జీవశాస్త్ర సంగ్రహము/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి

ఉపోద్ఘాతము.

దాని ధర్మములను గుఱించియు జ్ఞానము కలుగుచున్నది. కావుననే యీ పంచేద్రియములకు జ్ఞానేంద్రియములని పేరు. చిన్న నాటనుండియు నీయింద్రియములు మనకు బదార్థముల ధర్మముల దెల్పుచుండును. దీపముమీద జెయ్యిపడి చుఱుక్కనినపుడు దీపమునందు వేడిమి కలదని బాలుడు తెలిసికొనును. అగ్నిపై నీరుపడి యది చల్లారగా జూచి జలమునందు వేడిమి చల్లార్చు గుణము కలదని పిల్లవానికి దెలియును. ఇటులనే యితరపదార్థముల గుణధర్మములను గనుగొనును. మానవులకు బదార్థవిషయక జ్ఞానమంతయు నీలాగున ఇంద్రియములద్వారా కలిగినది. ఇట్టి యథార్థజ్ఞానమును ప్రత్యక్షజ్ఞాన మనియెదరు. ఇదియంతయు నొక్కచో జేర్చినయెడల నదియే ప్రకృతిశాస్త్ర మనబడును. ప్రకృతిశాస్త్రములకు భౌతికశాస్త్రము లని మాఱు పేరు.

ఆధ్యాత్మిక శాస్త్రములు.

మన దేశములో శాస్త్రము లనుపేరిట మిక్కిలి విఖ్యాతి జెందియున్నవి భౌతికశాస్త్రములు కావు. వేదములు, స్మృతులు, పురాణములు మొదలగు వానిని మనవారు శాస్త్రము లనియెదరు. వానికి ఆధ్యాత్మికశాస్త్రములు (Metaphysical Sciences) అని పేరు. ఇవి యింద్రియములకు గోచరము కాని సంగతులను బోధించును. పరమాత్మ, జీవాత్మ, స్వర్గము, నరకము, ముక్తి, పుణ్యము, పాపము అను అతీంద్రియవిషయము లీ శాస్త్రములందు జర్చింపబడును. ఇందు వర్ణింపబడిన విషయములు ప్రత్యక్షానుభవసిద్ధములు కావు. ఇందు బహుస్వల్పముగా, యుక్తియు, విశేషముగా నా ప్తవాక్యమని నమ్మికయు బ్రధానములయి యున్నవి. ఆప్తవాక్య మనగా బెద్దలు చెప్పినమాట: వేదము, బైబిల్, కురాన్ మొదలయినవి.

భౌతిక శాస్త్రములకును, ఆధ్యాత్మిక శాస్త్రములకును గలభేధము.

ఇట్టి యాధ్యాత్మిక శాస్త్రములకును భౌతిక శాస్త్రములకును గల భేదము చదువరులు చక్కగ గనుగొనియెదరు. గాక. ఈభేదము చక్కగ దెలియుటకై యీక్రింద రెండు ఉదాహరణము లిచ్చెదను:(1) ఇనుము, బంగారము అను లోహములలో నేది యెక్కువ బరువు గలది యని యిద్దరికి వాదము కలిగెను. ఒకడు బంగార మెక్కువ బరువనియు, రెండవవాడు ఇనుము ఎక్కువ బరువనియు యుక్తి ప్రయుక్తులచే సిద్ధంతీకరింప జొచ్చిరి. అప్పుడు మఱియొక బుద్ధిమంతుడువచ్చి 'వ్యర్ధవాద మెందుకు? ప్రత్యక్షముగా దూచి చూడరాదా?' యని యొక ఘనాంగుళము బంగారమును, ఒక ఘనాంగుళము ఇనుమును దెచ్చి తూచి చూచెను. అప్పుడు బంగారము ఇనుముకంటె ఘనమైనది యనగా నధికమైన బరువుకలది యని వారికి నిశ్చయముగా దెలిసెను.

(2) జగత్తును సృష్టించినవాడు ఎద్దునెక్కినవాడా లేక గ్రద్దనెక్కినవాడా యని యిద్దఱు పురుషులకు వివాదము కలిగెను. వివాద తీర్చుటకు నింకొక్కడువచ్చి 'నీ వనుమాట నిజమని యెట్లు' అని యడిగెను. 'నేనన్నమాట లింగపురాణములో నున్నది' యని యొక డనినతోడనే 'నేను చెప్పినసంగతి శ్రీమద్భాగవతములోనున్నది' అని రెండవవా డనెను. అందుపై 'భాగవతము ప్రమాణము కాదు' అని మొదటివా డుత్తరము చెప్పెను. 'లింగపురాణ మంతకంటె నమ్మదగినది'కా దని వెంటనే రెండవవాడు ప్రత్యుత్తర మిచ్చెను. ఇట్లు తెగని యావాదము విని మూడవవాడు 'మీయిద్దరి పురాణములును అసత్యములు. సృష్టికర్త ఆకాశములో బెద్ద వెల్తురు నడుమ గూర్చుండును. ఇందుకు బ్రమాణమిదుగో యాతడు స్వయముగా బంపిన శుభవర్తమాన (Gospel) మని పలికి యొక బైబిలుగ్రంథమును బైట బెట్టెను! అందుపై మొదటి యిద్దఱును మూడవవానితో బోరాడ సాగిరి. ఇట్టి శైవవైష్ణవక్రైస్తవాది మతవాదములు వేలకొలది సంవత్సరములనుండి జరుగుచున్నను నేటివఱకు దెగ లేదు. ముందెన్నడైనను తెగుననెడి యాశలేదు.

