జ్యోతిష్య శాస్త్రము/కర్మచక్రములోని కోణములు

వికీసోర్స్ నుండి

27. కర్మచక్రములోని కోణములు[మార్చు]

కర్మచక్రములో శాస్త్రబద్ధముగా కేంద్రములు రెండుగలవని తెలుసు కొన్నాము. అంగీ, అర్ధాంగి అను భాగములలో మూడు స్థానములను ముఖ్యమైనవని చెప్పుట చేత, ఆ మూడు స్థానములు ఒకదానికొకటి సమ దూరములో ఉండుట వలన, ఆ మూడు స్థానములు త్రికోణాకృతిగా ఉండుట వలన వాటిని కోణస్థానములన్నారు. కర్మచక్రములో కేంద్రములు రెండు భాగములలో రెండు ఉన్నట్లు, మిత్ర స్థానముల కోణములు, శత్రు స్థానకోణములని రెండు కోణములు కలవు. వాటిని పుణ్యస్థాన కోణములనీ, పాపస్థాన కోణములనీ కూడా చెప్పవచ్చును. మిత్రస్థాన కోణములు మూడు ఒకదానికొకటి మూడు స్థానములు దూరముతో సమముగా ఉండగా, అలాగే శత్రుస్థాన కోణములు కూడా మూడు ఒకదానికొకటి మూడు స్థానములు సమదూరముతోనున్నవి. దీనినిబట్టి కర్మచక్రములో (కర్మపత్రములో) రెండు కేంద్రములూ, రెండు త్రికోణములూ కలవని తెలియుచున్నది. మిత్ర, శత్రు రెండు కోణములను క్రింద 40వ చిత్రపటములో చూచెదము.

(40వ చిత్రపటము)

పైన కనబరచిన పుణ్య, పాప స్థానముల కోణములను గమనించితే 1×7 పూర్తి స్థాయి శత్రువు అను సూత్రమును అనుసరించి పుణ్యకోణము లకు పూర్తి ఏడవ స్థానములే పాప కోణములుగాయున్నవి. ఒకటికి ఏడు (1×7), ఐదుకు పదకొండు (5×11), తొమ్మిదికి మూడు (9×3) పూర్తి వ్యతిరేఖ కోణములుగా ఉన్నవి. వీటినిబట్టి కర్మపత్రములో ఆయా స్థానముల యందు మనిషియొక్క పాపపుణ్యములు చేరుచున్నవి. దీనినిబట్టి ఏ విధముగా చూచినా కోణములు 1,5,9 ఒక రకము అనియూ, 3,7,11 మరొకరకము అనియూ చెప్పవచ్చును. అట్లే కేంద్రము 4వ స్థానము ఒకటికాగా, రెండవది 10 స్థానముగా ఉన్నది. కర్మపత్రములోనున్న పన్నెండు స్థానములయందు మూడు స్థానములలో పుణ్యము లిఖించబడగా, మూడు స్థానములలో పాపము లిఖించబడినది. మిగత ఆరుస్థానములలో పాపము మరియు పుణ్యము రెండూ లిఖించబడ్డాయి. మూడు స్థానములు పుణ్యము, మూడు స్థానములు పాపము, ఆరు స్థానములు పాపపుణ్యములు మొత్తము పన్నెండు స్థానములలో ప్రారబ్ధకర్మ వ్రాయబడియుండును. వెనుకటి జన్మలలో సంపాదించుకొన్న ఆగామికర్మ ప్రస్తుత జన్మలో ప్రారబ్ధముగా మారి, ఆ ప్రారబ్ధము ప్రస్తుత జన్మలో అనుభవమునకు వచ్చుచున్నది. 69 సంవత్సరముల 5 నెలల 10 దినములు సంపాదించబడిన ఆగామికర్మ ఒకమారు సంచితముగా మారిపోవును. ఆ సంచిత కర్మనుండి ప్రారబ్ధ కర్మ మరణములో ఏర్పడి జరుగబోవు జన్మకు కారణమగుచున్నది.

