Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 201

వికీసోర్స్ నుండి


రేకు: 0201-01 మాళవి సం: 03-001 శరణాగతి

పల్లవి: ఇట్టి ప్రతాపము గల యీతని దాసుల నెల్ల
          కట్టునా కర్మములెల్ల గాలిఁ బోవుఁ గాక

చ. 1: యెలమిఁ జక్రాయుధున కెదురా దానవులు
        తొలఁగ కెందుచొచ్చినఁ దుండించుఁ గాక
        ఇల గరుడధ్వజు పై నెక్కునా విషములు
        కలఁగి నీరై పారి గాలిఁ బోవుఁ గాక

చ. 2: గోవర్ధనధరునిపై కొలుపునా మాయలు
         వేవేలు దునుకలై విరుగుఁగాక
         కేవలుఁ డచ్యుతనొద్దఁ గీడు చూపఁగలవా
         కావరమై తాఁ దానె గాలిఁ బోవుఁ గాక

చ. 3: వీరనారసింహునకు వెరపులు గలవా
         దూరాన గగ్గులకాడై తొలఁగుఁ గాక
         కోరి యీ శ్రీవేంకటేశుఁ గొలిచితి మిదివో
         కారుకొన్న పగలెల్ల గాలిఁ బోవుఁ గాక


రేకు: 0201-02 బౌళి సం: 03-002 అధ్యాత్మ

పల్లవి:

ఏది నిజంబని యెటువలె నమ్ముదు
పోదితోడ నను బోధింపవే

చ. 1:

సత్తు నసత్తని సర్వము నీవని
చిత్తగించి శ్రుతి చె ప్పెడిని
వుత్తమమధ్యమ మొగిఁ గలదని మరి
యిత్తల శాస్త్రము లేర్పరదీని

చ. 2:

నానారూపులు నరహరి నీవని
పూనిన విధు లిటు పొగడెడిని
మానక హేయము మరి వపాధే(దే?)యము
కానవచ్చి యిలఁ గలగియున్నవి

చ. 3:

భావాభావము పరమము నీ వని
దైవజ్ఞులు నినుఁ దలఁచెదరు
శ్రీవేంకటగిరిఁ జెలఁగిన నీవే
తావుగ మదిలోఁ దగిలితివ


రేకు: 0201-03 సాళంగనాట సం: 03-003 నామ సంకీర్తన

పల్లవి:

గెలిచితి భవములు గెలిచితి లోకము
యెలమి నీ దాసుల కెదురింక నేది

చ. 1:

జయ జయ నరసింహా జయ పుండరీకాక్ష
జయ జయ మురహర జయ ముకుంద
భయహరణము మాకుఁ బాపనాశనము
క్రియతోడి నీ సంకీర్తన గలగె

చ. 2:

నమో నమో దేవ నమో నాగపర్యంక
నమో వేదమూర్తి నారాయణా
తిమిరి మమ్ముఁ గావఁగ దిక్కయి మాకు నిలువ
జమళి భుజముల శంకుఁజక్రముల గలిగె

చ. 3:

రక్ష రక్ష పరమాత్మ రక్ష శ్రీవేంకటపతి
రక్ష రక్ష కమలారమణ పతి
అక్షయ సుఖమియ్యఁగల న(వ?)టు దాపుదండగా
పక్షివహనుఁడ నీభ క్తి మాకుఁ గలిగె


రేకు: 0201-04 దేసాళం సం: 03-004 కృష్ణ

పల్లవి:

ఎక్కడ చూచిన వీరే యింటింటి ముంగిటను
పెక్కుచేఁతలు సేసేరు పిలువరే బాలుల

చ. 1:

పిన్నవాఁడు కృష్ణుడు పెద్దవాడు రాముఁడు
వన్నె నిద్దరమడలవలె నున్నారు
వెన్నలు దొంగిలుదుర వీఁడు వాఁడు నొక్కటే
పన్నుగడై వచ్చినారు పట్టరే యీ బాలుల

చ. 2:

నల్లనివాఁడు కృష్ణుడు తెల్లనివాఁడు రాముఁడు
అల్లదివో జోడుకోడెలై వున్నారు
వెల్లవిరై తిరిగేరు వేరు లే దిద్దరికిని
పెల్లుగ యశోదవద్దఁ బెట్టరె యీబాలుల

చ. 3:

రోలఁ జిక్కె నొకఁడు రోకలి వట్టె నొకఁడు
పోలిక సరిబేసికిఁ బొంచు వున్నారు
మేలిమి శ్రీవేంకటాద్రి మించిరి తానే తానై
ఆలించి నె(యె?)వ్వరి నేమి ననకురే బాలుల


రేకు: 0201-05 నాట సం: 03-005 వైష్ణవ భక్తి

పల్లవి:

దాసోహమను బుద్ధిఁ దలచరు దానవులు
యీసులకే పెనఁగేరు యిప్పుడూఁ గొందరు

చ. 1:

హరిచక్రము దూషించే యట్టివారే యసురలు
అరయఁ దామే దైవమన్నవారు నసురలే
ధర నరకాసురుడు తానె దైవమని చెడె
యిరవై యిది మానరు యిప్పుడూఁ గొందరు

చ. 2:

పురుషోత్తముని పూజ పాంతఁ బోరు అసురలు
సరవి విష్ణుని జపించనివారు నసురలే
హిరణ్యకశిపుఁడును యీతని నొల్లక చెడె
ఇరవై యీతని నొల్ల రిప్పుడూఁ గొందరు

చ. 3:

సురలును మునులును శుకాది యోగులును
పరమము శ్రీవేంకటపతి యనుచు
శరణని బ్రదికేరు సరి నేఁడు వైష్ణవులు
యెరపరికానఁ బొయ్యే రిప్పుడూఁ గొందరు


రేకు: 0201-06 బౌళి సం: 03-006 శరణాగతి

పల్లవి:

వెఱ్ఱివాఁడ వెఱ్ఱివాఁడ వినియుఁ గనియుఁ మరి
వెఱ్ఱి దెలిసి రోఁకలి వేరె చుట్టేఁ గాక

చ. 1:

పుట్టించిన వాడవట పూచి నన్నుఁ బెంచలేవా
కట్టఁగడ నమ్మని నాకడమే కాక
వొట్టి నాలో నుందువట వొగిఁ బాపము నాకేది
గట్టిగాఁ బుణ్యము వేరే కట్టుకొనేఁ గాక

చ. 2:

యేడనైనా నీవే యట యెదుట నుండఁగలేవా
వేడ(డె?) వెట్టి యేడనై నా వెదకేఁ గాక
ఆడినదెల్లా నీవట అందులోఁ దప్పులన్నవా
వీడు పడ్డ తలఁపుతో వెరచేఁ గాక

చ. 3:

భావించితే మెత్తువట పరము నీ వియ్యలేవా
నీవాఁడననని నా నేరమే కాక
శ్రీవేంకటేశుఁడ నేను చేరి నీకు శరణంటి
దేవుఁడవై కావఁగా నే దిద్దుకొనేఁ గాక