తాతా చరిత్రము/పార్సీలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తాతా చరిత్రము

1. పార్సీలు.

మనభారతదేశమున జాతులు, మతములు, చాలగలవు. అందు హిందువులు సుమారు 24 కోట్లు, ముసల్మానులు రమారమి 9 కోట్లు, ఉందురు; క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులుగూడ కొలదిగ నున్నారు. పార్సీలసంఖ్య వీరందరి కన్ననుతక్కువ. వీరు సుమా రొకలక్షమాత్ర మెయున్నను, చాలప్రముఖులుగ నున్నారు. వీరి పూర్వచరిత్ర, ఆచారములు, విచిత్రములు.

పార్సీ లార్యజాతీయులు. ఆర్యులమహాజాతి చరిత్రకాలముకు చాలపూర్వమే రెండుగా చీలెను. అం దొకశాఖవారు యూరపులోని గ్రీసు, ఇటలీ, జర్మనీ, ఇంగ్లండు, ఫ్రాన్సు మున్నగుదేశములంజేరిరి; రెండవశాఖవారు ఆసియాలో పారసీక హిందూస్థానాదులందు స్థిరవాసులైరి. ఈప్రాచ్యులు పూర్వము కొంతకాలము మనదేశముకు పారసీకముకు మధ్యప్రాంతమున వసించుచుండ, కాలక్రమమున వారిలో రెండుశాఖ లేర్పడి, ఈయుభయులమధ్యను కలహము గల్గెనని, అం దసురశాఖీయులు పారసీకమున వ్యాపించిరని, దేవశాఖీయులు సింధునది దాటి మనదేశపు ఆర్యావర్తవాసులైరని, కొందరు చారిత్రకులందురు.†[1] భారతీయార్యుల మూలగ్రంథము 'ఋగ్వేదసహిత' ' పారసీకార్యుల మూలగ్రంథము 'అవెస్తా' ; ఈరెంటిభాష, విషయములును, చాలవరకు పోలియున్నవి.

భారతీయార్యులు తరువాత చాల సుఖదు:ఖములకు లోనై, మనదేశమంతటను వ్యాపించి, చాల రాజ్యముల స్థాపించిరి. క్రమముగా, ఆర్యద్రావిడుల నాగరికతలు మిశ్రితములై నంతట, మన భారతీయనాగరికత యేర్పడినది; తరువాత కొన్ని శతాబ్దములకు మనము పూర్వపుటున్నతిని గోల్పోయి, తుదకు పరాధీనుల మైతిమి.

పారసీకార్యులును మొదట బలీయులై, వృద్ధినొందిరి; గొప్పరాజ్యముల స్థాపించిరి; వారిలో 'జొరాస్టరు' అనబడు జరాతుస్త్రుడు గొప్పమరమును స్థాపించెను. వారికిని నిత్యాగ్ని పూజ, ఉపనయనము, మౌంజీధారణము, ఇత్యాదిసంస్కారములు కలవు; వారిలోను గోమూత్రము పవిత్రముగ నెంచబడును.

ఇట్లుండగా పారసీకముకు పడమటనున్న 'అరేబియా' దేశములో క్రీ. త. 622 ప్రాంతమున 'మహమ్మదు' అను ప్రవక్త క్రొత్తమతము స్థాపించెను. ఆమతము నరబ్బులందరు నవలంబించి, దానిని లోకమంతటను వ్యాపింపజేయుటకై వీ రావేశముతో నలుదిశలను బయలుదేరిరి. వారిరణనీతి, మతోత్సాహము, అద్భుతములు. అం దొకశాఖవారు పారసీకముపై బడిరి; ఆవాహినిని క్రీ. త. 637 లో 'కడెస్సియా' యుద్ధమున పారసీకు లెదిర్చిరి. అప్పటి పారసీకసేనాని యగు 'రుస్తుం' గొప్పశూరుడే. కాని మూడురోజులు సంకులయుద్ధము జరిగి, తుదకు పారసీకు లోడిరి. అరబుతరంగ మా దేశమంతటను వ్యాపించెను. పారసీకులందరకు 'కురాను' ఖడ్గము నెదురయ్యెను;†[2] ఆజను లిస్లాము నంగీకరింపనిచో, ఖడ్గమున కెరయగుచుండిరి. దాదాపు పారసీకు లందరును త్వరలోనే ముసల్మానులైరి; కొంద రు ధీరులుమాత్రము తమ కానువంశికమగు 'జొరాస్టరు' మతము విడనాడరైరి. వా రారబులప్రచండధాటి కోర్వలేక, జన్మభూమిని సర్వస్వమునుగూడ వదలి, దేవునిపై భారమువైచి, ఆకాలపు చిన్న యోడలలో మహాసముద్రముపై బయలుదేరిరి. అనేకకల్లోలములను ప్రమాదములను దాటి, ఆయోడ లెట్లో క్రీ. త. 720 ప్రాంతమున మనదేశపు పశ్చిమతీరమును జేరెను. ఆయోడలలో వచ్చిన యా పారసీకు లీదేశమందే యుండిపోయిరి; వారివంశీయులే నేటికిని 'పార్సీ' లనబడుచున్నారు. వారు వసించినప్రాంత మగు మన ఘూర్జరదేశ మప్పుడు చాళుక్యరాజుల పాలనలో నుండి సర్వసంపత్సమృద్ధ మైయుండెను. (దీని యుత్తరప్రాంత మిప్పుడు బరోడారాజ్యములోను, దక్షిణప్రాంతము బొంబాయిరాష్ట్రపు గుజరాతుగను, ఉన్నవి). ఈప్రాంతము వింధ్యగిరిపాదములతోను, నర్మదా తపతీనదులతోను, అలరారుచున్నది.