మరణము పొందిన మరుక్షణమే కర్మపత్రములో రహస్యముగా యున్న సంచితకర్మనుండి ప్రారబ్ధకర్మ తయారై కర్మచక్రములో 1,5,9 స్థానములయందు పుణ్యము చేరిపోగా, పాపము 3,7,11 స్థానములలో చేరిపోవుచున్నది. మిగత సరిసంఖ్య అయిన ఆరు స్థానములలో పాప పుణ్యములు రెండూ చేరుచున్నవి. కర్మచక్రము లేక కర్మపత్రమునందు పాపమూ, పుణ్యమూ మరియు పాపపుణ్యములు రెండూవున్న స్థానములను క్రింద 41వ చిత్రపటములో చూడవచ్చును.

41వ చిత్రపటము

కర్మచక్రములో ఇంతవరకు కోణములు కేంద్రములను గుర్తించడమే కాకుండా వాటియందునూ, మిగతా స్థానములందునూ పాపపుణ్య స్థానములను కూడా గుర్తించుకొన్నాము. ఇప్పుడు కర్మపత్రములో ఎక్కడ ఏ కర్మ వ్రాయబడుతుందో, మనిషి తన ప్రారబ్ధమును ఏయే స్థానమునుండి అనుభవించుచున్నాడో తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము. కర్మచక్రము లేక కర్మపత్రము యొక్క స్థానమునూ, దాని కదలికనూ, దాని అమరికనూ తెలుసుకొన్నాము. తెలిసిన దానినిబట్టి పైనగల కాలచక్రములోనున్న ద్వాదశ గ్రహముల కిరణములు క్రిందగల కర్మచక్రములోని పాపపుణ్య కర్మలమీద ప్రసరించగా, ఆ కిరణములు కర్మచక్రములోని కర్మను తీసుకొని క్రింద గుణచక్రములోనున్న జీవుని మీదపడును. అక్కడ జీవునిమీద గ్రహ కిరణములు ఏ కర్మను ప్రసరింప చేయునో ఆ కర్మకు సంబంధించిన గుణము జీవున్ని తగులుకొనును. అప్పుడు జీవునికి తగులుకొన్న గుణమును జీవుని ప్రక్కనే జీవున్ని అంటిపెట్టుకొనియున్న బుద్ధి ఆలోచిస్తూ జీవునికి చూపించును. ముందే నిర్ణయము చేయబడినట్లు చిత్తము మనస్సు ప్రవర్తించగ కర్మ చివరకు కార్యరూపమై శరీరముద్వారా అమలు జరుగును. అలా అమలు జరిగిన కార్యములోని కష్ట, సుఖములనూ, ఆనంద దుఃఖము లనూ జీవుడు బుద్ధి ద్వారానే అనుభవించడము జరుగుచున్నది. ఈ విధముగా ఒక మనిషిగానున్న జీవుడు చివరకు సుఖదుఃఖమును అనుభ వించుటకు ఏర్పరచబడిన విధానమే కాల, కర్మ, గుణచక్రముల అమరిక అని తెలియవలెను. జీవుడు జీవితములో అనుభవించు కర్మను ముందే సూచాయగా తెలుసుకోవడమును జ్యోతిష్యము అంటాము.

