Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 303

వికీసోర్స్ నుండి

రేకు: 0303-01 శంకరాభరణం సం: 04-013 విష్ణు కీర్తనం

పల్లవి:

అతఁడేమి సేసినా మాకదే గురి
మతిలో నాతఁడుండఁగా మాయలు మాకేఁటికి

చ. 1:

ఆసలకెల్లా గురి హరి యొక్కఁడేకాని
వేసరక కన్నవారి వేఁడనోపను
చేసేటిసేఁతకు గురి శ్రీవిభుఁడే కాని
వాసి దప్పి హీనుల సేవలు సేయ నోపము

చ. 2:

ముచ్చటకెల్లా గురి మురహరుఁడే కాని
చెచ్చెర నెవ్వరికైనాఁ జెప్పనోపము
నిచ్చలు మాబ్రదుకెల్లా నీలవర్ణునికే కాని
రచ్చల దుష్టులతోడిరాఁపులకు నోపము

చ. 3:

పరము నిహమునకు పరమాత్ముఁడే గురి
పరులకధీనమైన బాఁతి యేఁటికి
సిరులకెల్లా గురి శ్రీవేంకటేశుఁడేకాని
అరపిరికితనపుటలమట లేదు


రేకు: 0303-02 దేశాక్షి సం: 04-014 శరణాగతి

పల్లవి:

ఎన్నఁడుఁ జెడనియీవు లిచ్చీని మాధవుఁడు
పన్నినయాస లితనిపైపై నిలుపవో

చ. 1:

కొననాలుకా హరిగుణములే నుడుగవో
మనసా అతని దివ్యమహిమెంచవో
తనువా శ్రీపతితీర్ధ దాహమే కోరవో
యెనలేని అడియాస లేఁటికి నీ కిఁకను

చ. 2:

వీనులాలా యేపొద్దు విష్ణుకథలే వినరో
ఆనిన చేతులితని కంది మొక్కరో
కానుక చూపులాల కమలాక్షుఁ జూడరో
యీనేటి పాపాలబారి నేల పడేవిఁకను

చ. 3:

నలిఁ బాదాలాల హరినగరికే నడవరో
కలభక్తి యాతనిపై ఘటియించవో
చలమా శ్రీవేంకటేశు సంగతినే వుండవో
యెలయింపుఁ గోరికల కేల పారే విఁకను

రేకు: 0303-03 సామంతం సం: 04-015 శరణాగతి

పల్లవి:

కొసరి కొసరి యిఁకఁ గోరఁగనేఁటికి
అసురవైరి శరణనుటే చాలు

చ. 1:

సంతతభోగము జననబంధములు
జంతురాసులకు సహజము
వంతురక్షకత్వము కరుణ భువి
నంతర్యామికి నది సహజము

చ. 2:

కలకాలంబును గామముఁ గ్రోధము
చలమును బ్రాణుల సహజము
సులభత్వంబును సొరిది వదాన్యత
అల లక్ష్మిపతికది సహజము

చ. 3:

వుడుగనికర్మము లొడలోముటలును
జడులము మాకిది సహజము
యెడయక శ్రీవేంకటేశ నీకు మము
నడరి కాచుటే అది సహజము

రేకు: 0303-04 శుద్ధవసంతం సం: 04-016 శరణాగతి

పల్లవి:

ఇహపరసాధన మిది యొకటే
సహజపుమురారిసంకీర్తన నొకటే

చ. 1:

భవసాగరములఁ బాపెడిది తేప
భువి నజ్ఞానముపులివాకట్టిది
జవళి నాశాపాశములకుఁ గొడువలి
నవనీతచోరునామం బొకటే

చ. 2:

చింతాతిమిరముఁ జెరిచేటి సూర్యుఁడు
అంతట దరిద్రహతపు నిధానము
వింతమరణభయ వినాశమంత్రము
మంతుకు హరినామంబిది యొకటే

చ. 3:

మించు దుఃఖములమృత సంజీవని
అంచలఁ బంచేద్రియములు కంకుశము
యెంచగఁ శ్రీవేంకటేశు దాసులకు
బంచిన పాళ్లఁ బరగినదొకటే

రేకు: 0303-05 సాళంగనాట సం: 04-017 దశావతారములు

పల్లవి:

ఏమని పొగడుదు నిట్టి నీగుణము
యీ మహిమకుఁ బ్రతి యితరులు గలరా

చ. 1:

నిండెను జగముల నీ ప్రతాపములు
చెండిన బాణునిచేతులతో
కొండలంతలై కుప్పలువడియెను
వండఁదరగు రావణుతలలయి

చ. 2:

పూడెను జలధులు పొరిఁ గోపించిన
తోడ బ్రహ్మాండము తూఁటాయ
చూడఁ బాతాళము చొచ్చె బలీంద్రుఁడు
కూడిన కౌరవకులములు నడఁగె

చ. 3:

యెత్తితివి జగము లీరేడు నొకపరి
యిత్తల నభయం బిచ్చితివి
హత్తిన శ్రీవేంకటాధిప నీకృప
నిత్తెమాయ నీనిజదాసులకు


రేకు: 0303-06 దేపాళం సం: 04-018 శరణాగతి

పల్లవి:

నీకు నీవే వలసితే నీవు నన్నుఁ గాచుకొమ్ము
నాకు వసగానివెల్ల నన్నుఁ బాసీనయ్యా

చ. 1:

పాపమూల మటు తొల్లి పైకొన్న దేహము
పాపము సేయకుండితే పక్కున నేల మాను
కోపమే కూడుగఁ గుడిచిన యీబుద్ధి
కోపము విడువుమంటే గుణమేల మాను

చ. 2:

అప్పు దీర్చ వచ్చినట్టి ఆయపు సంసారము
అప్పు దీర్చుకోకుమంటే నది యేమిటికి మాను
తప్పు వేయవచ్చి నన్నుఁ దగిలె నీ కర్మములు
తప్పులు వేయక సారెఁ దా మేల మాను

చ. 3:

పంచమహాపాతకాలే పట్టుకొనే యింద్రియాలు
పంచమహాపాతాకాలే బారిఁ దోయ కేల మాను
అంచెల శ్రీవేంకటేశ ఆత్మలో నీవుండఁగాను
పొంచి నీ కరుణ నన్నుఁ బొదుగ కేల మాను