రేకు: 0312-01 దేశాక్షి సం: 04-067 అంత్యప్రాస
పల్లవి : |
నిరంతరంబును నీమాయే పరం-
పరములాయ పాపవే నీమాయ
|
|
చ. 1: |
మును తల్లిగర్భమున ముంచెను నీమాయ
వెనక జనించినట్టే వెలసె నీమాయ
అనుగు కౌమార బాల్య యవ్వనములు నీమాయ
జనులకు దాఁటరానిజలధి నీమాయ
|
|
చ. 2: |
ఆస నీమాయ అంగము నీమాయ
యీసునఁ గామక్రోధము లివి నీమాయ
వాసుల సంసారమున వలఁబెట్టీ నీమాయ
గాసిఁబడి యిఁక నెట్టు గడచే నీమాయ
|
|
చ. 3: |
యెదురెల్ల నీమాయ యిహమెల్ల నీమాయ
పొదలి స్వర్గ నరక భోగము నీమాయ
అదన శ్రీవేంకటేశ అంతరాత్మవు నీవె
దె నీకే శరణంటి నిఁకనేల మాయ
|
|
రేకు: 0312-02 లలిత సం: 04-068 శరణాగతి
పల్లవి : |
ఏతపములు నేల యేదానములు నేల
శ్రీతరుణీపతినిత్యసేవే జన్మఫలము
|
|
చ. 1: |
దేహపుటింద్రియముల దేహమందే యణఁచుటే
దేహముతోనే తాను దేవుఁడౌట
సోహలను వెలిఁ జూచేచూపు లోను చూచుటే
ఆహా దేవతలఁ దనందే తాఁ గనుట
|
|
చ. 2: |
వెలి నిట్టూరుపుగాలి వెళ్ళకుండా నాఁగుటే
కులికి తపోధనము గూడపెట్టుట
తలఁపు తనందే తగ లయము సేయుట
లలిఁ బాపబంధముల లయము సేయుట
|
|
చ. 3: |
వెనక సంసారమందు విషయ విముక్తుఁడౌటే
మునుపనే తా జీవన్ముక్తుఁడౌట
పనివి శ్రీవేంకటేశుపదములు శరణంటే
అనువైన దివ్యపదమప్పుడే తా నందుట
|
|
రేకు: 0312-03 గుండక్రియ సం: 04-069 శరణాగతి
పల్లవి : |
పంతపుటాసలు బండ్ల రాఁగా
దొంతుల యలమటఁ దొలఁగేనా
|
|
చ. 1: |
మును దీపనాగ్ని మోఁచిన దేహిని
అనిశముఁ గ్రోధాగ్ని నణఁచేనా
మనసిజుకతమున మహి జన్మించితి
విను మరునాజ్ఞకు వెలి యయ్యేనా
|
|
చ. 1: |
సటలోభపు సంసారము చొచ్చితి
ఘటన విడుము డిఁకఁ గలిగీనా
నటించు చపలపు నాలుక గల నే
మటమాయపు చవి మానేనా
|
|
చ. 1: |
పాపపుణ్యముల భవముల జీవిని
తోపడ కర్మము దొబ్బేనా
యేపున శ్రీవేంకటేశ్వరు శరణమే
పైపయి భజించి బ్రదికితిఁగాక
|
|
రేకు: 0312-04 బౌళి సం: 04-070 వైరాగ్య చింత
పల్లవి : |
తెలియుట యెన్నఁడు దేహి తనంతట
తెలియఁగ హరి నీదిక్కే కలది
|
|
చ. 1: |
రాపుగ రేపేమూత్రపురీషంబులు
ఆపై నాఁకటి యలమటలు
కైపుగ నింతటఁ గామవికారము
మాపు నిద్దురలమంపులె కలది
|
|
చ. 2: |
కొన్నాళ్లు బాల్యము కొన్నాళ్లు కౌమార
మన్నిటఁ గొన్నాళ్లు యౌవ్వనము
పన్నిన ముదిమియుఁ బైపైఁ గొన్నాళ్లు
వున్నతి నంతట నుడుగుట కలది
|
|
చ. 3: |
జంతువులకు యీసరవులు నీవే
పొంతలఁ గల్పించి పొదిపితివి
యింతట శ్రీవేంకటేశ్వర నీకృప
చింతించి కావవే చేకొని నన్ను
|
|
రేకు: 0312-05 బౌళిరామక్రియ సం: 04-071 భగవద్గీత కీర్తనలు
పల్లవి : |
ఇదివో శ్రుతిమూల మెదుటనే వున్నది
సదరముగా హరి చాటీ నదివో
|
|
చ. 1: |
యెనసి పుణ్యముసేసి యే లోకమెక్కిన
మనికై భూమియందు మగుడఁ బొడముటే
పొనిగి "యా బ్రహ్మభువనా లోకాః
పునరావృత్తి " యనెఁ బురుషోత్తముఁడు
|
|
చ. 2: |
తటుకున శ్రీహరి తన్నునే కొలిచిన
పటుగతితో మోక్షపదము సులభమనె
ఘటన “మాముపేత్యతు కౌంతేయ "మహిని
నటనఁ "బునర్జన్మ న విద్యతే “
|
|
చ. 3: |
యిన్నిటా శ్రీవేంకటేశ్వరు సేవె
పన్నినగతి నిహపరసాధన మదే
మన్నించి యాతఁడే " మన్మనా భవ " యని
అన్నిటా నందరి కానతిచ్చెఁగాన
|
|
రేకు: 0312-06 ధన్నాసి సం: 04-072 వైరాగ్య చింత
పల్లవి : |
అందులకు నందులకు హరిసేసినలంకే
కందువసంసారమందే కలదు మోక్షము గాన
|
|
చ. 1: |
దేహ మోన్నాళ్లు దిరిగె భూమిమీఁద
దాహపులంపటములతగు లన్నాళ్లు
వూహించి విసుగవద్దు వొల్లనన్నఁ బోవవి
శ్రీహరి నందే తలఁచి చెలఁగఁగవలెఁగాన
|
|
చ. 2: |
దీపనమోన్నాళ్లు మేనఁ దిరమై మెలఁగుచుండు
తాపపుటాసల మీఁదితగు లన్నాళ్లు
పైపైఁ గోపించరాదు పాయుమన్నఁ బాయ వవి
శ్రీపతి నందే తలఁచి చెలఁగఁగవలెగాన
|
|
చ. 3: |
యెఱుక యెన్నాళ్లు మతి నెనసి పాయకయుండె
తఱమేయింద్రియములతగు లన్నాళ్లే
వొఱలి బంధించవద్దు వున్నతి శ్రీవేంకటేశు-
మఱఁగు చొచ్చి మఱచి మట్టుపడవలెఁగాన
|
|