జ్యోతిష్య శాస్త్రము/పంచాంగ అవసరము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

47. పంచాంగ అవసరము

పంచాంగము అను పేరునుబట్టి దానిలోని ఐదు అంగములేమిటో ముందే తెలుసుకొన్నాము. పేరునుబట్టి చెప్పుకొంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ అను వాటిని చెప్పునదని అనుకొన్నాము. అయినా పంచాంగములో దాని పేరుకు సంబంధము లేని చాలా విషయములు తెలియబడుచున్నవి. ముఖ్యముగా ద్వాదశ గ్రహములు ప్రతి దినము కాలచక్రములో ఎలా తిరుగుచున్నదీ, ఏ దినము ఏ గ్రహము ఏ నక్షత్రమును దాటుచున్నదీ, పన్నెండు లగ్నములలో ఏ దినము ఏ గ్రహము ఎక్కడున్నదీ మొత్తము గ్రహముల గమన సమాచారమంతయు పంచాంగములో ఉండును. గ్రహముల సమాచారమేకాక ప్రతి దినము ఏ వారమగుచున్నది, అలాగే ప్రతి దినము ఏ తిథియగుచున్నదీ, అమావాస్య ఎప్పుడు, పౌర్ణమి ఎప్పుడు అను విషయములను, నక్షత్రములను, నెలలనూ మొత్తము కాలమునకు సంబంధించిన సమాచారమంతాయుండును. నిత్యము గ్రహములు తమ ప్రయాణములో ఏ లగ్నమునందు ఎంత కాలముండునదీ, ఏ నక్షత్రపాదములో ఎంత కాలముండునదీ తెల్పుచూ, గ్రహములు ఏ లగ్నమును ఎప్పుడు దాటుచున్నదో, ఏ నక్షత్రమునందు ఎప్పుడు ప్రవేశించు చున్నదో వాటి కాలమును గంటలలోనూ మరియు గడియలలోనూ పంచాంగములో ఉండును. అలాగే ఏ తిథి ఎంత కాలముండునదీ, ఏ నక్షత్రము ఎంతకాలముండునదీ పంచాంగములో వ్రాసిపెట్టబడి యుండును. గ్రహములన్నిటికీ రాజు మంత్రిలాగయున్న సూర్య, చంద్ర గ్రహముల సమాచారములో వారికి గ్రహణములు ఎప్పుడు కల్గు చున్నదీ, ఎప్పుడు వదులుచున్నదీ వ్రాసిపెట్టబడియుండును. ఇట్లు ఎన్నో విషయములు, ద్వాదశ గ్రహముల సమాచారము ఉండుట వలన పంచాంగము అందరికీ అవసరమైనదే. పూర్వము వంద సంవత్సరముల క్రితము భారత దేశములో అన్యమతములు ఎక్కువగా లేవు. అందరూ ఎక్కువగా హిందువులే ఉండెడివారు. ఆ కాలములో చదువు వచ్చిన ప్రతి ఇంటిలోనూ పంచాంగము ఉండెడిది. తమ ఇంటిలో ఎవరికి పేరు పెట్టాలన్నా, ఎవరికి పెళ్ళి చేయాలన్నా, ఎవరు ఎక్కడకు ప్రయాణము చేయాలన్నా, ప్రతి దానికి తమవద్ద యుండే పంచాంగమును తీసుకొని ఆ ఊరిలో ఉండే పురోహితుని వద్దకు పోయి పంచాంగమును చూపించి దేనికేది మంచిరోజో, ఏది చెడు రోజో తెలుసుకొనెడివారు. అంతేకాక విత్తనము వేయుటకు, నాగలి కట్టుటకు, ముఖ్యమైన ప్రతి పనికీ మంచి ముహూర్తము ఏదో తెలుసుకొనెడి వారు. ఈ విధముగా హిందువు అయినవాని ప్రతి ఇంటా పంచాంగము ఉండెడిది.

