Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 340

వికీసోర్స్ నుండి

రేకు: 0340-01 మంగళకౌశిక సం: 04-232 భక్తి


పల్లవి :

మమ్ముఁజూడనేల నీమహిమే చూతువుగాక
వుమ్మడిఁ బరుస మంటే దొక్కమాఁటేకాదా


చ. 1:

పెక్కుమారులు నిన్నుఁ బేరుకొని జపించఁగ
మక్కళించి నీకుఁ గొంత మహిమెక్కినా
వొక్కమారు జపించి నే నూరకుండినంతలోనే
తక్కక నీమహిమలోఁ దరగి పోయీనా


చ. 2:

తగిలి నేఁ గాలమెల్ల ధ్యానము సేయఁగ నీకు
జిగి నీమేనికిఁ గింత చేవ యెక్కీనా
అగపడి యొకవేళ నటు దలఁచి మానితే
చిగురై యంతటిలోనె చిక్కి వాడీనా


చ. 3:

యిన్ని యాల శ్రీవేంకటేశ మాయింటిలోననే
వున్నతి నీవారమని వుంటేఁ జాలు
సన్నము దొడ్డించనేల సరివలసీచోట
అన్నియు నిత్యమింతే యలమట కోపము

రేకు: 0340-02 మాళవి సం: 04-233 అంత్యప్రాస


పల్లవి :

ఇదిగో రూపై తోఁచీ యిందరియెదుట నివి
మదిఁ జేపట్టేదిలేక మానెఁగాని


చ. 1:

కోపమై పొడచూపుఁ గొంత పాపము
దీపమై పొడచూపు దేహ పాపము
మాపులు నిద్దురై చూపు మరికొంత పాపము
కైపుగాఁ బరుల నింద కడమ పాపము


చ. 2:

శాంతమే పుణ్యము సత్యదయే పుణ్యము
అంతటాను హరిభక్తి యది పుణ్యము
చింతించ వైరాగ్యమే చేతిలోని పుణ్యము
మంతనపుజ్ఞానమే మహిఁగల పుణ్యము


చ. 3:

హరినామమే ముక్తి యరసి కైకొంటేను
ధర నాతనిదాస్యమే తగిన ముక్తి
సొరిది శ్రీవేంకటేశుఁడే పరతత్వము
యిరవై కొలుచుటే యిహ నిత్యముక్తి

రేకు: 0340-03 పాడి సం: 04-234 కృష్ణ


పల్లవి :

అనుచుఁ బొగడఁ జొచ్చెరదె బ్రహ్మాదులు మింట
మొనసి యీ బాలునికే మొక్కేము నేము


చ. 1:

వున్నతపు లోకములు వుదరాన నున్నవాఁడు
అన్నువ నీ దేవకీ గర్భమందు పుట్టెను
మన్నించి యోగీంద్రులమదిలోనుండెడువాఁడు
పన్నిన పొత్తులలోన బాలుఁడై వున్నాఁడు


చ. 2:

పాలజలధిలోన పాయనిగోవిందుఁడు
పాలు వెన్న లారగించె పైఁడికోరను
వోలిఁ దన విష్ణుమాయ నోలలాడినట్టివాఁడు
చాలి మంత్రసానులచే జలకమాడీని


చ. 3:

ముగురువేల్పులకు మూలమైన యట్టివాఁడు
తగుబలభద్రునికి తమ్ముఁడాయను
నిగిడి వైకుంఠమున నిలిచి రేపల్లెనుండి
యెగువ శ్రీవేంకటాద్రి నిరవాయ వీఁడే

రేకు: 0340-04 శుద్ధవంతం సం: 04-235 భక్తి


పల్లవి :

హరిపూజే బ్రహ్మాండ మవ్వలి కవ్వల గాని
యెరవెల్లా నాసందికీసందివే


చ. 1:

తపములు జపములు దానధర్మములెల్ల
యెపుడును బ్రహ్మలోక మీసందివే
విపరీతభోగాలు వెలలేనిపుణ్యాలు
కపురులు స్వర్గలోకముకాడివే


చ. 2:

వట్టి సటరాజసాలు వర్ణాశ్రమములును
పుట్టుగులిన్నియును యీభూమిమీఁదివే
చుట్టపు సంబంధాలు జోలి వావివర్తనలు
దిట్టతనములెల్ల యీదేహముతోడివే


చ. 3:

పూఁటపూఁటకోరికలు పొరలేవుపాయాలు
మాఁటలుఁదేటలునెల్ల మతిలోనివే
గాఁటపు శ్రీవేంకటేశుగని కొలిచినఁజాలు
నాఁటకపు మతములు నవ్వులలోనివే

రేకు: 0340-05 హిందోళం సం: 04-236 నామ సంకీర్తన


పల్లవి :

ఉన్న సుద్దులేల మాకు వూర విచారములెల్ల
వెన్నునికి మొక్కుటే వేవేలు మాకు


చ. 1:

నగధర నందగోప నరసింహ వామన
జగదేకపతియనే జపము మాది
తగు హరిడింగరీఁడ దాసుఁడ బంటననేటి-
మిగులఁ బెద్దతనము మించేది మాకు


చ. 2:

హరి పుండరీకాక్ష ఆదినారాయణయనేటి-
ధర నామమంత్రములే ధనము మాకు
సరుస శంఖచక్రాలు సర్వేశుదాసుల సేవె
మరిగినదె మామతమును మనికె


చ. 3:

శ్రీవేంకటేశయని శేషగిరివేదాద్రి
భావించి కొలుచుటే మాబ్రదుకెల్లను
కైవల్యమిదియె కంటి మిట్టి మంచిత్రోవ
పావనమైతిమి మమ్ముఁ బాలించె నితఁడు

రేకు: 0340-06 శంకరాభరణం సం: 04-237 కృష్ణ


పల్లవి :

ఏఁటి బిడ్డఁ గంటివమ్మ యెశోదమ్మ
గాఁటపు దేవతలెల్లఁ గాచుకున్నా రితని


చ. 1:

చెక్కుమీఁటి పాలువోయి చేరి నోరు దెరచితే
పక్కుననుఁ బొడచూపె బ్రహ్మాండాలు
అక్కున నలముకొంటే సంగజతాపము మోఁచె
మక్కువకు వెరతుము మాయపు బాలునికి


చ. 2:

పొత్తులలో నుండఁగానె భుజాలు నాలుగుదోఁచె
యిత్తల బాలునికేవి యిటువంటివి
యెత్తుకొన్న వేకమై యెవ్వరికి వసగాఁడు
హత్తిచూడ వెరతు మీ యారడిబాలునికి


చ. 3:

తేఱి వీనితోడిముద్దు దేవలోకము పనులు
మీఱి యేవి చూచినాను మితిలేనివి
ఆఱడిగొల్లెతలము అట్టె కూడి యాడితిమి
వేఱు సేయ వెరతు శ్రీవేంకటాద్రిబాలుని