జ్యోతిష్య శాస్త్రము/గుణములను ప్రేరేపించునది కర్మనా? లేక కాలమా?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

22. గుణములను ప్రేరేపించునది కర్మనా? లేక కాలమా?

గుణచక్రములోని గుణములను ప్రేరేపించునది కర్మయేనని చెప్పవచ్చును. కర్మను కదలించునది కాలమని చెప్పవచ్చును. నాలుగు చక్రముల అమరికలో బ్రహ్మచక్రము అన్నిటికీ గొప్పది, అన్నిటికీ అతీతమైనది. దానిని పేరుకు మాత్రము గుర్తుగా పెట్టుకొన్నాము. అందువలన ఏ మనిషికైనా క్రింది మూడు చక్రములే ముఖ్యములని చెప్పవచ్చును. ఆ మూడు చక్రములలో మధ్యలో గలది కర్మచక్రము. కర్మచక్రము పైన కాలచక్రమూ, క్రింద గుణచక్రమూ గలదు. మధ్యలోగల కర్మను అనుసరించియే క్రింద గుణచక్రమూ, పైన కాలచక్రము యొక్క నిర్మాణమున్నది. కావున ఈ మూడు చక్రములను కలిపి కాల, కర్మ, గుణ చక్రములని చెప్పినప్పటికీ, ఆధ్యాత్మిక విద్యలో మూడు చక్రములను కలిపి కర్మచట్రము అనియూ, కర్మ లిఖితము అనియూ, కర్మపత్రము అనియూ, కర్మ ఫలకము అనియూ చెప్పుచుందురు. మనిషికి (జీవునికి) అనుభవము నకు వచ్చేది కర్మయే. జీవుడు గుణముల మధ్యలోయున్నా, గుణములను ఉపయోగించుకొని కర్మను అనుభవించుచున్నాడు. పైన కాలచక్రములో ద్వాదశగ్రహములున్నా జీవునికి కర్మను అనుభవింపజేయుటకేయున్నవి. అందువలన ప్రతి మనిషికీ, ప్రతి జీవరాశికీ కర్మచక్రమే ముఖ్యమని తెలియు చున్నది. కాల, కర్మ, గుణచక్రములలో కర్మచక్రమునకు ప్రాధాన్యత ఇస్తూ కర్మపత్రమనీ, కర్మలిఖితమనీ, కర్మఫలకమనీ చెప్పడము జరిగినది.

కాల, కర్మ, గుణచక్రముల నిర్మాణము మనిషి తలలోయున్నా దాని నాడి వీపులో క్రిందివరకు వ్యాపించియున్నది. అందువలన మూల గ్రంథములలో దేవుడు కర్మను వీపున వ్రేలాడదీసి పంపాడనీ, మెడలో కట్టి పంపాడనీ ముఖాన వ్రాసిపంపాడని చెప్పడము జరిగినది. అందువలన బ్రహ్మ, కాల, కర్మ, గుణ అనబడు నాల్గుచక్రములను కలిపి కర్మ విధానమని, కర్మపత్రమని చెప్పడమైనది. ప్రతి మనిషియొక్క కర్మలిఖితములో (కర్మవ్రాతలో) తేడాలున్నాయి. ఏ విధముగా మనిషి యొక్క హస్తములోని వేలిగుర్తులు ప్రతి ఒక్కరికీ వేరువేరుగా ఉండునో, అలాగే ప్రతి మనిషియొక్క కర్మ లిఖితము వేరువేరుగా కొంతయినా తేడా కల్గియుండును. ప్రతి మనిషిలోనూ గుణ చక్రములోని గుణములుగానీ, కాలచక్రములోని గ్రహములుగానీ ఏమీ తేడా లేకుండాయున్నవి. గుణచక్రములోని మూడు భాగములలోగానీ, పన్నెండు గుణముల చీలికలైన 108 గుణముల భాగములలో గానీ తేడా లేకుండా అందరిలో సమానముగా ఉన్నవి. అలాగే కాలచక్రము లోని పన్నెండు గ్రహములలోగానీ ఏమాత్రము తేడా లేకుండా అందరిలో ఒకే విధముగా ఉన్నవి. నాల్గుచక్రముల సముదాయములో ఒక్క కర్మచక్రము తప్ప అన్నీ ఒకే విధముగా అందరిలో ఉండగా, కర్మచక్రము లోని కర్మ మాత్రము మనిషి మనిషికీ తేడా కల్గియున్నది. ప్రతి మనిషిలోని కర్మభేదము వాని అనుభవములో కనిపించుచున్నది. దేవునికి సంబంధించిన బ్రహ్మచక్రమును ప్రక్కనయుంచి మనిషికి సంబంధించిన గుణ,కర్మ,కాల చక్రములను చూచితే మూడు చక్రములలో మధ్యన ఉండునది కర్మచక్రము. మధ్యనగల కర్మచక్రమే మూడు చక్రములలో ముఖ్యమైనదని చెప్పుకొన్నాము. కాలము గుణము అందరికీ సమానమే అయినా, కర్మ మాత్రము ఏ ఒక్కరిలో సమానముగా లేదు. ప్రతి మనిషిలోను వేరు వేరుగాయున్న కర్మ మనిషి యొక్క గుణములను ప్రేరేపించుచున్నది.


Jyothishya shastramu.pdf
34వ పటము. కర్మపత్రము
పైన కాలచక్రములోగల గ్రహముల కిరణములు కర్మచక్రములోని కర్మమీద పడగా, కర్మయొక్క నీడ క్రింద గుణముల మీదపడుచున్నది. పడిన కర్మనీడనుబట్టి అప్పటికి ఏ గుణము అవసరమో ఆ గుణము ప్రేరేపింపబడుచున్నది. ఆ సమయమునకు ప్రేరేపింపబడిన గుణము చేత కార్యము చేయబడును. కర్మ కారణముచేత గుణమువలన జరుగు పని కొంత కాలము జరుగుచున్నది. ఎంత కాలము జరిగినదనుటకు కర్మను బట్టి కాలముండును. కర్మ కొద్దిగాయుంటే తక్కువ కాలములో అనుభవ ముండును. కర్మ చాలాయుంటే ఎక్కువకాలము అనుభవముండును. ఈ విధముగా కర్మనుబట్టి ఇటు గుణములూ, అటు కాలముండును. కావున కర్మనుబట్టి కాలమూ, కర్మనుబట్టి గుణములుండునని చెప్పవచ్చును.