తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 307

వికీసోర్స్ నుండి

రేకు: 0307-01 సామంతం సం: 04-037 వైరాగ్య చింత

పల్లవి:

మేలెల్ల నొక్కటే మించుతీలూ నొకటే
తాలిమితో ఫలియించు తలఁపూ నొకటే

చ. 1:

ఆఁకలి గడు హెచ్చితే నన్నము రుచి గోరును
జోకఁ బాపము హెచ్చితే సుకృతము గోరును
పైకొని యవివేకికిఁ బాపమైనా నుపకారి
ఆకడ మూర్ఖునకుఁ బుణ్యమైనా బంధకమే

చ. 2:

యెందు నెండఁబడ్డఁ గాని ఇంపునీడఁ గోరఁడు
కందువ సంసారియైనఁ గాని మోక్షము గోరఁడు
చందపు యోగికి సంసారమైనా నుపకారి
కందువబద్ధున కదే కట్టినట్టి కట్లు

చ. 3:

కలయఁ జీఁకటియైతేఁగాని దీప మిడుకోఁడు
ఇల నజ్ఞుఁడైనఁగాని యెరుక వెదకఁడు
తలఁచి శ్రీవేంకటేశుదాసుని కింతా జయమే
బలిమిఁ జంచలునికి బహళ దుఃఖములే

రేకు: 0307-02 లలిత సం: 04-038 నామ సంకీర్తన

పల్లవి:

ఇదియే సులభం బిందరికి
కదియఁగ వసమా కరుణనే కాక

చ. 1:

నగధరుండు పన్నగశయనుడు భూ-
గగనాంతరిక్షగాత్రుడు
అగణితుఁడితని నరసి తెలియఁగాఁ
దగు నా కనెడిది దాస్యమే కాక

చ. 2:

కమలజజనకుఁడు కామునిజనకుఁడు
కమలాసతిపతి ఘనగుణుఁడు
విమలుఁడీహరి వెదకి కానఁగను
అమరునా శరణాగతిఁగాక

చ. 3:

దేవుఁడు త్రిగుణాతీతుఁ డనంతుఁడు
కైవల్యమొఁసగుఘనుఁడు
శ్రీవేంకటపతి జీవాంతరాత్ముఁడు
భావించవసమా భక్తిన కాక

రేకు: 0307-03 ధన్నాసి సం: 04-039 శరణాగతి

పల్లవి:

హరి నీవు మాలోన నడఁగు టరదుగాక
శరణని నీకు నే జయ మందుటరుదా

చ. 1:

పాపపుణ్యలంపటమైనది మేను
కూపపు యోనులఁ గుంగేటిది మేను
దీపనాగ్నిగల దిష్టము యీమేను
మోపు మోచిన నేము ములిగేది యరుదా

చ. 2:

పొలసి పొద్దొకచాయఁ బొరలేటిమనసు
కొలఁదిలేని యాసఁ గుదురైన మనసు
మలిసి సంసారమే మరిగిన మనసు
కలనేము, తిమ్మటలు గైకొనేది యరుదా

చ. 3:

పెనచి యింద్రియములఁ బేఁడినభవము
పనివడి చింతలకే పాలైనభవము
యెనలేని శ్రీవేంకటేశ నీకే శరణని
మనెఁ గాన యిఁక మీఁద మంచిదౌటరుదా

రేకు: 0307-04 గుండక్రియ సం: 04-040 వైష్ణవ భక్తి

పల్లవి:

కోటికిఁ బడగయెత్తి కొంకనేల
యీటులేని పదమక్కి యిఁకనేల చింత

చ. 1:

పెట్టినది నొసలను పెద్ద పెద్ద తిరుమణి
కట్టినది మొలఁ జిన్నకౌపీనము
పట్టినది శ్రీహరిపాదపద్మ మూలము
యెట్టయినా మాకు మేలే యిఁకనేల చింత

చ. 2:

చిక్కి నా లోనైనది శ్రీవైష్ణవధర్మము
తొక్కినది భవముల తుదిపదము
యెక్కినది హరిభక్తి యిది పట్టపేనుఁగ
యెక్కువ కెక్కువే కాక యిఁక నేల చింత

చ. 3:

చిత్తములోనిండినది శ్రీపతిరూపము
హత్తినది వైరాగ్య మాత్మధనము
యెత్తలఁజూచిన మాకు నిదివో శ్రీవేంకటేశుఁ-
డెత్తి మముఁ గావఁగాను యిఁక నేల చింత


రేకు: 0307-05 దేవగాంధారి సం: 04-041 శరణాగతి

పల్లవి:

ఒహో వొడలుమాని వోపికె గడుమేలు
యిహల నీవుపకారమేమని నుతింతు

చ. 1:

పుట్టినచోటంటినా అది భూతములనెలవు
నెట్టన మూసిన మేను నిఖిల హేయమయము
యిట్టి నా యాతుమలోన హరి యెట్టుంటివి నీవు
అట్టె నీచేఁతలు దలఁచి అరుదయ్యీ నాకు

చ. 2:

మించుల మనసంటిమా అది మిగులఁ జంచలంబు
పంచల నా సంపదలు పాపపుణ్య విధులు
యెంచఁగా యిటువంటి నన్ను యెట్టు ధరియించితి
నించిన నీ చేఁతలు విని నివ్వెరగయ్యీని

చ. 3:

పాయ మిది యంటిమా పంచేంద్రియముల వశము
ఆయము నాకంటిమా అది అయిదుభూతముల మొరఁగు
యీయెడ శ్రీవేంకటేశ యీడా యెట్టేలితి నన్ను
మాయల నీశరణంబిందుకే మనసయ్యీ నాకు

రేకు: 0307-06 శుద్ధవసంతం సం: 04-042 అంత్యప్రాస

పల్లవి:

విత్తొకటి వెట్టఁగా వేరొకటి మొలచునా
యెత్తి హరి నీవు నను నీడేర్తుగాక

చ. 1:

మోహబాంధవములకు మూలంబు తనువు
వూహాపోహలకు వునికి యీ తనువు
దాహమున కాఁకటికి తగులు యీ తనువు
యీహీ వైరాగ్య మిందెట్టు గలుగు

చ. 2:

పంచేంద్రియములకు పాదు యీ తనువు
చంచలపుటాసలకు జంట యీ తనువు
అంచె దుర్గణములకు నాకరము తనువు
యెంచి చూడ వివేక మిందెట్టు నిలుచు

చ. 3:

యీహలోకసుఖములకు హేతువీ తనువు
బహుపుణ్యపాపాలకు ఫలము యీ తనువు
యిహమునకు శ్రీవేంకటేశ నీదాస్యమున
విహరించెఁ దనువు యిఁక వెఱపేల కలుగు