జ్యోతిష్య శాస్త్రము/గ్రహములకు గమనమున్నదా?

వికీసోర్స్ నుండి

32. గ్రహములకు గమనమున్నదా?[మార్చు]

కాలచక్రములోనున్న ద్వాదశ గ్రహములకు గమనమున్నదని చెప్ప వచ్చును. గ్రహములు ప్రయాణము చేయుచుండుట వలన, కాలచక్రము లోని అన్ని లగ్నములను దాటుచున్నవి. క్రిందగల కర్మచక్రములోనున్న అన్ని రాశుల మీద తమ కిరణములను ప్రసరింపజేయుచున్నవి. ఇక్కడ ముఖ్యముగా గమనించవలసిన విషయమేమనగా! కాలచక్రము కూడా కొంత వేగముతో తిరుగుచున్నది. అయినా అది బయటికి కనిపించునట్లు గానీ, ఇతరులు గుర్తించునట్లుగానీ తిరగడము లేదు. కాలచక్రము యొక్క వేగమును గమనించితే కాలచక్రము ఒకమారు (ఒకచుట్టు) తిరుగుటకు 43,20,000 సంవత్సరముల కాలము పట్టును. అందువలన కాలచక్రము తిరిగినట్లు కనిపించడములేదు. కాలచక్రములోని పన్నెండు గ్రహములు తమ గమనము బయటికి తెలియునట్లు ఒక్కొక్కటి ఒక్కొక్క వేగముతో కదులుచున్నవి. ద్వాదశ గ్రహముల వేగము ఎట్లున్నదో ఇప్పుడు గమనిద్దాము.

ఈ విధముగా కాలచక్రములోని పన్నెండు గ్రహములకు వేరువేరు గమనములున్నవని తెలియుచున్నది. వాటిలో సూర్య, బుధ, శుక్ర, భూమి నాలుగు ఒక వేగమునూ, రాహువు, కేతువు, మిత్ర, చిత్ర అను నాలుగు ఒక వేగమునూ కల్గియున్నవి. మిగతా నాల్గు గ్రహములైన చంద్రుడు, 2.½ దినము, కుజుడు 1.½ నెల, శని 2.½ సంవత్సరములు, గురువు 1 సంవత్సరము వేరువేరు వేగములు కల్గియున్నారు. కాలచక్రములో ఒక లగ్నమును దాటుటలో గ్రహముల వేగమును చెప్పుకొన్నాము.

కాలచక్రములోనున్న ఒక లగ్నమును దాటుటకు ఏ గ్రహమునకు ఎంతకాలము పట్టునో తెలుసుకొన్నాము. ఒక గ్రహము ఒక లగ్నమును దాటుటకు కొంతకాలము పట్టినప్పుడు కాలచక్రములోని పన్నెండు లగ్నములను దాటుటకు ఎంతకాలము పట్టునో సులభముగా తెలియు చున్నది. వాటి వివరమును ఇప్పుడు చూస్తాము.

సూర్యుడు కాలచక్రములో తనకున్న వేగముతో ఒక లగ్నమును దాటుటకు 1 నెలరోజులు పట్టగా, 12 లగ్నములను దాటుటకు 1 సం॥ పట్టును.

చంద్రుడు కాలచక్రములో తనకున్న వేగముతో ఒక లగ్నమును దాటుటకు 2.½ దినము పట్టగా, 12 లగ్నములను దాటుటకు 1 నెల పట్టును.

కుజుడు కాలచక్రములో తనకున్న వేగముతో ఒక లగ్నమును దాటుటకు 1.½ నెల పట్టగా, 12 లగ్నములను దాటుటకు 1.½ సం॥ పట్టును.

బుధుడు కాలచక్రములో తనకున్న వేగముతో ఒక లగ్నమును దాటుటకు 1 నెల పట్టగా, 12 లగ్నములను దాటుటకు 1 సం॥ పట్టును.

గురువు కాలచక్రములో తనకున్న వేగముతో ఒక లగ్నమును దాటుటకు 1 సం॥ పట్టగా, 12 లగ్నములను దాటుటకు 12 సం॥ పట్టును. శుక్రుడు కాలచక్రములో తనకున్న వేగముతో ఒక లగ్నమును దాటుటకు 1 నెల పట్టగా, 12 లగ్నములను దాటుటకు 1 సం॥ పట్టును.

శని కాలచక్రములో తనకున్న వేగముతో ఒక లగ్నమును దాటుటకు 2½ సం॥ పట్టగా, 12 లగ్నములను దాటుటకు 30 సం॥ పట్టును.

రాహువు కాలచక్రములో తనకున్న వేగముతో ఒక లగ్నమును దాటుటకు 1½ సం॥ పట్టగా, 12 లగ్నములను దాటుటకు 18 సం॥ పట్టును.

కేతువు కాలచక్రములో తనకున్న వేగముతో ఒక లగ్నమును దాటుటకు 1½ సం॥ పట్టగా, 12 లగ్నములను దాటుటకు 18 సం॥ పట్టును.

