తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 267

వికీసోర్స్ నుండి

రేకు:0267-01 లలిత సం: 03-383 అద్వైతము


పల్లవి :

పెద్ద తెరువుండఁగాను పెడగంతలు దీసుక
పొద్దువోక యడవులఁ బుంగుడయ్యేరు


చ. 1:

తొల్లిటి పెద్దలెంచిరి దొడ్డవాఁడు హరియంటా
అల్లదె భారత రామాయణ భాగవతములు
ఇల్లిదె నేఁటి పెద్దలు యెవ్వరో దైవములంటా
వెల్లవిరిగా నింకా వెదకేరు


చ. 1:

దేవలోకమువారు దేవుఁడు శ్రీపతియని
భావించి మొరవెట్టి బ్రదికిరి
యీవల నిప్పటివారు ఇందరికి మొరవెట్టి
కావిరి నెవ్వరివారుఁ గాక వున్నారు


చ. 1:

నానాభూములవారు నమ్మి శ్రీవేంకటపతిఁ
గానవచ్చి యేఁటనేఁట ఘనులయ్యేరు
యీనిజ మిక్కడివారు యిన్నియుఁ దెలిశుండియు
మానక చలాలఁబోయి మాయలఁ బొందేరు

రేకు:0267-02 లలిత సం: 03-384 వైష్ణవ భక్తి


పల్లవి :

నాకేల విచారము నాకేల యాచారము
సాకిరైనవాఁడ నింతే సర్వేశుఁడే దిక్కు


చ. 1:

ప్రపంచ మధీనము పాలుపడ్డ దేహమిది
ప్రపంచముతో పాటు పరగీని
యెపుడూ నీయాతుమ యీశ్వరాధీనము
అపు డాతఁ డెట్టునిచే నట్టే అయ్యిని


చ. 2:

కర్మాన కధీనము కలిములు లేములు
కర్మమెట్టు గల్పించెఁ గలిగీని
అర్మిలి నాయాచార్యు నధీనము మోక్షము
ధర్మ మతని కృపను తానే వచ్చీని


చ. 3:

చిత్తమున కధీనము చిల్లరయింద్రియములు
చిత్తము చిక్కినప్పుడు చిక్కీనవి
హత్తి శ్రీవేంకటేశుదాస్య మధీనము జన్మము
పొత్తుల నందుకు నది పూఁచినట్టయ్యీని

రేకు: 0267-03 మాళవి సం: 03-385 ఉపమానములు


పల్లవి :

ఏఁటి పరిణామము మమ్మేల యడిగేరయ్య
గాఁటపుహరి యొక్కఁడే గతి మా కిఁకనయ్య


చ. 1:

మరుగుచు శ్రీహరి మాయలోఁ జిక్కినయట్టు
గరిమలఁ గులకాంతకాఁగిటఁ జిక్కితిమయ్య
తిరముగఁ గాలములు దిగమింగినయట్టు
సొరిది చవులు మింగుచు నున్నారమయ్య


చ. 2:

జననిగర్భములోన చక్కఁగా మునిఁగినట్టు
మునుకొని నిద్దురల మునిఁగి వున్నారమయ్య
చనవునఁ గర్మమనే జలధిలో నున్నట్టు
ధనధాన్యాల నడుమఁ దగిలి వున్నారమయ్య


చ. 3:

పేదవాఁడు నిధిగని పెక్కువ బతికినట్టు
గాదిలి శ్రీవేంకటేశుఁ గని చెలఁగితిమయ్య
యీదెస మొక్కే దైవ మెదురుగావచ్చినట్టు
ఆ దేవుఁడే మాకు నంతరాత్ముఁ డాయనయ్య

రేకు: 0267-04 బౌళి సం: 03-386 ఉపమానములు


పల్లవి :

సాసముఖా నడె సాసముఖా
ఆసల పరివారము అవధారు దేవా


చ. 1:

మత్తిలి జీవుఁడ నేటిమహిమ గలుగు రాజు
చిత్తమనియెడి పెద్ద సింహాసనం బెక్కి
బత్తితోఁ బంచేంద్రియపు పరివారము గొలువ
చిత్తజు పారుపత్యము సిసీనిదివో


చ. 2:

కడు మదించి నహంకారమనే యేనుగపై
యెడనెడ నెక్కి తోలీనిదె జీవుఁడను రాజు
బడిబడిఁ గర్మముల పౌఁజులు దీర్చరో
వెడమాయ పట్టణపు వీధుల నేఁగీని


చ. 3:

మించిన సంసారమనే మేడలో నేకాంతమున
పొంచి జీవుఁడనే రాజు భోగము భోగించఁగా
అంచెల శ్రీవేంకటేశుఁడనే దేవుఁడు వచ్చి
మంచితనమునఁ దానె మన్నించె నదివో

రేకు: 0267-05 ముఖారి సం: 03-387 వైరాగ్య చింత


పల్లవి :

నీకు నీ సహజమిది నాకు నా సహజమిది
యేకడా నీవే నిరుహేతుక బంధుఁడవు


చ. 1:

నే నిన్నుఁ దలఁచినా నెఱి నిన్ను మఱచినా
పూని నా యంతరాత్మవై వుండకపోవు
పూని నిన్నుఁ బూజించినాఁ బూజించకుండినాను
కానీలే యీశ్వరుఁడవుఁ గాక మానవు


చ. 2:

యిట్టె నే నడిగినా నేమీ నడుగకుండినా
జట్టిగా నీవు రక్షించక మానవు
తొట్టి నిన్ను దగ్గరినా దూరమున నుండినాను
పుట్టించి నీ గర్భములోఁ బొదలించకుండవు


చ. 3:

భావించి నీకు మొక్కినాఁ బరాకై మానినా -
నేవి చూచినా నీవై యిఁకఁ బాయవు
శ్రీవేంకటేశుఁడ నీవే చింతాయకుఁడవు
కావించేటి నా వుద్యోగములేమి బాఁతి

రేకు: 0267-06 రామక్రియ సం: 03-388 ఉపమానములు


పల్లవి :

కాంతల మానమనేటి కరవట్నాలకు దిగె
మంతనాన జీవుఁడనే మంచిమరకాఁడు


చ. 1:

అరిది సంసారమనే యంబుధిలోనఁ దిరిగి
వురుగతి దేహపుటోడమీఁద
సరిఁ బాపపుణ్యముల సరకులు నించుకొని
దరి చేరె జీవుఁడనే తలమరకాఁడు


చ. 2:

కడలేని నిట్టూర్పుగాలి విసరఁగాను
జడియుఁ గోరికలనే చాపలెత్తి
అడిబరవుగ మాయ అందునిండా నించుకొని
యెడతాఁకె జీవుఁడనే యీమరకాఁడు


చ. 3:

అల శ్రీవేంకటేశుఁడని యేటిమాలిమి
నలుదిక్కులకు నోడ నడపఁగాను
ములిగె ధర్మార్థకామమోక్షధనము గడించి
పలుమాఱు జీవుఁడనే బలుమరకాఁడు.