జ్యోతిష్యము శాస్త్రబద్ధముగా ఉన్నప్పుడే దానిని సరిగా తెలుసు కోగలము. ఆ విధానములో ఇప్పుడు కర్మచక్రమందు ఎక్కడ ఏ కర్మ ఉంటుందో తెలుసుకొందాము. ఇంతవరకు తెలిసిన దానిప్రకారము 1వ స్థానములో శరీరమునకు సంబంధించిన కర్మయుండుననీ, అదియే జీవిత ప్రారంభస్థానమనీ తెలుసుకొన్నాము. శరీరము లభించిన జన్మ మొదలు కొని శరీర సంబంధ కర్మలన్నీ అందులో ఇమిడియుండును. దానినుండి 7వ స్థానము భార్యకు సంబంధించిన స్థానమని తెలుసుకొన్నాము. భార్య, భార్యనుండి ఎదురయ్యే సమస్యల కర్మలన్నీ అందులో లిఖించబడును. 1 మరియు 7వ స్థానములకు మధ్యలోగల అంగీ అర్ధాంగి రెండు భాగములలో ఒకవైపు 4వ స్థానము మరియొక వైపు 10వ స్థానము కేంద్రములుగా యున్నవని తెలుసుకొన్నాము కదా! మొదటి భాగమైన అంగీ భాగములో కేంద్రమైన నాల్గవ స్థానమందు స్థూలమైన స్థిరాస్తులకు సంబంధించిన కర్మలు చేర్చబడియుండును. అట్లే రెండవ భాగమైన అర్ధాంగి వైపు కేంద్రమైన పదవ స్థానమందు కంటికి కనిపించని ఆస్తి అయిన కీర్తికి సంబంధించిన కర్మయూ, పేరు ప్రఖ్యాతులు లభించుటకు కారణమైనవి అయిన వృత్తి, ఉద్యోగముల కర్మలు మొదలగునవి లిఖించబడియుండును. దీనిని తర్వాత పేజీలోగల 42వ చిత్రములో చూడవచ్చును.

ఇంతవరకు కర్మచక్రములో గల ఒకటవ స్థానము, నాల్గవ స్థానము, ఏడవ స్థానము, పదవస్థానము, పన్నెండవ స్థానములలో ఏయే కర్మలు చేరుచున్నవో తెలిసినది. మొత్తము 12 స్థానములలో 5 స్థానముల కర్మలు తెలిసిపోయినవి. ఇక మిగిలిన మొత్తము ఏడు స్థానములలో ఏ కర్మలు చేరుచున్నవో కొద్దిగ గమనిద్దాము. కర్మపత్రములో చివరి స్థానమున శరీరము యొక్క అంత్యకర్మ ఉండునని తెలుసుకొన్నాము కదా! శరీరము అంత్యమునకు చేరుటను మరణము అంటున్నాము. మరణము కర్మచక్రము లోని 12వ స్థానమునుండే లభించును. అయితే 12వ స్థానమునకు ఎదురుగా వ్యతిరేఖ స్థానముగానున్న ఆరవ స్థానములో చావుకు వ్యతిరేఖ మైన కర్మ చేరును. చావుకు భిన్నముగాయుండి చావుకంటే ఎక్కువ బాధించు కర్మ ఆరవస్థానములో ఉండును. చావు కాకుండా మనిషి బ్రతికియున్నా చావుకంటే ఎన్నో రెట్లు వ్యతిరేఖముగా బాధించునవి రోగములు, బుణములు. చావులో ఏ బాధాయుండదు. కానీ ఆరవస్థానములోగల కర్మలో రోగ, ఋణముల కర్మలుండి మనిషిని చావుకు వ్యతిరేఖమైన బాధలను అనుభవింప జేయును. జీవిత అంత్యము మరణముతో జరుగును. అయితే మరణము ఏ బాధా లేనిది. బాధలు మొదలగునది జననముతో కాగా, బాధలు అంత్యమగునది మరణముతో, అయితే మరణము బాధారహితమైనది. దానికి వ్యతిరేఖముగా 12వ స్థానమునకు పూర్తి 7వ స్థానములో శత్రుస్థానమై
కేంద్రములలోని కర్మ(42వ చిత్రపటము)


ఆరవ స్థానము కలదు. కావున ఆ స్థానములో బాధారహితమైన మరణము నకు వ్యతిరేఖముగా బాధను కల్గించు శత్రు, ఋణ, రోగ సమస్యల కర్మలు లిఖించబడును. క్రింద 43వ పటము చూడుము.

