Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 313

వికీసోర్స్ నుండి

రేకు: 0313-01 పాడి సం: 04-073 అధ్యాత్మ


పల్లవి :

తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలఁడే
కల్లయునుఁ గాదు ఇది కడు నిజము గాదు


చ. 1:

కనుదెరచినంతనే కలుగు నీ జగము
కనుమూసినంతనే కడుశూన్యమౌను
కనురెప్ప మరఁగుననె కలిమియును లేమియును
తన మనోభావనలఁ దగిలి తోఁచీని


చ. 2:

తలఁచినంతనే యెంతదవ్వయినఁ గాన్పించు
తలఁపు మరచినమతికి దట్టమౌఁ దమము
పొలసి మతిమరఁగుననె పుట్టుటలుఁ బోవుటలు
పలు చంచల వికారభావ మీ గుణము


చ. 3:

ముందు దాఁగలిగితే మూఁడు లోకములుఁ గల-
వెందుఁ దా లేకుంటే నేమియును లేదు
అంది శ్రీవేంకటేశుఁ డాత్మలోననె వీఁడె
కందువల నితనిసంకల్ప మీపనులు

రేకు: 0313-02 శ్రీరాగం సం: 04-074 భగవద్గీత కీర్తనలు


పల్లవి :

చదివితిఁ దొల్లి కొంతచదివే నింకాఁ గొంత
యెదిరి నన్నెఱఁగను యెంతైనా నయ్యో


చ. 1:

వొరుల దూషింతుఁగాని వొకమారైన నా-
దురితకర్మములను దూషించను
పరుల నవ్వుదుఁగాని పలుయోని కూపముల
నరకపు నామేను నవ్వుకోను


చ. 2:

లోకులఁ గోపింతుఁగాని లోని కామాదులనేటి-
కాకరి శత్రులమీఁదఁ గడుఁ గోపించ
ఆకడ బుద్ధులు చెప్పి అన్యుల బోధింతుఁగాని
తేకువ నాలోని హరిఁ దెలుసుకోలేను


చ. 3:

యితరుల దుర్గణము లెంచి యెంచి రోతుఁగాని
మతిలో నా యాసలు మానలేను
గతిగా శ్రీవేంకటేశుఁ గని బ్రదికితిఁగాని
తతి నిన్నాళ్లదాఁకా దలపోయ లేను

రేకు: 0313-03 బౌళి సం: 04-075 అధ్యాత్మ


పల్లవి :

ఉన్నదిందునే వొక్క విచారము
కన్నది గానుపు ఘనపుణ్యులకు


చ. 1:

అగపడి పవిత్ర మపవిత్రంబును
జగమొక్కటనే జరగెడిని
పగటున నిది నా భావవికారమొ
జగదీశ్వరుని రచన నేరుపులో


చ. 2:

అలరిన జ్ఞానము నజ్ఞానంబును
తలఁ పొక్కటనే తగిలెడిని
చలమున నిది నా సహజపు గుణమో
పెలుచగు శ్రీహరి పెలరేఁపనలే


చ. 3:

దాహపు నాలో ధర్మ మధర్మము
దేహ మొక్కటనె తిరిగెడిని
శ్రీహరి నాయాత్మ చేరిన ఫలమో
యీహల శ్రీవేంకటేశ్వరు కరుణో

రేకు: 0313-04 గుజ్జరి సం: 04-076 భగవద్గీత కీర్తనలు


పల్లవి :

ఇహమే పరము మరి యింతా నీ మయముగాన
సహజపుసంసారమే మోక్షము సరుసవిరక్తికి నెడమేదయ్యా


చ. 1:

నీయందే బ్రహ్మ మరి నీయందే రుద్రుఁడు
నీయందే సచరాచరమును నీయందే యీజగము
చాయలనే యెడనెడ నే నేమిచూచినా సర్వము నీధ్యానమేకాక
యీయెడ నీయర్థములో నితరంబిది యౌఁగాదన నెడమేదయ్యా


చ. 2:

నీ చేఁతలే రాత్రులుఁబగళ్లు నీ చేతఁలే కాలత్రయము
నీ చేఁతలే సర్వజంతువుల నిశ్చల చైతన్యములు
చేచేతనే చేసినవెల్లా శ్రీపతి నీయాజ్ఞవిధులే
యేచాయలఁ బుణ్యపాపములకును యెంచఁగఁ బంచఁగ నెడమేదయ్యా


చ. 3:

నీశరణా గతి యొక్కటి గలిగిన నిజము గల్లలకు వెఱపేలా
ఆశల నీవంతర్యామివిగన అందిన దేహమె వైకుంఠము
రాసికి నెక్కిన శ్రీవేంకటగిరిరమణుఁడ నీ వుపదేశమిది
యీశ పరాత్పర తనిసితి మిందే యిఁక నొకటి గోర నెడమేదయ్యా

రేకు: 0313-05 శుద్ధవసంతం సం: 04-077 శరణాగతి


పల్లవి :

హరి "సర్వపాపేభ్యో ఆహం త్వా " యనె
గరిమ నా వాక్యమే ప్రమాణమైనట్టిగతి యొక్కటే నాకు


చ. 1:

యిన్ని జన్మములఁ బుట్టి యేఁ జేసినపాపములు యిఁక
నన్నిజన్మములఁ బుట్టి అట్టె పుణ్యములు సేసి అవి పాపుకోఁగలనా
పన్నినదొంతులపైఁ బడ నొక్క గుదియపెట్టు
వున్నతి మోఁదినయట్టు హరిశరణాగతి యదియొక్కటే నాకు


చ. 2:

యింతగాల మింద్రియముల నిట్టె సాఁగినతలఁపు యిఁక
నంతగాలము చిత్త మాఁగి నే నది దిప్పుకోఁ గలనా
చెంతఁ బంటెఁడుపాలలో నొక చల్లబొట్టు చేమిరివెట్టినట్టు
అంతటికిని శ్రీహరి శరణాగతి యది యొక్కటే నాకు


చ. 3:

పలు శాస్త్రములు చూచి బహుదేవతలఁ గొలిచి పఱచైన యీదేహము
పలుసందేహములను వచ్చినతెరువునను పాపుకో నేఁ గలనా
యిల నంధకారపుటింటిలో నొకదీప మెత్తి మెఱసినట్టు
వొలసి శ్రీవేంకటపతి శరణాగతి వొకటే గతి నాకు