జ్యోతిష్య శాస్త్రము/12 గ్రహములు ఏవి?

వికీసోర్స్ నుండి

11. 12 గ్రహములు ఏవి?

గుణములు 12 రకములు గలవు. 12 గుణములలో వచ్చు కర్మలు 12 రకములు గలవు. 12 గుణములలో పుట్టు 12 రకముల కర్మలను గ్రహించు గ్రహములు కూడ 12 గలవు. గ్రహములు నివశించు కాలచక్రము కూడా 12 భాగములుగా ఉన్నది. కర్మచక్రము కూడ 12 రకముల కర్మలు నిలువయుండుటకు 12 భాగములుగానే ఉన్నది. కాలచక్రములోని 12 భాగములలో స్వంత స్థానములను ఏర్పరచుకొన్న 12 గ్రహముల పేర్లు వరుసగా ఈ విధముగా కలవు. 1) రవి 2) చంద్రుడు 3) కుజుడు 4) బుధుడు 5) గురువు 6) శుక్రుడు 7) శని 8) రాహువు 9) కేతువు 10) భూమి 11) మిత్ర 12) చిత్ర. సూర్యకుటుంబములోని గ్రహములలో భూమి కూడ కలదు. కావున దానిని అందరు ఒప్పుకొనుటకు అవకాశము గలదు. కానీ ఎవరూ ఇంతవరకు విననివి మరియు తెలియనివి అయిన మిత్ర, చిత్ర అను రెండు గ్రహములు కూడా కలవు. ఇంతవరకు ఖగోళశాస్త్ర పరిశోధకులకు కూడ ఈ రెండు గ్రహముల ఉనికి తెలియదు. ఖగోళ శాస్త్రపరిశోధకులు భవిష్యత్తులో ఈ రెండు గ్రహములను గూర్చి చెప్పవచ్చునేమో కానీ, ఇప్పటి వరకు వాటి వివరము ఏమాత్రము వారికి తెలియదు. ఈ రెండు గ్రహములను కనుగొనుట కొంత కష్టముతో కూడుకొన్న పనియేనని చెప్పవచ్చును. ఇక్కడ కొందరు మేధావులు మమ్ములను ఈ విధముగా ప్రశ్నించవచ్చును. ఇంతవరకు ఖగోళ శాస్త్రజ్ఞులకే తెలియని రెండు గ్రహముల వివరము మీకు ఏ పరిశోధన ద్వారా తెలిసినది? పైగా ఈ రెండు గ్రహములను కనుగొనుట కష్టముతో కూడుకొన్న పనియే అన్నారు. ఆ విషయమును మీరెలా చెప్పుచున్నారని అడుగవచ్చును. దానికి మా జవాబు ఈ విధముగా కలదు. ఉన్న విద్యను శోధించి తెలుసుకొనుచున్నవాడు విద్యార్థి అవుతాడు. పూర్తి విద్యను నేర్చినవాడు విద్యావేత్త అవుతాడు. విద్యార్థిని, విద్యావేత్తయని అనలేము. అలాగే ఉన్న శాస్త్రమును శోధించి తెలుసుకొనువాడు శాస్త్ర పరిశోధకుడవుతాడు, శాస్త్రవేత్తగాడు! మరియు శాస్త్రజ్ఞుడూగాడు. మా దృష్టిలో ఖగోళశాస్త్రపరిశోధకులున్నారు గానీ, ఖగోళశాస్త్రజ్ఞులు లేరు. పూర్తి శాస్త్రమును తెలియనంతవరకు, ఎవరూ శాస్త్రజ్ఞులు కాలేరు. నేడు ఖగోళమును పరిశోధించు శోధకులున్నారు గానీ, పూర్తి తెలిసిన శాస్త్రవేత్తలు లేరు. అందువలన భవిష్యత్తులో ఇంతవరకు చెప్పని రెండు గ్రహముల వివరమును ఎవరైనా చెప్పవచ్చునేమో అన్నాము. మిత్ర, చిత్ర అను రెండు గ్రహములను కనుగొనుట కొంత కష్టముతో కూడుకొన్నపని అని కూడా అన్నాము. అలా అనుటకు కారణము ఏమనగా! మిత్ర గ్రహము చీకటితో కూడుకొన్నది. దాని మీదికి ఏ వెలుగూ ప్రసరించదు. ఏ వెలుగూ దాని మీద ప్రతిబింబించదు. ఏ రేడియేషన్‌ కిరణములు దానిని తాకలేవు. ఇకపోతే రెండవ గ్రహమైన ‘చిత్రగ్రహము’ అనేక రంగులు కలదై, 24 గంటలలో కొన్ని నిమిషములు మాత్రమే గోచరించును. మిగతా సమయములో అదృశ్యమై ఉండును. కొన్ని నిమిషములు మాత్రమే అగుపించు అదృశ్యగ్రహమును చిత్రగ్రహము అంటాము. కావున కనిపించని చిత్ర గ్రహమును గానీ, చీకటి గ్రహమైన మిత్ర గ్రహమునుగానీ కనుగొనుట కష్టమన్నాము. మీరు ఏ పరిశోధన ద్వారా చెప్పుచున్నారని నన్నడిగితే, నా జవాబు ఏమనగా! నా పరిశోధన ఏదైనా బయటగానీ, బయటి పరికరముల ద్వారాగానీ ఏమాత్రముండదు. నా శోధనయంతా శరీరాంతరములోనే ఉండును. శరీరములోని బ్రహ్మనాడిలో సమస్త విశ్వము ఇమిడియున్నది. శరీరాంతర బ్రహ్మనాడిలోనే షట్‌ శాస్త్రములు ఇమిడియున్నవి. సకల విద్యలూ బ్రహ్మనాడియందే గలవు. ఉదాహరణకు బయట విద్యను నేర్వని చిన్న వయస్సువారు కూడా, ఎంతో విద్యా ప్రావీణ్యులుగ కనిపించుచున్నారు. వారియందే విద్య ఉన్నదానివలన, అది లోపలే ప్రాప్తించిన దానివలన, వారు ఆ విద్యలో ప్రావీణ్యులుగ కనిపించుచున్నారు.