పైని ఒక దానితో నొకటికి సంబంధములేని రెండు ఉదాహరణములు వ్రాయబడినవి. అందు మొదటిది భౌతికశాస్త్ర సూచకము. రెండవది యాధ్యాత్మికశాస్త్రసూచకము. ఈభిన్న శాస్త్రములకు గల భేదము తెలియుటకై మఱియొక యుదాహరణ మిచ్చెదను. సృష్టియందు గానవచ్చెడి పదార్థముల గుణధర్మములను దెలిపెడి భౌతికశాస్త్రములకు బ్రత్యాక్షానుభవమే సర్వాధారము. ఓమము తినిన గడుపులో నొప్పి యాగును అని యనుభవమువలననే తెలిసికొనిరి. ఇది వైద్యశాస్త్రములోని యొక చిన్న విషయము. అనేక సంవత్సరముల వఱకును నాకాశములోని చంద్రునివైపు చూచి మానవులు శుక్రచంద్రాది గ్రహోపగ్రహముల గమనములు కనిపెట్టి వారియనుభవము వ్రాసియుంచినందుననేకదా యిప్పుడు మనము ఈ దినమున చంద్రు డిన్ని కళలు కల్గి యాకాశమున నిచ్చోట నుండునని చెప్పగలము. జ్యోతిశ్శాస్త్ర మీరీతున నభివృద్ధిజెందెను. మానవశరీరమును అనేకరీతుల బరీక్షించి చూచి తలలో బుఱ్ఱెక్రింద మస్తిష్క మున్నదనియు, నిదియే జ్ఞానమునకు మూలాధారమనియు, అది చెడినచో మానవుడు పిచ్చివాడగుననియు, గనుగొనిరి. ఇది శారీరశాస్త్రము (Physiology) యొక్క విషయము. నీరు మిక్కిలి కాచినయెడల ఆవిరియై వాయురూపము జెందును. నీటిలోనుండి వేడిమిని దీసివేసి చల్లతనమును హెచ్చించినయెడల అది మంచుగడ్డయై ఘనరూపమును (Solid) దాల్చును. ఈసంగతి గనిపెట్టి 'పదార్థములను ఉష్ణత యనుశక్తి వాయురూపముగా మార్చును. శీతలము పదార్థమును ఘనరూపముగా మార్చును' అని సిద్ధాంతీకరించిరి. ఇది పదార్థవిజ్ఞానము (Physics) లోనియొకశాఖ. అనగా బైనివర్ణింపబడిన వైద్యజోతిషశారీరపదార్థ విజ్ఞానశాస్త్రములును ఇతర ప్రకృతిశాస్త్రములన్నియు అనుభవసిద్ధములు. అనేక సంవత్సరములు కష్టపడి స్వయముగా నెన్నెన్నియో ప్రయోగములు (శోధనలు:Experiments) చేసినగాని యొక్కొక్క పదార్థముయొక్క గుణధర్మములు తెలియవు. ఆవిరియంత్రము గనుగొనుటకును, నేడు మన మెక్కుచున్న పొగబండ్లయుక్తి పూర్తి యగుటకును వందలసంవత్సరములు పట్టినవి. విద్యుత్ (మెఱుపు) ను గుఱించి రెండువందల యేండ్లనుండి శోధనలు జరుగుచున్నవి. అందుచే జనుల కనేక లాభములు కలుగుచున్నవి. క్రొత్తక్రొత్తయంశములు తెలియు చున్నవి. ఈ భౌతికశాస్త్రములకు సంబంధించిన శోధనలన్నియు సకలజనులకు సాధ్యములు, ప్రత్యక్షములు, ఇంద్రియ గోచరములు, ఒకరికి గాన వచ్చి మఱియొకరికి గానరాకుండునవి కావు. ఆధ్యాత్మిక శాస్త్రములలోని సిద్ధాంతములు అతీంద్రియములు; ఇంద్రియములకు దెలియునవి కావు; ఏశోధనలకును లోబడవు. కావుననే యాధ్యాత్మిక శాస్త్రములలోని సిద్ధాంతములను గుఱించి జనులందరికి నొక్కయభిప్రాయ ముండజాలదు. అందువలననే జగత్తునందిన్ని మతములును, మతభేదములును గలుగుటకు గారణమైనది. ప్రత్యక్షముగా స్థిరపడనిది భౌతికశాస్త్రములోని యేసిద్ధాంతమునైనను శాస్త్రజ్ఞు లొప్పుకొనరు. భౌతికశాస్త్రములలోని శోధనలు అందఱు జనులకును అన్ని కాలముల యందును సాధ్యములు. ఇదియే భౌతికశాస్త్రములకును ఆధ్యాత్మికశాస్త్రములకును గల భేదము.

