తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 304
రేకు: 0304-01 లలిత సం: 04-019 గురు వందన, నృసింహ
పల్లవి:
భావించు వారలపాలి భాగ్య మితఁ
డా వలనీ వల నంతర్యామి
చ. 1:
యీశ్వరేశ్వరుఁడు యితఁడు దివిజులకు
శాశ్వతమూరితి జగములకు
విశ్వాత్మకుఁడీ వివిధ జీవులకు
ఐశ్వర్యము మా యంతర్యామి
చ. 2:
నిత్యుఁడితఁ డొకఁడె నెరిఁ గాలములకు
సత్యం బీతఁడు చదువులకు
ప్రత్యక్షం బిదె భక్తకోటికిని
అత్యంతము మా యంతర్యామి
చ. 3:
గుణి నిర్గుణితఁడు గురుముని జనులకు
ప్రణవము వేదాంతపంక్తులకు
ప్రణుతి శ్రీవేంకటపతి లోకులకితఁ
డణురేణు పూర్ణుఁడంతర్యామి
రేకు: 0304-02 సాళంగనాట సం: 04-020 కృస్ణ
పల్లవి:
జగములెల్లా నీడేరె జయ వెట్టి రిందరును
తగ నేఁడు కృష్ణావతారమాయ నిదివో
చ. 1:
అచ్చితుఁడు జనించె నద్దమరేతిరికాడ
ముచ్చిమి రాకాసులు ముట్టుపడిరి
పచ్చిగాను లోకులాల పండుగ సేయరో నేఁడు
అచ్చపుఁ గృష్ణావతారమాయ నిదివో
చ. 2:
గోవిందుఁడు జనియించె గోకులష్టమిదే నేఁడు
కావరపు కంసుని గర్వమణఁగె
భావించి ప్రజలాల పారణ సేయరో నేఁడు
ఆవేళఁ గృష్ణావతారమాయ నిదివో
చ. 3:
అనంతుఁడు శ్రీవేంకటాద్రీశుఁడు జనియించె
ఘనశిశుపాలాదులు గతమైరి
తనివంది జనులాల ధర్మాన బ్రతుకరో
అనుగుఁ గృష్ణావతారమాయ నిదివో
రేకు: 0304-03 మాళవి సం: 04-021 విష్ణు కీర్తనం
పల్లవి:
పారిరి దానవులెల్లా పంచబంగాళమైరి
తూరిరి గొందులెల్లాను తుత్తుమురై విరిగి
చ. 1:
గరుడధ్వజునిదండు గదలె రాకాసులపై
అరదము దోలవో చయ్యన దారకా
ధరయెల్లఁ గుమ్మెలై పాతాళ మదే కానవచ్చె
తురగములఁ దోలవో దుమ్ములు రేఁగను
చ. 2:
దనుజాంతకుని సేన దగ్గరి నడవఁజొచ్చె
చొనిపి రోప్పవో తేరు సుమంతుఁడా
గునిసి దిగ్గజములు గొబ్బున మొగ్గతిలెను
కినిసి పగ్గములు బిగించవో పయిపైన
చ. 3:
శ్రీవేంకటేశుబలము చిమ్మిరేఁగి మించఁజొచ్చె
సేవించలమేల్మంగను సేనాపతీ
దేవతలు మొక్కి రదే దిక్కులు సాధ్యములాయ
తావుకు మరలించవో తానకముగాను
రేకు: 0304-04 లలిత సం: 04-022 శరణాగతి
పల్లవి:
ఘనుఁడాతఁడే మముఁ గాచుఁగాక హరి
అనిశము నే మిఁక నతనికె శరణు
చ. 1:
యెవ్వనినాభిని యీ బ్రహ్మాదులు
యెవ్వఁడు రక్షకుఁ డిన్నిటికి
యెవ్వనిమూలము యీ సచరాచర-
మవ్వలనివ్వల నతనికే శరణు
చ. 2:
పురుషోత్తముఁడని పొగడి రెవ్వరిని
కరి నెవ్వఁడు గక్కనఁ గాచె
ధర యెవ్వఁడెత్త దనుజులఁ బొరిగెను
అరుదుగ మే మిఁక నతనికె శరణు
చ. 3:
శ్రీపతి యెవ్వనిఁ జేరి వురమునను
భాసిల్లె నెవ్వఁడు పరమంబై
దాసుల కొరకై తగు శ్రీవేంకట
మాస చూపె నితఁ డతనికె శరణు
రేకు: 0304-05 మంగళకౌశిక సం: 04-023 శరణాగతి
పల్లవి:
ఔలే నే నొకపనికి నవుదు నీకును
కూళలలో నెంచి చూడ గురి యవుదును
చ. 1:
పసురము వంటివాఁడ పాపపుబందెలు దెత్తు
శిసువు వంటివాఁడ సిగ్గు నెగ్గు నెరఁగ
వసుధలో రాయి వంటివాఁడను దయదలఁచ
యెసఁగ నన్నేరీతి నీ వేలితివి దైవమా
చ. 2:
మాఁకువంటివాఁడ నే మతి లేదు; పుచ్చిన-
పోఁక వంటివాఁడ నెప్పుడు కొరగాను
రోఁకలి వంటివాఁడ రోటిలోనిపోట్లకు
యేఁకట నన్నెటువలె నేలితివి దైవమా
చ. 3:
పామువంటివాఁడనే పట్టినవారిఁ గరతు
గామువంటివాఁడ లోకమువారిఁ బీడింతు
నేమపు శ్రీవేంకటేశ నీవు నన్ను బంటంటా-
నేమిటికిఁ గృపతోడ నేలితివి దైవమా
రేకు: 0304-06 వరాళి సం: 04-024 వైరాగ్య చింత
పల్లవి:
దేహముతోడిది లంకె తీరదిది హరిమాయ
సాహసపు జీవులకు సహజమెప్పుడును
చ. 1:
నెట్టనఁ బెక్కిండ్లవిందు నిండుకొన్నయాఁకలి
వొట్టి నిచ్చకల్యాణి కామోద్రేకము
కట్టినవోడదూలము కాయపుసంసారము
దట్టమైన ప్రాణులకుఁ దనివేడదయ్యా
చ. 2:
పొద్దొకబై రూపము పొదలేటి యీవయసు
తిద్దుబడి గుఱ్ఱము హత్తినగుణము
వొద్దనుండినట్టి నీడ వుడివోనియట్టి నిద్ర
అద్దుకొని వుండుఁగాక అదియేల మానును
చ. 3:
పచ్చిగరికెకాలము ప్రపంచములో బ్రదుకు
తచ్చి చూచెటి సూత్రము తన జ్ఞానము
అచ్చపు శ్రీవేంకటేశుఁ డాత్మలో నిధానము
యిచ్చ నెరుఁగుకొంటేనే యిహమే పరము