బయట కనిపించు సమస్తము మన బ్రహ్మనాడియందు ఉండడమే కాక, ఈ సమస్తమును సృష్ఠించిన దేవుడు కూడ మనయందే ఉన్నాడు. మనిషి బయట ఎక్కడ వెదకిన దేవుడు కనిపించడు. బయట కనిపించని దేవుణ్ణి కూడ మనిషి తన శరీరము లోపలే తెలియవచ్చును, పొందవచ్చును. చివరికి మోక్షమును పొందవలసినది కూడ శరీరములోనే. ప్రకృతిని సృష్ఠించిన దేవుడే శరీరములో ఉంటే, మిగత వాటిని గురించి బయట వెదకవలసిన పనిలేదు. పూర్వము మహర్షులు, బయటి పరిశోధన లేకుండగనే సూర్య,చంద్ర,నక్షత్ర గతులనూ, గ్రహణములనూ చెప్పగలిగారని మరువకూడదు. నేటి శాస్త్రపరిశోధకులు చెప్పని విషయములను ముందే ఏ పరిశోధన లేకుండ చెప్పిన ఘనత ఇందూదేశ జ్ఞానులకు గలదు. గతములో మేము చెప్పిన ‘‘జనన మరణ సిద్ధాంతము’’గానీ, ‘‘ఆధ్యాత్మిక రహస్యములు’’గానీ అంతరంగ పరిశోధనలోనివేనని తెల్పుచున్నాము. ఆ పద్ధతి ప్రకారమే ఇప్పుడు చెప్పిన 12 గ్రహముల వివరమని తెలియవలెను. చీకటి గ్రహమైన మిత్ర గ్రహముగానీ, అదృశ్య రూపముగా నుండి, కొన్ని క్షణములు మాత్రము కనిపించు చిత్రగ్రహము గానీ ఇప్పటికీ క్రొత్తవే. అయినా వీటి పాత్ర జ్యోతిష్యములో చాలా ఉన్నది. వీటి పాత్రను వదలివేసిన నేటి జ్యోతిష్యములో శాస్త్రీయత లోపించినదనియే చెప్పవచ్చును. జ్యోతిష్యము శాస్త్రముగా నిరూపించబడాలంటే గ్రహముల సంఖ్య 12 గానే ఉండాలి.