జ్యోతిష్య శాస్త్రము/గ్రహములవద్ద ఏమీ ఉండవా?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

41. గ్రహములవద్ద ఏమీ ఉండవా?[మార్చు]

కాలచక్రములోని గ్రహములవద్ద ఏమీ ఉండవు. కానీ ఒక్కొక్క గ్రహము ప్రపంచములో ఉన్న వస్తువులు అయిన వాహనములు, భవనములు, ఆభరణములు, లోహములు, ద్రవములు, కులములు, మతములు ఉన్న సమస్తము పన్నెండు భాగములుగా విభజింపబడి పన్నెండు సముదాయము లుగా ఏర్పడినవి. అలా ఏర్పడిన వాటిలో ఒక్కొక్క సముదాయము ఒక్కొక్క గ్రహము యొక్క ఆధీనములో చేరిపోయి, అవన్నియు ఆ గ్రహము యొక్క సొంత ఆస్థులుగాయున్నవి. అందువలన కాలచక్రములోని గ్రహముల వద్ద ఏమీ లేకున్నా, భూమిమీద గల సమస్తము మీద అధికారము కలవిగా యున్నవి. ఏ గ్రహము భూమిమీదగల ఏ వస్తువుల మీద మరియు ఏ పదార్థము మీద అధికారము కలదో కొంతవరకు తెలుసుకొందాము. మొదట సూర్య గ్రహము యొక్క ఆధీనములో ఏమున్నవో తెలుసుకొందాము.

సూర్యుడు

పిత, ఆత్మ, తనువు, రాజ్యము, ప్రభావము, ధైర్యము, అధికారము, నేత్రము, పిత్తము, శూరత్వము, శక్తి, విదేశ పర్యటన, జ్ఞాన తేజము, పరాక్రమము, ఉష్ణము, అగ్ని, ధర్మ ధ్యాస, కడుపు, కన్ను, పాలనాశక్తి, ప్రభుత్వ భూములు, కోర్టు వ్యవహారములు, బంజరు భూములు, గుండ్రని ఆకారముండు పొలములు, రారాజు యోచన, గ్రామ ఆధీన జాగాలు, ఎర్రచందనము, ముద్రాధికారము, తెల్ల జిల్లేడు, తూర్పు, ఆంగ్ల విద్య, ఆదివారము, చైత్రమాసము, రాజభవనములు, వేడిని పుట్టించు నీలి వెలుగులు, పై అంతస్థులు గల భవనములు ఈ విధముగా సూర్యుని ఆధీనములో ఉన్నవి. ఇట్లుండుట వలన సూర్యుడు కర్మచక్రములోని నాల్గవ రాశిమీద తన కిరణములను ప్రసరించినప్పుడు ఆ జాతకునికి పై అంతస్థు భవనములు కట్టించు ప్రేరణ చేయును. ఒకవేళ వ్యక్తి పేదవాడైవుంటే, భవనము కట్టించు స్థోమతలేనివాడైయుంటే, అతనికి పెద్ద భవనములో కిరాయికైనా ఉండుటకు ప్రేరణ చేయును. కిరాయికి కూడా ఉండలేని కర్మగలవానికి తాను పని చేయుచున్న యజమానికి గల పెద్ద అంతస్థుల భవనములో వాచ్‌మేన్‌గా నైనా లేక పని మనిషిగానైనా ఉండునట్లు చేసి ఆ ఇంటిలో నివాసము కల్గునట్లు చేయును. ఎందరో బీదవారు తమది కాని పెద్ద భవనములో వర్క్‌మ్యాన్‌గానో, వాచ్‌మ్యాన్‌గానో, వాటర్‌మ్యాన్‌గానో ఉంటూ యజమాని తన ఇంటిలో లేకున్నా తానుమాత్రము ఉంటున్నాడు. ఈ విధముగా సూర్యుడు అనుకూలించిన వారికి కలుగును. ఇలా అనుభవించవలెనను కర్మ నాల్గవ ఇంటిలోనున్నప్పుడు ఆ స్థానములోనికి సూర్యుడు వచ్చినప్పుడు అలా జరుగునని తెలియవలెను. నాల్గవ ఇంటిలో పాపమున్నప్పుడు సూర్యుడు అనుకూలుడై వచ్చినా అటువంటి సుఖములను సూర్యుడు ఇవ్వడు. ఒకవేళ సూర్యుడు శత్రుగ్రహమై వస్తే గృహమునకు సంబంధించిన సుఖములు అంతవరకున్నా అప్పుడు లేకుండా చేయుటకు ప్రయత్నించును. ఉన్న పెద్ద ఇల్లును కూడా అమ్మి చిన్న ఇల్లును కొందామనుకొనును. ఈ విధముగా మనిషియెడల సూర్యగ్రహము పనిచేయుచున్నది. జాతక లగ్నమునకు నాల్గవ స్థానములో రవి యున్నప్పుడు ఇలాంటి ప్రేరణ చేయును. జాతక లగ్నములో సూర్యుడు ఏ రాశిమీద ఉండునో జీవితాంతము ఆ రాశికి సంబంధించిన కార్యములనే ప్రేరేపిస్తూ మనిషికి కష్టసుఖములను కల్గించుచుండును. ఏ జాతకునికైనా జాతక లగ్నములో ఏయే రాశుల మీద ఏయే గ్రహములుండునో దాని ఫలితమును బట్టి జీవితములో ఉండును. కాలచక్రములో తిరుగుగ్రహములు తిరిగి ఆ రాశిమీదికి వచ్చినప్పుడు మొదటి లగ్నము ప్రకారమే ఫలితముల నిచ్చుచుందురు. ఇప్పుడు చంద్రునికి ప్రపంచములో ఏయే వస్తువుల మీద అధికారము కలదో తెలుసుకొందాము.

