తాతా చరిత్రము/భూమిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

భూమిక.

ఆయాకాలపు మహనీయులచరిత్రమే ఇతిహాసపు సారమని కొందరిభావన; అది యెట్లున్నను ప్రతిభావంతులగు నాయకపురుషుల జీవితచర్యలు సమకాలికులకే గాక, క్రిందితరములకును, స్మరణీయములు, అనుసరణీయములు; వారిజీవిత చర్యల వలన దేశమంతటి పరిస్థితులును మారుచుండును. అట్టివారి సత్కార్యచర్యలను ప్రవృత్తిని గ్రంథస్థముచేయుట యవసరము. సత్పురుషుల ఘనకార్యములను గ్రంథములందు జదువుటచే, మనహృదయములందు నుదారభావములు, సత్కార్యప్రేరణ, కల్గును. చక్కగవ్రాసిన జీవితచరిత్రములు, ఆయాకాలపు ఇతిహాసమును దేశస్థితినిగూడ గ్రహించుటకు చాలనుపయోగకరములు, అవి యువకులకు మార్గదర్శకములగును. అందుచే జీవితచరిత్రములు వాఙ్మయమున నొకముఖ్యభాగముగ నెంచబడును.

ఆంధ్రవాఙ్మయమున నిట్టిగ్రంథము లంతగా లేవు; ఉన్నవి ముఖ్యముగ మతరాజకీయములకు సంబంధించినవి. కాని మతముకు రాజకీయములకునిచ్చు ప్రాముఖ్యమును మనవా రార్ధికపారిశ్రామికముల కిచ్చుట లేదు. తెలుగునపారిశ్రామికనాయకుల జీవితచరిత్రము లేకుండుట కిదియొక ముఖ్యకారణము కావచ్చును.

ఆదర్శపురుషులుగ నెంచదగిన రాజకీయనాయకులు ప్రవక్తలు మనదేశమున చాలమందికలరు; పారిశ్రామికనాయ కులు మాత్ర మరుదు. ఆధ్యాత్మిక రాజకీయములందు ప్రజ్ఞ యెంతయున్నను, ఆర్ధికపరిస్థితి బాగుగలేనిచో, నేలవిడచిసాము చేయు నట్లుండును; అట్టిస్థితిలో, ఏవిషయమందును సంఘము సరిగ వృద్ధి జెందదు. అందుకు, చీనాభారతదేశముల ప్రస్థుతస్థితియే ప్రబల నిదర్శనము. ఆర్ధికపరాధీనత రాజకీయ వశత కన్నను ఎక్కువ హానికరమని ప్రాజ్ఞులగు మహనీయుల యభిప్రాయము.

ప్రస్తుతకాలమున మనయిండ్లలో సాధారణముగా వాడు వివిధవస్తువు లేదేశపువో పరీక్షతో గమనించుచో, మనమెట్టి ఆర్ధికదుర్దశలో నున్నామో స్పష్టమగును. విదేశీయులు విజ్ఞాన సహాయమున తమ దేశములందు మహాయంత్రముల నిర్మించి, అందు బహులోత్పత్తి మూలమున చౌకగ వస్తువులను తయారు జేసి మనకంపుచున్నారు. వానిదిగుమతిని నిరోధించుట సాధ్యము కాదు. వాని వాడుక హెచ్చుటచే, ఇచటి దేశీయపరిశ్రమలు నశించినవి; కొన్ని మూలకుతొలగినవి. ఇటీవల సుమా రేబదియేండ్ల నుండి మనదేశమునను కొలదిమంది పారిశ్రామికులు పాశ్చాత్య పద్ధతినే వైజ్ఞానికముగ యంత్రాలయముల నేర్పరచి, పరిశ్రమల స్థాపించి, కొన్ని వస్తువులను తయారుచేయుచున్నారు. వారిలో నగ్రగణ్యుడు 'జంషెడ్జి నస్సర్వంజీ తాతా'. ఈయన దూరదృష్టి, బుద్ధికుశలత, వ్యాపారదక్షత, దాతృత్వము, మన దేశమం దసమానములు. ఈయన పారిశ్రామికరంగమున సాటిలేని కర్మ వీరుడు; ఈమహానీయునిచరిత్రము నాంధ్రులందరును తెలుసు కొన దగుననితోచి, తాతా మిత్రులగు కీ. శే. సర్ డిన్షావాచా గారు రచించిన Life and Life work of J. N. Tata నుండియు పత్రి కావ్యాసములు మున్నగు వానిని బట్టియు, 1917 లో నొకపుస్తకమును వ్రాసియుంటిని. దానిని నామిత్రులగు కావ్యనిధి శ్రీ చెలికాని లచ్చారావుగారు 'తాతా జీవితము' అను పేరుతో 1921 లో శ్రారామ విలాసగ్రంధమాలలో అచ్చువేయించిరి. అనేకగ్రంథముల బ్రచురించియు, పండితసహాయ మొనర్చియు, ఆంధ్రభాషకు సేవయొనర్చిన శ్రీ లచ్చారావుగారు 1923 లో అకాలమరణము నొందిరి. ఆపుస్తకము మరల నచ్చు పడలేదు.

