తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 381

వికీసోర్స్ నుండి


రేకు: 0381-01 మాళవి సం: 04-470 హనుమ

పల్లవి:

అరుదీ కపీంద్రుని యధిక ప్రతాపము
సురలకు నరుల కీ సుద్దు లెందుఁ గలవా

చ. 1:

వుదయాచలము మీఁది నొక్కజంగ చాఁచుకొని
వుదుటున నపరాద్రి నొక్కజంగ చాఁచుకొని
తుద సూర్యమండలము తోడ మోము దిప్పుకొంటా
పెదవులెత్తి చదివెఁ బెద్ద హనుమంతుఁడు

చ. 2:

వొక్క మొలగంట చంద్రు డొక్క మొలగంట రవి
చుక్కలు మొలపూసలై చూపట్టఁగా
నిక్కిన వాలాగ్రమందు నిండిన బ్రహ్మలోకము
పిక్కటిల్లఁ బెరిగెను పెద్ద హనుమంతుఁడు

చ. 3:

పడికిలించిన చేత బిరుదుల పండ్ల గొల
తడయక కుడి చేత దశ దిక్కుల
జడియక శ్రీ వేంకటేశ్వరునిమన్ననబంటు
బెడిదపు మహిమల పెద్ద హనుమంతుఁడు


రేకు: 0381-02 బౌళి సం: 04-471 రామ

పల్లవి:

నమో నమో రఘు కుల నాయక దివజ వంద్య
నమో నమో శంకర నగజనుతా

చ. 1:

విహిత ధర్మపాలక వీర దశరథ రామ
గహనవాసినీ తాటకా మర్దన
అహల్యా శాపమోచన అసుర కుల భంజన
సహజ విశ్వామిత్ర సవన రక్షకా

చ. 2:

హరి కోదండహర సీతాంగనా వల్లభ
ఖరదూషణారి వాలిగర్వాపహా
తరణి తనూజాది తరుచర పాలక
శరధి లంఘన కృత సౌమిత్రి సమేతా

చ. 3:

బిరుద రావణ శిరో భేదక విభీషణ-
వరద సాకేత పుర వాస రాఘవ
నిరుపమ శ్రీ వేంకేటనిలయ విజనగర
పురవరవిహార పుండరీకాక్షా


రేకు: 0381-03 సాళంగనాట సం: 04-472 రామ

పల్లవి:

చిత్తా అవధారు జియ్య పరా కెచ్చరికె
హత్తి కానుక లిచ్చేరు అదె రాజరాజులు

చ. 1:

రామ రఘ కుల వీర రాజీవ లోచన
కోమల శ్యామల వర్ణ కొలువు వేళ
వామ దేవాది మునులు వారె, సుగ్రీవుఁడు వాఁడె
వేమారును వానర వీరులు మొక్కేరు

చ. 2:

దేవ సీతాస మేత ధీర లోక నాయక
భావించ నవధరించు పౌఁజువేళ
పావని యల్లవాఁడె భల్లూకపతి వీఁడె
సేవించీని భరతునిఁ జేకొను శత్రుఘ్నుని

చ. 3:

శ్రీమదయోధ్యా విహార శ్రీ వేంకటనివాస
సామజ వాజి రథాల సందడివేళ
సౌమిత్రి యీవంక విభీషణుఁడు నావలివంక
నీ మహిమలెల్లా మెచ్చి నీకు విన్నవించేరు


రేకు: 0381-04 గుజ్జరి సం: 04-473 మాయ

పల్లవి:

హేయ మేమీలేదు జగమింతా రుచికరమే
మాయావికార మిది మనసెట్టి రోసును

చ. 1:

కాయధారణము లింపు కాంతలభోగము లింపు
ఆయతమై వారివారి యాహారా లింపు
సోయగపుఁ గన్నులను చూచేటి వేఁడుక లింపు
చాయ మనసొడఁబడి సమ్మతించితేను

చ. 2:

పలుకులెల్లా నింపు భావములెల్లా నింపు
చెలరేఁగి తమ తమ చేఁత లింపు
జలమల సంగతుల సహజము లవి యింపు
వొలిసి తమ మనసొడఁబడి తేను

చ. 3:

తగిన జన్మము లింపు తమ చక్కఁదనా లింపు
జగతి వారికి వారి జాతు లింపు
నిగిడి శ్రీ వేంకటేశ నీ మహిమలే యివి
వొగరు లేక మనసొడఁబడి వుంటేను


రేకు: 0381-05 సామంతం సం: 04-474 శరణాగతి

పల్లవి:

ఎందలివారమో నేము యెఱఁగ వసముగాదు
సందడి విష్ణునకే శరణు చొచ్చెదము

చ. 1:

తెర దీసినట్టుండు తెలిసితే జ్ఞానము
మరుగక మఱచితే మరఁగై తోఁచు
వురియై తగులుఁ గర్మ మూడిచితే నూడును
యిరవైన హరి మాయలెల ఇంపు చున్నవి

చ. 2:

కడుఁ బుణ్య వశమై కాచుకుండు స్వర్గము
నడుమఁ బాపమూలము నరకము
తడవితే నంటును దాఁటేదే నేరుపు
యెడయ కచ్యుతు మాయలెల ఇంపు చున్నవి

చ. 3:

పట్టితేఁ దన మనసు పరమాత్మఁ గనిపించు
చుట్టుకొంటే బంధమై సూడు సాధించు
ఒట్టి శ్రీ వేంకటేశ్వరుఁ డోపి మమ్మునేలెఁ గాని
ఇట్టె యా దేవుని మాయలెల ఇంచును


రేకు: 0381-06 ధన్నాసి సం: 04-475 వేంకటగానం

పల్లవి:

పరమ వివేకులాల బంధువులాల
తెరదీసి మాకు నిది తెలుపరో

చ. 1:

యేడు జానల మేనిలో నిందిరా నాథుఁ డున్నాఁడు
వేడుకతో నతనిని వెదకరో
పూడిచి వున్నది మతిఁ బొందుగ వైకుంఠము
చూడరో ధ్యానము సేసి సోదించరో

చ. 2:

కొడిదెఁడు బయలిలో గోవిందుని నెలవఁట
చిడిముడి తో నిట్టే చేరి పట్టరో
అడఁచి దాఁచివున్నది అందే బ్రహ్మానందము
విడువరో యీ ముడియ వెలయఁ జేపట్టరో

చ. 3:

వూని నల్లెఁడు నాలికలో నుండు శ్రీ వేంకటేశుఁ -
డానుకొని బత్తి తోడ నటు నిల్పరో
నానఁబెట్టివున్నది నామ కీర్తనములందు
తానకముగా నేపొద్దూఁ దలఁచుకోరో