఁడిదిగో

రేకు: 0275-06 దేవగాంధారి సం: 03-435 శరణాగతి


పల్లవి :

తప్పు లెంచ కిఁక దరి చేర్చవయ్యా
చెప్పనేల నీ చిత్తమయ్యా


చ. 1:

కలిదోషహరణ కర్మవిదారణ
సులభపు నీ దాసులమయ్యా
కలిగిన శరణాగత వజ్రపంజర
వలనగు నీ మరఁగువారమయ్యా


చ. 2:

 దురితనివారణ దుఃఖవిమోచన
దొరకొని నీ భక్తులమయ్యా
కరిరాజవరద కరుణాసముద్ర
సరి నిను నమ్మిన జంతులమయ్యా


చ. 3:

శ్రీకాంతప్రియ శ్రీవేంకటేశ్వర
కై కొన్న నీ కింకరులమయ్యా
మాకేల యితరపు మతదైన్యంబులు
పైకొనఁ బోఁజేసి పాలించవయ్యా