చంద్రుడు

మనుషులలో బుద్ధికి అధిపతి చంద్రుడు, అదేవిధముగా నీటికి అధిపతి చంద్రుడు. అలాగే స్త్రీలకు, మనస్సుకు, సౌందర్యమునకు, జల సౌఖ్యమునకు, బలమునకు, పంటలకు, వెండికి, యాత్రలకు, గుర్రపుస్వారికి, నిద్రకు, వేగమునకు, సుగంధములకు, మాతృ ప్రీతికి, కోనేర్లు, బావులకు, కీర్తికి, స్త్రీ సుఖమునకు, తెల్లని మెత్తని గుడ్డలకు, సముద్రములకు, పుష్ఠికి, పూలకు, నదులకు, యాత్రలకు, తెలుపురంగుకు, చెరువులకు, శ్వాసకు, కడుపుకు, ముత్యములకు, ముఖ అలంకరణకు, గర్భముకు, మృదుత్వము నకు, సుఖభోజనమునకు, పాలకు, మనోజపమునకు, విమానయానమునకు, విమానములకు, నావలకు, అంతస్తుల భవనములకు చంద్రుడు అధిపతిగా యున్నాడు. అంతేకాక చౌడుభూములకు, లాడ్జీలకు, వర్షమునకు, ముద్ర ణాధికారమునకు, రాజ చిహ్నమునకు, సన్మానమునకు, ధాన్యములో వడ్లకు, వెన్నెలకు, శయన గృహములకు, సంతోషమునకు, వీర్యబలమునకు, అశ్వ వాహనమునకు, జ్ఞాపకశక్తికి, దూరాలోచనకు, శిరో ఆరోగ్యమునకు, మెదడు బలమునకు, గ్రాహితశక్తికి, ఈతలో నైపుణ్యమునకు, నదీస్నానమునకు, నీటి ప్రదేశములకు, చౌడుకు, జలచరములకు, ఇంగ్లీషుభాషకు, విలాస వస్తువులకు, వాయువ్యదిశకు, సోమవారమునకు తెల్లని పూలకు, మల్లె తోటలకు, చంద్రుడు అధిపతిగాయున్నాడు.

ఇప్పటికి ముప్పై ఐదు సంవత్సరముల క్రితమే చంద్రగ్రహములో నీళ్ళు లేవు అని ఖగోళశాస్త్రజ్ఞులు చెప్పినప్పుడు, నీటికి చంద్రుడు అధిపతి అయినందున చంద్రునిలో నీళ్ళు అపారముగా ఉన్నాయి అని మేము చెప్పడము జరిగినది. అప్పుడు నీళ్లు లేవు అని చెప్పిన శాస్త్రవేత్తలు రెండు సంవత్సరముల క్రిందట చంద్రునిలో నీళ్లు ఉన్నట్లు వారి పరిశోధనలో తెలిసినట్లు చెప్పారు. నీటికి చంద్రుడు అధిపతియైనందువలన మేము ముందుగానే నీళ్ళు ఉన్నాయని చెప్పడము జరిగినది. ఒక మనిషి జాతకములో చంద్రుడు వ్యతిరేకముగా వున్నట్లయితే, అతనికి జీవితములో నీటివలన అనేక ఇబ్బందులుండునని చెప్పవచ్చును. ఏదో ఒక విధముగా నీటి బాధలు జీవితాంతము ఉండును. అటువంటి వాడు బావులు త్రవ్వితే నీళ్ళు రావు. బోర్లు వేయిస్తే నీళ్ళుపడినా బోరు పూడి పోవడమో లేక నీరు ఎండిపోవడమో జరుగును. అటువంటి వ్యక్తి ఎంతమంచిగా ఇల్లు కట్టు కొనినా వర్షపు నీరు కారడమో, ఇంటిలోనికి రావడమో జరుగును. బాత్‌రూమ్‌లో కొలాయిలు చెడిపోయి నీళ్ళకు ఆటంకము ఏర్పడును. సెప్టిక్‌ట్యాంక్‌ పైపులు పూడిపోయి నీళ్ళు పోవుటకు ఆటంకములు ఏర్పడుచుండును. ఏదో ఒక విధముగా నీళ్ళ సమస్యలు ఉండును. అదే చంద్రుడు జాతకునికి మిత్రుడైయుంటే అతని జీవితములో నీటివలన ఎటువంటి బాధాయుండదు. మిగతా రాశులలోనికి చంద్రుడు పోయినప్పుడు ఆ రాశులలోని కర్మనుబట్టి ప్రవర్తించుచూ మనిషికి సుఖ దుఃఖము కర్మప్రకారము కలుగజేయుచున్నాడు.