43వ చిత్రపటము. 6వ స్థానములోని కర్మ.
ఇప్పటికి మొత్తము ఆరు స్థానములలో కర్మ వ్రాతను తెలుసుకోగలి గాము. ఇక మిగిలిన స్థానములు ఆరు కలవు. ఎదురెదురుగాయున్న 5,11 స్థానములను గురించి తెలుసుకొందాము. స్థూల స్థిరాస్తులైన గృహము, భూములు మొదలగునవి ఏ మనిషికి ఏమి ఉన్నవో కర్మచక్రము లోని నాల్గవ స్థానమును చూచి తెలియవచ్చును. నాల్గవ స్థానమునకు క్రింద పైన ఇరువైపుల 3వ స్థానమూ, 5వ స్థానమూ కలవు. నాల్గవస్థానము కేంద్రస్థానమైన దానివలన దానికిరువైపులనున్నవి నాల్గవస్థానమును అనుసరించియుండును. అంగీ భాగమునకు కేంద్రమైన నాల్గవ స్థానములో స్థూల ఆస్తుల కర్మలుండగా దాని తర్వాతగల ఐదవ స్థానములో స్థూల ఆస్తులు సంపాదించుటకు తగిన బుద్ధిని సూచించు కర్మలుండును. ఒక మనిషి ప్రపంచములో స్థూల ఆస్తులు సంపాదించుటకు కావలసిన ప్రపంచ బుద్ధి, ప్రపంచ జ్ఞానము (ప్రపంచ విద్య) ఐదవ స్థానములో లిఖించబడి యుండును. నాల్గవ కేంద్రస్థానములో స్థూల ఆస్తుల కర్మలుండగా దానిని ఆధారము చేసుకొని ఐదవ స్థానములో ప్రపంచ జ్ఞానముండగా, మూడవ స్థానములో ప్రపంచ ధనమునకు సంబంధించిన కర్మ ఉండును. ప్రపంచ ధనము అనగా డబ్బు నిలువ, డబ్బు చలామణి అని అర్థము. దీనినంతటినీ గ్రహించితే అంగీ భాగమందు వరుసగాగల 3,4,5 స్థానములలో ప్రపంచ ధనము, ప్రపంచ ఆస్తి, ప్రపంచ జ్ఞానము వరుసగా అన్నీ ప్రపంచ సంబంధ విషయ కర్మలేగలవు. అంగీలో కేంద్రమైన నాల్గవ స్థానమును ఆధారము చేసుకొని మూడులో ప్రపంచ ధనమునకు సంబంధించిన కర్మ, ఐదులో ప్రపంచ సంబంధ జ్ఞానము లేక చదువుల కర్మలున్నాయని తెలుసుకొన్నాము కదా! వాటినే క్రింద 44వ చిత్రపటములో చూడవచ్చును. కర్మ చిత్రపటములోనున్న పన్నెండు భాగములలో ఒక్కొక్క భాగము ఒక్కొక్క రకమైన కర్మతో నిండిపోతుండడము చిత్రపటములో చూడవచ్చును.
44వ చిత్రపటము

