Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 320

వికీసోర్స్ నుండి

రేకు:0320-01 శుద్ధవసంతం సం: 04-112 శరణాగతి


పల్లవి :

హరి నీవే సకలలోకారాధ్యుడఁవు గాక
ధర నీకు శరణంటీ తలఁపిదే చాలును


చ. 1:

కింది నేఁజేసినయట్టికీడు నీవు వాపఁగాను
అందుమీఁదు నడిగేదా అది చాలక
పొంది పుట్టించేట్టి బ్రహ్మపుత్రుఁడు నీకైవుండఁగ
ఇందరిఁ గొలిచేదా యెంత కూళతనము


చ. 2:

దీకొని నాలో నీవు దిక్కై వుండగాను
నాకొక స్వతంత్రమా నాఁడు చాలక
కైకొని లోకములు నీకడుపులో నుండఁగాను
నీ కంటేఁ బరులున్నారా నేరమింతే కాక


చ. 3:

ఇహపరముసిరులు ఇన్నియు నీవియ్యఁగాను
సహజాన నుండవొద్దా చాలదా యింత
విహితమైన శ్రీవేంకటేశ వోక్కండవే
బహళమై వుండఁగాను బంటనంటగాక

రేకు: 0320-02 గుండక్రియ సం: 04-113 శరణాగతి


పల్లవి :

జ్ఞానము నెఱఁగము అజ్ఞానము నెఱఁగము
శ్రీనాయకుఁడ నీ సేవకుఁడ నేను


చ. 1:

అరుతఁ గట్టినతాళి యవె వనమాలికలు
సరుస మోఁచిన డాగు శంఖచక్రములు
వరుస నొసల గురివ్రాసినది తిరుమణి
ఇర వెరిఁగితి మిఁక నెపుడైనఁ గావుము


చ. 2:

పళ్ళెము ప్రసాద మింతే పసగా నారుచు లివె
పిల్లు నేఁ బొగడేవి నీబిరుదులు
యెల్లపుడుఁ బూజించేది ఇది నీరూపుపతిమ
కల్లలే దిందుల నీవు గన్నదింతే కానుపు


చ. 3:

నిక్కము నేఁ జొచ్చినది నీలెంకతనము
చక్కనాజీవనము నీశరణాగతి
యెక్కువ శ్రీవేంకటేశ యెదలో నున్నాఁడ నిదె
చిక్కిన దేమియులేదు చిత్తమింతే ఇఁకను

రేకు: 0320-03 సాళంగనాట సం: 04-114 శరణాగతి


పల్లవి :

నిన్ను నీవే తెలుసుకో నిరుహేతుకబంధుఁడ -
వన్నిటాఁ బరతంత్రుఁడ నంతేపో నేను


చ. 1:

యేమి గూడీ నీఁ గర్మ మిలపైఁ జేయఁగ నీకు
యేమి మానె వేఁగర్మ మిటు మానఁగ
భూమినీనాటక మేల పూర్ణ కాముఁడవు నీవు
కామించి కాతువుగాక కరుణానిలయ


చ. 2:

యెంత గూడపెట్టితి నే నిలమీఁదఁ బుట్టఁగాను
యెంత నష్టినే జనించ కిట్టుండగా
వింతగుయీ యుక్తులెల్ల వృథావాదము లింతే
సంతతము ననుఁ గావు సర్వేశ్వరా


చ. 3:

యెవ్వరు విన్నవించేరు ఇటు నాదెస నీకు
యెవ్వరు వద్దనేరు నీ విలఁగావఁగా
రవ్వల శ్రీవేంకటేశ రక్షింతువుగాక
అవ్వల వివ్వల శరణాగతరక్షకుఁడా

రేకు: 0320-04 బౌళి సం: 04-115 గురు వందన, నృసింహ


పల్లవి :

కనియెడి దిదియే వినియెడి దిదియే కడలఁ జదివెడిదిదియపో
నినుపు నీరై సర్వజగముల నిలిచె శ్రీహరిమాయ


చ. 1:

తలఁపు నొక్కటే తాను నొక్కఁడే దైవ మొక్కఁడే పో
కలిసి పెక్కుముఖంబులై లోకంబు దోఁచెనేని
తెలియఁ జిల్లుల కడవ లోపలి దీపమువలెనే
అలరి వెలిఁగెడి చూడఁజూడఁగ హరిప్రపంచపు మాయ


చ. 2:

దేహ మొక్కటే జీవుఁ డొక్కఁడే దినము నొక్కటేపో
మోహ జాగ్రత్స్వప్ననిద్రలు మొనపె భేదములై
వూహఁ బెక్కులయద్దముల చంద్రోదయమువలెను
సాహసంబున భ్రమలఁబెట్టెడి చదల నిదె హరిమాయ


చ. 3:

గురువు నొక్కఁడే మంత్ర మొక్కటే కొలువు నొక్కటేపో
అరయ భక్తియ వేరు వేరై యలరుచున్న దిదే
గరిమ శ్రీవేంకటగిరీశ్వరు కల్పితమువలెనే
వెరసి వారికి వారికే ఇది వింతవో హరిమాయ

రేకు: 0320-05 పాడి సం: 04-116 మనసా


పల్లవి :

సచరాచర మిదె సర్వేశ్వరుఁడే
పచరించి యీతని భావింపు మనసా


చ. 1:

కదలెటి దంతయు కమలారమణుని-
సదరపు సత్యపు చైతన్యమే
నిదిరించెటి యీనిశ్చేష్టజగమును
వుదుటున నాతఁడు వుండేసహజమే


చ. 2:

కలిగివుండినది కల దింతయు హరి-
నలుగడఁ బరిపూర్ణపుగుణమే
మలల్సి లేనిదియు మహిమల నాతని-
నిలుకడగలిగిన నిర్గుణమే


చ. 3:

జీవరాసులగు సృష్టియింతయును
శ్రీవేంకటపతి చిత్తంబే
కైవల్యమె లోకపు టిహముఁ బరము
భావించ నేర్చిన పరమవిదులకు

రేకు: 0320-06 సామంతం సం: 04-117 గురు వందన, నృసింహ


పల్లవి :

అందుల కిదె ప్రతియౌషధము
ఇందిరాపతికి నెక్కినచింత


చ. 1:

పంచబాణములబాసట మంటిన-
చంచలమౌ నిశ్చలమనసు
పంచబాణగురుపాదము దలఁచిన
కంచుఁజంచలము గక్కన మాను


చ. 2:

కనకపుటాసలగరళం బంటిన
ననిచిన విజ్ఞానము చెదరు
కనకగర్భు నటు గన్నతండ్రిపై
మనసిడితే నిర్మలమౌ గుణము


చ. 3:

మునుకొని మొదలను మొలచిన ససికిని
పనివడి కొననే ఫలియించు
అనయము శ్రీవేంకటాధిపుకృపగల -
జనుని కిహపరము సఫలంబు