ప్రకృతిశాస్త్రములకు బ్రత్యక్షమనగా నింద్రియజన్యజ్ఞానమే ప్రధాన మన్నందువలన ఆశాస్త్రములలో అనుమానప్రమాణము ఎంతమాత్రము గ్రాహ్యముగాదని చదువరు లనుకొనగూడదు. అనుమాన మనగా దర్కము, యుక్తి. దాని సహాయము భౌతికశాస్త్రజ్ఞులు కొంతవఱకు దీసికొనియెదరు. కాని యెంతవఱకు? ప్రత్యక్షమునకు సహకారిగాను అవిరోధిగాను ఉన్నంతవఱకు, ఇట్టి యనుమానములను ఈశాస్త్రజ్ఞులు 'ఊహ' (Hypothesis) లనియెదరు. ఇట్టి యూహల జేయుటలో బొరపా టయినయెడల భౌతికశాస్త్రములును ఆధ్యాత్మికశాస్త్రములవలెనే అతీంద్రియము లయిపోవును. కావున ఊహల జేయవలసినవిధమును, ఎట్టియూహలు భౌతిక శాస్త్రజ్ఞు లొప్పుకొనునదియు అనువిషయమును గుఱించి బహుసూక్ష్మనిబంధన లేర్పఱుపబడినవి. ఊహయొక్క సత్యత్వమును గుఱించి యెంతమాత్రము సంశయము వచ్చినను శాస్త్రజ్ఞులు దానిని వదిలివేయుదురు.

ప్రకృతిశాస్త్రకరణములు.

ప్రత్యక్షానుభవమే యీశాస్త్రములకు ముఖ్యాధారమని చదువరులు పైనివ్రాసిన సంగతులనుబట్టి గ్రహించి యుందురు. ఈ ప్రత్యక్షానుభవము శాస్త్రజ్ఞులకు రెండువిధముల గలుగును. ఒక విధమునకు అవలోకనము (Observation) అనియు, రెండవదానికి ప్రయోగము (Experiment) అనియు నామములు. అవలోకనమునకు నిరీక్షణ మనియు ప్రయోగమునకు శోధన, పరిశోధన అనియు నామాంతరములు.

1. అవలోకనము.

సృష్టిలోని పదార్థములను, వాని వ్యాపారములను గుణధర్మములను, కార్యకారణసంబంధమును, సృష్టి నేమములను, కనుగొనునిమిత్తమై సృష్టి చమత్కారములను శ్రద్ధతో జూచుట అవలోకన మనబడును. గ్రహణము లెప్పుడువచ్చునో లెక్క వేయువిధము జ్యోతిష్కు లెట్లు కనుగొనిరి? అవలోకనమువలననే. గ్రహణము లెప్పుడుపట్టునో కనిపెట్టుచుగొన్ని దినములవఱకు నవలోకనముచేసి సూర్యగ్రహణ మమావాస్యనాడును, చంద్రగ్రహణము పౌర్ణిమనాడును తప్ప యితర దినములలో రావని నిశ్చయించుకొనిరి. కొన్ని సంవత్సరములవఱకు గ్రహణావలోకనము చేయుచు తుదకు గ్రహణచక్రము 18 సంవత్సరముల 11 దినముల 7 గంటల 42 నిమిషము (minutes) ల కొకసారి తిరుగుచుండును; అనగా బదునెనిమిది సంవత్సరములయిన తరువాత మరల మరల ఆయాగ్రహణములే వచ్చునని తెలిసికొనిరి. అందుచే కొన్ని గంటలు హెచ్చుతక్కువగా గ్రహణములు లెక్కవేయుటయెఱింగిరి. మఱి యనేకసంవత్సరములు గ్రహణఘటికలను గనిపెట్టి నిమిషభేదముగూడ లేకుండ లెక్కవేయుట నేర్చిరి, ఇట్లు జ్యోతిశ్శాస్త్ర మంతయు ఆకాశగోళములయొక్క చలనములను వేలకొలది సంవత్సరములవఱకు అవలోకించి యవలోకించి అనేక తరములవారిచే సాధింప బడినది. జ్యోతిశ్శాస్త్రాభివృద్ధికి అవలోకనమే ముఖ్యాధారము. ఇట్లు అవలోకనమే ఆధారముగాగల శాస్త్రములు అభివృద్ధియగుటకు మిక్కిలి కాలము పట్టును. ఎందుకనగా మన మవలోకనము చేయవలసిన సృష్టిలోని వ్యాపారము మనకు నిష్టమువచ్చినప్పుడు జరగదు. అది వచ్చినప్పుడు కనిపెట్టుకొని మనము చూడవలెను. సూర్యునియందలిమచ్చలను గుఱించి కనుగొనవలెననిన, ఆమచ్చలు సూర్యునియందు సంవత్సరములో నెప్పుడు కానవచ్చునో యప్పుడు వానిని మనము పరీక్షించ వలసినదే కాని వట్టిసమయములందు నేమియు జేయ వీలులేదు. cation), శరీరనిర్మాణము (Morphology), ఇంద్రియ వ్యాపారములు (Organic functions) మొదలయిన విషయములను గుఱించి వ్రాయబడియుండును. మానవాస్థిపంజరశాస్త్రము (Human Anatomy) మానవశారీరశాస్త్రము (Human Physiology) అను రెండుశాస్త్రములును ఈ శాస్త్రము యొక్క విభాగములే. ఈ రెండు శాస్త్రములును వైద్యుల కత్యంతావశ్యకములు.