ఇంతవరకు కర్మచక్రములో మొత్తము ఏడు స్థానములలోని కర్మ తెలిసిపోయినది. అంగీ భాగములోని నాల్గవ కేంద్రస్థానమును ఆధారము చేసుకొని మూడు, ఐదు స్థానములలోని కర్మలను తెలుసుకొన్నాము. ఇప్పుడు అర్ధాంగి భాగములో కేంద్రమైన పదవస్థానమును ఆధారము చేసుకొని దానికిరువైపులనున్న 9,11 స్థానములలోని కర్మలను తెలుసుకొందాము. 9,11 స్థానములలోని కర్మలను కష్టము లేకుండా సులభముగా తెలియ వచ్చును. అదెలా అనగా అంగీ భాగమునకు కేంద్రమైన 4వ స్థానములో స్థూల ఆస్తులుండగా, అర్ధాంగి భాగమునకు కేంద్రమైన 10వ స్థానములో నాల్గవ స్థానమునకు వ్యతిరేఖమైన సూక్ష్మఆస్తులైన కీర్తిప్రతిష్ఠ, వృత్తి ఉద్యోగ కర్మలను గ్రహించవచ్చును. స్థూల ఆస్తులు ప్రపంచ సంబంధమైనవి కాగా, జ్ఞానధనము, జ్ఞానమార్గము సూక్ష్మ ఆస్తులు పరమాత్మ సంబంధమైనవి. ఈ విధముగా అంగీ భాగములోనున్న కర్మకు పూర్తి భిన్నముగా అర్ధాంగి భాగములోగల కర్మలుండును. మొదటి భాగములో కేంద్రమైన నాల్గవ స్థానమునకు రెండవ భాగములో కేంద్రమైన పదవస్థానము వ్యతిరేఖమైనట్లే, అంగీ భాగములోని మూడవ స్థానములోని కర్మకు వ్యతిరేఖమైన కర్మ అర్ధాంగి భాగములోని తొమ్మిదవ స్థానములో ఉండును. అలాగే అంగీ భాగములోని ఐదవ స్థానములోని కర్మకు వ్యతిరేఖమైన కర్మ అర్ధాంగి భాగములోని పదకొండో స్థానములో ఉండును. మూడవ స్థానములో ప్రపంచ ధనమునకు సంబంధించిన పాపముండగా దానికి పూర్తి వ్యతిరేఖ స్థానమైన తొమ్మిదవ స్థానమున పరమాత్మ ధనము (జ్ఞానశక్తి) నకు సంబంధించినది లభించును. అదే విధముగా ఐదవ స్థానములో ప్రపంచ సంబంధ జ్ఞానముండగా దానికి వ్యతిరేఖ స్థానమైన పదకొండో స్థానములో పరమాత్మ జ్ఞానము (దైవజ్ఞానము) నకు సంబంధించిన గ్రాహిత శక్తియుండును. అర్ధాంగి భాగములో 9,10,11 స్థానములు దైవ భావమునకు సంబంధించినవని చెప్పవచ్చును. అయితే పదిలోనున్న జ్ఞానశక్తి, తొమ్మిదిలోనున్న జ్ఞానధనము పదకొండులోనున్న జ్ఞాని గ్రాహితశక్తి కర్మకు లోబడియుండవు. అందువలన కర్మ ఆధారముతో జ్ఞాన ధనమును గానీ, జ్ఞానశక్తినిగానీ, జ్ఞాన విచక్షణనుగానీ (జ్ఞానమును గ్రహించుకొను శక్తినిగానీ) గుర్తించి చెప్పలేము. 9,10,11 స్థానములలోనున్న వాటిలో కొన్ని కర్మలకు సంబంధించియుండగా, అక్కడేగల జ్ఞాన చిహ్నములన్నీ కర్మాధీనములుగావు. అందువలన కర్మాతీతమైన వాటిని గురించి ఖచ్చితముగా చెప్పుటకు వీలుపడదు. ఈ మూడు స్థానముల వలన భూమిమీద జ్ఞానిని గుర్తించవచ్చును. అయితే అతనిలో ఎంత జ్ఞానముండేది తేల్చి చెప్పలేము. క్రింద 45వ చిత్రపటములో కర్మచక్రము లోని 9,10,11 స్థానముల కర్మలను చూడవచ్చును.


45వ చిత్రపటము
45వ చిత్రపటము.