కుజుడు

పరాక్రమము, కోపము, సేనాధిపత్యము, సాహసము, విస్పోటనము, బాంబులు, తుపాకులు, మారణాయుధములు, కోతులు, కుక్కలు, కోరలు గల కూృారజంతువులు, కొమ్ములుగల ఎద్దులు, శస్త్రవిద్య, తర్కశాస్త్రము, శత్రువృద్ధి, ఉష్ణము, ఎర్రభూమి, రాళ్ళభూమి, కొండలు, బండలు, ఎరుపు రంగు, రక్తము, యవ్వనము, యువకులు, యుక్తవయస్సు స్త్రీల పరిచయము, మెట్టభూమి, పట్టుదల, ప్రభుభక్తి, లక్ష్యమును ఛేదించుట, జయము, దక్షిణ దిక్కు, అరణ్యములు, అరణ్య సంచారము, సంఢ్రచెట్టు లేక సంఢ్ర కట్టెలు, వేట జరుపుట, యువరాజు, కట్టెలు, ప్రవాహము, మరణశిక్ష, కోటలు, బురుజులు, సోదరబలము, చెల్లెండ్రు, వెంట్రుకలు, మీసము, కృరమైన ముఖవర్చస్సు, దీర్ఘబాహువులు, అంగరక్షకులు, పోలీస్‌లు, మిలటరీ, కందులు, సన్మానములు, సైన్య బలము (మనుషుల అండ) రాతి గుహలు, రచ్చబండలు, మంగమాణ్యములు, కుమ్మర మాణ్యములు, కుమ్మరాములు, వ్రణ వైద్యము, పిందెలు, కాయలు, మంగళవారము, నక్సలైట్లు మొదలగు నవన్నియు కుజగ్రహము యొక్క ఆధీనములో ఉండును.

ఒక వ్యక్తి జాతకములో కుజగ్రహము శత్రు స్థానములోయుంటే అతని యవ్వనములో సుఖము లేకుండ చేయును. నీచ స్త్రీల సాంగత్యమును కల్గించును. జాతకములో ఏడవ స్థానమును కుజుడు చూచినా, కుజుడు ఉన్నా అతనికి యుక్తవయస్సులో పెళ్ళి కాకుండ చేయును. ఎనిమిదవ స్థానమును కుజుడు తాకిన అతను ఆయుధముల చేత చంపబడును. ఆరవస్థానమును తాకినా లేక చేరినా మృగముల చేత గాయపడును. లేకపోతే ఆయుధములచేత దాడిజరిగి గాయపడడము జరుగును. శరీరములో పుండ్లు పుట్టును. టి.బి. రోగము, క్యాన్సర్‌ రోగము కుజుని వలననే కుజుడు శత్రువై ఆరవ స్థానమును చేరినప్పుడు కల్గును. ఒకవేళ జాతకునికి కుజగ్రహము మిత్రుడైయుంటే ఇప్పుడు చెప్పిన బాధలన్నీ యుండవు. అటువంటివి కలుగకుండా చూచుకొనును. చిన్నవయస్సులోనే పెళ్ళి చేయును. రోడ్డు ప్రమాదము జరిగినా కుజ గ్రహము అనుకూలముగా యుండినప్పుడు అతనికి ఏమాత్రము గాయము కూడా కాదు. అదే కుజుడు శత్రువుగాయుంటే గాయాలపాలు చేయును, రక్తపాతమును పుట్టించును. ఈ విధముగా కుజగ్రహము కర్మచక్రము మీద తన కిరణములను ప్రసరించుచూ ఒక్కొక్క స్థానమువద్దయున్నప్పుడు ఆ స్థానములోగల కర్మను అనుసరించి కుజుని నుండి ఫలితము దక్కును. కుజగ్రహము చురుకైనది, కోపముగలది. కావున స్థానములనుబట్టి కర్మ ఫలితములు తీక్షణముగా ఉండును.

బుధుడు

జ్యోతిష్యము, గణితశాస్త్రము, మంత్రములు, యంత్రములు, వ్యాపారము, తల్లివైపు బంధువులు, మామగారు, యుక్తి, శిల్పవిద్య, మంత్ర తంత్రవిద్యలు, వేద విచారణ, హాస్యము, వైద్యము, జ్ఞానము, లిపి, పైత్యము, దృష్ఠిబలము, ఆకుపచ్చరంగు, శిల్పకళ చిత్రలేఖనము, శివభక్తి, దాస దాసీ జన అభివృద్ధి, సంధిచేయుట, చాకచక్యముగా మాట్లాడుట, పొట్టితనము, విచిత్ర రచనలు, యుక్తియుక్త జ్ఞానము, చమత్కారము, సైంటిస్టు, ఉత్తరము దిక్కు, బుధవారము, స్మశానభూములు, గోరీలు, దిబ్బలు, దింపుడు కల్లములు, దయ్యాల ఇండ్లు, బలి ఇచ్చుస్థానములు, దయ్యాలు, పాడుపడిన స్థలములు, వ్యాపార స్థలములు, అంగళ్ళు, శూన్యములు, సూక్ష్మములు, భూతవైద్యము, ఉత్తరేణి చెట్టు, పెసలు ధాన్యము మొదలగునవి బుధ గ్రహముయొక్క ఆధీనములో గలవు.