3. వృక్షశాస్త్రము:- మిక్కిలి చిన్ని వృక్షములు మొదలు గగనచుంబితములగు మహావృక్షములవఱకును గల వృక్షజాతుల వర్గీకరణము, శరీరనిర్మాణము మొదలయిన విషయములను గుఱించి యీ శాస్త్రమునందు వర్ణింపబడును.

4. మానసశాస్త్రము (Psychology) - ఇదియు జీవశాస్త్రాంతర్గతమే. ఇందు జిత్తవృత్తులను గుఱించియు, మనోధర్మములను గుఱించియు, మనోవ్యాపారములను గుఱించియు వివరింపబడి యుండును.

ఇవి సచేతనవిషయక మైన ముఖ్యశాస్త్రములు. ఇక నిర్జీవపదార్థములను గుఱించిన శాస్త్రముల గనుగొందము.

నిర్జీవవిషయక శాస్త్రములు.

1. పదార్థవిజ్ఞాన శాస్త్రము (Physics) - జీవశాస్త్రమువలెనేయిది స్వతంత్రశాస్త్రము కాదు. అనేక శాస్త్రముల సముదాయము. ఇందు జడము యొక్క సామాన్యధర్మము (General Properties) లను గుఱించియు, సృష్టిలోని శక్తి (Force) యొక్క రూపాంతరములగు ఉష్ణత (Heat), విద్యుత్ (Electricity), లోహ చుంబకత్వము (Magnetism), ప్రకాశము (వెలుతురు Light), ధ్వని (Sound) మొదలయినవాని గుఱించియు వర్ణింపబడును. ఇందలి గమనమును (Motion) గుఱించిన శాస్త్రమునకు గతిశాస్త్రమనయు (Dyanamics), వెలుతురును గుఱించినదానికి ప్రకాశ శాస్త్రమనియు (Optics) పేళ్లు గలవు. ఇందులోని ఇతరశాస్త్రములకు నిటులనే వేఱు పేళ్లు గలవు. 2. రసాయన శాస్త్రము (Chemistry) - ఇది సృష్టిలోనున్న జడపదార్థముల నన్నిటిని బరీక్షించి యేయే పదార్థములలో మఱి యేయే పదార్థములు కలిసి యున్నదియు, ఏయే పదార్థములు తత్వద్రవ్యము (Rlements) లయినదియు దెలుపు శాస్త్రము. ప్రయోగపద్ధతిచే బదార్థముల నన్నింటిని బరిశోధించి చూచి వానిలో డెబ్బది మాత్రము తత్వద్రవ్యములు, అనగా నితర పదార్థమేదియు దమలో గలసి లేక స్వయంసిద్ధముగ నున్న వనియు, నెన్ని యుపాయముల బన్నినను పృథక్కరణమునకు (Analysis) లోబడనివి అగుననియు, కడమ పదార్థములన్నియు మిశ్రద్రవ్యములు, అనగా ఈ డెబ్బది తత్వద్రవ్యముల భిన్న భిన్న సంయోగీకరణముచే బుట్టినవనియు శాస్త్రజ్ఞులు సిద్ధాంతీకరించిరి. ఈయంశములును, మిశ్రపదార్థములను తత్వద్రవ్యముగా మార్చుపద్ధతియు, తత్వద్రవ్యముల గలిపి మిశ్ర పదార్థములను జేయు విధమును ఈశాస్త్రమునందు విశదీకరింప బడును.

పైన జెప్పబడిన రెండు శాస్త్రములును అనగా పదార్థవిజ్ఞాన రసాయన శాస్త్రములు సకల శాస్త్రములకును మూలాధారములు. కావున ప్రకృతిశాస్త్రముల నభ్యసించువారు వీనిని తప్పక మొదట జదువవలెను. ఈ రెండు గ్రంథములును మాచదువరులకు మేము కొలది కాలములలోనే యియ్యగలము.