ఇంతవరకు తెలిసిన దానిలో కర్మచక్రములోని రెండు స్థానములు తప్ప మిగత అన్ని స్థానములలో ఏ కర్మ చేరిపోయినదీ తెలుసుకొన్నాము. ఇప్పుడు మిగిలినది అంగీ భాగములో రెండవ స్థానమూ, అర్థాంగి భాగములో ఎనిమిదవ స్థానము మాత్రము మిగిలియున్నవి. అంగీ భాగములో మొదటి స్థానము తర్వాతయున్న రెండవ స్థానము, మొదటి స్థానమునకు అనుబంధముగాయున్నది. అలాగే అర్థాంగి భాగములో మొదటిదైన ఏడవ స్థానమునకు ప్రక్కనేయున్న ఎనిమిదవ స్థానము అనుబంధముగాయున్నది. కావున కర్మచక్రములో ఒకటవ స్థానమును అనుసరించి రెండవ స్థానమూ, ఏడవ స్థానమును అనుసరించి ఎనిమిదవ స్థానమూ కర్మతో నింపబడినవి. కర్మచక్రములో ఒకటవ భాగమైన అంగీ భాగములో ఇంతవరకు నమోదైన కర్మలన్నీ ప్రపంచ సంబంధ కర్మలనియే చెప్పవచ్చును. 1వ స్థానమున శరీరమునకు సంబంధించిన కర్మయుండగా, 3,4,5,6 స్థానములన్నిటిలో ప్రపంచ విషయములతో కూడుకొన్న కర్మలేగలవు. అట్లే రెండవ భాగమైన అర్థాంగి భాగములో 7వ స్థానము పెళ్ళితో సంబంధమేర్పడు భార్య విషయముండును. పెళ్ళి కార్యమంతయు దైవజ్ఞానముతో కూడుకొని యున్నది. తర్వాత 9,10,11,12 స్థానములన్నీ దైవజ్ఞానము సంబంధ విషయములకు సంబంధిత ఫలితములున్నవి. అందువలన అంగీ భాగము అజ్ఞానముతో కూడుకొనియున్నదనీ, అర్థాంగి భాగము జ్ఞానముతో కూడుకొనియున్నదనీ చెప్పవచ్చును.

