తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 222

వికీసోర్స్ నుండి


రేకు: 0222-01 సామంతం సం: 03-120 అధ్యాత్మ

పల్లవి:

ఇందునే వున్నది యెఱుకయు మఱపును
చందమిదివో ఇకఁ జదివెడిదేది

చ. 1:

అంది కర్మముల ననుభవింపుచును
ముందర మరి సుఖములు గోరు
కందువ నీదేహి కనియుం గానఁడు
దిందుపడ (?) నొరులు తెలిపెడిదేది

చ. 2:

వొకచేత హేయ ముడుగక కడుగును
వొకచేత భుజించు నొగి రుచులు
అకటా దృష్టం బరచేనుండఁగ
సకలము నుపదేశము లిఁక నేవి

చ. 3:

మలయు భోగములు మాయలని యెరుఁగు
నిలిచిన మోక్షపునిజ మెరుఁగు
యిలపై శ్రీవేంకటేశుఁడు గలఁడిదె
బలిమి గలిగెనిఁకఁ బదరెడిదేది


రేకు: 0222-02 లలిత సం: 03-121 శరణాగతి

పల్లవి:

పురుషోత్తముఁడ నీవే పుణ్యము గట్టుక నన్ను
దరిచేర్చి రక్షించి దయఁ జూడఁగదవే

చ. 1:

ధరలో యాచకునకు ధర్మాధర్మము లేదు
సిరులఁ గాముకునికి సిగ్గులేదు
పరమపాతకునకు భయమించుకాలేదు
విరసపు నాకై తే వివేకమే లేదు

చ. 2:

మించిన కృతఘ్నునికి మేలెన్నఁడును లేదు
చంచలచిత్తునకు నిశ్చయమే లేదు
అంచల నాస్తికునకు నాచారమే లేదు
కొంచని మూర్ఖుఁడ నాకు గుణమే లేదు

చ. 3:

మదించిన సంసారికి మరి తనివే లేదు
పొదిగొన మూర్ఖునకు బుద్దే లేదు
అదన శ్రీవేంకటేశ అలమేల్మంగ దాసుఁడ-
నిదివో చనవరి నాకెదురే లేదు


రేకు: 0222-03 సాళంగనాట సం: 03-122 కళ్యాణ కీర్తనలు

పల్లవి:

తిరువీధు లేఁగీని దేవతలు జయవెట్ట
హరి వాఁడె పెండ్లికొడుకై ప్రతాపమున

చ. 1:

కనకపుఁ గొండ వంటి ఘనమైన రథముపై
దనుజమర్దనుఁడెక్కె దరుణులతో
వినువీధిఁ బడెగె(డగ?)లు వేవేలు కుచ్చులతోడఁ
బెనగొనఁగఁ గదలె భేరులు మ్రోయఁగను

చ. 2:

వరుసఁ జంద్రసూర్యులవంటి బండికండ్లతోడ
గరుడధ్వజుఁ డొరసిఁ గడుదిక్కులు
పరగు వేదరాసులే పగ్గాలు వట్టితియ్యఁగ
సరుగ దుష్టులఁ గొట్టి జయము చేకొనెను

చ. 3:

ఆటలుఁ బాటలు వింటా నలమేల్మంగయుఁ దాను
యీటున శ్రీవేంకటేశుఁ డెదురులేక
వాటపు సింగారముతో వాకిటవచ్చి నిలిచీ
కోటానఁగోటి వరాలు కొమ్మని ఇచ్చుచును


రేకు: 0222-04 వరాళి సం: 03-123 వైరాగ్య చింత

పల్లవి:

ఇన్నిటికి నీశ్వరేచ్ఛ యింతేకాక
తన్నుఁదానే హరి గాచు దాసుఁడైతేఁ జాలు

చ. 1:

ప్రకృతిఁ బుట్టిన దేహి ప్రకృత(తి?) గుణమే కాని
వికృతి బోధించబోతే విషమింతే కాదా
వొకవిత్తు వెట్టితే వేరొకటేల మొలచును
ప్రకటమైన వట్టిప్రయాసమే కాక

చ. 2:

పాపానఁ బుట్టిన మేను పాపమే సేయించుఁ గాక
యేపునఁ బుణ్యముతోవ యేల పట్టును
వేపచేఁదు వండితేను వెస నేల బెల్లమవును
పైపై బలిమి సేసే భ్రమ యింతే కాక

చ. 3:

ప్రపంచమైన పుట్టుగు ప్రపంచమునకే కాక
వుపమించ మోక్షమున కొడఁబడునా
ప్రపన్నుడైనవేళ భాగ్యాన శ్రీవేంఠటేశుఁ-
డపుడు దయఁజూడఁగ నధికుఁడౌఁ గాక


రేకు: 0222-05 సాళంగం సం: 03-124 అధ్యాత్మ

పల్లవి:

ఎక్కడి సుద్ది యీ భ్రమనేల పడేరు
అక్కటా వోదేహులాల హరినే తలఁచరో

చ. 1:

బలుదేవతలకునుఁ బాయదట వ్యామోహము
యిలపై నరులము నేమెంతకెంత
కలదట మునులకుఁ గడ(డు?) రాగద్వేషాలు
చలనచిత్తులము మా జాడ యిఁక నేది

చ. 2:

పరగఁ దొల్లిటివారు పంచేంద్రియబద్దులట
నెరవుగా ముక్తులమా నేఁటివారము
అరిదిఁ బ్రపంచము మాయామయమట నేము
దురితవర్తనులము తొలఁగేమా

చ. 3:

ఘన సిద్దగంధర్వులు కడ గానలేరట
దినమత్తులము మా తెలివేఁటిది
యెనలేని శ్రీవేంకటేశ్వరు శరణుచొచ్చి
మనువార మింతేకాక మరి గతియేది


రేకు: 0222-06 దేసాళం సం: 03-125 వేంకటగానం

పల్లవి:

దేవదుందుభులతోడ తేటతెల్లమైనాఁడు
సేవించరో యిదే వీఁడే సింగారదేవుఁడు

చ. 1:

బంగారుమేడలలోనఁ బన్నీట మజ్జనమాడి
అంగము తడి యొత్తఁగా నదే దేవుఁడు
ముంగిటఁ బులుకడిగిన ముత్యమువలె నున్నాఁడు
కుంగని రాజసముతో కొండవంటి దేవుఁడు

చ. 2:

కాంతులు మించిన మాణికపుదోరణముకింద
అంతటఁ గప్పురముచాతు కదే దేవుఁడు
పొంతల నమృతమే పోగైనట్టున్నవాఁడు
సంతతము సంపదల సరిలేని దేవుఁడు

చ. 3:

తట్టు పుణుఁగు నించుక దండిసొమ్ములెల్లాఁ బెట్టి
అట్టెలమేల్మంగ నరుతఁ గట్టి
నెట్టన నమ్మినవారి నిధానమై వున్నవాఁడు
పట్టపు శ్రీవేంకటాద్రిపతియైన దేవుఁడు