జ్యోతిష్య శాస్త్రము/గ్రహములు ఎలా బలవంతులుగా, బలహీనులుగా ఉన్నారు?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

30. గ్రహములు ఎలా బలవంతులుగా, బలహీనులుగా ఉన్నారు?[మార్చు]

గ్రహములు అనగా గ్రహించునవని అర్థము. పేరులో సమాన అర్థమున్నా, గ్రహించడములో కొన్ని గ్రహములు ఎక్కువగా, కొన్ని గ్రహములు తక్కువగా గ్రహించుకొనుచుండుట వలన, వాటిని బలవంతులు, బలహీను లని చెప్పడము జరిగినది. ఇప్పుడు మనకు అర్థమగుటకు గ్రహములకు చేతులున్నట్లు చెప్పుకొందాము. వాస్తవముగా గ్రహములకు చేతులు లేవు. గ్రహములు కర్మలను ఎలా గ్రహించునో పూర్తిగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనకు అర్థమగు నిమిత్తము గ్రహములకు చేతులున్నట్లు చెప్పుచున్నాము గానీ నిజముగా వాటికి చేతులు లేవు. బాహు బలము (చేతుల బలము)ను బట్టి వీడు బలాఢ్యుడు, బలహీనుడు అని మనుషులను చెప్పుచుందురు. అందువలన గ్రహములను బలవంతులుగా చెప్పుటకు చేతులున్నట్లు చెప్పుకొనుచున్నాము. అంతేగానీ గ్రహములకు చేతులుండవు. గ్రహములన్నీ ఒకే ఆకారము కల్గియున్నవని చెప్పలేము. ద్వాదశ గ్రహములు ఉండగా వాటిలో ఇంతవరకు అందరూ తొమ్మిదిని మాత్రమే చెప్పుకొనుచూ నవగ్రహములని అన్నారు. ఖగోళములో లెక్కలేనన్ని గ్రహములు కోట్ల సంఖ్యలో గలవు. అయినా మన కర్మచక్రములో ఉన్నవి ద్వాదశ గ్రహములు మాత్రమే. పన్నెండు గ్రహములలో తొమ్మిది గ్రహములకు సహజముగా రెండు చేతులు గలవు. (గ్రహములకు గ్రహించుశక్తి సూక్ష్మముగాయుండును. కావున గ్రహములు ఎలా గ్రహించుకొనునో ఎవరికీ తెలియదు. మనకు అర్థమగుటకు మాత్రమే గ్రహములకు చేతులున్నాయని చెప్పడము జరిగినది.) పన్నెండు గ్రహములలో తొమ్మిదింటికి రెండు చేతులుండగా, కేవలము మూడు గ్రహములకు మాత్రము నాల్గుచేతులు కలవు. రెండు చేతులున్న గ్రహములనూ, నాల్గు చేతులున్న గ్రహములనూ క్రింద వరుసలో చూస్తాము.

Jyothishya shastramu.pdf

ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క పేరుకల్గియున్నట్లు తమ కార్యకలా పము లందుగానీ, తమకున్న బలమునందుగానీ అందరూ సమానముగా ఉన్నా రనుటకు వీలులేదు. పన్నెండు గ్రహములలో తొమ్మిది గ్రహములు రెండు చేతులుకల్గి పనిని చేయగా, మూడు గ్రహములు మాత్రము ప్రత్యేకించి నాలుగు చేతులుకల్గి పని చేయుచున్నవి. సూర్య, చంద్ర, బుధ, శుక్ర, భూమి, రాహువు, కేతువు, మిత్ర, చిత్ర అను పేర్లు గల నవగ్రహములు కర్మచక్రములో ఉంటూ, కర్మచక్రములోనున్న ప్రారబ్ధకర్మను రెండు చోట్లనుండి, రెండు చేతుల ద్వారా స్వీకరించుచుందురు. అట్లే మిగత కుజ, గురు, శనిగ్రహములు మూడు ఒక్కొక్కటి నాలుగు చేతులు కల్గియుండి కర్మచక్రములోని ప్రారబ్ధకర్మను నాలుగు చోట్లనుండి తీసుకొని జీవుని మీద (మనిషిమీద) వదలుచుందురు. సూర్యుడు తన రెండు చేతులద్వారా తానున్న ఒకటవ స్థానములోని కర్మనూ, తనకు ఎదురుగానున్న ఏడవ స్థానములోని కర్మనూ స్వీకరించును. చంద్రుడు తన రెండు చేతులలో ఒక చేతి ద్వారా తానున్న ఒకటవ స్థానములోని కర్మనూ, రెండవ చేతి ద్వారా ఏడవ స్థానములోని కర్మనూ తీసుకొనును. సులభముగా అర్థమగుటకు క్రిందగల వాక్యములను చూడుము.

Jyothishya shastramu.pdf
Jyothishya shastramu.pdf

ఈ విధముగా ద్వాదశ గ్రహములు కర్మచక్రములోని ప్రారబ్ధకర్మను స్వీకరించి మనిషిచేత అనుభవింపజేయుచున్నవి. ఎల్లకాలము మనిషి ఒకే విధమైన కర్మను అనుభవింపక కాలము గడచుకొద్దీ వేరువేరు కర్మలను అనుభవిస్తూ పోవుచుండును. అందుకొరకు గ్రహములు తనస్థానములను వదలి వేరుస్థానములలో ప్రవేశించి, అక్కడి క్రొత్త కర్మను కూడా స్వీకరించ వలసియున్నది. కావున ద్వాదశ గ్రహములు కర్మచక్రము మీద తమ కిరణములను వేరువేరు స్థానముల మీద ప్రసరింపజేయుటకు, కాల చక్రములో కొంత వేగముతో కదిలి తిరుగవలసివచ్చుచున్నది.