Jump to content

జ్యోతిష్య శాస్త్రము/మూడు క్రొత్త గ్రహముల గమనమును ఎలా గుర్తించాలి?

వికీసోర్స్ నుండి

45. మూడు క్రొత్త గ్రహముల గమనమును ఎలా గుర్తించాలి?

[మార్చు]

మూడు గ్రహములు ఇప్పుడు మనకు క్రొత్తవే అయినా పూర్వము అందరికీ సుపరిచయమైనవేనని చెప్పవచ్చును. పూర్వము వ్రాసిన గ్రంథములలో మూడు గ్రహములను ఎవరూ వ్రాయలేదే అని ఎవరైనా మమ్ములను అడుగవచ్చును. దానికి మా సమాధానము ఇలా కలదు. పేపరు తయారై అచ్చుయంత్రములు వచ్చిన తర్వాత గ్రంథములు తయారై నాయి. అచ్చుయంత్రములు వచ్చి దాదాపు ఇప్పటికి 120 సంవత్సరములు అయిందనుకొంటాను. అంతకుముందు తాటి ఆకులమీద దబ్బనముతో గుచ్చి వ్రాసెడివారు. అలా వ్రాసిన తాటి ఆకులు వెయ్యి సంవత్సరములకంటే ఎక్కువ నిలువయుండేటివి కావు. వెయ్యి సంవత్సరములలోపలే అవి మార్పుచెంది ముట్టుకుంటే విరిగిపోవడము జరిగెడిది. వేయిసంవత్సరముల కంటే ఎక్కువ ఉండుట కష్టముగా ఉండేది. దానికంటే ముందు గుడ్డల