జాతకునికి బుధగ్రహము శత్రుస్థానములోయుంటే బుధుడు ఆరవ స్థానమును తాకినా లేక అందులోయున్నా వానికి దయ్యముల బాధలు తప్పవని చెప్పవచ్చును. దయ్యములు శరీరములో రోగరూపముగాయుంటూ బాధించునని చెప్పవచ్చును. కర్మ బలీయముగావుంటే దయ్యముల చేతనే చంపబడునని చెప్పవచ్చును. బుధగ్రహము అనుకూలముగా (మిత్రునిగా) యుంటే దయ్యముల బాధవుండదు. బుధుడు మిత్రగ్రహమై ఆరవ స్థానములో తాకినా, ఉండినా అతను వైద్యము వలన జీవించుననీ, అందులో భూతవైద్యమును కూడా తెలిసియుండుననీ చెప్పవచ్చును. ఒకవేళ అతనికి బుధుడు శత్రుగ్రహమైతే భూతవైద్యమును చేసినా దానివలన దయ్యములు పోవు. అంతేకాక దయ్యములే అతనిని ఇబ్బంది పెట్టును. కొంతమందికి నాల్గవ స్థానమును బుధుడు చూచిన అతనికి మిత్రగ్రహమైతే అతను వ్యాపారవేత్తగా జీవించగలుగును. అతనికున్న కర్మప్రకారము, గ్రహముల మిత్ర శత్రు కారణమునుబట్టి వ్యాపారవృత్తిలో గొప్ప పేరు సంపాదించు కోవడము జరుగుచున్నది. బుధ గ్రహము యొక్క అనుకూలమునుబట్టి ఎవరికైనా జ్యోతిష్యశాస్త్రము పూర్తిగా తెలియగలదు. అటువంటి వాడు జ్యోతిష్యునిగా మారిపోవచ్చును.

గురువు

పన్నెండు గ్రహములలో గురువు ఒక పక్షమునకు నాయకుడుగా యున్నాడు. అటువంటి గురువు ఆధీనములో క్రింద చెప్పినవన్నీ గలవు. భూమిమీదున్న ప్రపంచ ధనమూ, వేదవిద్య, ప్రపంచ విద్య, పుత్రులు, జ్యోతిష్యము, గురువుగా ఉండుట, సత్కర్మ చేయుట, శబ్దశాస్త్రము, బ్రాహ్మణత్వము, యజ్ఞాది క్రతువులు, బంగారు, గృహము, అశ్వము, గజము, ఆచారము, సుజనత్వము, శాంతము, మంత్రిత్వము, ఐశ్వర్యము, బంధువృద్ధి, సత్యము, పురాణములు, పౌరాణికము, పుత్రపౌత్ర వృద్ధి, మంచి సంతతి. పూజనీయత, అధికార గౌరవములు, గ్రామాధికారము, పసుపు రంగు, మాట చమత్కారము, మేథావి, తీర్థయాత్ర దేవతా దర్శనములు, గ్రంథ పఠనము, అగ్రస్థానము, తియ్యని ఆహారము, సంస్కృతి, పాండిత్యములో ప్రతిభ, బంధుబలము, సంస్కృతభాష, గ్రంథరచన, ముక్తి సాధన, పౌరోహిత్యము, యుజుర్వేదము, సమయస్ఫూర్తి, మతసిద్ధాంతము, దేవాలయ నిర్మాణము, చవుటి భూములు, కళ్యాణ మందిరములు, భజన మందిరములు నిర్మించుట, బోధనావృత్తి మొదలగు విషయములన్నియు గురువు ఆధీనములోనున్నవని తెలియవలెను.

గురుగ్రహము కర్మరాశుల మీద తన కిరణములను ప్రసరింప జేసినప్పుడు అక్కడి కర్మప్రకారము తన ఆధీనములోని వాటిని గ్రహించి మనిషిచేత అనుభవింపజేయుచున్నది. ఉదాహరణకు గురుగ్రహము కర్మ చక్రములోని మూడవ రాశిమీదికి తన కిరణములను ప్రసరింపజేసినప్పుడు మూడవ స్థానములో ధనము బంగారు రాశులు కర్మప్రకారముండును. కనుక అక్కడికి తన కిరణములను పంపిన గురువు ఆ జాతకునికి మిత్రుడైతే ఆ రాశిలోని బంగారును తీసి జాతకునికి ఇచ్చును. బయట వ్యవహారము లలో మిళితమైన మనిషికి తనకు బంగారు ఏదో ఒక విధముగా లభ్యమైనట్లు తెలిసినా, వ్యాపారములో లాభమొచ్చి బంగారమును కొనినా, అదంతయు తమ తెలివివలన, తాము చేసే పనుల వలన లభ్యమైనదని అనుకొనినా, పైకి ఎలా కనిపించినా ఎవరికీ తెలియకుండా గురు గ్రహమువలన వచ్చినదని ఎవరూ అనుకోరు. గురుగ్రహము ప్రపంచములోని బంగారు కంతటికి అధిపతియనీ, గురుగ్రహము యొక్క కిరణముల నీడ పడనిదే ఎవనికీ బంగారు లభ్యముకాదని చాలామందికి తెలియదు. గురుగ్రహము అనుకూలముగా మిత్రునిగా ఉండుట వలన లేని బంగారును ఏదో ఒక విధముగా ఇచ్చును. అదే గురుగ్రహము జాతకునికి వ్యతిరేఖిగా, శత్రువుగా ఉంటే బయట ఏదో ఒక కారణముచేత ఉన్న బంగారును కూడా లేకుండా అమ్మించును. మూడవ స్థానములో రాహువు వెనుక గురువుంటే ఉన్న బంగారును దొంగలు ఎత్తుకొని పోవునట్లు చేయును. ఈ విధముగా తన ఆధీనములోనున్న దేనినైనా మనిషికి లేని దానిని ఇవ్వడముగానీ, ఉన్న దానిని గుంజుకోవడముగానీ గురుగ్రహము కర్మనుబట్టి చేయుచుండును. ఈ విధముగానే అన్ని విషయములలోను లెక్కించి చెప్పుకోవలెను.