కాలక్రమేపి పంచాంగములు బ్రాహ్మణులకే పరిమితమైపోయాయి. నేడు చదువుకొంటున్న పిల్లలను పంచాంగమును గురించి అడిగితే అదేమిటో మాకు తెలియదని చెప్పుచున్నారు. పంచాంగము అను పేరు తెలియనివారు చాలామంది ఉన్నారు. వారికి బయటనున్న సూర్య చంద్ర గ్రహములు మాత్రము తెలుసుగానీ శరీరమున తలలోనున్న ద్వాదశ గ్రహములు తెలియవు. ఈ విధముగా నేడు చాలామంది పెద్దలకు కూడా పంచాంగమును గురించి తెలియకుండా పోయినది. పండుగలను గురించి తెలియాలన్నా తేదీలను గురించి తెలియాలన్నా అందరికీ నేడు క్యాలెండర్లు మాత్రము తెలుసు. క్యాలెండర్లలోనే తిథి, నక్షత్రములుండుట వలన అందరికీ క్యాలెండర్లు తెలియునని చెప్పవచ్చును. ఎక్కడైనా ఒకరో ఇద్దరో పంచాంగములు చూచేవారున్నప్పటికీ, నేడు కంప్యూటర్లలో జాతకములు కూడా సులభముగా తెలియుచుండుట వలన చివరకు బ్రాహ్మణులకు కూడా పంచాంగములు అవసరము లేకుండాపోయింది. ఇతర మతముల వారు పంచాంగము హిందువులది అని అనుకోవడము వలన వారు ఎవరూ పంచాంగమును తాకను కూడా తాకరు. ఇట్లు అనేక విధములుగా పంచాంగము నేడు చాలామందికి తెలియకుండా పోయినది.

నేడు మేము చెప్పునది ఏమనగా! నేడు జ్యోతిష్యులు కూడా కంప్యూటర్‌ ముందు కూర్చొని భవిష్యత్తునూ, భవిష్యత్తుకు సంబంధించిన ముహూర్తములనూ చెప్పుచున్నారు. అలాకాకుండా ప్రతి జ్యోతిష్యుడూ పంచాంగమును దగ్గరుంచుకొని దానిప్రకారము భవిష్యత్తునిగానీ, ముహూర్తములనుగానీ చెప్పడము మంచిది. అలాకాకుండా కంప్యూటర్లలో చూచి చెప్పడము వలన శ్రమ తగ్గినా పైనగల గ్రహముల అనుగ్రహము మనమీద ఉండదని నేను అనుకొంటున్నాను. అందువలన జ్యోతిష్యమునకు ఎవరైనా పంచాంగమునే ఉపయోగించుకోమని తెల్పుచున్నాము. ఒక వ్యక్తి జ్యోతిష్యునిగా మారుటకు జ్యోతిష్యమునకు అధిపతియైన బుధగ్రహము సహకరించినప్పుడే మంచి జ్యోతిష్యునిగా పేరురాగలదు. గ్రహముల స్థితి గతులు ముద్రించియున్న గ్రంథమైన పంచాంగములో కనిపించని శక్తి నిక్షిప్తమైయుండి పంచాంగముమీద గల జ్యోతిష్యుని మనోభావమును బట్టి అతని బుద్ధికి సత్యమైన మాటలను పలుకునట్లు సూచనలిచ్చును. కంప్యూటర్‌ ఒక యంత్రము అయినందున గ్రహముల అనుగ్రహము దానినుండి లభించదు. అందువలన చెప్పినమాట సత్యము కాకుండా పోవుటకు అవకాశముగలదు. జ్యోతిష్యునివద్ద కంప్యూటర్‌ ఉన్నా కొన్ని గణితములను దానియందు సులభముగా తెలియగల్గినా కంప్యూటర్‌ ముందు పంచాంగము పెట్టుకొని, దానిని గౌరవిస్తూ జ్యోతిష్యము చెప్పుట మంచి కార్యమగును. ఏ మనిషి ఎప్పుడు పుట్టినా అతని జాతక లగ్నమును పంచాంగము ద్వారాగానీ, కంప్యూటర్‌ ద్వారాగానీ తీసుకొనియున్నా ప్రస్తుతము జరిగే వర్తమాన కాలములో గ్రహముల స్థితి గతులు ఎలా ఉన్నాయి, గ్రహముల గమనములో మనకు కావలసిన లగ్నములో ఏ గ్రహమున్నది. ఏ గ్రహము రాబోతుంది అని వర్తమాన కాల పరిస్థితులను తెలియుటకు ప్రతి ఒక్కరూ పంచాంగమునే చూడవలెను. ఇంతకుముందు రాజీవ్‌గాంధీగారి జన్మ కుండలిని వ్రాసుకొని చూచాము. ఆ కుండలిని మేము 1983వ సంవత్సరమే పత్రికలో చూచాము. అయినా ఆ దినము ఆ జాతకమును సంపూర్ణముగా చూడలేదు. అప్పుడు నేను జ్యోతిష్యము మీద పరిశోధన చేయుకాలము. కావున కొందరి జాతకములు సేకరించి కొన్ని విషయము లను మాత్రము వాటిలో చూడడము జరిగినది. అప్పుడు చూడని విషయమును 1985వ సంవత్సరము పరిశోధన నిమిత్తము చూచాను. ఆయువు విషయములో కొంతవరకు అంచనా వచ్చినా అప్పుడది నిర్ధారణ లేని విషయము మాత్రమే. అయితే ఆ అంచనా కొంతకాలమునకు నిజమైనది. అప్పుడు ఆ సంఘటనతో జ్యోతిష్యము శాస్త్రమనీ, మూఢ నమ్మకముకాదనీ అనుకొన్నాము. ఆ ఒక్క విషయముతోనే జ్యోతిష్యమును శాస్త్రమనలేదు. మా పరిశోధనలో ఇటువంటి కొన్ని ఇతర విషయములు ప్రత్యక్షముగా జరుగుట వలన పూర్తిగా జ్యోతిష్యమును శాస్త్రమని చెప్పడము జరిగినది. ఏదైనా తప్పు అయితే అది జ్యోతిష్యునిలో ఉంటుందిగానీ, జ్యోతిష్యములో ఉండదు.

1985వ సంవత్సరము రాజీవ్‌గాంధీ జాతకమును మేము చూచినప్పుడు అందులో ఆయుష్షు విషయములో కొంత అనుమానము వచ్చి ఒక అంచనాకు వచ్చి ఇలా జరుగవచ్చునని అనుకొన్నాము. అది ఒక ఊహ మాత్రమేగానీ నిర్ధారణకాదు. అయితే అప్పుడు అతనికి ఏ సంవత్సరము ప్రమాదము జరుగునని తెలియదు. ఏ ఆయుధముల చేత ప్రమాదము జరుగునని తెలియదు. అంతేకాక నా అంచనాకు వచ్చిన విషయము సత్యమో కాదోనని కూడా తెలియదు. ఆనాడు నావద్ద కొన్ని ప్రశ్నలకు జవాబులులేవు. అంచనాలు మాత్రమున్నాయి. అయితే అవి సత్యమాకాదా అని తెలియుటకు ఆరు సంవత్సరముల వ్యవధి పట్టినది. అయితే ఈనాడు కూడా జ్యోతిష్యములో అన్ని ప్రశ్నలకూ జవాబులు లేకున్నా కొన్ని ప్రశ్నలకు నా పరిశోధనలో తెలిసిన వాటికి నావద్ద నిజమైన జవాబులు ఉన్నాయి. జ్యోతిష్యము నాకు సంబంధించిన శాస్త్రముకాదు. అందువలన దానిని కొద్దిగా పరిశోధించి, నాకు మిక్కిలి ఆసక్తిగాయున్న బ్రహ్మవిద్యా శాస్త్రమును పూర్తిగా పరిశోధించి తెలుసుకోవడము జరిగినది. జ్యోతిష్యము లో నాకు తెలిసినంతవరకు ఒక సంఘటన విషయములో అనుమానము వస్తే అది ఎప్పుడు జరుగుతుందని తెలియుటకు ప్రస్తుత కాల పంచాంగము అవసరము. ఏదో ఒకటి జరుగవలసియుంటే అది ఎప్పుడు జరుగుతుందో ముందే చెప్పుటకంటే ఎప్పటి పంచాంగము అప్పుడు చూచి చెప్పడము మంచిది.

