తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 232
రేకు: 0232-01 లలిత సం: 03-180 శరణాగతి
పల్లవి:
వెన్న చేతఁబట్టి నేయి వెదకనేలా
యిన్నిటా నెంచి చూచితే నిదియే వివేకము
చ. 1:
నీ దాసులున్నచోట నిత్యవైకుంఠ మిదె
వేదతో వేరొక చోట వెదకనేలా
ఆదిగొని వారిరూపు లవియే నీరూపులు
పోది నిన్ను మదిఁ దలపోయనేలా
చ. 2:
వారలతోడి మాటలు వడి వేదాంతపఠన
సారె వట్టిచదువులు చదువనేల
చేరి వారికరుణే నీ చేపట్టిన మన్ననలు
కోరి యింతకంటే మిమ్ముఁ గొసరనేలా
చ. 3:
నావిన్నపము నిదె నారదశుకాదులును
యీవిధముననే ఆనతిచ్చినారు
శ్రీవేంకటేశ నీవు చేపట్టిన దాసులకు
కైవశమౌ యీబుద్ధి కడమేలా
రేకు: 0232-02 దేవగాంధారి సం: 03-181 శరణాగతి
పల్లవి:
హీనుఁడైన నన్నుఁ దెచ్చి యింతగా మన్నించితివి
దానవారి నీవు సేసే తగవిట్టిదయ్యా
చ. 1:
విరతి బొందినయట్టి విమలచిత్తుఁడఁ గాను
ధరణి నెక్కుడయిన తపసిఁ గాను
అరుదుగ గెంటులేని ఆచారవంతుఁడఁ గాను
హరి నీకరుణ నాపై నంటుటెట్టయ్యా
చ. 2:
చేముంచి యిందరిలోన జితేంద్రియుఁడఁ గాను
భూమెల్లా దానమిచ్చిన పుణ్యుఁడఁ గాను
దోమటికర్మాలు సేసి తుదకెక్కేవాఁడఁ గాను
యేమిటికిఁ గాచితివో యిది సోద్యమయ్యా
చ. 3:
వివరించి తెలిసిన విజ్ఞాని తొలుతఁ గాను
తవిలి వీ భక్తిగల ధన్యుఁడఁ గాను
భవసాగరములోని ప్రాణిమాత్ర మింతే నేను
యివల శ్రీవేంకటేశ యెట్టేలితివయ్యా
రేకు: 0232-03 మంగళకౌశిక సం: 03-182 శరణాగతి
పల్లవి:
ఇదె నీ కన్నుల యెదిటికి వచ్చితి
కదియుచు నెట్టయినఁ గావకపోదు
చ. 1:
పరమపురుష నీ భక్తి దొరకకే
యిరవగు జన్మము లెత్తితిని
హరి నీ కరుణకు నరుహము లేకే
దురితవిదుల సందులఁ బడితి
చ. 2:
జగతీశ్వర నీశరణము లేకే
వొగి సంసారపువురిఁ బడితి
భగవంతుఁడ నీ పదములు గనకే
తెగని పాపముల తీదీపు లైతి
చ. 3:
గోవిందుఁడ నినుఁ గొలువఁగ నేరకే
ధావతి యాసలఁ దగిలితిని
శ్రీవేంకటేశ్వర చేరి నీవు నా-
దైవమవుగాఁగ ధన్యుఁడ నయితి
రేకు: 0232-04 దేసాళం సం: 03-183 గురు వందన
పల్లవి:
ఈతఁడే ముక్తిదోవ యీతఁడే మాయాచార్యుఁ
డీతఁడు గలుగఁబట్టి ఇందరు బదికిరి
చ. 1:
అదివో తాళ్లపాక అన్నమాచార్యులు
యిదె వీఁడె శ్రీవేంకటేశు నెదుట
వెదవెట్టి లోకములో వేదములన్నియు మంచి-
పదములుసేసి పాడి పావనము సేసెను
చ. 2:
అలరుచుఁ దాళ్లపాక అన్నమాచార్యులు
నిలిచి శ్రీవేంకటనిధియే తానై
కలిదోషములు వాప ఘనపురాణములెల్ల
పలుకుల నించినించి పాడినాఁడు హరిని
చ. 3:
అంగవించెఁ దాళ్లపాక అన్నమాచార్యులు
బంగారు శ్రీవేంకటేశు పాదములందు
రంగుమీర శ్రీవేంకట రమణుని యలమేలు-
మంగను యిద్దరిఁ బాడి మమ్ము గరుణించెను
రేకు: 0232-05 లలిత సం: 03-184 దశావతారములు
పల్లవి:
నేఁడు నీ మహిమ నెరపడి సమయము
వాఁడి మెరసి యిటు వరదుఁడ రావే
చ. 1:
అల చక్రపాణివై యసురల తల-
లిలఁ గూల్చిన జగదీశ్వరుఁడ
చలమున హిరణ్యుఁ జక్కాడి యిటు భూ-
వలయము నిలిపిన వరాహమా
చ. 2:
పంచల నీదాసు బఱచిన కశిపునిఁ
జించిన శ్రీనరసింహమా
యెంచి విభీషణు కిటు లంక యెసగి
కొంచని ప్రతాప కోదండరామా
చ. 3:
నరకాసురు నటు నఱకి కామినుల
సిరులఁ జెఱగొన్న శ్రీకృష్ణ
పొరిఁబొరి బలిచే భూదాన మడిగి
సిరి నిటు గూడిన శ్రీవేంకటేశా
రేకు: 0232-06 శంకరాభరణం సం: 03-185 అధ్యాత్మ
పల్లవి:
కని గుడ్డును నదె విని చెవుడును నిదె
ననిచి జగత్తు నడచీనదివో
చ. 1:
వుదయాస్తమయము లొకదినముననే
యెదుటనె వున్నవి యెంచినను
యిదివో జీవులు యెంచక తమతమ-
బ్రదుకులు సతమని భ్రమసెదరు
చ. 2:
వెలుఁగును జీఁకటి వెసఁ గనుఁగొనలనె
నిలిచీ నూరక నిమిషములో
కలవలెనుండిన గతి సంసారము
బలువుగ సతమని భ్రమసెదరు
చ. 3:
కాంతలుఁ బురుషులు కాయ మొక్కటనె
పొంతనే పుట్టుచుఁ బొదలెదరు
యింతయు శ్రీవేంకటేశ్వరు మహిమలఁ
పంతము దెలియక భ్రమసెదరు