మీద వ్రాసి చూచారు. అవి కూడ కొన్ని తరములకు శిథిలమై పోయెడివి. ఎంత కష్టపడినా, ఏమివ్రాసినా అది నాలుగు లేక ఐదు సంవత్సరములకంటే ఎక్కువ కాలము ఉండెడిది కాదు. అలాంటప్పుడు నలభై లక్షల సంవత్సరము లప్పుడు వ్రాసిన జ్యోతిష్యము అప్పటికి మాత్రమే తెలిసినది, గురుశిష్య పరంపరగ ఒకరి తర్వాత ఒకరు తెలియుచూ వచ్చినా, తెలిసినవారు ఇతరులకు పూర్తి చెప్పకనే, కొన్ని ఉపద్రవముల వలన అకస్మాత్తుగా చనిపోవుట చేత ఆ విషయములు అంతటితో తెలియకుండ పోయినవి. అందువలన కృతయుగములోనేయున్న ద్వాదశ గ్రహముల విషయము తెలియకుండ మాసిపోయినది. చివరకు నవగ్రహములు మిగిలాయి. బ్రహ్మవిద్య కూడా మొదట సృష్ఠి ఆదిలోనే సూర్యుడు మనువుకు చెప్పినా, మనువు ద్వారా మిగతావారికి తెలిసినా మిగతా యుగములలో తెలియకుండ పోయినది. సూర్యుడు చెప్పినప్పుడు ఒకరికొకరు అందరూ తెలుసుకొన్నా రనీ, తర్వాత అనతికాలమునకే తెలియకుండా పోయినదనీ భగవద్గీతలోని జ్ఞానయోగమున 1, 2 శ్లోకములలో చెప్పియున్నారు. ఎంతో జాగ్రత్తగా తెలుసుకొన్న బ్రహ్మవిద్యయే తెలియకుండ పోయినప్పుడు 40 లక్షల సంవత్సరములప్పుడు చెప్పిన జ్యోతిష్యము ఇంత కాలముండుటకు అవకాశమేలేదు. అందువలన పేరుకు మాత్రము జ్యోతిష్యము ఉందిగానీ, పూర్వమున్న పన్నెండు గ్రహములు పోయి వాటి బదులు తొమ్మిది గ్రహముల జ్యోతిష్యము మిగిలియున్నది. ఇప్పుడు మనకు కావలసినది పన్నెండు గ్రహముల జ్యోతిష్యశాస్త్రము. కృతయుగములోనే చెప్పబడిన, పన్నెండు గ్రహముల విషయమును మేము తెలిసి మీకు తెలిపినా, దానికి సంబంధించిన పంచాంగములు లేవు. నేడు లభ్యమగు పంచాంగములు నవగ్రహములను గురించి వ్రాసినవేగానీ, పన్నెండు గ్రహములను గురించి వ్రాసినవి లేవు. అలాంటపుడు మిగత మూడు గ్రహముల విషయము ఎలా తెలియునని ప్రశ్నవచ్చును. గ్రహముల విషయములు వాటి గమనములు అన్నియు పంచాంగము ద్వారా తెలియకపోతే ఇంతవరకు మేము చెప్పిన జ్యోతిష్యమే తెలియకుండ పోవును. ఇటువంటి చిక్కు సమస్య వస్తుందను ముందు చూపుతో దేవుడు ఒక మంచి పనిచేశాడు. దానితో మూడు గ్రహముల విషయము, గమనము మనమే స్వయముగా తెలియ వచ్చును. అదెలాయనగా! దాని వివరమును ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. నవగ్రహముల పంచాంగములో ఛాయా గ్రహములని పేరుగాంచిన రాహువు, కేతువు రెండు గ్రహములున్నవి కదా! అవికాక మిగత ఏడు గ్రహములు ఎడమనుండి కుడిప్రక్కకు తిరుగుచుండగా, రాహు కేతువులు మాత్రము కుడినుండి ఎడమకు తిరుగుచున్నట్లు తెలుసుకొన్నాము. అంతేకాక రాహుగ్రహము కేతుగ్రహము రెండూ కాలచక్ర లగ్నములలో ఒకే వేగము కల్గియున్నాయి. రెండు గ్రహములుగానీ మూడు గ్రహములుగానీ ఒకే వేగము కల్గియున్నప్పుడు వాటిలో ఒక గ్రహము యొక్క స్థానము ఎక్కుడున్నది తెలిసిన దానినిబట్టి మిగత గ్రహముల స్థానములను సులభముగా తెలియవచ్చును. ఒకే వేగముగల గ్రహముల మధ్యదూరము ఎప్పటికీ ఒకే రకముగా ఉండును. అందువలన ఒక గ్రహము కదలికను బట్టి మిగత గ్రహము యొక్క కదలికలను తెలియవచ్చును. ఉదాహరణకు కాలచక్రములో రాహు కేతువులు ఒకే వేగమును కల్గియున్నాయి. కావున వాటి గమనమును కాలచక్రములో ఎట్లున్నది గమనించుము. దీని ఆధారముతో క్రొత్తగా తెలిసిన మూడు గ్రహములను పంచాంగము లేకున్నా సులభముగా ప్రక్కపేజీలో గ్రహించవచ్చును.
54వ చిత్రపటము

2008వ సంవత్సరము జూలై 2వ తేదీన ధనిష్ట 1వ పాదము రాహువు రాత్రి 11.00 గంటలకు

2008వ సంవత్సరము జూలై 2వ తేదీన ఆశ్లేష 3వ పాదము కేతువు రాత్రి 11.00 గంటలకు

అని పంచాంగములో ఉన్నది. దానిప్రకారము జూలై 2వ తేదీన రాత్రి 11.00 గంటల సమయములో రాహుగ్రహము కాలచక్రములో ధనిష్ట 1వ పాదములోనికి రాత్రి 11 గంటలకు ప్రవేశించాడు. అదే సమయములో ఒకే వేగమున్న కేతుగ్రహము దానికి పూర్తి ఎదురుగానున్న ఆశ్లేష 3వ పాదములోనికి కేతువు ప్రవేశించాడు. అట్లు ఇరువురూ ఒకేమారు పాదములు దాటుట వలన వారి మధ్య దూరము కూడా మారలేదని తెలిసినది.