'తాతా జీవితము' వ్రాయునప్పటికి, మనయార్ధిక పరిస్థితి బాగుపడుటకై ఆవశ్యకవస్తువులన్నిటికిని ఆధునిక పాశ్చాత్య యంత్రములతో పెద్ద 'ఫాక్టరీ' లనేర్పర్చి, అట్టిపరిశ్రమలను మన దేశమందును స్థాపించుటే మార్గమనుభావము సర్వసామాన్యముగ వ్యాపించియుండినది. కాని, 1921 నుండి దేశమున నూతన జాతీయభావముకలిగి, ఆధునికయాంత్రిక పద్ధతి హానికరమనియు, చేతిపనులనే వృద్ధిచేయించి, వానినే గ్రామములందు ప్రోత్సహించవలెననియు, ఒక సిద్ధాంతము బయలుదేరినది. కేవలయాంత్రిక నాగరికత, మనదేశమున కొంతహానికరముగనే ఉన్నది. †[1] అందు వలన యాంత్రికపరిశ్రమల స్థాపించిన తాతాగారి చరిత్రమును గ్రంథరూపమున మరల ఆంధ్రపాఠకులయెదుట నుంచుట ఉపయోగకరమా యని సందేహము కల్గుట సహజము. కాని యీవిషయమున కొన్ని సదర్భముల మరువరాదు. మిల్లులు మున్నగు మహాయంత్రములందు బహులోత్పత్తినొంది మనదేశముకు దిగుమతియగు వస్తువులతో, పూర్వపుపనిముట్లతో చేతితో తయారగువస్తువులు సాధారణముగ పోటీచేయలేవని మనకు ప్రత్యక్షముగ కనబడుచున్నది.

మనప్రస్తుతపు ఆర్ధికదుర్దశనుబట్టియు, రుచిభేదముచే సహజప్రవృత్తిని బట్టియు, చాలమందిజనులు చౌకయగుయాంత్రిక వస్తువులనే కోరుచున్నారు. ఈవస్తువులకే, (మన్నిక పనితనముగల చేతివస్తువులకన్న,) చలామణి చాలహెచ్చుగ నున్నది. ఈస్థితి విచారకరమైనను యధార్ధమని గమనింపక తప్పదు. చేతిపనులకు మనమెట్టి ప్రోత్సాహమిచ్చినను, అవి గ్రామజనులకు సహాయకములైనను, ఇప్పటి నాగరికతను బట్టి దేశీయావసరము లన్నిటిని తీర్ప లేవు. ఈయాంత్రిక నాగరికత దుర్ని వారముగా వేగముతో వృద్ధియగును, సర్వత్ర వ్యాపించుచున్నది. చేతితో తయారగు వస్తువులనే అభిమానించు వారుగూడ నిత్యమును వ్రాతకోతలకు, రాకపోకలకు, చాలపనిముట్లకు, నిత్యావసరములగు చాలకార్యములకు యాంత్రికవస్తువులనే వాడుచుండుట ఎంతమాత్రమును తప్పుట లేదు. వానివాడుక క్రమముగా హెచ్చుచున్నది గాని తగ్గుటలేదు. రైళ్ళు, మోటార్లు, బైసికిళ్ళు, గ్రామఫోనులు, సినీమా, రేడియో, టెలిగ్రాపు, ముద్రాయంత్రములు, సూదులు, తీగలు, కాగితములు, పెంసిళ్లు, గోనెసంచులు, గాజువస్తువులు, పెద్దదీపములు, రసాయనవస్తువులు మున్నగు మనమువాడుకొనున వెన్నియో చాలవరకు యాంత్రికములే.