3. భౌతిక భూగోళము (Physical Geography) - ఈ భూగోళముమీద స్థలభాగములోను, జలభాగములోను ఎల్లప్పుడును జరుగుచున్న మార్పులును వాని కారణములును ఇందు వివరింపబడును.

4. భూగర్భ శాస్త్రము (Geology) - ఇందు భూగర్భములోని పొరలను (Strata) గుఱించియు, వాని ననుసరించి భూమియొక్క యాదిమాకారమును, గుఱించియు తరువాత నది పెరిగిన విధంబును, భూమిమీద ఏయే వృక్షజాతి యేయే జంతుజాతి యెప్పుడెప్పు డావిర్భవించినదియు మఱి య నేక విషయములును వివరింపబడి యుండును.

ఇట్లిచ్చట ముఖ్య శాస్త్రములను బేర్కొంటిమి. శాస్త్రము లనంతములు వానినన్నిటిని బేర్కొనుటకే యనేకపుటలు కావలెను. జ్ఞాన మభివృద్ధియైన కొలదిని శాస్త్రములసంఖ్య హెచ్చుచున్నది. ఒకకంటిని గుఱించి యనేకగ్రంథములు గలవు. చీమనుగుఱించి యొకశాస్త్రముగలదు. మనయాంధ్రభాష యభివృద్ధియైనకొలదిని యీశాస్త్రము లన్నియు దెలుగున బ్రకటింప బడునని నమ్ముచున్నాము.

ఇట్లు ప్రకృతిశాస్త్రములను గుఱించిన సామాన్యసిద్ధాంతముల దెలిసికొని, ప్రస్తుతగ్రంథములోని సంగతు లెట్టివియో కనుగొందము.

జీవశాస్త్రము.

సచేతనములనియు అచేతనములనియు మన మీసృష్టియందు బదార్థములలో రెండు భేదముల జూచుచున్నాము. సచేతనములకు సజీవములనియు అచేతనములకు నిర్జీవములనియు నామాంతరములు. సచేతనములను గుఱించిన శాస్త్రమునకు జీవశాస్త్రమని పేరు. జీవము, ప్రాణము అను శబ్దములు సమానార్థకములు. ప్రతిసజీవపదార్థమును జడపదార్థమగు దేహముతో గలసి వ్యక్తమగునే కాని, జడమునువిడచి స్వతంత్రముగా గానరాదు. కావున జీవశాస్త్రమునందు శరీరముద్వారా వ్యక్తమగు జీవమును గుఱించి విచారింపబడునే కాని, దేహమును విడచిన జీవము అతీంద్రియము కావున అందునగుఱించి యిందు వివరింపబడదు. జీవుడనువాడు వేరొకడు కలడా? లేక సర్వేంద్రియ వ్యాపారసమూహమే జీవుడా? మరణానంతరము జీవు డేమగును? అను విషయములన్నియు అతీంద్రియములు. కావున వానితో జీవశాస్త్రమునకు నేమియుబనిలేదు. వేదాంతశాస్త్రము లందునగుఱించి చర్చించునుగాత.

మన యింద్రియములకు గోచరమగు సచేతనముల శరీరనిర్నాణమును (Morphology), ఇంద్రియ వ్యాపారమును (Physiology), జీవులయొక్క శరీరరచన ననుసరించి మనోవికారభేదములను (చిత్తవృత్తులను Mental Phenomena) బట్టి జీవులలో నేర్పడుచున్న తరగతులును (Classes), భిన్న తరగతులలోని జీవులకుగల సంబంధమును కనుగొనుటయు, జీవశాస్త్ర ముయొక్క విషయములు. ఈశాస్త్రమును అభ్యసించువారు ప్రప్రథమమున సచేతనము (జీవము) లకును అచేతనములకునుగల భేదమును చక్కగ గనుగొనవలయును. అచేతనములందు లేని యీక్రింది ధర్మములు సచేతనములందు గలవు:-