ఆ 'పార్సీ' లిచ్చటి మనరాజుల మన్ననలంది స్వేచ్ఛతో తమ 'జొరాస్టరు' మతాచారముల రక్షించుకొనిరి. ఈప్రాంతపు హిందువులతృప్తికై గోమాంసమును, తరువాత ముసల్మానుల తృప్తికై సూకరమాంసముగూడ, వారు త్యజించిరి. వారు చాల అల్పసంఖ్యాకులయ్యు, నేటివరకు తమమతమును వ్యక్తిత్వమును నిల్పుకొనియున్నారు. అప్పటినుండి ఆప్రాంతపు సూరతు, భారుకచ్ఛము (బ్రోచి), మున్నగు రేవుస్థలములనుండి విశేషముగ కోస్తావ్యాపారము చేయుచున్నారు.

పార్సీలలోను మన హిందువులలోవలె కాలక్రమమున కొన్ని మూఢాచారములు వ్యాపించెను. కాని గతశతాబ్దమున నాంగ్లవిద్య యారంభింపగనే, పార్సీలలో చాల మార్పుకలిగినది. దాదాపుగా వారందరును విద్యావంతులు; వా రాప్రాంతపు 'గుజరాతీ'ని స్వభాషగ జేసికొనిరి; దాని వాఙ్మయము వృద్ధి నొందించిరి. ఆసంఘమున అతిబాల్యవివాహములు లేవు; స్త్రీలకు కొంతస్వతంత్రత కలదు. పార్సీలు వ్యాపారాదులకై తరుచు ఆంగ్లమును హిందూస్థానీని కూడ అభ్యసింతురు. తాము కడు నిడుమలబడియున్నపు డాతిథ్యమొసగి మతస్వాతంత్ర్యమిచ్చిన భారతదేశమే పార్సీలకు స్వదేశమయ్యెను. వారిలో చాలమంది యిప్పుడు మనదేశమున వివిధశాఖలం దున్నతస్థానముల వహించి, సంఘమున కనేకవిధముల నుపకరించుచున్నారు; వారిలో కొందరుద్యోగులు రాజ్యాంగదక్షులునుకలరు; (బ్రిటిషుపార్ల మెంటులో సభ్యులైన భారతీయులు ముగ్గురును పార్సీలే). పార్సీలకార్యశూరత, దాతృత్వము, వ్యవహారదక్షత ప్రపంచమం దసమానములు. పెద్దపెద్దవ్యాపారములందు వీరికి పెట్టినదిపేరు. 'త్యాగాయసంభృతార్థానాం' అను కాళిదాసునిసూక్తి ఈజాతికి వర్తింప్చును. ఇట్టివిచిత్రజాతియందే మేధావి, కర్మవీరుడు, ఉదారుడు, మహాదాత, వ్యాపారనాయకుడు అగు మన జంషెడ్జి నస్సర్వంజి తాతా జనించెను.



__________
  1. † ఈయైతిహ్యముప్రకార మాయుద్ధమే 'దేవాసురయుద్ధ' మనబడెను; ఇట్లు దేవాసురులందరు అసలు ఏకజాతీయులై యుందురు. అసురులకు 'పూర్వదేవు' లనియు పేరుగలదు.
  2. † 'కురాను' మహమ్మదు బోధనలదెల్పు, ఆమతపు మూలగ్రంథము. ఆమతమును 'ఇస్లాం' అనియు నందురు. ఆమతస్థులను ముస్లిములు, ముసల్మానులు, అనియు చెప్పుదురు. ఇది ఏళేశ్వరమతము; ఇందు అవతారములకు, విగ్రహారాధనలకు, జాతికులభేదములకు, తావులేదు. మహమ్మదును ప్రవక్తయే గాని దేవుని అవతారము కాదని, ఇట్లే ఏసుక్రీస్తు, బుద్ధుడు, మున్నగు పూర్వపు మతకర్తలును ప్రవక్తలేయనియు ఆమతసిద్ధాంతము.