ముఖ్యముగ ఆధునిక నాగరికత అయోమయమగుచున్నది. పూర్వము కర్ర నుపయోగించుపట్లగూడ ఇప్పుడు, ఇనుమునే ఎక్కువగా వాడుచున్నారు. ఉక్కువస్తువుల వాడుకయు చాల హెచ్చినది; ఇతరపరిశ్రమల మూలాధారములగు ఇంజనులు మున్నగు యంత్రములన్నియు ఇనుముతోను ఉక్కుతోను చేయబడును. వానికన్నిటికి చౌకగ ప్రశస్తమగు ఇనుము తయారగుట అవసరము, దానికిని ఇతరములకును నేలబొగ్గు, విద్యుచ్ఛక్తి అత్యవసరములగుచున్నవి. అందువలన లోహ, ఖనిజ, విద్యుచ్ఛక్తుల బుట్టించు పరిశ్రమలు ఇతరపరిశ్రమ లన్నిటికిని మూలాధారములై, ప్రతిదేశపు ఆర్థికాభివృద్ధికిని ముఖ్యావసరము లగుచున్నవి. ఇవి యాంత్రికములైనగాని, చౌకగను దృఢముగను ఉండవు.

ఈ వివిధవస్తువులకు మనదేశమున స్వయంసహాయమున పరిశ్రమ లేర్పడవలెను; ప్రస్తుతస్థితిలో మనవారు యంత్రపరిశ్రమల నేర్పర్చకున్నను, ఆస్థానమున అన్ని పనులకును చేతిపరిశ్రమలే వృద్ధియై యుండుననుటకు వీలు లేదు. అప్పుడు ద్రవ్యవిజ్ఞానానుభవములు పలుకుబడియు గల విదేశీయులే ఫాక్టరీలగట్టి, గనుల యజమానులై, ఆపరిశ్రమలకు మనదేశమున స్థాపించియుందురని తోచును.

వంగ దేశమున భారతీయులు ముందుగా శ్రద్ధవహించనందున, కలకత్తాప్రాంతపు జూటు (=జనపనార) సంచుల పరిశ్రమను, చాలవరకు బొగ్గుగనులను, కొంతవరకు కాకితపుమిల్లులు మున్నగు వానిని, విదేశీయులే నడుపుచున్నారు*[2] ఆవిదేశీయ సంఘములాపరిశ్రమల వృద్ధిచేయుచు, లాభ ద్రవ్యమును తమదేశముకు గొనిపోవుచున్నారు. ఆపరిశ్రమలందు భారతీయులకు తగు అనుభవము ప్రాబల్యము లేదు. జంషెడ్జితాతా మున్నగువారు సన్న నూలుబట్టల మిల్లులను స్థాపింపనిచో, వానినిగూడ విదేశీయులే స్థాపించియుందురేమో! ఈదేశమందు అట్లే తాతా సంఘపు దూరదృష్టి చాకచక్యములు లేకుండినచో, సాక్షిలోహపరిశ్రమ, బొగ్గుగనులపరిశ్రమ, సహ్యాద్రిలోని జలవిద్యుచ్ఛక్తి పరిశ్రమ, విదేశీయులహస్తగతమై యుండును; వాని లాభమందును, శిల్పానుభవమందును, యాజమాన్యమందును, భారతీయులకు తావే లేకపోయెడిది.