1. శరీరనిర్మాణము (అవయవరచన) - సాధారణముగా శరీరమును ఒక యంత్రముతో బోల్చెదరు. ఈశాస్త్రమునందు శరీరమనగా కేవలము మానవశరీరము కాదు. సూక్ష్మదర్శని (Microscope) సహాయముచేగాని కానరాని యత్యంత సూక్ష్మబిందువువలెనుండి వికారిణి (Amoeba) అను జీవిమొదలుకొని సమస్తజీవులకు రాజగు మనుష్యునివఱకు గల అసంఖ్య జీవులయొక్క శరీరమునకును ఈశాస్త్రమునందు శరీరమని పేరు. వృక్షములును జీవులే అయినందువలన వాని అవయవనిర్మాణమునకు శరీరమనియే పేరు. ఇట్టి ప్రతిశరీరము యంత్రమువంటిది. గడియారము, ప్రత్తిమర, బియ్యపుమర, కుట్రపువానియొద్ది బట్టలుకుట్టెడి మిషన్ మొదలయిన యంత్రములను తెలుగు చదువరులు చూచియుందురు. ఈ యంత్రములయం దేముండును? అనేక చిన్న చక్రములును పెద్దచక్రములును, ఇరుసులును మఱి కొన్ని అవయవములు కలిగి, యిం దొక్కొక్కటి ఒక్కొక్క ప్రయోజనార్థము నిర్మింపబడి యొక్కొక్క పనిజేయుచున్నటుల గానవచ్చుచున్నది. ఆలాగునే ప్రతి శరీరమునందును పంచజ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములు మస్తిష్కము, హృదయము, జ్ఞానతంతువులు, ఉదరము, మజ్జా, మొదలయిన అవయవములలో నన్నియో, కొన్నియో గలిగియుండి,వాని వాని వ్యాపారముల జేయుచుండును. యంత్రముయొక్క రచన యెంత సులభముగా నుండునో దానియొక్క వ్యాపారమంత తక్కువగ నుండును. యంత్రముయొక్క రచన యెంత యెక్కువ చిక్కుగ నుండునో దానివ్యాపారములు గూడ నంతయధికముగా నుండును. అనగా నది యధికముగా బనిచేయును. ఇందుకు గడియారమును ఉదాహరణముగా గైకొందము. కేవలము గంటలు, నిమిషములు తెలుపు గడియారములో గొలది చక్రములే యుండును. క్షణములజూపు దానిలో నొంకొక చక్ర మధికముగానుండును. అంతకంటె దెక్కుడు చక్రములు కలది గంటలుకొట్టును. తేదులు, నెలలు, వారములు చూపు గడియార మితరగడియారములకంటె నెక్కుడు చక్రములును ఎక్కుడు నిర్మాణ చమత్కారమును గలిగి యుండును. ఇటులనే జీవులవిషయ మై యెఱుంగ వలయును. ప్రాణికోటిలో రాజని చెప్పదగు మనుష్యుని శరీరములోని యవయవరచన మత్యంతచమత్కారముగాజేయబడినది. అందునితరప్రాణులకంటె నెన్నియో అవయవములు, వెలుపలను లోపలనుగలవు. అందుచే మానవశరీరవ్యాపారములు ఇతరజంతువులకంటె నధికముగాను, ఎక్కువ యోగ్యత, ఉపయోగము కలవిగాను ఉండును. అవయవనిర్మాణము ననుసరించియె మానవుని యందు వాక్కు, బుద్ధి, మేధ మొదలయిన విశేషంబులున్నవి. మనము తగ్గుజాతి జీవులను జూచిన కొలదిని వానియందు, ఇంద్రియరచనయు, ఇంద్రియ వ్యాపారములును, విజ్ఞానమును తగ్గుచున్నటుల గానవచ్చెడిని. మిక్కిలి తక్కువ జాతిది యగువికారిణి (Amoeba) శరీరము జూచినయెడల అందు పంచజ్ఞానేంద్రియ పంచకర్మేంద్రియముల వ్యాపారములన్నియు నొక్క త్వగింద్రియమే చేయుచున్నటుల గానవచ్చును. అందుచే దానివ్యాపారంబులును, విజ్ఞానంబును మిక్కిలి తక్కువగనుండును. ఈలాగు మిక్కిలి తగ్గుజాతి జీవులు మొదలు హెచ్చుజాతి జీవులవఱకు అవయవరచనా నైపుణ్యంబును విజ్ఞానవృద్ధియు గానవచ్చెడిని. కేవల జడపదార్థములలో నీశరీరనిర్మాణవై చిత్ర్య ముండదు. ఇనుము గాని రాయిగాని చూచినయెడల అందు పతమాణువులన్ని యు కూడి యొక ముద్దవలె నుండునేకాని, యందు సృష్టిలోని యొకశక్తిని మఱియొక శక్తిగా మార్చు యంత్రనిర్మాణమువంటి నిర్మాణ ముండదు. ఇది చేతనా చేతనములకు గల యొక పెద్దభేదము. ఇట్లు యంత్రములకును జీవులకును బోల్చుట జూడగా సాధారణ యంత్రములకును, జీవశరీరములకును నేమియు భేదములేదని చదువరులు భ్రమపడుదురేమో. కాని వీనికి సామ్యమున్న టులనే భేదముకూడ గలదు. మనము చూచెడి యంత్రములు నడచుటకు వెలుపలి సామర్థ్యము కావలెను. గడియారములోని చక్రములు నడచుటకు స్ప్రింగ్ కావలయును. ఎంజిన్ నడచుటకు ఆవిరి కావలయును. ఈ యంత్రములలోని యేభాగము చెడిపోయినను యంత్రము ఆగిపోవును. ఆ చెడిపోయినభాగమును సరిచేసుకొను ఆయంత్రమునందు లేదు. ఈ యంత్రములెంత విచిత్రరచనమునను తమవంటి రెండవయంత్రమును పుట్టింపనేరవు. జీవు లనుయంత్రము దమ వ్యాపారములను జేయు సామర్థ్యము స్వయముగాగలదు. అది పదార్థములవలన వానికి రానక్కరలేదు.. ఇందలికీ లేమైనను చెడినయెడల బాగుచేసికొనుసామర్థ్య మీ శరీరయంత్రములందు గలదు; తమవంటి యంత్రముల బుట్టించు సామర్థ్యము గలదు. ఇది యీరెండు యంత్రములగల తారతమ్యము. ఇట్లు జడపదార్థములకును సచేతనపదార్థములకును యొకభేదము గనపఱచి అచేతనములకు లేనట్టి సచేతనములకు గల ధర్మముల బేర్కొనియెద:

2. ఉత్పత్తి:- తమవంటి మఱియొక జీవినుండి యుత్పత్తియగుట జీవుల ధర్మము. ఏజీవియు దనంతట దాను కలుగదు. దానికి జనకస్థానమునమఱి యొక జీవియైనను ఉండవలెను. హెచ్చుతరగతి జీవులకు దలిదండ్రులు జన్మహేతువులగు రెండుజీవు లుండును. తగ్గుజాతిజీవుల యుత్పత్తియొక జీవివలనే గలుగుచున్నది.

3. వృద్ధి (పెఱుగుట) :- తమచుట్టునుండెడి విజాతీయ (Hetero---) పదార్థములను లోనికిదీసికొని వానిని రాసాయనరీత్యా (Chemi--) పృథక్కరించి (Analyse) వానిలోనుండి తనశరీరమునకు నావశ్యకమైన పదార్థములను దీసికొని తద్వారా సర్వావయవములను, సర్వశరీరమును చేయు సామర్థ్యము జీవులకుగలదు. అచేతనపదార్థములుకూడ పెరు-----నముచూచుచున్నాము. కృష్ణాగోదావరులలోని లంకలు పెరుగును; ---లు (Crystals) పెరుగును. కాని యీజడపదార్థములన్నియు సజా-----ర్థములు తమపై వచ్చిపడినందున బెరుగును. క్రమక్రమముగా ఇసుక మొదలయిన ద్రవ్యములపొరలు ఒకటిపైనొకటి వచ్చి చేరినందున లంక----ఏకజాతీయ కణములు ఒకటిపైనొకటి చేరుటవలన స్ఫటికము పెరువుల యభివృద్ధి అటువంటిదికాదు. గాలిలోని బొగ్గుపులుసుగాలి (కర్బనము Carbon Dioxide), భూమిలోనిజలము, కొన్ని లవణములు వీనినిభక్షించి గడ్డి, ఉలవలు, అభివృద్ధియగును. అట్టి గడ్డి ఉలవలు తిని గుఱ్ఱము బలియుచున్నది. ఇదియుగాక ఒకానొకచోటమాత్రము క్రొత్తపదార్థము అతికినందున జడపదార్థము పెరుగును. అనగా ఆపెరుగుట పదార్థముయొక్క యొకానొక భాగమునందుగాని, చుట్టుమాత్రముగాని ఉండును. అంతట నుండదు. జీవియొక్క పెరుగుట యటువంటిది గాదు. తన దేహములోని ప్రతియవయవమును ప్రతికణమును పెరిగినందువలన జీవి పెరుగును. దీనికే నేంద్రియవృద్ధి (Organic growth) అనిపేరు.

3. సంతానవృద్ధి :- తనవంటి జంతువునుకనుట జీవియొక్క యొకవిశేష ధర్మము. ఈ పునరుత్పాదనవిధము లనేకములుగలవు. స్త్రీపురుషసంయోగమువలన సంతానోత్పత్తి యగుట మనము హెచ్చుజాతి జీవులయందు జూచుచున్నాము. కాని అణురూపములయిన మిక్కిలి తగ్గుజాతులలోని జీవులలో స్త్రీపురుషవిభేదము లేదు. అట్టి యొక జీవి రెండు గాదెగి యా రెండుభాగములును రెండు స్వతంత్రజీవులగును. దీనికి ద్విఖండన సంతానవృద్ధి విధానమని పేరు. ఇందునగుఱించి యధికము తెలిసికొనగోరువారు ఈగ్రంథముయొక్క 16-వ పుటలో జూడనగు.

4. మరణము :- పైన వర్ణింపబడిన వ్యాపారములన్నియు మాని జడత్వము జెందుట మరణము. ఇట్టిమరణము జడములకు లేదు.

వృక్షములకు జీవము కలదా?

