తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 306

వికీసోర్స్ నుండి

రేకు: 0306-01 భౌళి సం: 04-031 తేరు

పల్లవి:

ఎత్తరే ఆరతులు యియ్యరేకానుకలు
యిత్తల నేఁగివచ్చీని యిందిరానాధుఁడు

చ. 1:

గరుడధ్వజపు తేరు కనకమయపు తేరు
సిరులతో వేదములచేరుల తేరు
సురలు మునులుఁ బట్టి సొంపుతోడఁ దియ్యఁగాను
యిరవుగ నేఁగివచ్చీ నిందిరానాధుఁడు

చ. 2:

జీవకోట్లున్న తేరు శేషుఁడే రూపైన తేరు
వేవేలు సింగారముల వెలయు తేరు
మూవరుస నిత్యులును ముక్తులును గొలువఁగా
యీవల నేఁగివచ్చీ నిందిరానాథుఁడు

చ. 3:

పంచభూతముల తేరు బ్రహ్మాండమైన తేరు
మించిన శ్రీవేంకటాద్రి మీఁదటి తేరు
కొంచక యలమేల్మంగఁ గూడి వచ్చీ నదె తేరు
చరాని మహిమల నిందిరానాథుఁడు

రేకు: 0306-02 నాట సం: 04-032 నృసింహ

పల్లవి:

కదిరి నృసింహుఁడు కంభమున వెడలె
విదితముగా సేవించరొ మునులు

చ. 1:

ఫాలలోచనము భయదోగ్రముఖము
జ్వాలామయ కేసరములును
కాల రౌద్ర సంఘటిత దంతములు
హేలాగతి ధరియించుక నిలిచె

చ. 2:

ముడివడు బొమ్మలు ముంచిన వూర్పులు
గడగడ నదరెటి కటములును
నిడుద నాలికెయు నిక్కుఁ గర్ణములు-
నడియాలపు రూపై తా వెలసె

చ. 3:

సకలాయుధములు సహస్ర భుజములు
వికట నఖంబులు వెఁస బూని
వెకలి యగుచు శ్రీ వేంకటేశ్వరుఁడె
ప్రకటపు దుష్టుల భంజించె నిదివో


రేకు: 0306-03 దేసాళం సం: 04-033 వైష్ణవ భక్తి

పల్లవి: చదివి బతుకరో సర్వ జనులు మీరు
కదిసి నారాయణాష్టాక్షర మిదియే

చ. 1:

సాదించి మున్ను శుకుఁడు చదివినట్టి చదువు
వేద వ్యాసులు చదివినచ దువు
అది కాలపు వైష్ణవులందరి నోటి చదువు
గాదిలి నారాయణాష్టాక్షర మిదియే

చ. 2:

సతతము మునులెల్ల చదివినట్టి చదువు
వెత దీర బ్రహ్మ చదివినచదువు
జతనమై ప్రహ్లాదుఁడు చదివి నట్టి చదువు
గతిగా నారాయణాష్టాక్షర మిదియే

చ. 3:

చలపట్టి దేవతలు చదివినట్టి చదువు
వెలయ విప్రులు చదివేటి చదువు
పలుమారు శ్రీ వేంకటపతినామమై భువిఁ
గలుగు నారాయణాష్టాక్షర మిదియే

రేకు: 0306-04 భైరవి సం: 04-034 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

శరణ మాతనికే సర్వభావాల
యిరవై మమ్ము రక్షించ నీశ్వరుఁడే యెఱుఁగు

చ. 1:

వచ్చిన త్రోవెఱఁగము వడిఁ బూర్వకాలమందు
చొచ్చెటి త్రోవెఱఁగము సోదించి విూఁద
కుచ్చిన కర్మములతో గుదియై వేలుకాడేము
హెచ్చి మా బ్రదుకుఁదోవ యీశ్వరుఁడే యెరుఁగు

చ. 2:

నన్ను నేనే యెఱఁగను నానాచందములను
అన్నిటా నాలోనున్న హరిఁ గానను
కన్నులఁ జూచుచు మంచి కాయములో నున్నవాఁడ
యెన్నఁగ నాజ్ఞానము యీశ్వరుఁడే యెరుఁగు

చ. 3:

మొదలు దెలియను ముంచి కొన దెలియను
చదువుచు నున్నవాఁడ సర్వవేదాలు
హృదయములోనుండి యిటు నన్ను గావఁగ
యిదివో శ్రీవేంకటాద్రి యీశ్వరుఁడే యెఱుఁగు

రేకు: 0306-05 పాడి సం: 04-035 తేరు

పల్లవి:

అప్పడైనహరి యెక్కె నదివో తేరు
యిప్పుడు తిరువీధుల నేఁగీ తేరు

చ. 1:

సముద్రాలమీఁదఁ దోలె సర్వేశ్వరుఁడు తేరు
భ్రమయ జరాసంధుపైఁ బరపెఁదేరు
తిమురుచు రుక్మకుపైఁ దిరుగఁ దోలెఁ దేరు
ప్రమదాన సృగాలునిపైఁ దోలెఁ దేరు

చ. 2:

కమ్మి యక్రూరుఁడు దేఁగా కంసునిపై నెక్కెఁ దేరు
బమ్మరపో దంతవక్త్రుపైఁ దోలెఁ దేరు
దుమ్ములుగా సాల్వునిపై దొడ్డగాఁ దోలినతేరు
దొమ్మి రుక్మిణిపెండ్లికిఁ దోలినట్టితేరు

చ. 3:

విూఱి హంసడిచికులమీఁదఁ దోలినట్టితేరు
తూఱి సంధిమాటలకుఁ దోలినతేరు
అఱడి శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁ గూడి
చూఱలుగొన నెక్కెను శోభనపుతేరు

రేకు: 0306-06 గౌళ సం: 04-036 నృసింహ

పల్లవి:

మొదలివేల్ప మా మొఱ యాలించవె
యెదుటఁ గావు మము నిదివో దేవా

చ. 1:

ధరపైఁ దపసుల తపములు చెరిచెను
నిరతపుణ్యముల నీరుసేసె నదె
పరకామినులను భంగ పెట్టె నదె
హిరణ్యకశిపుఁ డిదివో దేవా

చ. 2:

మునులజడ లవిగో మోఁపులుకొలఁదులు
ఇనచంద్రాదుల నెక్కువగెలిచెను
చనవరి యింద్రుని స్వర్గము చేకొనె
యెనగొని హిరణ్యుఁ డిదివో దేవా

చ. 3:

పలుదిక్పాలులఁ బారఁగఁ దోలెను
బలిమినే పహ్లాదుఁ బరచీని
యెలమిని శ్రీవేంకటేశ నీవలన
యిలఁ గశిపుఁడు చెడె నిదివో దేవా