తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 221

వికీసోర్స్ నుండి


రేకు: 0221-01 లలిత సం: 03-114 కృష్ణ

పల్లవి:

చూడ నరుదాయనమ్మ సొరిది నందరికిని
వేడుకతో వచ్చి సేవించేరు బ్రహ్మాదులు

చ. 1:

కోరి చంద్రుఁడుదయించ గోకులచంద్రుడు వుట్టె-
నేరీతి నీతఁడు నాతఁ డేమౌదురో
వారిధి కొడుకతఁడు వారిధి యల్లుఁ డీతఁడు
యీరీతి నీతఁడాతని కేలికాయఁ గాని

చ. 2:

నల్లని వాఁడీతఁడాయ తెల్లని వాఁడతఁడాయ
యెల్లవారికిఁ జూడ వీరేమౌదురో
అల్లాతఁడే యమృతము అమృతనాథుఁడితఁడు
చల్లనైన హరితోడ సరిగాఁడుఁ గాని

చ. 3:

ఆతఁడు పూర్వాద్రిమీఁద నమరెఁ నిందరుఁ జూడ
నీతఁడు శ్రీవేంకటాద్రి నిరవైనాఁడు
యేతుల వుబ్బుసగ్గులు యిలమీఁద నాతనికి
చైతన్యమెప్పు డీతఁడు సింగారవిభుఁడుగాని


రేకు: 0221-02 దేసాక్షి సం: 03-115 అధ్యాత్మ

పల్లవి:

దేవత లెందున్నవారో దిష్ట మెవ్వరిఁ గానము
యీవలఁ దామే కలితే నేమని రావలదా

చ. 1:

పరమేదో ఇహమేదో బదికే జీవులకెల్ల
నరకపు దేహాలలో నానుచున్నారు
అరసి పుట్టించినట్టి అజుఁ డెందు దాఁగినాఁడో
సరిగాన మెవ్వరిఁ గొసరేమంటేను

చ. 2:

యేమి గలి గేమి సెలవెన్నటికో తమమేలు
యీ మేరఁ బ్రాణులు మాయ నీఁదుచున్నారు
భూమికి దిక్కైనవారు పొడచూపి కావవద్దా
దీముగా నిలువలేరు తెలిసేమంటేను

చ. 3:

తుదయేడ మొదలేడ తొంగి చూచేవారెవ్వరు
అదె సంసారానఁ బ్రాణులాడుచున్నారు
ఇదె శ్రీవేంకటేశ్వరుఁ డింతలో విచ్చేసి కాచె
యెదుట రక్షకుఁడైతే నిట్టుండవలదా


రేకు: 0221-03 సామంతం సం: 03-116 అధ్యాత్మ

పల్లవి:

నీవు దేవుఁడవు నే నొక జీవుఁడ
యీ విధి నిద్దరి కెంతంతరువు

చ. 1;

పొడమిన జగములు పుట్టెడి జగములు
గుడిగొనె మీ రోమకూపముల
యెడయక నీరూప మేమని ధ్యానింతు
అడరి మీవాఁడ నేననుటే కాక

చ. 2:

మునుపటి బ్రహ్మలు ముందరి బ్రహ్మలు
మొనసి మీ నాభిని మొలచేరు
ఘనుఁడవు నిన్నేగతి నేఁ దెలిసెద
అనువుగ మిము శరణనుటే కాక

చ. 3;

సహజానందము సంసారానంద-
మిహముఁ బరముగా నిచ్చేవు
అహిపతి శ్రీవేంకటాధిప నీకృప
మహిలో సేవించి మనుటే కాక


రేకు: 0221-04 ధన్నాసి సం: 03-117 శరణాగతి

పల్లవి:

శరణాగత వజ్రపంజరుఁ డీతఁడు చక్రధరుఁ డసురసంహారుఁడు
వెరవుతోడఁ దను శరణనువారి వెనుబల మీతఁడే రక్షకుఁడు

చ. 1:

హరినామోచ్చారణఁ దెగనికర్మ మవల వేరొకటున్నదా
అరసి యెందు నమ్మిక చాలక ప్రాయశ్చిత్తంబులు చెప్పుదురు
ధర నెరఁగనివారేమనినాఁ దామసులగొడవ యేమిటికి
హరిహరి యంటే దురితము లణఁగెను అతఁడే మాకిఁక రక్షకుఁడు

చ. 2:

శ్రీపతి దిక్కయి కావఁగ మరియునుఁ జేరని సంపద లిఁకనేవి
చాపలబుద్దుల (లు?) నది నమ్మక విచ్చనవిడి నోములు చెప్పుదురు
తీపులు పుట్టించి యెవ్వరేమనినఁ దెలిపి వాదడువ నేమిటికి
శ్రీపతిఁ గొలిచితి చేరె సంపదలు జిగి నితఁడే మా రక్షకుఁడు

చ. 3:

అంతరాత్మ శ్రీవేంకటేశ్వరుఁడు అన్యము భజించఁ జో టేది
యింతట నమ్మక దేవతాంతరము లేఁటేఁటివో మరి చెప్పుదురు
యెంతలేదు ప్రాకృతజనముల భ్రమ యెవ్వరిఁ గాదన నేమిటికి
యింతకు శ్రీవేంకటేశుదాసులము యీతఁడే మాకిఁక రక్షకుఁడు


రేకు: 0221-05 లలిత సం: 03-118 శరణాగతి

పల్లవి:

వెదకినఁ దెలియదు వెనక ముందరలు
పదమున నిలుపవె పరమాత్మా

చ. 1:

కోరిక లూరక కొనలు సాగఁగా
బారలు చాఁచీఁ బ్రపంచము
యీరీతి జీవులు ఇలఁ బొడమఁ బొడమ
దూరంబాయను తొలుతటి రాక

చ. 2:

కాయపు మదములు కప్పఁగఁ గప్పఁగ
ఆయము లంటీనదె మాయ
పాయక ఇందే పనుపడి పనుపడి
చాయలు మరచిరి జంతువులు

చ. 3:

బలుశరణాగతి ప్రాణులు దలఁచఁగ
నెలవున నిలిపెను నీకరుణ
ఇలపై శ్రీవేంకటేశ్వర యిహ పర-
మలవడి దొరకెను అరచేతికిని


రేకు: 0221-06 బౌళి సం: 03-119 శరణాగతి

పల్లవి:

కనకము కనకమే కడు నినుమినుమే
వెనక సరిదూఁగితే వెలువకురాదు

చ. 1:

హరిఁ గొలిచినవారి కమరు నన్నిసుఖాలు
గరిమతో వారల భాగ్యమే భాగ్యము
తెరమరఁగుల కర్మదేహులెల్ల వీరితోడ
పురుఁడు వెట్టుకోఁబోతే పోలికలు రావు

చ. 2:

భాగవతులైనవారు పట్టినదెల్లా నీడేరు
చేగదేర వారలు సేసినదే చేఁత
తీగెసంసారమత్తులు తెలియక వీరివలె
వేగినంతా నయ్యేమంటే వెరవులఁ బడవు (?)

చ. 3:

శ్రీవేంకటేశుదాసులు చేసినదెల్లా సృష్టి
యేవంకా ధ్రువపట్టమే ఇటు వారికి
కావరపు మనుజులు గతిగనేమని వారి-
తోవల నడవఁబోతేఁ దూగదు తమకును