జ్యోతిష్య శాస్త్రము/కర్మచక్రములో కేంద్రములు

వికీసోర్స్ నుండి

26. కర్మచక్రములో కేంద్రములు[మార్చు]

కర్మచక్రములోని 12 భాగములను అంగీ అర్థాంగీ అని రెండు భాగములుగా విభజించుకొన్నాము. అంగీ అను మొదటి భాగములో 1వ స్థానమూ, అర్థాంగి అను రెండవ భాగములో 7వ స్థానము ప్రారంభమైనవి అగుటయేకాక, 1వ స్థానములో తన శరీరమునకు సంబంధించిన కర్మయూ, 7వ స్థానమున తన భార్యకు సంబంధించిన కర్మయూ నమోదు చేయబడిన దనీ మరియు నమోదు చేయబడుచున్నదనీ చెప్పాము. ఇప్పుడు అంగీ అర్ధాంగి అను రెండు భాగములలో ముఖ్యకేంద్రములుగా గుర్తింపబడిన స్థానములు రెండు గలవు. మొదటి భాగమున ఆరు స్థానములలో ముఖ్యమైనదిగా ఒక స్థానమూ, రెండవ భాగమున ఆరు స్థానములలో ముఖ్యమైనదిగా మరియొక స్థానమును గుర్తించడమైనది. ఈ రెండు ముఖ్య స్థానములు అంగీ, అర్ధాంగీ అను రెండు భాగములలో ఆయా భాగములకు కేంద్రములుగా గలవు. కేంద్రము అనగా ఆధారస్థానమనీ, ముఖ్యముగా గుర్తింపు పొందిన స్థానమనీ చెప్పవచ్చును. కర్మచక్రము యొక్క పన్నెండు స్థానములలోనే మనిషి (జీవుని) జీవితమంతా ఇమిడియున్నది. మనిషి జీవితమునకు సంబంధించి కర్మచక్రములో కేంద్రములుగాయున్న స్థానము లేవియని గమనించిన ఇలా తెలియుచున్నది. కర్మపత్రములో శరీరమూ, పుట్టుక ప్రారంభమునకు సంబంధించి ఒకటవ స్థానముండగా, అక్కడినుండి మొత్తము ఆరు స్థానములను అంగీ భాగము అనియూ, తర్వాత ఆరు స్థానములను అర్థాంగి భాగమనియూ చెప్పుకొన్నాము కదా! ఇప్పుడు అంగీ భాగములోని ఆరు స్థానములలో ఒకటవ స్థానమును వదలి మిగత ఐదు స్థానములను తీసుకొని వాటిలో మధ్యలో గల దానిని గమనించితే వరుసలో నాల్గవ స్థానము మద్యదగును. ఒకటవ స్థానము తర్వాత రెండు, మూడు స్థానములకూ, ఐదు, ఆరు స్థానములకూ మధ్యలో నాల్గవ స్థానము కలదు. ఐదు స్థానములలో మధ్యనగల నాల్గవ స్థానమును అంగీ భాగమునకు ముఖ్యమైనదిగా మరియు ఆ భాగమునకు కేంద్రముగా లెక్కించి చెప్పుచున్నాము. అంగీ భాగములో కేంద్రముగాయున్న నాల్గవస్థానమును క్రిందగల 37వ చిత్రములో చూడవచ్చును.

37వ పటము. నాల్గవ స్థానము కేంద్రము


అంగీ, అర్ధాంగీ అను రెండు భాగములలో మొదటి అంగీ భాగములో నాల్గవ స్థానము కేంద్రముగాయున్నట్లు తెలిసినది. మొదటి భాగములో నాల్గవ స్థానము కేంద్రమైనట్లే, రెండవ భాగమైన అర్ధాంగి భాగములో మొదటిదైన 7వ స్థానమును వదలి చూచితే తర్వాతగల 8,9,10,11,12 స్థానములలో మధ్యనగల పదవస్థానము ఆ భాగమున కంతటికీ కేంద్రముగాయున్నది. అంగీ భాగములో 4వ స్థానమూ, అర్ధాంగి భాగములో 10వ స్థానమూ కేంద్రములుగా ఉన్నట్లు తెలియుచున్నది. కేంద్రము అనగా ముఖ్యమైన ఆధార స్థానముగా చెప్పవచ్చును. మానవ జీవితములో ముఖ్యముగా అందరూ గమనించేవి రెండు గలవు. అందులో ఒకటి మనిషికున్న ఆస్తి, రెండవది మనిషికున్న పేరు ప్రతిష్ఠలు. మనిషికున్న ఆస్తినిబట్టి మనిషికి గౌరవముగానీ, అగౌరవముగానీ ఉండును. అలాగే మనిషికున్న పేరుప్రతిష్టలను బట్టి కూడా గౌరవ అగౌరవములుండును. అందువలన ఇటు ఆస్తి, అటు కీర్తి మనిషి జీవితములో ముఖ్యమైనవనీ, అవియే మనిషి జీవితములో కర్మ కేంద్రములని చెప్పవచ్చును. మనిషికి గల ఆస్తి యొక్క కర్మనుబట్టి, అలాగే కీర్తినిబట్టి మిగతా కర్మలన్నియు మిగతా ఎనిమిది స్థానములలో చేర్చబడియుండును. అందువలన మిగతా ఎనిమిది స్థానముల కర్మలకు 4, 10 స్థానములే కేంద్రములుగాయున్నవని చెప్ప వచ్చును. క్రిందగల 38వ చిత్రపటములో అర్ధాంగి భాగములో 10వ స్థానమును కేంద్రముగా చూడవచ్చును.