ఇప్పుడు మనము చెప్పుకోవలసిన 2వ స్థానము అంగీ భాగము లోనూ, 8వ స్థానము అర్థాంగి భాగములోనూ కలదు. అందువలన 2వ స్థానము ప్రపంచ సంబంధముగా ఉండుననీ, 8వ స్థానము దైవ సంబంధముగా ఉండుననీ తెలియుచున్నది. కర్మచక్రములో ఇంతవరకు మిగిలిన 2 మరియు 8 స్థానములలో ఏ కర్మయున్నదో గమనిద్దాము. అంగీ భాగములోని 2వ స్థానమును చూస్తే 1వ స్థానము శరీర ప్రారంభ మునకు సంబంధించిన కర్మ అందులో ఉన్నది కదా! శరీరములో జీవితము ప్రారంభమైన దినమునుండి మనిషికి అజ్ఞాన జీవితమే గడచుచుండును. దైవజ్ఞానము మీద ధ్యాస పెళ్ళి తర్వాత రావచ్చునేమోగానీ, అంతవరకు ఎవరికైనా జ్ఞానజీవితము మీద ధ్యాసరాదు. పెళ్ళి తర్వాత దైవము మీద ధ్యాస మనిషికి కలుగవచ్చును. పుట్టుక అజ్ఞానములో జరిగినా పెళ్ళి జ్ఞాన సంబంధముగా ఉండవలెనని పూర్వము మనిషికి చేయు పెళ్ళిలో అంతా జ్ఞానమునకు సంబంధించిన కార్యములనే ఉంచారు. అందువలన 1వ స్థానము తర్వాత రెండవ స్థానమున మనిషి తన జీవితములో అజ్ఞాన జీవితము ఎంతకాలము గడుపుననీ, చివరికి అతను ఎంత అజ్ఞానిగా చనిపోవును, అజ్ఞాన జీవితము ఎంతకాలముండును అనుటకు సంబంధించిన కర్మలు రెండవ స్థానమున ఉండును. ఉదాహరణకు ఒక మనిషి 60 సంవత్సరములు బ్రతికి చనిపోతే ఆ అరవై సంవత్సరముల ఆయుష్షులో ఎంతకాలము అజ్ఞానిగా బ్రతుకును అనుటకు సమాధానముగా అతని రెండవ స్థానమున ఉన్న ప్రపంచ కర్మనుబట్టి 50 సంవత్సరముల కాలము అజ్ఞానములో బ్రతికాడనీ, మిగత పది సంవత్సరముల కాలము జ్ఞాన జీవితములో గడచిపోయినదని చెప్పవచ్చును. ఒక మనిషి ఎంత కాలము అజ్ఞానములో గడుపునని రెండవ స్థానమునుబట్టి చెప్పినట్లే, అదే మనిషి ఎంతకాలము జ్ఞానజీవితము గడుపునో అతని కర్మచక్రములోని ఎనిమిదవ స్థానమును చూచి చెప్పవచ్చును. ఇక్కడ ముఖ్యముగా అందరూ గమనించ వలసినదేమంటే! ఒకని జీవితములో ఎంత భాగము అజ్ఞాన జీవితము, ఎంత భాగము జ్ఞానజీవితము ఉండునో చెప్పవచ్చునుగానీ, మనిషియొక్క ఆయుష్షును గురించి ఎవరూ చెప్పలేరు. మనిషి జీవితములో చావు పుట్టుకలు కర్మాధీనములు కావు. అవి కర్మకు అతీతమైనవిగా ఉన్నవి. అందువలన మనిషి తన జీవితములో ఇంత భాగము అజ్ఞాన జీవితము గడుపునని చెప్పవచ్చును. అలాగే ఎంతకాలము జ్ఞానజీవితమును గడుపునో చెప్పవచ్చును. ఈ రెండు స్థానములను చూచి ఇతనికి ఇంత ఆయుష్షుంటుంది అని కొందరు చెప్పవచ్చునుగానీ అది సత్యమైన మాటయని చెప్పలేము. 2,8 స్థానములనుబట్టి వాడు అజ్ఞానమార్గములో పయనించునా లేక జ్ఞానమార్గములో పయనించునా అని చెప్పవచ్చును. మనిషికి వంద సంవత్సరములు ఆయుష్షు అని 2,8 స్థానముల కర్మనుబట్టి అంచనాగా వంద సంవత్సరములలో ఇంతకాలము బ్రతకగలడనీ, వీని ఆయుష్షు ఇంత అని చెప్పుచుందురు. మరణములు మూడు రకములున్నాయి. కాబట్టి ఆయుష్షు విషయములో జ్యోతిష్యుడు చెప్పిన మాటలు సత్యము కాగలదను నమ్మకము లేదు. ఆయుష్షు విషయములో ఒక్క యోగులు తప్ప మిగతావారు ఖచ్ఛితముగా చెప్పలేరని తెలియుచున్నది. ఇంతవరకు మనము జ్యోతిష్య శాస్త్రము ప్రకారము కర్మచక్రములోని మొత్తము పన్నెండు స్థానములలో ఏ కర్మ నిలువ ఉన్నదో తెలుసుకొన్నాము. ఇప్పుడు 46వ చిత్రపటములో 2,8 స్థానముల కర్మలను గుర్తించుకొని చూస్తాము

46వ చిత్రపటము. పూర్తి కర్మచక్రము
ఇప్పటికి కర్మచక్రములోని పన్నెండు భాగములలోని కర్మను కొంత వరకు గుర్తించుకొన్నాము. జీవితములో ముఖ్యమైన విషయముల కర్మలను మాత్రము గుర్తించి చూచుకొన్నాము. మనము చెప్పుకోని ఎన్నో
46వ చిత్రపటము. పూర్తి కర్మచక్రము.