రాజీవ్‌గాంధీగారి జాఫతకములో ఆయుష్షు స్థానము మీద 1985లో వచ్చిన అనుమానము ఆరు సంవత్సరముల తర్వాత 1991లో తీరి పోయినది. ఆ సంవత్సర పంచాంగములో ఆయన చనిపోయిన రోజు జాతకలగ్నములో ఏ గ్రహము ఎక్కడున్నదని చూచాము. ఆ దినముగల జాతక కుండలిని తర్వాత పేజీలో చూడవచ్చును.

పంచాంగము ప్రకారము 1991 మే, 21 తేదీన ఉన్న కుండలిని చూస్తే జనన లగ్నమున రెండవ స్థానములోయుండి ఆయుస్థానమైన
Jyothishya shastramu.pdf

ఎనిమిదవ స్థానము మీద పెత్తనము చెలాయించు కుజగ్రహము గురువుతో కలిసి పదవ స్థానమున ఉన్నది. అక్కడున్న కుజగ్రహము గురువుతో కలిసి ఇద్దరూ శనిమీద వారి హస్తములనుంచి శని ఆధీనములోనున్న ఆయుష్షును కుజగ్రహము లాగుకోవడము జరిగినది. జాతకములో పుట్టినప్పుడే నిర్ణయించబడిన కర్మను పుట్టిన రోజు పంచాంగము ద్వారా తెలిసినా అది ఎప్పుడు జరుగుననుటకు అప్పుడు జవాబులేదు. అప్పటి పంచాంగము ద్వారా తెలియకున్నా ప్రస్తుత వర్తమాన కాలములోనున్న పంచాంగములో మాత్రము తెలియగలదు. ఆయుష్షు విషయములో అనుమానమున్నా అతని ఆయుష్షు ఎప్పుడు హరించివేయబడుతుందను విషయము ఆ సంఘటన జరుగుకాలము ఎప్పుడగునో అప్పటి పంచాంగములో ఆ సంఘటన వివరమునకు సంబంధించిన గ్రహచార ముండును. 1991వ సంవత్సర పంచాంగము మార్చి నెలలోనే లభించుట వలన ప్రమాదము జరిగి చనిపోకముందు రెండు నెలలముందు ఆ విషయము లగ్నకుండలిలో అర్థమగుచున్నది. ఆ సంవత్సరములో జరుగు ఘటన ఆ సంవత్సర పంచాంగములోనేయుండును. 1991 మే, 21 తేది సరిగా మంగళవారమే కావడము విశేషము. గ్రహములలో కుజున్ని అంగారకుడనీ, మంగళుడనీ అనుచున్నాము. దినములలో మంగళవారము కుజుని దినమని చెప్పుచున్నాము. కుజుడు తన దినమైన మంగళవారమే రాజీవ్‌గాంధీని చంపడము జరిగినది. మంగళవారమే చని పోవడము వలన ఆ దిన అధిపతి అయిన కుజ గ్రహము వలన ఆ సంఘటన జరిగినదని తెలియుచున్నది. మరియొక విషయమేమనగా తులాలగ్న జాతకుడైన రాజీవ్‌గాంధీగారికి శత్రు గ్రహములుగా ఐదు గ్రహములు కలవు. అవి వరుసగా 1) సూర్యుడు 2) చంద్రుడు 3) కుజుడు 4) గురువు 5) కేతు గ్రహములు. ఈ ఐదుమంది గుంపుకు గురువు నాయకుడుగా ఉన్నాడు. ఈ శత్రు గుంపులోని గురువు, కుజుడు ఇద్దరూ కర్కాటక రాశిలో ఉండి కుజుడు శరీరస్థానమైన మొదటి స్థానమును చూచి శరీరమును నాశనము చేశారు. ఆ సంఘటన రాత్రి 10-21 నిమిషములకు జరిగినది. ఇక్కడ శత్రుగుంపులోని గురు, కుజులే కాక