జ్యోతిష్య శాస్త్రము/కర్మచక్రములో ఏ కర్మ ఎక్కడ చేరుతుంది?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

24. కర్మచక్రములో ఏ కర్మ ఎక్కడ చేరుతుంది?

నాలుగు చక్రముల సముదాయము ప్రతి మానవుని శిరస్సులో కలదు. నాలుగు చక్రములకు ఆధారమైన ఆత్మ తలనుండి వీపు క్రింది భాగము వరకు వ్యాపించియున్న బ్రహ్మనాడిలో (పెద్ద నరములో) కలదు. పై చక్రము దేవునికి సంబంధించినది, కావున ప్రతిమారు దానిని చెప్ప నవసరము లేదు. అందువలన పై చక్రమును వదలి మనిషికి సంబంధించిన మూడు చక్రములనే చెప్పుకొందాము. కాల, కర్మ, గుణ చక్రములు మూడుయున్నా వాటిలో ఎక్కువ ప్రాధాన్యత గలది కర్మచక్రమని చెప్పుకొన్నాము. అటు కాలచక్రము ఇటు గుణచక్రముల మధ్యన కర్మచక్రము యుండి ప్రాధాన్యత కల్గియున్న దానివలన, ఇతర మతగ్రంథములని పేరు గాంచిన మూల గ్రంథములలో కూడా కర్మచక్ర ప్రస్థావన వచ్చినది. ఇక్కడ కర్మచక్రమని దేనినంటున్నామో దానినే కర్మపత్రమని మూల గ్రంథములలో చెప్పారు. మంచి చెడులున్న కర్మపత్రాన్ని మనిషి మెడలో వ్రేలాడదీశామని 17వ సురా, 13వ ఆయత్లో ఖుర్ఆన్ గ్రంథములో చెప్పబడినది. అక్కడ పాప పుణ్యములను చెడు మంచిలని చెప్పారు. అంతేగాక తలలో నాల్గుచక్రములు క్రిందికి బ్రహ్మనాడిగా వ్రేలాడబడియుండడమును కర్మపత్రాన్ని మెడలో వ్రేలాడదీశామని చెప్పారు. ఈ విధముగా కర్మచక్రము ఆధ్యాత్మిక రంగములో అన్ని మత గ్రంథములందు ప్రస్తావనకు వచ్చినది.

ప్రతి మనిషికీ కాల, కర్మ, గుణచక్రములు మూడు ముఖ్యమైనవని చెప్పుకొన్నాము. ఆ మూడు చక్రములలో కర్మచక్రము చాలా ముఖ్యమైనదని చెప్పాము. కర్మనుబట్టియే కాలమూ, కర్మనుబట్టియే గుణములని కూడా చెప్పుకొన్నాము. ఇప్పుడు మరికొంత ప్రత్యేకముగా చెప్పునదేమనగా! సృష్ఠ్యాది నుండియున్న కాలచక్రములోని గ్రహములుగానీ, గుణచక్రములోని గుణములు గానీ, మారకుండా ఎన్నియున్నవో ఎలాయున్నవో, అన్నియు అలాగేయున్నవి. కాలచక్రములోని పన్నెండు (12) గ్రహములు మారలేదు. గుణచక్రములోని గుణములు మారలేదు. నిమ్మకాయలోని పులుపు, మిరపకాయలోని కారము కొంత మారవచ్చునేమోగానీ, కాలచక్రము లోని గ్రహములుగానీ, గుణచక్రములోని గుణములుగానీ ఏమాత్రము కొంతయినా మార్పుచెందకుండా అలాగేయున్నవి. కాలచక్రములోని గ్రహములు, గుణచక్రములోని గుణములు మారకున్నా, కర్మచక్రములోని కర్మ మాత్రము నిత్యము జమ, ఖర్చు అగుచు ఎల్లప్పుడూ మారుచునే ఉన్నది. ఎవరి కర్మచక్రములోని కర్మ స్థిరస్థాయిగా ఉండదు. అందువలన ఎప్పటికీ ఒకేలాగున ఆగామి పాపపుణ్యములుగానీ, ప్రారబ్ధ పాపపుణ్యములు గానీ ఉండక మారుచుండును. నిత్యమూ మారుచున్న కర్మచక్రము మూడు చక్రములలో ముఖ్యమైనదై ఉన్నది. ఎవడు ఎటువంటివాడో చూడవలసివచ్చి నప్పుడు వాని గుణములను ప్రేరేపించు కర్మనే చూడవలసివచ్చుచున్నది. కర్మ ప్రేరణవలననే గుణములు ఉండుట వలన గుణములకు కారణమైన కర్మనే చూడవలసివచ్చినది. అందువలన మనిషికి సంబంధించిన జీవన విధానమేదైనా ఎట్లున్నదనుటకు కర్మయే అద్దముగా, ప్రతిరూపముగా ఉన్నది. ఏ జ్యోతిష్యుడైనా మనిషిలోని కర్మనే లెక్కించి చూచి వాని భవిష్యత్తు కొంతవరకు తెలియవచ్చును. జ్యోతిష్యము అంతయు జ్యోతితో ముడిపడి యున్నది. కావున జ్ఞానము (జ్యోతి) తెలియనివాడు సరియైన జ్యోతిష్యుడు కాడు. జ్ఞానమును తెలియుట వలననే కర్మలూ, వాటి బాధలూ తెలియును. దానినిబట్టి జ్యోతిష్యమును తెలియవచ్చును.