శుక్ర గ్రహము

ద్వాదశ గ్రహములలో మానవునికి సుఖములను అందివ్వడములో దీనిని మించిన గ్రహములేదు. శుక్రుడు శని వర్గములోనివాడు. శనివర్గము లోని వారికి ఎంతో విలువైన సుఖములను అందించును. అటువంటి శుక్రగ్రహము ఆధీనములోనున్న విషయములను ఇప్పుడు చూద్దాము. శుక్రుడు కళత్రకారకుడు అందువలన భూమిమీద ఏ మనిషికైనా భార్య లభించాలంటే శుక్రుని కిరణములమీదే ఆధారపడియుండును. అంతేకాక ఆయన ఆధీనములోని విషయములు ఇలా కలవు. వివాహము, నాటక సాహిత్యము స్త్రీసౌఖ్యము, కామము, భోగము, వ్యభిచారము, వాహన సుఖము. ఆభరణములు, ఐశ్వర్యము, ముద్రణాధికారము, హాస్యము, మేహము, వేశ్యాసంభోగము, కన్యత్వలభ్యము. తెల్లని వస్త్రము, సుగంధములు, సౌందర్యము, జలక్రీడ, చిత్రలేఖనము, కవిత్వము, గ్రంథరచన, సంగీతము, సామవేదము, మద్యపానము, నృత్యము, యువతి, మనోభావములు, అష్ట భోగములు, అష్ట ఐశ్వర్యములు, శృంగార కావ్య రచనలు, దేహసుఖము, సౌందర్యము, సుకుమారము, వీణ లేక వేణు గానము, వాహన సౌఖ్యము, అన్యస్త్రీల ఆలింగనము, బహుస్త్రీ సంగమము, కళానైపుణ్యము, వీర్యబలము, శివభక్తి, శాంభవీవిద్య, మృధురతి, స్త్రీలకు మిక్కిలి ప్రియముగా ఉండుట, వివాహములలో విందులలో పాల్గొనుట. సభా సన్మానములు, వేశ్యలు సన్నిహితముగా ఉండుట. వ్యసనాలలో స్త్రీకి లొంగిపోవడము, తాంబూలము, మాంసభక్షణ, శక్తిపూజలు, పశువుల ఇండ్లు, బండ్లు విడుచు స్థలము, వ్యభిచార గృహములు, పశువుల ఇళ్ళు, వంట కట్టెలు పెట్టుచోటు, శయన గృహములు నవ యవ్వనుల మిత్రత్వము. కామకేళీ విలాసము. ఈ విధముగా శుక్ర గ్రహము యొక్క ఆధీనములోని విషయములు గలవు. శుక్రగ్రహము మిత్రుడై కాలచక్రములో తిరుగుతూ, కళత్ర స్థానమైన ఏడవ స్థానమును తన కిరణముల చేత తాకితే యుక్తవయస్సులో అందమైన భార్యను ఇచ్చును. అందమైన భార్యయేకాక అమె అనుకూలమైన భార్యjైు ఉండును. భార్య వలన మంచి పేరు వచ్చుటయేగాక ఆమెవలన మంచి సుఖము లభించును. ఒకవేళ శుక్రుడు వ్యతిరేఖి అయితే భార్య విషయములో ముందు చెప్పిన దానికి భిన్నముగా ఉండును. భార్యవలన మనిషికి కష్టమే ఉండును. ఇట్లు ఆయా స్థానములనుబట్టి గ్రహముల మిత్ర శత్రుత్వములనుబట్టి గ్రహముల ఆధీనములోని విషయములు మంచిగానో, చెడుగానో లభ్యమగుచుండును. గ్రహము జాతకరీత్యా అనుకూలమైతే దాని ఆధీనములోని విషయములన్నీ మంచిగానే లభించును. గ్రహము మంచిది కాకపోతే ఆ గ్రహమునుండి దాని ఆధీనములోనివి ఏమీ లభించవు. అంతేకాక ఉన్నవి కూడా పోవును. జాతక కుండలిలోని అన్ని గ్రహముల విషయములు అట్లే ఉండునని తెలియవలెను.