మరొక శత్రు గ్రహము ఆ లగ్నములోనికి వచ్చియున్నది. అప్పుడు ఒకే వర్గమునకు చెందిన మూడు గ్రహములు కటక లగ్నములో ఉండుట వలన వారికి ఎదురుగాయున్న మకర లగ్నములోని శనిని తాకి శనినుండి జాతకుని ఆయుష్షును లాగుకొన్నారు. సూర్యోదయములో ధనుర్‌లగ్నము మీదగల సూర్యుడు రెండు గంటలకు ఒక లగ్నమును దాటుచూ వచ్చి రాత్రి 9-25 నిమిషములనుండి 11-37 నిమిషముల వరకు కటక లగ్నము (కర్కాటక లగ్నము) మీద ఉండుట వలన ప్రమాద సమయమునకు గురు, కుజులతో పాటు సూర్యుడు కూడా ఉన్నాడని తెలియుచున్నది. సూర్యుడు కర్కాటక లగ్నములో దాదాపు 2-12 నిమిషములున్నాడు. అయితే సూర్యుడు కటక లగ్నములోనికి వచ్చి గురు కుజులతో కలిసిన దాదాపు గంటలు 10-21 నిమిషములకు ప్రమాదము జరిగినది. సూర్యుడు గురువు కుజునికి సహకరించి శనివద్దయున్న ఆయుష్షును లాగుకొన్నారు. అది సూర్యుడు, గురు, కుజులతో కలిసిన దాదాపు గంటకు పైన శనితో పోరాడి శనిని ఓడిరచి శనివద్దయున్న ఆయువును లాగుకొని జాతకునికి మరణము నిచ్చారు.

ఈ జాతకుడు పుట్టిన సమయములోని జన్మకుండలియందు ఏ లగ్నము ఎన్నో స్థానమైనదీ, ఏ గ్రహములు శత్రుగ్రహములైనదీ తెలియు చున్నది. అతని జాతకము ప్రకారము జీవితముండుననీ, జీవితములో అన్ని విషయములు ఉండునని తెలియుచున్నది. అయితే ఏ సంఘటన ఎప్పుడు జరుగునను వివరము ఉండదు. 1991 మే 21వ నాటి పంచాంగములో గురువు, కుజుడు కర్కాటక లగ్నములో ఉండడము జరిగినది. అయితే 1944 ఆగష్టు 20వ తేదీ రాజీవ్‌ గాంధీ పుట్టిన దినమున భవిష్యత్తులో గురు కుజులు మరియు సూర్యుడు కర్కాటక లగ్నములో కలిసి మకరములోయున్న శనితో పోరాడుతారని తెలియదు కదా! అందువలన ప్రమాదముండవచ్చునని 1991 సం॥ పంచాంగము ప్రకారము జన్మ లగ్నములో తెలిసినా అది ఎప్పుడు జరుగును ఏయే గ్రహములు ఆ సమయములో పాల్గొందురు అను విషయము ఆ దినము తెలియదు. అది భవిష్యత్తు జరిగే కొద్ది వచ్చే పంచాంగములలో తెలియును. గ్రహములు కాలచక్రములో తిరుగుట వలన వారి ప్రయాణములో ఎవరు ఎవరితో ఎప్పుడు కలియుదురో ఆ సమాచారము ప్రతి సంవత్సరము పంచాంగములో ఉండును. ప్రతి సంవత్సర పంచాంగమునూ చూస్తుంటే ఏదో ఒక పంచాంగములో శత్రు గ్రహములు కలిసి ఏమి కుట్ర చేయుచున్నదీ, ఏ విషయము మీద వారు ఎక్కువ ప్రభావమును చూపునదీ తెలియును. అందువలన ప్రమాదములను ఒక సంవత్సరములో గుర్తించు కోవచ్చునుగానీ, అంతకంటే ముందు తెలుసుకొనుటకు వీలుపడదు.

