తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 231

వికీసోర్స్ నుండి


రేకు: 0231-01 ధన్నాసి సం: 03-174 అధ్యాత్మ

పల్లవి:

వెఱ్ఱి దెలిసి రోఁకలి వెసఁ జుట్టుకొన్నట్టు
యిఱ్ఱి దీముభోగముల నెనసేము

చ. 1:

మురికిదేహము మోచి మూలల సిగ్గుపడక
పొరిఁ బరిమళములు పూసేము
పరగ పునుకతల పావనము సేసేమంటా
నిరతితోడ దినము నీట ముంచేము

చ. 2:

పుక్కట పంచేంద్రియపు పుట్టు వుట్టి యందరిలో
మొక్కించుక దొరలమై మురిసేము
అక్కర నజ్ఞానమనే అంధకారమున నుండి
దిక్కుల నెదిరివారిఁ దెలిపేము

చ. 3:

దినసంసారమే మాకు దేవుఁడని కొలుచుక
వెనుకొని ఘనముక్తి వెదకేము
యెనలేక శ్రీవేంకటేశ మమ్ముఁ గావఁగాను
తనిసి తొల్లిటిపాటు దలఁచేము


రేకు: 0231-02 రామక్రియ సం: 03-175 శరణాగతి

పల్లవి:

ఇంకా నో దైవమా యేల వెఱ్ఱి దవ్వించేవు
కొంకి తెంచి ముడిగొంటే కుఱుచే కాదా

చ. 1:

పైకొని నీదాసులు బ్రహ్మాదులఁ గొల్వమని
లోకులఁ గొల్చితే వారు లోలో నవ్వరా
కోక చాకియింట వేసి కొక్కెరాలవెంటఁ బోతే
ఆకడ పురుషార్థము నందీనా జీవుఁడు

చ. 2:

వుమ్మడిఁ గర్మఫలము వొల్లమని పసిఁడికి
నమ్మిక చేయి చాఁచితే నవ్వదా అది
కమ్మి శిరసుండఁగా మోకాల సేస వెట్టఁబోతే
సమ్మతి నిందరిలోన జాణౌనా జీవుఁడు

చ. 3:

సారెకు మాయాప్రపంచమునకు లోనుఁ గాక
నారులకు లోనై తే నవ్వరా వారు
యీరీతి శ్రీవేంకటేశ ఇన్నిటా నీశరణని
కూరవండి కసవేరిఁ గోరీనా జీవుఁడు


రేకు: 0231-03 బౌళి. సం: 03-176 శరణాగతి

పల్లవి:

అమ్మే దొకటియును అసిమ లోనిదొకటి
ఇమ్ముల మాగుణములు యెంచఁ జోటేదయ్యా

చ. 1:

యెప్పుడు నేము చూచిన నింద్రియకింకరులము
ఇప్పుడు నీకింకరుల మెట్టయ్యేమో
తప్పక ధనమునకు దాస్యము నేము సేసేము
చెప్పి నీదాసులమన సిగ్గుగాదా మాకు

చ. 2:

పడఁతుల కెప్పుడును పరతంత్రులము నేము
వడి నీ పరతంత్రభావము మాకేది
నడుమ రుచులకే నాలుక అమ్ముడువోయ
యెడయేది నిన్ను నుతిఇంచేఅందుకును

చ. 3:

తనువులంపటానకు తగ మీఁదెత్తితిమిదె
వొనరి నీవూడిగాన కొదిగేదెట్టు
ననిచి శ్రీవేంకటేశ నాఁడే నీకు శరణంటి
వెనక ముందెంచక నీవే కావవయ్యా


రేకు: 0231-04 దేసాక్షి సం: 03-177 వైరాగ్య చింత

పల్లవి:

వెఱ్ఱి దెలిసి మరియు వేఁదురు దవ్వేము నేము
ముఱ్ఱుఁబాల మంకువాఁడ మూలమా శరణు

చ. 1:

తోలు నెముకలు ముట్టి దోసమంటాఁ దీర్థమాడి
తోలు నెముకల మేనితోడ నున్నాఁడ
వాలిన జీవహింస వద్దని చైతన్యముతో
తేలించి శాకపాకాల దిగమింగేము

చ. 2:

బూతునఁ బుట్టినందుకు పుణ్యములెల్లాఁ జేసి
బూతుల సంసారమే భోగించేము
పాతకములెల్లాఁ బోను బహుదానము లొసఁగి
ఆతల నొరులఁ బోయి అడిగేము నేము

చ. 3:

కర్మము లన్నియుఁ దోసి ఘనముక్తిఁబొందేనంటా
కర్మాచలే కడుఁ జేసేము
నిర్మించి శ్రీవేంకటేశ నేరాలు నన్ను నెంచక
ధర్మము దలఁచి నీవే దయఁ జూడవే


రేకు: 0231-05 దేసాళం సం: 03-178 కృష్ణ

పల్లవి:

ఏమనఁగ వచ్చునమ్మ ఇటువంటి వారిఁ జూచి
కామించి గోపికలెల్లాఁ గాచుకున్నా రదివో

చ. 1:

రోలఁ గట్టుపడ్డవాఁడు రోఁకలి పట్టినవాఁడు
వేళలేదు వెన్నలెల్ల వెరఁజాడేరు
వేలఁ గొండెత్తినవాఁడు వేరే యేరుసేసేవాఁడు
బాలులవలెనే వీధిఁ బారాడేరు వారివో

చ. 2:

కాటుకమైచాయవాఁడు కప్పురపువన్నెవాఁడు
కూటము గూడుక జోడుకోడెలైనారు
నీటుఁ బైఁడికోకవాఁడు నీలికాశతోడివాఁడు
తేటలై దూడలఁ గాచి తిరిగేరు వారివో

చ. 3:

చేరి చీరలిచ్చువాఁడు చెలిఁ గుంగించినవాఁడు
ధీరులై రేపల్లెలోనఁ దిరిగేరదే
యీ రీతి శ్రీవేంకటాద్రి నిద్దరును నేకరూపై
కోరినవారి వరాలు కొల్లలిచ్చే రదివో


రేకు: 0231-06 పాడి. సం: 03-179 కృష్ణ

పల్లవి:

చేరి యందెలమోతతో చెన్నకేశవా
యీరీతి మాఁడుపూరిలో నిట్లాడేవా

చ. 1:

మున్ను యశోద వద్దను ముద్దు గునిశాడితివి
పన్ని రేపల్లె వీధులఁ బారాడితివి
పిన్నవై గోపాలులతోఁ బిల్లదీపులాడితివి
యెన్నిక మాఁడుపూరిలో యిట్లాడేవా

చ. 2:

కాళింగు పడిగెలపై కడు నాట్యమాడితివి
కేలి యమునలో రాసక్రీడలాడితి
చేలలంటి గోపికల చెట్టాపట్టాలాడితివి
యీలీల మాఁడుపూరిలో యిట్లాడేవా

చ. 3:

తగు విభాండకునితో దాఁగిలిముచ్చలాడితి
అగడుగా బండివిరిచాటలాడితి
వొగి శ్రీవేంకటగిరి నుండి వచ్చి మాఁడుపూర-
నెగసెగసి గతుల కిటులాడేవా (?)