శని గ్రహము

శని గ్రహము ఆధీనములోని విషయములను ఇక్కడ చెప్పు కొందాము. ఆయుష్షు, నీచవిద్య, నీచ దేవతోపాసన, మరణము, దుఃఖము, అసత్యము, అధర్మము, బంధనము, కురూపము, శాంతము, దుష్ప్రవర్తన, పాపము, నరకము, నీచ జీవనము, రోగములు, దాసీజన సౌఖ్యము, విధవ సౌఖ్యము, నపుంసకత్వము, పౌరుషహీనము, పాపార్జన, అనాచారము, జీవహింస, మాలిన్యవస్త్రం, శిధిల వస్తువులు, పాపుడు, కూృారత్వము, బూడిద పూసుకొన్నవాడు, సన్య్నాసి లేక సన్న్యాసిని, నల్లటి వస్త్రములు పాపులతో స్నేహము, శూద్రుడు, వ్యవసాయదారుడు, జైలు, కృశించిన శరీరము గలవాడు, చినిగిన వస్త్రములుకలవాడు, బ్రాహ్మణద్వేషి, దున్నలకు అధిపతి, భయంకరుడు, జంతువులతో రమించువాడు, నీచదేవతోపాసన, పాతాళ గృహము, కంచర గాడిదలు, చెడు ప్రవర్తన, దారిద్య్రము, వంటలవాడు, మద్యపానము విక్రయించువాడు, మాంసవిక్రయుడు, మాంసవిక్రయశాల, భోజనవిక్రయము, ఇనుము అంగడి, శిథిల గృహము దాని నివాసము, కాఫీ హోటళ్ళు, దిబ్బలు, మల విసర్జన స్థలములు, స్మశానము, చీకటిల్లు, ఈశ్వరి మాన్యములు, సమాధులు, జమ్మిచెట్టు, నూగులు, వృద్ధత్వము, మారణాస్త్రములు, శక్తి ఆలయములు, నలుపురంగు, కామదహన స్థలము, పీర్ల గుండము, సారాయి, కల్లు, అంగళ్ళు, ఇనుము, ఇనుప వ్యాపారము.

ఇవన్నియు శని ఆధీనములో ఉన్న వస్తువుల విషయములు. ఉదాహరణకు ఇనుము శని ఆధీనములోని లోహము కదా! అందువలన శని గ్రహము అనుకూలమైన జాతకులు కొందరు ఇనుము వ్యాపారము చేయుచూ, శనిగ్రహము వలన మంచి లాభములనుపొంది పెద్ద ధనికులుగా మారినవారు కలరు. శనిగ్రహము వ్యతిరేఖముగా ఉంటే నష్టాలలో ముంచి నీచ వృత్తిని చేయించిన విధానము కూడా కలదు. శని అంటే అన్నీ చెడు చేయువాడనీ, కష్టపెట్టువాడనీ అందరూ అనుకోవడము జరుగుచున్నది. అందరూ అనుకొన్నట్లు శని కష్టపెట్టుటకు మాత్రమే ఉన్నాడని అనుకోవడము పొరపాటు. శని కాలచక్రములో తిరుగునప్పుడు ఆయన కిరణములు కర్మచక్రము మీద పడుచూ పోవుచుండును కదా! అప్పుడు ఆ స్థానములలో ఉండు పాపపుణ్యములనుబట్టి మనిషికి కష్టసుఖములు కల్గుచుండును. శని గ్రహము మిత్రుడైతే అన్నీ మంచే జరుగును. శత్రువైతే అన్నీ చెడే జరుగునని తెలియవలెను. అందువలన ఏ గ్రహముగానీ తాను స్వయముగా చెడును కలుగజేయుటకే ఉండుననుకోవడము పొరపాటు. ఇప్పుడు రాహు గ్రహమును గురించి తెలుసుకొందాము.

