Jump to content

తలిరాకు జొంపముల సం

వికీసోర్స్ నుండి


తలిరాకు జొంపముల సం

దులత్రోవల నేల వాలు తుహినకిరణ కో

మల రేఖవొ! పువుదీవవొ!

వెలదీ, యెవ్వతెవు నీపవిటపీవనిలోన్?


కారుమొయిళ్ళ కాటుకపొగల్

వెలిగ్రక్కు తమాలవాటి నే

దారియు కానరాదు, నెలతా!

యెటువోయెద వర్ధరాత్రి - వి

స్ఫార విలోచ నాంధ తమసమ్ముల

జిమ్ముచు, వేడి వేడి ని

ట్టూరుపులన్ నిశీథ పవ నోర్మి

వితానము మేలుకొల్పుచున్?"


"అది శరద్రాత్రి; శీత చంద్రాత పాంత

రాళ రమణీయ రజత తల్పంబునందు

చల్లగా నిద్రవోవు వ్రేపల్లెవాడ

సకల గోపాల గోపికా జనముతోడ.


సాము సడలిన పతి పరిష్వంగమందు

సుఖము దుఃఖము లేని సుషుప్తిలోన

స్వప్నవీథీ యథేష్ట సంచార కలన

మేను మరచిన న న్నంత మేలుకొలిపె

శర్వరీ శీత పవన పక్షముల మలసి

స్వాదు యము నోర్మి సంగీత ఝరుల గలసి

కౌముదీధౌత శుభ్ర దిక్తటుల సొలసి

మురళికా మందమంద మాధురుల రుతులు.


ఎలదేటి చిరుపాట సెలయేటి కెరటాల

బడిపోవు విరికన్నె వలపువోలె

తీయని మల్లె పూదేనె సోనల పైని

తూగాడు తలిరాకు దోనెలోలె

తొలిప్రొద్దు తెమ్మెర త్రోవలో పయనమై

పరువెత్తు కోయిల పాటవోలె

వెల్లువలై పారు వెలది వెన్నెలలోన

మునిగిపోయిన మబ్బుతునకవోలె


చిరుత తొలకరివానగా చిన్ని సొనగ

పొంగి పొరలెడు కాల్వగా నింగి కెగయు

కడలిగా పిల్లగ్రోవిని వెడలు వింత

తీయదనముల లీనమైపోయె నెడద.


పరువు పరువున పోవు నెదతో

పరువు లెత్తితి మరచి మేనే

మరచి సర్వము నన్ను నేనే

మరచి నడిరేయిన్."


"ప్రాణనాయకు కౌగిలి పట్టు వదలి

యిల్లు వదలి యెన్నండు నీ పల్లె వదలి

యడుగిడని దాన; వా నాటి యర్ధరాత్రి

విజన పథముల బడి యెట్లు వెడలినావు?"


"తావులతోడ తేనియల

ధారల నిప్పిలు వేణుగీతికా

రావముతోడ మందగతులన్

జను మారుతముల్ విశాల బృం

దావన వీథులందు యమునా

నవభంగ మృదంగ వాద్యముల్

త్రోవ స్ఫురింపగా వలపు

తొందర వెట్టగ బోతి నొంటిమై.


సన్నని యెల్గెత్తి జాలిగా నెవరినో

యరయుమా! పిలుచుచున్నదియె యమున!

పక్ష నిర్జీవ ధావళ్యమ్ముతో నున్న

సికతాతలమ్ము గాంచితివె, దాని?

తుది మొదల్ లే దిదే త్రోవరుల్ త్రొక్కని

యీ దారినే పరువెత్తినాను!

ఈ మొండిచేతుల నెత్తి యీ వనతరుల్

శూన్యదృక్కుల దిశల్ చూచు నయ్యొ!

ఇచటనె, యిచటానే యత; డిచట నేను -

ఇచట నీ జాజిపూ బొదరింట నేను -

ఈ కడిమిచెట్టు క్రింద సుమ్మీ యతండు -

సరిగ కన్నుల గట్టిన సరణి దోచు.


శారద శర్వరీ మధుర చంద్రిక,

సూర్యసుతా స్రవంతికా

చారు వినీల వీచిక, ప్రశాంత

నిశా పవనోర్మి మాలికా

చారిత నీప శాఖిక, కృశాంగిని

గోపిక నేను, నాడు బృం

దా రమణీయసీమ వినినారము

మోహన వేణుగానమున్.


మలయ పవను కౌగిలిలోనె పులకరించి

హాయిగా కంఠ మెత్తు ప్రాయంపు వంశి

విశ్వమోహను జిలిబిలి పెదవు లంటి

యవశమై పోయి యేమి చేయంగ లేదు!


బాలగోపాలు బోలెడు పాటగాని

కని విని యెరుంగ మెన్నండు; కరములోని

మురళినే కాదు, నాలోని మ్రోడు టెడద,

నీ శిథిల జీవనమ్ము మ్రోయింప గలడు.


నందగోప కుమారు నానంద మురళి

కా మనోహర సుషి రాపగా తరంగ

జాలముల తారకా రవి చంద్రతతులు

కరగి చిని చిన్ని గీతులై కలసిపోవు.


చూవితివొ లేదొ చిన్ని కృష్ణుని సొబంగు?

పెదవి చివురు సంజల నరవిచ్చు నవ్వు

వెన్నెల, చలించు తుమ్మెద బెళుకు చూపు,

లోల పవన చాలిత కుటి లాలకమ్ము,

తరళ చూడా కలాపమ్ము, మురళి గూడి

యల్ల నల్లన గొంతెత్తి యమృతగాన

శీతల తుషారముల విరజిమ్ము వేళ

చిన్ని కృష్ణుని సొబగు చూచితివొ లేదొ?

లేవు శర త్తమస్వినులు

లేవు మనోజ్ఞ సుధాంశు మాలికల్

లేవు మదీయ గాత్ర లవలిం

బుల కాంకుర కోర కావళుల్

లేవు కుమారగోప మురళీ మృదుగీత ఝరీ విలాసముల్!


జిలిబిలి పట్టురేకుల వెన్న తొట్రిలు

మల్లియ యెద దాగు మధుప రవము

కనుచూపు దాటు నామని బాయు కోయిల

గొంతులో చిక్కు వసంతగీతి

విభు వీడి శుష్కించు విరహిణి సెలయేటి

కడుపులో నడగిన కడలి మ్రోత

రేనికై వెదకెడు రిక్కచూపుల లోన

చెరవడ నిండుచందిరుని పాట


యిట్టు లీ దీన గోపికా హృదయ మంది

రాంతరాళము లోన త్రుళ్ళింత లాడు

వేణు నాదంబు, వినిపించు విశ్వమోహ

నాకృతి కిశోరగాయకు నరయుచుంటి.


ఇది నా చరితము; విని నీ

వదరెదు తొట్రిలెదు వడకు దటు నిటు కనులన్

జెదరెడు చూపుల నేదో

వెదకెదు! ఎవ్వతెవు నీపవిటపీవనిలోన్?"