పై రెండు చిత్రపటములలో 4,10 స్థానములు కేంద్రములుగా కనిపించుచున్నవి. ఇదంతయు మన తలలోని కర్మచక్రములోనున్న విధానమని జ్ఞప్తికుంచుకోవలెను. ఇక్కడ జ్యోతిష్యులైన కొందరికి ఒక ప్రశ్న రావచ్చును. అది ఏమనగా! ‘‘మేము చదివిన జ్యోతిష్యశాస్త్రములో కేంద్రములు నాలుగు కలవనీ, అవియే 1,4,7,10 స్థానములనీ విన్నాము. మీరేమో కేంద్రములని పేరుపెట్టి 4,10 స్థానములను మాత్రము చెప్పు చున్నారు. ఒకటవ స్థానమును, ఏడవ స్థానమును మీరు వదలివేశారు. మిగతా గ్రంథములలో కేంద్రములు నాలుగు అని ఎందుకు చెప్పారు? మీరు రెండు మాత్రమే కలవని ఎందుకు చెప్పుచున్నారు?’’ అని అడుగ వచ్చును. దానికి మా జవాబు ఏమనగా! ఎవరు ఏ విధముగానైనా చెప్పవచ్చును. అయితే చెప్పబడిన విషయము సూత్రబద్ధముగా, శాస్త్రబద్ధముగా ఉండవలయును. మేము చెప్పినదానికి శాస్త్రము ఆధారముగాయున్నది. అలాగే జ్యోతిష్యశాస్త్రములో ఒక సూత్రమును చెప్పుచూ రెండు కేంద్రములను చెప్పాము. నాలుగు కేంద్రములు ఎట్లున్నవో? ఎలా ఉన్నవో? నాకు తెలియవు. నాలుగు కేంద్రములు అశాస్త్రీయమగును.

కొందరు వ్రాసిన జ్యోతిష్య గ్రంథములలో కోణములు మూడు యనీ, కేంద్రములు కూడా మూడుయనీ వ్రాసియుండుట మేము కూడా చూచాము. వారు ఒక సంస్కృత శ్లోకమును ఆధారముగా చెప్పుచూ ఫలానా శ్లోకములో ఇలాగ ఉన్నది. అందువలన కోణములు మూడు, కేంద్రములు మూడుయని చెప్పారు. అయితే వారు చూపిన శ్లోకము శాస్త్రబద్ధమైనదా కాదాయని వారు చూడలేదు. ఎవరో చెప్పిన దానిని గ్రుడ్డిగానమ్మి చెప్పడము జరిగినది. అలా నమ్మి చెప్పడమును మూఢనమ్మకము అని అనవచ్చును. ఇక్కడ మన బుద్ధిని ఉపయోగించి చూచినా మూడు స్థానములున్న దానిని కోణము అని అనవచ్చును. ఎప్పటికైనా మూడు స్థానములు కోణముగానే ఏర్పడును. కేంద్రము ఒక భాగములో ఎప్పటికైనా ఒకే స్థానములో ఉండును. మూడుగాయుంటే అది ఎప్పటి కైనా ఒకదానికొకటి కోణమే అగునుగానీ, ఎప్పటికీ కేంద్రము కాదు. ఉదాహరణకు కర్మచక్రములో కోణములు ఎలాగున్నవో 39వ చిత్రపటములో చూస్తాము.

39వ చిత్రపటము

మూడు స్థానములు ఎప్పటికైనా కోణాకారమగునని స్పష్టముగా తెలియుచున్నది. నాలుగు స్థానములు చతురస్రాకారమగును, ఒక్క స్థానమును కేంద్రము అనవచ్చును. కర్మచక్రములోని అంగీ, అర్ధాంగి అను రెండు భాగములలో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కేంద్రముగాయుండుట వలన, రెండు భాగములలో 4వ స్థానము ఒక ప్రక్క, 10వ స్థానము ఒక ప్రక్క కేంద్రములుగా ఉన్నవి. ఈ విధముగా కర్మచక్రము పన్నెండు భాగములు రెండు భాగములుగా విభజింపబడియుండగా, రెండు భాగములకు రెండు కేంద్రములువుండును. కొందరు కేంద్రములు మూడు అని కొందరు నాలుగుయని చెప్పడము శాస్త్రమునకు విరుద్ధమగును.