(ధాన్యము దంపుట, బెల్లము చేయుట, వడ్రపుపనులు, వడకుట, నేత, మున్నగు పరిశ్రమలు వ్యవసాయజనూకు చాల సహకారులు, మన గ్రామజీవనమునకు చాల ఉపయోగకారులు. వీనితో యాంత్రికపరిశ్రమలు పోటీచేసి, వీనిని నశింప జేయుట భావ్యముకాదు. కాని, అంతమాత్రమున, యాంత్రిక పరిశ్రమ లసలే యవసరముకావని భావించుట ఉచితముగ తోపదు)

విదేశపుయంత్రములందును విదేశీయాజమాన్యపు యంత్రములందును తయారగు వస్తువులకన్న, ఈదేశీయుల సరకులనే వాడుట ఆర్థికముగ శ్రేయస్కరము.

ఈదేశమందు పెద్దపరిశ్రమల స్థాపకులలో ప్రముఖుడు తాతా; ఇంతేగాక, గృహపరిశ్రమాభిలాషులును తాతాజీవితమునుండి చాలసంగతుల నేర్చుకొనవచ్చును. ఆయన గొప్ప దేశాభిమాని, ఆర్ధిక వేత్త. ప్రపంచపు ఆర్థికహితైషులందరకు ఆయన చర్యలు మార్గదర్శకములు.†[3]

ఈదేశమున కవసరములు, ఇతర పరిశ్రమలకు కీలకములు, అగు వానిపైననే జంషెడ్జి తనదృష్టిని నిగుడ్చెను. తనకు లాభకరములే గాక దేశాభివృద్ధి కవసరములగు క్రొత్తపరిశ్రమలనే ఆయన స్థాపించెను. యాంత్రికతవలన లాభముతో బాటు కొంతనష్టమును కలుగునని గ్రహించి, జంషెడ్జి ఆనష్టముల తగ్గించుటకును, కార్మికుల బాగుజేయుటకును, ఉద్యోగులకు పరిశ్రమల లాభములందు సంబంధము కలిగించుటకును, చాల తోడ్పడెను; కార్మికుల విద్యారోగ్యాదుల వసతులను వృద్ధి చేయించెను. ఉన్నతవిద్యను విజ్ఞానమును వృద్ధిచేయుటకై, ఆయన లక్షలకొలది రూపాయలు నిధుల నేర్పర్చెను.

ఇప్పుడు మనదేశమంతటను వ్యాపించి భారతీయవ్యాపారమం దగ్రగణ్యమగు 'తాతా' వారి సంస్థలలో నాగపురం, బొంబాయి, అహమ్మదాబాదు మిల్లులను పట్టుపరిశ్రమను జంషెడ్జి తాతా స్వయముగ స్థాపించి, వృద్ధిచేసెను. తాజ్‌మహల్ హోటల్ మొదలగు మహాభవనముల నాయనయే నిర్మించెను; విదేశములం దున్నతవిద్యాప్రోత్సాహముకై నిధినినెలకొల్పెను. విజ్ఞానాలయపు సంస్థనుగూడ జంషెడ్జియే స్థాపించెను; లోహశాలను జలవిద్యుచ్ఛక్తిశాలను పూర్తిగా స్థాపించువరకు జీవింపలేదు; కాని ఆమహాసంస్థల సాధ్యతను కనిపెట్టి, వానిని జయప్రదముగ జరుపుటకు వలయుసాధన పరికరమును సముజాయిషీ నంతను ఆయన విశేషకృషితోను వ్యయప్రయాసలతోను సిద్ధముచేసెను; మరియు తనయనంతరము వానిని అమలుజరపుటకు తన బంధుమిత్రుల కందలి వివరములను మర్మములను బోధించి, తనతో సహచరులుగజేసి, తన ఆశయము ఉత్సాహ ము అభినివేశము వారి కబ్బునట్లుచేసెను. ఇట్లా మహాసంస్థలను భారతీయులే స్థాపించినడుపుటకు జంషెడ్జితాతాయొక్క ప్రతిభ, దేశభక్తి, అభినివేశము, మూలకారణములని చెప్పవచ్చును. అందువలన వానిని వానిశాఖాలను గూడ ఈపుస్తకమున వివరించితిని.

