రేకు: 0274-01 మంగళ కౌశిక సం: 03-424 మాయ
పల్లవి : |
విడువవో మాయా విష్ణువధీనము
వొడలిది నీ కెందు నునికే లేదు
|
|
చ. 1: |
శ్రీపతినామము చేకొనే నాలుక
యే పాపములకు నెడలేదు
దాపగు గోవిందుఁ దలఁచిన మనసిది
కోపముల కిరవుకొన నెడలేదు
|
|
చ. 2: |
నెలవుగ హరికథ నిండెను వీనుల
కలిదోషము లిక్కడ లేవు
అలరిన జన్మం బచ్యుతు శరణని
నిలిచె దుఃఖముల నివారణము
|
|
చ. 3: |
శ్రీవేంకటపతిఁ జేరె నాత్మ యిది
భావవికారము పని లేదు
దైవాధీనము తత్త్వవిచారము
వేవేలు కర్మపువిధులే లేవు
|
|
రేకు: 0274-02 లలిత సం: 03-425 అంత్యప్రాస
పల్లవి : |
ఇన్నిటా శ్రీహరిభక్తి యిది లాభము
పన్నిన తపముచేత బడలుటే లాభము
|
|
చ. 1: |
యెనయఁ గర్మదేహ మిదెన్ని పాట్లు వచ్చినా
ననుభవించి తీరుచు టది లాభము
తన పాపవర్తన యితరు లెంత నిందించినా
ననుమానించక పడుటది లాభము
|
|
చ. 2: |
తగు సంసారజీవుఁడు తన్నెంత వేసరించినా
నగి రుణము దీర్చుట నానా లాభము
చిగురువంటి చిత్తము చేరి యెందు చెప్పినాను
తగిలి యలయుటే దక్కినట్టి లాభము
|
|
చ. 3: |
శ్రీవేంకటేశ్వరుఁడు జీవములో నుండఁగాను
యేవేళ నెట్లయినా నివి లాభము
పావనమైనట్టి యాత్మభావమెంత మఱచినా
ఆవల నానందించుటది లాభము
|
|
రేకు: 0274-03 లలిత సం: 03-426 అధ్యాత్మ
పల్లవి : |
మనసొకటి కోరికలు మాలు గలపుచు(?)నుండు
తనిసితే నదియ పరతత్త్వమై నిలుచు
|
|
చ. 1: |
కన్నులనియెడి పాపకర్మంబు లివి రెండు
పన్ని తామెన్నింటి పైపైనఁ బారు
మున్నె యివి హరిపాదముల మీఁద నిలిపినను
అన్ని పుణ్యంబులను అందునే కలుగు
|
|
చ. 2: |
వీనులనియెడి మహావెడఘోర నరకములు
అన్ని పరనిందలే ఆలింపుచుండు
నానాట యిందులో నారాయణుని కథలు
వూని నించిన పుణ్యభోగములే యొసఁగు
|
|
చ. 3: |
నాలుకనియెడి గుహను నాచుఁబామది యొకటీ
గాలి అమృతపు విషము గ్రక్కుచుండు
యీ లీల శ్రీవేంకటేశు నామామృతము
సోలి నించవే ఆత్మ శుభములే కలుగు
|
|
రేకు: 0274-04 కేదారగౌళ సం: 03-427 నామ సంకీర్తన
పల్లవి : |
ఎన్ని చందముల నెట్టైన నుతింతు
కన్నుల నిన్నే కనుఁగొంటిఁ గాన
|
|
చ. 1: |
గోవిందాయని కొలిచిన నిన్నే
శ్రీవల్లభుఁడని చింతింతును
భూవిభుఁడవు యిది పునరుక్తనకు మీ
దైవ మొకఁడవే ధరణికిఁ గాన
|
|
చ. 1: |
పరమాత్ముఁడవని భక్తి సేసి నిను
నరహరివని ధ్యానము సేతు
సరవులఁ జర్విత చర్వణమనకుమీ
అరయఁగఁ గురి యంతరాత్మవు గాన
|
|
చ. 1: |
సరుగ శ్రీవేంకటేశ్వర నీదాస్యము
మరిగితే నదె ముమ్మాఁటికిని
తిరిగినయందె తిరిగెదననకుమీ
యిరవుగ నితరం బిఁకలేదు గాన
|
|
రేకు: 0274-05 గుజ్జరి సం: 03-428 వైరాగ్య చింత
పల్లవి : |
దేవ నీవేకాల మెట్టు దిప్పినాఁ దిరుగుట గా-
కీవలఁ బెద్దరికము యెక్కడిదో తనకు
|
|
చ. 1: |
దొరకొని జీవుఁడు దుఃఖముల కోపఁడు
నరకములోనఁ దననాఁటి పాటెంచఁడు గాని
సిరుల కొరకుఁగాఁ జిందువందయ్యీఁ బ్రాణి
పురువై పుట్టినపుడే బుద్ధులెందు వోయనో
|
|
చ. 2: |
పొల్లువోకీ మేను నేఁడు భోగించకుండలేదు
తల్లికడుపులోనుండి తానేమి భోగించెనో
యిల్లు ముంగి లాసపడీ నిప్పుడే యీగుణము
తొల్లి జనించనినాఁడు తొలఁగి యెందుండెనో
|
|
చ. 3: |
గుక్కక మనసు నేఁడు కోరక వుండఁగలేదు
తక్కి బ్రహ్మప్రళయానఁ దా నెట్లుండెనో
నిక్కి శ్రీవేంకటేశ్వర నీమరఁగు నేఁ జొచ్చితి
యెక్కువఁ దానిటమీఁద నెందుకు దాఁగీనో
|
|
రేకు: 0274-06 కన్నడగౌళ సం: 03-429 విష్ణు కీర్తనం
పల్లవి : |
నడపే వేఁటికి నాటకము
అడరి నిజముగా నానతి యీవే
|
|
చ. 1: |
విశ్వమూర్తి కొక విన్నపము
శాశ్వతములాయ జగములివి
యీశ్వరేశ్వరున కింకొక విన్నపము
ఐశ్వర్యమోక్షం బాత్మలకేది
|
|
చ. 2: |
రమాధిపతి కొక రహస్యము
సమానుఁడవు నీవు సర్వమున
క్రమాన నిఁక నొక రహస్యము
సమోహి (?) నరకము స్వర్గము నేలా
|
|
చ. 3: |
హరి నే నొకమాఁ టడిగెదను
నిరంతరాత్మవు నీవుగదే
యిరవుగ శ్రీవేంకటేశ నే నడిగెద
విరసము లేదిఁక విచార మేలా
|
|