Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 382

వికీసోర్స్ నుండి


రేకు: 0382-01 సాళంగనాట సం: 04-476 వైష్ణవ భక్తి

పల్లవి:

నీగురుతులు చూచుకో నీబిరుదు లెంచుకో
యీగతిని కలబంట నిఁకనన్నుఁ గావవే

చ. 1:

కానిలే నేనెంత కఠినచిత్తుఁడనైన
నానొసల నివే పట్టెనామములు
మేను తోలునెమ్ములతో మెరసినదైనాను
పూనితిఁ దమ్మితులసి పూసల పేరులు

చ. 2:

భ్రమసి నేఁజేసినవి పాపకర్మములైనాను
జమళి భుజాల నివే శంఖచక్రాలు
అమరఁ దఱచుగా నే నాడేవి కల్లలైనా
తమిఁ బాడీ నాలిక నీతగు సంకీర్తనలు

చ. 3:

తలఁచితే నావోజ తామస గుణమైనాను
పిలిచేది భువిలో నాపేరు తిమ్మఁడు
అలర శ్రీవేంకటేశ అన్నిటనే దుష్టనైనా
తలకొనె నాయందు దాసరి తనములు


రేకు: 0382-02 మాళవి సం: 04-477 రామ

పల్లవి:

చెప్పితే నాశ్చర్యము సేసినచేఁత లితఁడు
ముప్పిరి మనుజ వేషమునఁ బుట్టె నీతఁడు

చ. 1:

రాముఁ డుదయించె దశరథునికిఁ దమ్ములతో
గామిడైన తాటకిని ఖండించెను
ఆముక యజ్ఞము గాచె హరుని విల్లు విరిచె
ప్రేమమున సీతాదేవిఁ బెండ్లి యాడెను

చ. 2:

మడియించె ఖరునిని మారీచుని వధియించె
కెడపె వాలిని యా సుగ్రీవునిఁ బెంచె
జడధి బంధించెను సరుగ రావణుఁగొట్టె
బడినే విభీషణునిఁ బట్టము గట్టెను

చ. 3:

సీతాదేవితో నయోధ్య సింహాసనంబెక్కె
పోతరించి కుశలవపుత్రు లఁగాంచె
శ్రీ తరుణితోఁగూడ శ్రీ వేంకటేశుఁడై నిల్చె
కౌతుకమున జగము కరుణఁగాఁచెను


రేకు: 0382-03 లలిత సం: 04-478 శరణాగతి

పల్లవి:

ఏదైనా సుఖమే యిన్నిటా నీవు గలవు
కాదుగూడదని నిన్నుఁ గక్కసించనేఁటికి

చ. 1:

యిహపరములలో నీ వెందు నన్నుఁ బెట్టినాను
నిహితమై రెంటిలోనా నీవు గలవు
వహి కెక్క నేలినవాఁడెక్కడ నుండుమన్నా
తహతహఁ గొలువుకుత్తరువే బంటుకుమ

చ. 2:

పాప పుణ్యములలో నేపని నన్నుఁ జేయించినా
కాపాడి రెండు నీవు కల్పించినవే
యేపున మగఁడైన వాఁడేమి సేయించినాను
దాపగుఁ బతివ్రతా ధర్మమే యాలికిని

చ. 3:

కల్ల నిజములలో నొక్కటి నన్ను నాడించినా
చెల్లించ రెంటికి నీవే శ్రీ వేంకటేశా
తల్లిదండ్రులే బాస దగ నాడ నేర్పినాను
తెల్లమిగ నాడేది తేకువే బిడ్డనికి


రేకు: 0382-04 వరాళి సం: 04-479 భక్తి

పల్లవి:

శ్రీ సతీశ బహుజీవ చైతన్యుఁడవు నీవు
చేసే నా చేఁతలెల్లా నీసేవలె సుమ్మీ

చ. 1:

ఆనుక జగద్రూపుఁడవని నిన్నందురుగాని
నేనిట్టే చూచిన వెల్లా నీ రూపులే
నా నా శబ్దవాచ్యుఁడ వెన్నఁగ నీ వటుగాన
వీనుల విన్నవల్లా నీ విష్ణు కథలే

చ. 2:

అట్టే విశ్వభుజుఁడవైతివి తొల్లే కనక
నెట్టన నా రుచులెల్లా నీ ప్రసాదాలే
గుట్టుతో సర్వ వ్యాపకుఁడవు నీ వటుగాన
ముట్టిన నాతను భోగములు నీకే సెలవు

చ. 3:

ప్రక్కన జీవుల కెల్ల ప్రాణమవు నీవే కాన
ముక్కున నాయాఘ్రాణములెల్లా నీవే
నెక్కొని శ్రీ వేంకటేశ నీవే లోకకుటుంబివి
తక్కక నా సంసారధర్మమెల్లా నీవే


రేకు: 0382-05 లలిత సం: 04-480 వైరాగ్య చింత

పల్లవి:

బడిబడి నింద్రియాలే పరువులు వెట్టుఁగాని
యెడయని చుట్టరికా లెవ్వరికీ లేవు

చ. 1:

వన్నె సతుల రూపులు వారివద్దనే వుండఁగా
కన్నులఁ జూచే వారికి కళరేగును
యెన్నిక వారి గుణాలు యెడ మాటలాడఁగాను
విన్నవారికి నూరకే వేడుకలు పుట్టును

చ. 2:

అంతా నింతాఁ గమ్మవిరు లంగళ్లలో నుండఁగాను
సంత వార లూరకే వాసన గొందురు
బంతి వారి కంచాలలో పలు రుచు లుండఁగాను
వింత వారలందుకుఁగా వెస నోరూరుదురు

చ. 3:

వెరవిడి దేహాలు వేరే వేరే వుండఁగాను
సురతాన సోఁకితేనే చొక్కుదురు
ఇరవై శ్రీ వేంకటేశుఁ డిన్నిటికి సూత్రధారి
సరి నితని దాసులు జడియ రిందుకును


రేకు: 0382-06 కన్నడగౌళ సం: 04-481 వైరాగ్య చింత

పల్లవి:

వట్టిజోలి యెంత లేదు వైరాగ్యమే సుఖము
నెట్టుకొని వివేకింప నేరవలెఁగాని

చ. 1:

కట్టుకొంటే నెంతైనాఁ గలదు సంసారము
పట్టి చేసితేఁ గలవు పనులెన్నైనా
చుట్టుకొంటే నూరఁగల చుట్టరికముఁగలదు
అట్టె మోక్షము గడించే దరు దింతేకాని

చ. 2:

చేసేనంటేఁ గలవు సేనా సేన పనులు
లాసి తగిలించు కొంటే లంపటా లంటు
ఆసలు పెంచ జూచితే నంత కంతకుఁ బెరుగు
వేసిరి శాంతిఁబొందుటే వేడు కింతేఁకాని

చ. 3:

పనిగొంటేఁ బెనుగొనుఁ బంచేంద్రియంబులు
వెనుకొంటేఁ జిమ్మిరేఁచు వేడుకలు
తనిసి శ్రీ వేంకటేశు దసానుదాసుఁడై
కొన కెక్కఁగ నాతనిఁ గొలువవలెఁగాని