రాహువు

కూృరత్వము, పాపము, నీచవిద్య, నీచ జీవనము, చోర జీవనము, విషములు, సర్పములు, తేళ్ళు, మండ్రగబ్బలు, క్రిమికీటకాదులు, పాడు పడిన గృహములు, పుట్టలు, చెదలు, వంపులు, మినుములు ధాన్యము, గరికగడ్డి, మాంస విక్రయము, మాసిన వస్త్రములు ధరించుట, పొగరంగు, మోసము చేయుట, పాములు పట్టుట, చెప్పులు కుట్టుట, దొంగతనము చేయుట, మత్తుపదార్థములను అమ్ముట, మత్తు పదార్థములను సేవించుట, అపసవ్యముగా తిరుగుట. చండాలత్వము, రాక్షసత్వము, హత్యలు చేయడము మొదలగునవన్నియు రాహుగ్రహము యొక్క ఆధీనములో ఉండును. రాహు గ్రహము జాతకమునుబట్టి కొందరికి అనుకూలముగా, కొందరికి అనానుకూలముగా ఉండును. అనుకూలముయున్న వానికి జాతకములో కర్మచక్రములోని నాల్గవ స్థానములో రాహు గ్రహముండిన ఆ జాతకుణ్ణి పూర్తిగా దొంగతనములు, పెద్ద దోపిడీలు చేయడమే వృత్తిగా చేయును. దొంగ వృత్తికి పెద్ద రాహువు అయినందున మనిషిని దొంగ వృత్తిలో లక్షలు సంపాదించునట్లు చేయును, రాహువు అనుకూలమైనందున ఆ వృత్తిలో ఎక్కడా ఆటంకము ఏర్పడదు. అదే వృత్తిలో ధనికున్ని చేయడమే కాక, అతనికి గౌరవము కూడా సమాజములో ఉండునట్లు చేయును. అతను దోపిడీ చేయువాడని తెలిసి అతనికి భయపడి గౌరవింతురు. అదే రాహు గ్రహము వ్యతిరేఖమైయుంటే, దొంగతనము వృత్తిగా చేసినా, దానిలో ఎన్నో మార్లు దొరికి తన్నులు తినడము. పోలీస్‌ కేసులు వచ్చి ఉన్న ధనమును కూడా రికవరీ క్రింద వారు లాగుకొనడము జరుగుచుండును. ఆ దొంగ వృత్తిలో జీవితము దుర్భరమగును. జైలు జీవితము గడుపవలసి వచ్చును. ఈ విధముగా రాహువు యొక్క మిత్ర శత్రుత్వమునుబట్టి ఫలితముండును.

కేతువు

కేతు గ్రహము అందరి దృష్ఠిలో చిన్నదైనా మా దృష్ఠిలో పెద్దదని చెప్పక తప్పదు. పన్నెండు గ్రహములలో పదకొండు మనిషిని పూర్తిగా అజ్ఞానములో ముంచి ప్రపంచ మార్గములో నడుపగా, ఒక్క కేతు గ్రహము మాత్రము మనిషికి దైవభక్తిని కల్గించి దైవమార్గములో నడుచుటకు అవకాశమేర్పరచుచున్నది. మనిషికున్న శ్రద్ధనుబట్టి తన ద్వారా మనిషికి నిరాకార భక్తి లభించునట్లు చేయుచున్నది. అందువలన ద్వాదశ గ్రహము లలో కేతువును ముఖ్యమైన గ్రహముగా మేము చెప్పుచున్నాము. అటువంటి కేతు గ్రహము యొక్క ఆధీనములో ఏమున్నవో ఇప్పుడు గమనిద్దాము. ఆత్మజ్ఞానములాంటి జ్ఞానము, సన్న్యాసత్వము, నిరాకార భక్తి, దైవభక్తి, ఆశ్రమ నివాసము. సన్న్యాసులతో స్నేహము, వేదాంతము, దేవుని ధ్యాస, చిత్రవర్ణము, దర్భమొక్కలు, ఉలవల ధాన్యము, తపస్సు, మౌనము, అపసవ్య లిపిని వ్రాయడము లేక అటువంటి దానిని చదవడము, వైరాగ్యము, శూద్రగోష్టి, మహమ్మదీయులు, హేతువాదము మొదలగునవన్నియు కేతువు ఆధీనములో ఉండును.

కేతు గ్రహము యొక్క కిరణములు కర్మచక్రములోని ఐదవ స్థానము మీద పడితే ఐదవ స్థానములోనున్న ప్రపంచ జ్ఞానమునుండి దేవుని జ్ఞానము వైపు మళ్ళించుటకు ప్రయత్నించును. అప్పుడు మనిషికి ప్రపంచ జ్ఞానము మీద శ్రద్ధయుంటే దానిప్రకారము ప్రపంచ జ్ఞానమునే కలుగజేస్తూ, ప్రపంచ జ్ఞానములో హేతువాదమును కల్గించి సత్యము కొరకు వెదుకుటకు ప్రయత్నించునట్లు చేయును. అలాంటి సత్యాన్వేషణలో దేవతలను నమ్మకుండ దేవునివైపు చూపు పారునట్లు చేయును. అలాంటప్పుడు మనిషికి కొద్దికొద్దిగా దేవునివైపు చింత కలుగును. ఒకవేళ ముందే దేవుని జ్ఞానము మీద మనిషికి శ్రద్ధయుంటే ప్రపంచ జ్ఞానమునకు వ్యతిరేఖముగా నడుచు కొనునట్లు మనిషిని ప్రేరేపించును. ప్రపంచ మార్గమునకు వ్యతిరేఖముగా నడిపించినప్పుడు అతడు ఎవరి ప్రమేయమూ లేకుండా ప్రపంచమునకు వ్యతిరేఖ మార్గమైన దేవుని మార్గమువైపు పోవునట్లు చేయును. అయినా దేవునివైపురాక దేవునివైపు అనునట్లు చేయును. ఒకవేళ కేతుగ్రహము వ్యతిరేఖుడై శత్రుపక్షమునవుంటే, మనిషిని ప్రపంచ జ్ఞానములోనే ఉండునట్లు చేయును. అటువంటి వారికి ఏమాత్రము దైవజ్ఞానము మీద ఆసక్తి యుండదు. అతనికి బలవంతముగా దైవజ్ఞానమును చెప్పినా అతను పట్టించుకోడు. ఈ విధముగా కేతు గ్రహము యొక్క ఐదవ రాశిలోని ఫలితముండగా మిగతా రాశుల ఫలితములు వేరుగా ఉండును.