తాతా జీవితము వ్రాసినప్పటినుండి దేశపరిస్థితులు చాల మారినవి. ఆపుస్తకపుశైలి నిందు మార్చి సులభమొనర్చితిని. 'తాతాజీవితము'లోని చాలసంగతు లిప్పుడు అప్రధానములైనవి; వానినెల్ల విడిచితిని, అందలి కొన్నింటి నిందు చాల క్లుప్తముచేసితిని; ఆపుస్తకమున లెని చాలసంగతుల నిందు చేర్చితిని.

హారిసుగారు తాతానుగూర్చి రచించిన ఆంగ్లగ్రంథపు ప్రతిని సర్ దొరాబ్జితాతా ట్రస్టువారు నాకు దయతో బంపిరి. అది ఈపుస్తకమును వ్రాయుటకు నాకు చాల నుపయోగించినది. ఇందలి చిత్రపటములును అందుండి గ్రహించినవే. (ఇందుకు నేను వారికెంతయు కృతజ్ఞుడను.) ఈపటముల బ్లాకులను తిరువల్లిక్కేణిలోని విశ్వ అండ్ కంపెనీలో తయారు చేయించితిని.

దాదాపుగా, మనదేశపు పెద్దపరిశ్రమ లన్నిటిని గూర్చినప్రశంస చాలవరకు ఇందు చేరినదని పాఠకులు గ్రహింతురు. తాతాగారి జీవితము మనదేశపు పారిశ్రామిక చరిత్రముతో అభేద్యముగ మిళితమై యున్నది. ఆ యాసమస్యల చర్చ సందర్భమున ఇం దాపరిశ్రమల ప్రశంస అవసరము, ఉపయోగకరము, అగుటచే, సందర్భవశమున వాని నుదహరించితిని. శైలికి పారిభాషికపదములకు నా 'జగత్కథ' లోని పద్ధతినే యవలంబించితిని; ఈపుస్తకమును వ్రాసిప్రచురించుటలోను చి|| ప్ర|| పార్ధసారధి (బి. ఏ., బి. కామ్; ఎల్. ఎల్. బి.) నాకు సాయము చేసెను.

భారతదేశమం దిప్పుడు వ్యవసాయమే ముఖ్యవృత్తి, ప్రభుత్వపులెక్కలప్రకారమే ముప్పాతికమంది జనముకు వ్యవసాయమే జీవనాధారము. (అనగా, ఇంతమందియు నిజముగ వ్యవసాయాదులు చేసికొనుచు స్వయముగ తమ్ము తాము పోషించుకొనుచున్నారని తలపకూడదు. ఇందులో మిక్కిలి కొద్దిమందికే వ్యవసాయపుపని దొరకుచున్నది. కొలదిమంది యీనాందారులుగ శిస్తుల గ్రహించుచున్నారు; తక్కినవారందరు తాము నిరాధారులగుటవలన, కర్షకులవలననో భూనాయకులవలననో, అనుబంధముచే కరుణయా పోషింప బడుచున్నారు; ఐనను, లెక్కలలో వారికిని వ్యవసాయమే వృత్తి యనుట వాడుక) మరియు సాగుదార్లకు పూర్వము అనుబంధవృత్తులుండినవి. ఇప్పుడు వ్యవసాయము లేనిరోజులలో రయితులు తరుచు వ్యర్ధముగనే యుండుచున్నారు. పరిశ్రమలు హెచ్చినచో ముడివస్తువులకు ధరలు హెచ్చి, వ్యవసాయముకును ప్రోత్సాహము కలుగును.

