Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 321

వికీసోర్స్ నుండి

రేకు: 0321-01 సాళంగం సం: 04-118 శరణాగతి


పల్లవి :

వెన్న చేతఁబట్టి నేయి వెదకినట్టు
యెన్నఁగ నీవుండఁగాను యెక్కడో చూచేను


చ. 1:

కన్నులు మిన్నులు దాఁకీ కాయ మీడ వున్నఁగానే
తిన్నని వీనులు మెట్టీ దిక్కులనెల్ల
యిన్నిటి కొడయఁడవై యిందిరేశ నీవు నాలో
నున్నరూపు గానలేను వూహించి ఇపుడు


చ. 2:

కాయము పాయము గీరీ కాల మీడ నుండఁగానే
ఆయపు మనసు ముంచీ నన్నిటియందు
యేయెడ నాలోనున్న యీశ్వర నీ నిలయము
పాయకుండఁ గోరలేను పాయము నాకెట్టిదో


చ. 3:

ఇహమే పరము గోరీ యీడ నిట్టె వుండఁగాను
మహిలో శ్రీవేంకటేశ మహిమెట్టిదో
అహరహమును నీ వంతర్యామివై
సహజమై యుండఁ గంటి చాలు నిఁక నాకు

రేకు:0321-02 లలిత సం: 04-119 శరణాగతి


పల్లవి :

నేఁడుగాక దొరనైతి నేను నారాయణుఁ గొల్చి
పోఁడిమి నాచార్యుని బోధవంకను


చ. 1:

దీనవృత్తి నేఁ దిరుగని చోటేది
నానా చంచలము నామనసు
నేఁగొనని భువిలోని రుచు లేవి
హీనజన్మము లెత్తిన దీమేను


చ. 2:

చేరి నేఁజేచేతఁ జేయనిపాప మేది
ధారుణి మోపైన సంసారమునను
ఆరయ మున్ను నేనాడని కల్లలేవి
సారెకు నుదరపోషణమునకు


చ. 3:

సూటిదప్పక నేఁ జూడని చూపేది
చేటులేని చిరకాల జీవుఁడనే
చాటువ శ్రీవేంకటేశు శరణు చొరకతొల్లి
బూటకము లెన్ని లేవు పొలయదు కాలము

రేకు:0321-03 దేసాళం సం: 04-120 శరణాగతి


పల్లవి :

అన్నిటా నిట్టే కాని యగపడదు
అన్నమదమున జిత్త మగపడదు


చ. 1:

సొలసి సంసారములో సుఖముఁ బొందేనంటే
అలమటలేకాని యగపడదు
పలుచదువులవంకఁ బరము గనేనంటే
అల సంశమోకాని యగపడదు


చ. 2:

వెడదేహము మోఁచి విరతిఁ బొందేనంటే
అడియాసలేకాని యగపడదు
పడిఁ గోపమే యుండఁగ శాంతిఁ బొందేనంటే
అడవిఁ బడుటేకాని యగపడదు


చ. 3:

నేరిచి నీ మాయలోన నిజభక్తి గనేనంటే
అరీతి నాఱడేకాని యగపడదు
మేరతో శ్రీవేంకటేశ మించి నీకే శరణంటే
ఆరి తేరి కర్మబంధ మగపడదు

రేకు: 0321-04 బౌళి సం: 04-121 శరణాగతి


పల్లవి :

చదివి చదివి వట్టిజాలిఁబడు టింతేకాక
యెదుట నిన్ను గానఁగ నితరులవశమా


చ. 1:

ఆకాశముపొడవు ఆకాశమే యెరుఁగు
ఆకడ జలధిలోఁతు ఆ జలధే యెరుఁగు
శ్రీకాంతుఁడ నీ ఘనము చేరి నీవే యెరుఁగుదు-
నీకడ నితంతన నితరుల వశమా


చ. 2:

నదులయిసుకలెల్ల నదులే యెరుఁగును
కదలి గాలియిరవు గాలికే తెలుసు
అదన నాత్మగుణము లంతరాత్మ నీవెరుగు-
దిదియదీయనిచెప్ప నితరులవశమా


చ. 3:

శ్రీవేంకటేశ యిన్నిచింతలకు మొదలు
యీ నీ శరణంటే యిటు నీవే యెరిగింతు
దైవమా నీ కల్పనలు తగ నీవే యెరుఁగుదు -
వీవల నౌఁగాదన నితరుల వశమా

రేకు: 0321-05 శ్రీరాగం సం: 04-122వైష్ణవ భక్తి


పల్లవి :

ప్రత్యక్షమే మాకుఁ బ్రమాణము
సత్యరూప జోలిదవ్వి జాలిఁబడ నోపము


చ. 1:

కన్న వారెవ్వరు నిన్ను కన్నుల యెదుటను
పన్ని నీదాసులు చూచే భావమువలె
విన్న వారెవ్వరు నీవిభవపు మాటలు
అన్నిటా నాచార్యుని యానతివలె


చ. 2:

తొడఁగి నీ ప్రసాదము దొరకని వారెవ్వరు
జడియు నీ దాసుల ప్రసాదమువలె
కడు నీ పాదతీర్థము కడగన్నవారెవ్వరు
బడిబడి నీ భక్తపాదజలమువలె


చ. 3:

యేచి పరంధామమున కేఁగిన వారెవ్వరు
చాచిన నీ దాసుల సన్నిధివలె
చాచితి శ్రీవేంకటేశ సొంపుల నీ మహిమెల్ల
తాచిన నీ దాసానుదాసులయందే

రేకు:0321-06 దేవగాంధారి సం:04-123 శరణాగతి


పల్లవి :

తెలిసినవారెల్లా దేవునిఁ జేరి బదికి-
రిల నిదెరఁగనిది యేఁటిదోకాక


చ. 1:

కరుణానిలయుఁడట కరుణకు వెలితా
వెరవుతో నేఁగొల్వని వెలితి గాక
నరహరి ఇతఁడట నరులఁ గాచుటరుదా
శరణనని వెలితి జనములది గాక


చ. 2:

వెస లక్ష్మీపతియట వితరణము లేదా
పసఁదన్నే కోరని మాపాపము గాక
యెసఁగు భక్తవత్సలుఁడింట వెంట నుండఁడా
ససువై మొక్కని వెల్తి జగములది గాక


చ. 3:

శ్రీవేంకటేశుఁడచిత్తములో లేఁడా
భావించి నమ్మినది మాభాగ్యముగాక
వావాత నింతటివాఁడు వరములీలేఁడా
వోవలఁ గొలగొనే దేవోటి కింతే కాక