నేను బ్రహ్మవిద్యకు సంబంధించినవాడిని, జ్యోతిష్యుడను కాను. అందువలన ప్రతి సంవత్సరము పంచాంగములను చూచే అలవాటు నాకు ఏమాత్రము లేదు. అందువలన 1991 సంవత్సర పంచాంగమును రాజీవ్‌గాంధీ చనిపోయిన తర్వాత చూచాను అందులోని లోపములను గ్రహించాము. ఒకవేళ ఆ సంవత్సరము ముందే తెలియవలసియున్న పంచాంగమును తీసుకొని ప్రతి నెల వెదుకుచువచ్చివుంటే లోపములు మే నెలలో ఉన్నట్లు కనిపించేవి. ఒక జాతకునికి అనేక విషయములలో అనేక కోణములనుండి చూడవలసియుంటుంది. ఇదంతా ఒక సంవత్సరము పాటుయున్న మంచి చెడు కాలమును వెదకడానికి సమయము ఓపిక యుండవలెను. అట్లు ఓపిక, సమయము ఉన్నవారు సంవత్సరము మొదలులోనే పంచాంగమును వెదకి తమతమ మంచి చెడులను గ్రహించుకోవచ్చును. ఒక ప్రమాదమును జాతకములో సూచించినా, ఆ ప్రమాదము ఏ సంవత్సరములో జరుగుననుటకు ప్రతి సంవత్సర పంచాంగమును చూడవలసియుండును. అందువలన జ్యోతిష్యుడు జాతకములోని సమస్యలను ప్రస్తుత వర్తమాన పంచాంగములలో వెదకవలసి వచ్చును. రాజీవ్‌గాంధీ గారికి ప్రమాదము పుట్టిన జాతకములోయుంటే, అది జరుగుటకు కావలసిన గ్రహబలము 1991వ సంవత్సర పంచాంగము లో ఉన్నట్లు పంచాంగమును వెదికియుంటే ముందే తెలిసేది. ఇప్పుడు జగన్‌ అను వ్యక్తి యొక్క జాతకములో రాజీవ్‌గాంధీకి జరిగిన ప్రమాదమునకు సరియగు ప్రమాదము ఉన్నట్లు సూచనలు కనిపించినా, అది ఎప్పుడు జరుగును అను సమాచారము జాతకములో ఉండదు. అందువలన ప్రతి సంవత్సరము పంచాంగము విడుదలయైన వెంటనే దానిలోని పన్నెండు నెలలు వెదకి చూడాలి. గ్రహచారములో ఎక్కువ శత్రు గ్రహములు ఒకచోట చేరినా, చేరిన శత్రు గ్రహములు ఆయు స్థానమును తాకినా, ఆయువుకు అధిపతియైన శని గ్రహమును బంధించినా అష్టమాధిపతియైనవాడు శత్రుగ్రహముల చేతిలో చిక్కుకొనినా అది ప్రమాద సమయమని గుర్తించుకోవచ్చును.

ఎంతో తెలివిని ఉపయోగించి ఒక వ్యక్తి జాతకములోనున్న ప్రమాదమును 32వ సంవత్సర పంచాంగములో గుర్తించావనుకొనుము. ఆ సంవత్సరము ఉగాది మొదటిలో వచ్చిన పంచాంగమును చూచి ఈ సంవత్సరము ఏడు నెలలు గడచిన తర్వాత ఎనిమిదవ నెలలో ప్రమాదము జరిగి జాతకుడు మరణించునని తెలిసినదనుకొనుము. అప్పుడు ఆ జాతకుడు గానీ, ఆ జాతకునికి ప్రమాదమును గురించి తెలిపిన జ్యోతిష్యుడుగానీ ఏ ప్రయత్నము చేసినా, ఏ శాంతులు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఎంతోమంది దేవతలను ఆరాధించి మ్రొక్కుబడులు చెల్లించినా, శాంతి హోమములు, మృత్యుంజయ యజ్ఞములు చేసినా, జ్యోతిష్యుడు తన విద్యనంతా ఉపయోగించి జాతకున్ని ప్రమాదమునుండి