విషయములు మనిషి జీవితములో ఉన్నవి. ఉదాహరణకు సంతానమును గురించిన కర్మ ఏ స్థానములో ఉండునో మనము చెప్పుకోలేదు. సంతానము మనిషి జీవితములో ముఖ్యమైనది. ఎంతో ముఖ్యమైన సంతాన విషయము కర్మరూపములో ఎక్కడుండునో గమనించితే ఈ విధముగా తెలియుచున్నది. తల్లి తండ్రుల గుణములు పిల్లలకు వస్తాయి అంటుంటారు. అట్లే తల్లి తండ్రులు తెలివైనవారైతే పుట్టే పిల్లలు కూడా తెలివైనవారు పుట్టుదురని కూడ చెప్పుచుందురు. తల్లితండ్రుల లక్షణములే వారి పిల్లలకు వస్తాయి అని చాలామంది చెప్పుట విన్నాము. చాలావరకు వారు చెప్పినట్లే బయట కనిపించడము జరుగుచున్నది. ప్రపంచ జ్ఞానము ప్రపంచ బుద్ధులు తల్లి తండ్రుల వలన వచ్చినవారు అక్కడక్కడ కనిపించడము వలన తల్లితండ్రుల బుద్ధులు పిల్లలకు వస్తాయని చెప్పడము జరుగుచున్నది. తల్లితండ్రులు అజ్ఞానులైతే పిల్లలకు కూడా వారి అజ్ఞానము రావడమూ, అలాగే తల్లి తండ్రులు దైవభక్తికలవారైతే వారి పిల్లలు కూడా కొంత దైవభక్తి కల్గియుండడము జరుగుచున్నది. కర్మచక్రములో ఐదవస్థానము ప్రపంచ జ్ఞానమునకు సంబంధించినదిగా ఉండుట వలన, దానికి ఎదురుగాయున్న పదకొండవ స్థానము భక్తి, జ్ఞాన, ధర్మములకు సంబంధించినదియుండగా, ఈ రెండు స్థానములలోని బుద్ధి భావములు, జ్ఞాన, భక్తి భావములు సంతతికి వచ్చుచుండుట వలన ఎవరికైనా సంతానమును గురించిన కర్మ సమాచారము 5,11 స్థానములలోనే ఉండునని తెలియుచున్నది. ఈ విధముగా కొన్ని కర్మలను ఏ స్థానములలో ఉన్నది గ్రహించవచ్చును.

శాస్త్రము అనగా సత్యము, సత్యము అనగా శాస్త్రమని చెప్పవచ్చును. కొన్ని కర్మలు జరిగెడు యదార్థసంఘటనలనుబట్టి తెలియవచ్చును. ఇప్పుడు సంతతి ఎటువంటిదో తెలియుటకు 5,11 స్థానములను చూడవచ్చుననుట శాస్త్రబద్ధమా అని ఎవరైనా అడిగితే దానికి సమాధానముగా ఇట్లు చెప్పవచ్చును. కొన్ని శాస్త్రబద్ధముగా వ్రాసిపెట్టబడియుండును. కాబట్టి వాటిని అనుసరించవచ్చును. కొన్ని విషయములు వ్రాయనివి కూడా ఉండవచ్చును. అప్పుడు జరిగిన సత్యమునుబట్టి ఇది శాస్త్రమని తెలియ వచ్చును. ముందే ఇతరుల చేత వ్రాయబడిన శాస్త్రమునుబట్టి కొన్ని విషయములను చెప్పవచ్చును. కొన్ని జరిగిన సత్యములనుబట్టి కొన్ని శాస్త్ర విషయములను కనిపెట్టి చెప్పవచ్చును. సంతాన విషయములో మేము జరుగుచున్న సత్యమునుబట్టి 5,11 స్థానములు శాస్త్రబద్ధముగా సంతాన స్థానములని చెప్పుచున్నాము. ఇదే పద్ధతిలో కొన్ని విషయములను అప్పటి కప్పుడు గ్రహించవచ్చును.