మిత్ర కాలచక్రములో తనకున్న వేగముతో ఒక లగ్నమును దాటుటకు 1½ సం॥ పట్టగా, 12 లగ్నములను దాటుటకు 18 సం॥ పట్టును.

చిత్ర కాలచక్రములో తనకున్న వేగముతో ఒక లగ్నమును దాటుటకు 1½ సం॥ పట్టగా, 12 లగ్నములను దాటుటకు 18 సం॥ పట్టును.

భూమి కాలచక్రములో తనకున్న వేగముతో ఒక లగ్నమును దాటుటకు 1 నెల పట్టగా, 12 లగ్నములను దాటుటకు 1 సం॥ పట్టును.

ఈ విధముగా రాహు, కేతు, మిత్ర, చిత్ర అను నాలుగు గ్రహములు ఒకే వేగముతో కాలచక్రమును 18 సం॥ములలో ఒకమారు దాటుచున్నవి. అదే విధముగా సూర్య, బుధ, శుక్ర, భూమి అను నాలుగు గ్రహములు ఒకే వేగముతో కాలచక్రమును 1 సం॥ములో దాటుచున్నవి. ఇకపోతే చంద్రుడు 30 దినములలో కాలచక్ర పన్నెండు లగ్నములను దాటివేయగా, శని గ్రహము 30 సం॥ములలో కాలచక్రములోనున్న పన్నెండు లగ్నములను దాటుచున్నది. కుజ గ్రహము మొత్తము కాలచక్ర లగ్నములను దాటుటకు 1½ సం॥ము పట్టుచున్నది. గురువు కాలచక్రములోనున్న పన్నెండు లగ్నములను దాటుటకు 12 సం॥ముల కాలము పట్టుచున్నది. నాలుగు గ్రహములు 18 సం॥ గమనమునూ, మరియొక నాలుగు గ్రహములు 1 సంవత్సర గమనమునూ, మిగత నాలుగు గ్రహములు వేరువేరు గమనమునూ కల్గియున్నా, పన్నెండు గ్రహములు పన్నెండు విధముల వేగము కల్గియున్నారని చెప్పవచ్చును. ఎందుకనగా! ఒక సంవత్సర గమనమును కల్గియున్న నాలుగు గ్రహములు ఖచ్చితముగా సం॥ములోనే కాలచక్రమును ఒకమారు దాటునని చెప్పలేము. నాలుగు గ్రహములు ఒకే వేగమును కల్గియున్నా చివరికవి ఒకటి లేక రెండు నిమిషములు మొదలుకొని ఐదు లేక ఆరు నిమిషముల తేడాతో పయనించుచున్నవి. ఒకప్పుడు ఆరు నిమిషములు ముందున్న గ్రహము మరియొకప్పుడు ఐదు లేక ఆరు నిమిషముల ఆలస్యము కూడా కావచ్చును. పన్నెండు గ్రహములు వాటికున్న వేగములో ఒకటినుండి ఆరు నిమిషములవరకు ముందు వెనుక ప్రయాణించుచున్నవి. ఒక్కొక్కప్పుడు అన్ని గ్రహములు ఎటువంటి ముందు వెనుక లేకుండా, తమకున్న వేగముతో ఖచ్చితముగా ప్రయాణము చేయగల్గు చున్నవి. అనేక (అన్ని) గ్రంథములలో కేవలము తొమ్మిది గ్రహములను గురించే వ్రాయడము జరిగినది. ఈ గ్రంథములో మాత్రము ప్రత్యేకించి పన్నెండు గ్రహములను గురించి వ్రాయడము జరిగినది. అట్లే వేగములో కూడా మూడు విధముల వేగమును చూపడము జరిగినది. ఈ గ్రంథములో కొన్ని విషయములను క్రొత్తగా ఇక్కడినుండే చెప్పడము వలన జాగ్రత్తగా పరిశీలించి అర్థము చేసుకోవాలని కోరుచున్నాము.

ఇంతవరకు జ్యోతిష్యశాస్త్రములో కాలచక్రము, కర్మచక్రము అను మాటలేలేవు, లగ్నము రాశులని పేరున్నా, వేటిని రాశులనాలో, వేటిని లగ్నములనాలో తెలియదు. దేవునికీ భగవంతునికీ తేడా తెలియక ఇద్దరూ ఒకటే కదా! అన్నట్లు, లగ్నమూ, రాశీ రెండూ ఒకటే కదా! అంటున్నారు. దేవుడు వేరు, భగవంతుడు వేరని మేము వ్రాసిన ఆధ్యాత్మిక గ్రంథములలో మాత్రమే తెలిసినట్లు, ఇప్పుడు ఈ గ్రంథములో మాత్రమే లగ్నము వేరు, రాశివేరని తెలియుచున్నది. ముందు ఇతరుల చేత వ్రాయబడిన విషయములకు, ఇప్పుడు మాచేత వ్రాయబడిన విషయములకు ఎంతో తేడాయుండుట వలన విచక్షణతో జాగ్రత్తగా చదువవలెనని తెలుపుచున్నాము.