కాపాడవలెననుకొనినా, జాతకుడు తన ధనమును ఉపయోగించి శనీశ్వరు నికి బంగారు కిరీటము చేయించినా, విఘ్నేశ్వరునికి గుడికట్టించినా, ముక్కంటీశ్వరునికి ముడుపులు చెల్లించినా, కపిలేశ్వరునికి తైలాభిషేకము, నీలకంఠేశ్వరునికి రుద్రాభిషేకము చేయించినా రానున్న ముప్పు రాక మానదు. జరుగవలసిన ప్రమాదము జరుగకమానదు. ఎవ్వరుగానీ కర్మను అతిక్రమించి పోలేరు. ఏ క్రియలచేతగానీ జరుగవలసిన కర్మను తప్పించు కోలేరు. గ్రహచారములో ఎవరూ ఏమీ చేయలేరు. అది ఎట్లుంటే అట్లు జరిగితీరును. జరుగవలసిన ప్రమాదమును తప్పించుకొనుటకు ఒకే ఒక మార్గము కలదని ముందే చెప్పుకొన్నాము. అది ప్రపంచ కార్యము కాదు. పరమాత్మ జ్ఞానమని కూడా చెప్పుకొన్నాము. కర్మను జయించి ప్రమాదమును తప్పించు జ్ఞానమును తెలియవలెనంటే మొదట ఆ మనిషిలో నేను ఫలానా మతము వాడినను భావము పోవాలి. అతని దృష్ఠిలో దేవుడు తప్ప మతము అను భావములేనిది నిజమైన జ్ఞానమగును. అటువంటి స్వచ్చమైన జ్ఞానమును తెలిసినవాడే కర్మను జయించి ప్రమాదమును తప్పించుకోగలడు. సృష్ఠికంతటికీ అధిపతియైన దేవున్ని తెలిసినవాడు, మతాల భ్రమను వీడినవాడు, శరీరాంతర్గత జ్ఞానమును తెలిసినవాడు, ఎంతటి కర్మగలవాడైనా, వానికి ఎంతపెద్ద ప్రమాదము ఉండినా దానిని సులభముగా జయించుకో గలడు. అటువంటి జ్ఞానిగా మారిన వానిని చూచిన గ్రహములు సంతోషించి తమ దశలలో అతనికి సంబంధించిన ఎన్నో కర్మలను దహించివేయుచున్నారు. కర్మను మనిషికి అందించి అనుభవింపజేయు గ్రహములు జ్ఞాని అయినవానిని గౌరవభావముతో చూస్తూ అతని కర్మను హరించివేయుచున్నవి. జ్యోతిష్యములో దశల విభాగము ఇలాయున్నదని తెలియనివానిని జ్యోతిష్యము మీద నమ్మకము లేనివానిని ఎవరూ కాపాడలేరు.

జ్యోతిష్యము మీద నమ్మకమున్నవారు గ్రహచారము మనిషిది, దశా చారము దేవునిదని తెలిసినవాడు నిజమైన జ్యోతిష్యుడగును. నిజమైన జ్యోతిష్యుడు పంచాంగములో చెడు మంచి కర్మలను తెలియగలిగి, అవి జాతకములోని పుట్టిన సమయముతో వచ్చినవని తెలిసి, జనన సమయము లో వచ్చిన వాటిని వర్తమాన పంచాంగములో ఎప్పుడు జరుగునదీ తెలియగల్గును. జనన సమయములో కర్మప్రకారము కల్గిన ప్రమాదములు చెడు కార్యములన్నిటినీ తన జ్ఞానము చేతనే తొలగించుకొనుటకు ప్రయత్నించును. అదే విధానమును ఇతరులకు కూడా బోధించును. జ్యోతిష్యము ఒక జాతకముతోనే ముగియదు. జ్యోతిష్యము వర్తమాన కాల పంచాంగముల మీద ఆధారపడియుండును. అట్లే జ్ఞానము భక్తి భావముతోనే పూర్తికాదు. తెలిసిన జ్ఞానమును జ్ఞానాగ్నిగా మార్చు బ్రహ్మవిద్యాశాస్త్రము మీద ఆధారపడియున్నది.