భూమి

ఇంతవరకు భూమిని గ్రహ కూటమిలోనికి ఎవరూ చేర్చకున్నా, మేము మాత్రము ఇక్కడినుండి చెప్పవలసివచ్చినది. కర్మను పాలించుటలో భూమికూడా పాత్ర వహించుచున్నది. కావున భూమిని గ్రహకూటమిలో చేర్చి చెప్పడమైనది. భూమి ఆధీనములో కొన్ని విషయములు మాత్రము కలవు. వాటిలో గనులు, ఖనిజములు ముఖ్యమైనవి. ఇళ్ళ స్థలములు, గుహలు, మంచు ప్రదేశములు, హిమపాతము, అరికాళ్ళు, అరి చేతులు నవ్వలురావడము, అరికాళ్ళు అరిచేతులు చీలడము, చర్మరోగములు, సువాసనలు, సుగంధ ద్రవ్యములు, మొలలు మొదలగునవి భూమి ఆధీనములోగలవు.

మిత్ర

మిత్రగ్రహము చీకటి గ్రహము. అందువలన మిత్ర ఆధీనములో నిద్ర, నిద్రలోని కదలికలు ఉండును. మిత్ర చీకటి గ్రహమైనందున చీకటిలోనున్న నిద్రకు అధిపతిగాయున్నది. అంతేకాక నిద్రలోవచ్చు తలనొప్పి, నిద్రలేమి, మానసిక వ్యాధులు మిత్ర గ్రహమువలననే కల్గును. ఆత్మజ్ఞానమునకు మిత్ర దారిచూపును. స్వప్నములు కూడా మిత్ర ఆధీనములో ఉన్నవేనని తెలియవలెను. నిద్రలోని కదలికలు, స్వప్నములోని కదలికలకు మిత్ర గ్రహమే కారణము.

చిత్ర

మనిషి అకాల మరణము పొందిన తర్వాత, జీవుడు బ్రతికియుండి పరకాయ ప్రవేశము చేయడమును (మరొక శరీరములో చేరుటను) ఆ శరీరములో ఎంతకాలముండవలెనను విషయమును చిత్రగ్రహము సూచించును. సూక్ష్మశరీరముతోయుండి ఎవరిలోనికీ చేరక ఉండు విషయమును సూక్ష్మముగాయున్న కాలములో జ్ఞానము పొందు అవకాశమును చిత్రగ్రహము సూచించును. ఒకవేళ చిత్రగ్రహము శత్రువైతే ఎవరిలోనూ చేరకయుండడము, మిగతా సూక్ష్మములచేత బాధింపబడడము జరుగుచుండును. చిత్రగ్రహము అకాలమృత్యువునూ, తాత్కాలిక మరణమును కూడా సూచించును. సూక్ష్మశరీరముతోనున్న సమయములో మనోబాధలు లేకుండా జ్ఞానచింతలోయుండునట్లు చిత్రగ్రహము చేయగలదు. చిత్రగ్రహము అదృశ్యముగాయుండి దినములో కొన్ని నిమిషములు మాత్రము కనిపించునను సూచనగా సూక్ష్మశరీరము అదృశ్యముగాయుండి కొంత సమయము మాత్రము ఇతరులలో చేరి బయటికి తెలియునట్లు చేయుచున్నది.

పన్నెండు గ్రహముల ఆధీనములోనున్న విషయ, వస్తు సముదాయమును తెలుసుకొన్నాము. గ్రహముల ఆధీనములో ఇంకా మనకు తెలియని అనేకములు గలవు. మనము కొంత వరకు చెప్పుకొన్నాము. అయితే అనుభవమునుబట్టి ఇంకా కొన్ని విషయములను తెలియవలసి యున్నది. జ్యోతిష్యశాస్త్రములో పరిశోధనలు జరుగడములేదు. అందువలన ఈ శాస్త్రము మిగత నాలుగు శాస్త్రములవలె అభివృద్ధి చెందలేదని చెప్పవచ్చును. అభివృద్ధి చెందనిది ఒక లోపమైతే, ఉన్నది కూడా కాల క్రమములో లేకుండా పోవడమూ, మార్పుచెంది పోవడమూ మరియొక లోపము. అందువలన జ్యోతిష్యము శాస్త్రమువలె కనిపించక కొందరి దృష్ఠిలో మూఢనమ్మకముగా కనిపించుచున్నది. మిగతా శాస్త్రములైన గణిత, ఖగోళ, రసాయన, భౌతికశాస్త్రములలో పరిశోధన జరిగినట్లు జ్యోతిష్య శాస్త్రములో పరిశోధన జరగలేదని అందరికీ తెలుసు. అయితే ఉన్న విషయములు కూడా కాలక్రమములో మార్పుచెంది వేరుగా మారిపోయినవని చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ విషయములు అవసరము లేకున్నా తెలుసుకోవడము మంచిది. అలా తెలుసుకోవడము వలన మిగతా విషయములైనా మారకుండ ఉండవచ్చును.