మనదేశమున వస్తువులలోటు లేదు. ఈవిశాలదేశమున అన్నిశీతోష్ణపరిస్థితులు అన్ని రకముల నేలలును గలవు. ఐనను మనదేశము వ్యవసాయముకే తగినదని, కొందరనుట పరిపాటిగ నుండినది. ఆసంగతి నిజము కాదనియు, తగు మనోనిశ్చయముతో కృషిసల్పినచో, ఈదేశమందును ముఖ్యపరిశ్రమ లేర్పడి యార్ధికస్థితి బాగుపడు ననియు, తాతాచరిత్రము సహేతుకముగ విశదము చేయును. ముఖ్యముగ, మన యాంధ్రప్రాంతమున పెద్దపరిశ్రమ లేవియు లేవు. ఉన్నపరిశ్రమ లైనను క్షీణించుటయో, పరహస్త గతములగుటయో, జరుగు చున్నది. జనులలో, ముఖ్యముగ విద్యావంతులగు యువకులలో, నిరుద్యోగత విపరీతముగ హెచ్చుచున్నది. ఇట్టి దయనీయ పరిస్థితి చాలయనర్ధములకు కారణమగుచున్నది. ఒకవిధముగ మన దేశమందలి వివిధ బాధలన్నిటికిని, పరిశ్రమలు లేకుండుటచే యువకులలోనున్న వృత్తిహీనతయే కారణమని తోచును.

అందువలన ఆధునికభారతదేశపు పారిశ్రామికనాయకులలో నగ్రగణ్యుడగు జంషెడ్జితాతాచరిత్రము మనయువకులలో కొంతవరకైన స్వతంత్రవృత్తి సంపాదనకు ఆర్థికోన్నతికి ఉత్సాహము కల్గింపవచ్చుననియు, ఆరీతిగ నీచిన్న పుస్తకము కొంచెము జనోపయోగకరము కావచ్చుననియు, తలచి దీనిని ప్రచురించితిని. వ్యాపారవిషయమున తాతా యవలంబించిన పద్ధతు లందరును నేర్చుకొనదగినవి. ఆయనచర్య లన్నిటిలోను విశేషతకలదు; వాని స్వభావమును, (చర్వితచర్వణమైనను) చివర అధ్యాయములో, ప్రత్యేకముగ చిత్రించితిని. భారతదేశపు ఐహికాభివృద్ధికై, ఆధునిక భారతీయులలో నింకెవరి కన్నను జంషెడ్జితాతాయే యెక్కువకృషిచేసెనని విదేశీయులు కూడ భావించుచున్నారు. *ఆయన ధనమును పరమావధిగ నెంచక, సత్కార్య సాధనముగనే యెంచెను.


__________
  1. † ఈసమస్యవిషయమై (ప్రపంచ చరిత్రను గూర్చి నేను వ్రాసిన 'జగత్కథ' లో 544 - 547, 648 - 650 వ పుటలందు కొంతవివరింపబడినది.
  2. * ఇట్లే మనమద్రాసు ప్రాంతమున కొన్ని బట్టలమిల్లులు మైసూరులో స్వర్ణపరిశ్రమ, ఇత్యాదులను విదేశీయులే నడుపుచున్నారు.
  3. † పరిశ్రమలం దారితేరిన పాశ్చాత్యులకును ఆయనజీవితము హిత బోధకమగుటవలననే, జంషెడ్జితాతా చరిత్రమును, ఇదివరలో లండనులోను ఇప్పుడు ఆక్సుఫర్డులోను ఉపన్యాసకుడైన యఫ్. ఆర్. హారిసు అను అర్థశాస్త్రపండితుడు 1925 లో మనోహరముగ రచించెను; దాని నాక్సుఫర్డు యూనివర్సిటీ ప్రెస్సువా రింగ్లండులో ముద్రించి ప్రచురించిరి. ఇదియు జంషెడ్జి ఘనతకు జగద్విఖ్యాతికి నిదర్శనము.
  4. * He did more for its material regeneration than any other Indian of modern times" Lovat Fraser's 'India under Curzon and after' P. 324."