జూలై 2వ తేదీన ఒకే సమయములో రాహువు కేతువులు తమ స్థానములు మారినట్లు తెలిసినది. తర్వాత 2 నెలల 18 దినములకు అనగా సెప్టెంబర్‌ 20వ తేదీన సా॥ 5-30 ని రాహువు శ్రవణం 4వ పాదములోనికి పోయాడు. అదే దినము అదే సమయమునకు కేతువు ఆశ్లేష 2వ పాదములోనికి పోయాడు. దానిని కాలచక్రములో గమనించండి.

సూర్యగ్రహము జూన్‌ 14వ తేదీన తెల్లవారుజామున 4-19 ని మృగశిర 3వ పాదమున మిథునములో ప్రవేశించాడు. సూర్యుడు మృగశిర 3వ పాదములో ప్రవేశించిన తె॥ 4-19 నిమిషములకే భూమి సూర్యునికి సమానముగా తిరుగుచూ మూల 1వ పాదమున ధనుర్‌లగ్నములో ప్రవేశించినది. దీనిని కూడా కాలచక్ర కుండలిలో గుర్తించాము చూడండి. మిత్ర, చిత్ర, భూమి యొక్క గమనములు కాలచక్రములో ఎలా ఉన్నది మనకు తెలియాలి. పంచాంగము లేకున్నా ఆ మూడు గ్రహముల గమనములు తెలియుట చాలా సులభమైన పనియే. భూమి ఎల్లప్పుడు సూర్యునికి ఎదురుగా ప్రయాణిస్తూ సమానదూరముగ ఉన్నది. కాల చక్రములో సూర్యునిది ఎంత వేగమో భూమిది కూడా అంతే వేగము కలదు. కావున సూర్యుడు ఏ సమయములో లగ్నము మారుచున్నాడో అదే సమయములో భూమికూడా లగ్నము మారుచున్నది. పైన సూర్యుడు మిథున లగ్నమున మృగశిర 3వ పాదములో ప్రవేశించిన 4-19 నిమిషములకే భూమి ధనుర్‌ లగ్నమున మూల నక్షత్రము 1వ పాదమున ప్రవేశించినది. ఈ పద్ధతి శాశ్వతముగా ఉండునది కాబట్టి సూర్యుని విషయమును పంచాంగము ద్వారా తెలుసుకోగల్గి దానికి వ్యతిరేకముగా భూమి ఉన్నట్లు గుర్తించుకోవచ్చును. మిత్ర, చిత్ర విషయములో కూడా అలాగే చేయవచ్చును. రాహువు, కేతువు సమాన దూరములో సమాన వేగముతో ప్రయాణించుచున్నారు. వారిలాగే (రాహువు, కేతువులాగే) మిత్ర, చిత్ర సమాన దూరముతో, సమాన వేగముతో ప్రయాణించుచున్నారు. కనుక ఆ రెండు గ్రహములను కూడా సులభముగా గుర్తించవచ్చును. రాహువు క్రింది పాదములో చిత్ర, కేతువు క్రింది పాదములో మిత్ర గ్రహములు ఉన్నవి. అందువలన రాహువును ఆధారము చేసుకొని చిత్రను, కేతువును ఆధారము చేసుకొని మిత్ర గ్రహమును గుర్తించుకోవచ్చును. ఈ మూడు గ్రహములకు ప్రత్యేకించి పంచాంగములు ఇంతవరకూ లేవు. భవిష్యత్తులో పంచాంగకర్తలు ఈ గ్రహములను కూడా తమ పంచాంగములలో వ్రాసుకోవచ్చును. పంచాంగములలో సూర్యుడు, రాహువు, కేతువు గుర్తింపబడియుండుట వలన వారిని చూచి భూమి, చిత్ర, మిత్ర గ్రహము లను గుర్తించుకోవచ్చునని తెలుపుచున్నాము.