సచేతనములలో వృక్షములనియు, జంతువులనియు రెండు భేదములు కలవని యిదివఱకే చెప్పియున్నాము. వృక్షాదులు జంతువులవలె స్థలాంతరము జేరక యొక్కచోటనే నిలచియుండుటచే నవి సచేతనములు గావని కొందఱు భ్రమపడుచున్నారు. కాని యది నిజముకాదు. చలనము జీవత్వమునకు ఒకముఖ్యలక్షణముకాదు. చలనములేకయ సచేతనత్వముండవచ్చును. చలనముండియు జడత్వ ముండవచ్చును. ఇదియుగాక పెద్ద పెద్దజంతువులకు జంగమత్వ మున్నను, చలనములేక యొక్కచోటనే యుండు అతిసూక్ష్మజంతువులు కొన్ని కలవు. సాధారణముగ వృక్షములకు జలనములేక పోయినను అతిసూక్ష్మ వృక్షములు కొన్ని తిరుగుచుండును. ఇదియు గాక పైని జీవత్వమునకుగలవనివర్ణించిన లక్షణము లన్నియు వృక్షములయెడ గలవు.

వృక్షములకు జంతువులవలె కాళ్లుచేతులు మొదలయిన యింద్రియములు లేకపోయినను, వానియందు జీవనమునకు నావశ్యకమైన అవయవములును, తద్వ్యాపారములును గానవచ్చును. హెచ్చుజాతిజంతువుల శరీరమునకు నాధారముగ అస్థిపంజరము (Skeleton) శరీరములో నున్నటుల వృక్షములను నిలవ బెట్టుటకు కాడయు, కొమ్మలును గలవు. వృక్షము అభివృద్ధియగుటకు బోషకరసము కావలయును. దానిని వృక్షములు వేళ్లద్వారా భూమిలోనుండి గ్రహించును. ఈవేళ్లు వృక్షములకు చేతులు నోరువంటివి. జంతువుల శరీరములోరక్తము ప్రవహించుచున్నటుల వృక్షములలో నొక విధ మైనరసము పారుచుండును. దీనికి మనము వృక్షశోణితమని పేరు పెట్టినను పెట్టవచ్చును. జంతువులకు ఊపిరితిత్తుల (Lungs) వలన జరిగెడుక్రియ ఆకులద్వారాజరుగును. వృక్షశోణితమును వృక్షశరీరమునందంతటను వ్యాపింప జేయ వాహికలుండును. ఇట్టి శరీరనిర్మాణము కలిగి వృక్షములు ఆహారముదిని స్వశరీరము బెంచి వృద్ధియగుచున్నవి. శత్రువులతో బోరాడి బలవంతములయిన వృక్షములు బలహీనములయిన వాని నడచివేయును. స్త్రీపురుష భేదము పుష్పములద్వారా కలిగియుండి వృక్షములు సంతానోత్పత్తి చేయుచున్నవి.

వృక్షములకు జంతువులవలె మెదడుగాని జ్ఞానతంతువులు (Nerves) గాని లేకపోయినను వానికి గొంతవఱకు మనోవికారములు కలవని చెప్పవచ్చును.వృక్షములకు నొకవిధమైన నిద్రయు భయమును కలవు. చింతయాకులు, తురాయియాకులు రాత్రి యొకటిలోనొకటి ముడుచుకొనును. ఇది వాని నిద్ర. ఇటులనే యనేకవృక్షములు రాత్రి నిద్రపోవుచుండుట శాస్త్రజ్ఞులు కనుగొనిరి. కొన్నివృక్షములయాకులను ముట్టినతోడనే యాకులన్నియు ద్వరత్వరగా ముడుచుకొనును. సాధారణముగా 'అత్తిపత్తిచెట్టు' అనబడుచిన్ని చెట్టు ఇటువంటిది. కొన్ని చెట్లయొక్క యొక యాకుమీద సహింపలేని ద్రావకముబోసినయెడల గడమ యాకులన్నియు భయముజెందిన వానివలె వడవడ వడక జొచ్చి వాడిపోవును. ఇందువలన జంతువులశరీరములో నున్నటుల వృక్షములలోగూడ జ్ఞానతంతుజాలము (Nervous System) ఉన్న దేమోయని కొందఱుశాస్త్రజ్ఞు లూహించెదరు. కాని యట్టిజాల మెవ్వరును ఇదివఱకు గనిపెట్టలేదు. పిడుగువలన మానవులు చనిపోవునటుల నే వృక్షములును మృతినొందును. కొన్ని వృక్షములమీద నల్లమందునీళ్లు చల్లినయెడల నవి మత్తెక్కిన వానివలె నగును. కొన్ని విషములు పోసిన బ్రాణులవలెనే వృక్షములు చచ్చును.

వాన్‌మార్షియస్ అనుబాటసారి అమెరికాఖండములోని ఉష్ణప్రదేశములో దిరుగునప్పుడు 'మిమోసా' యనువృక్షముల యరణ్యము గనుగొనెను. అందునగుఱించి యాత డిట్లువ్రాసెను. 'నా గుఱ్ఱపు కాళ్లచప్పుడు వినినతోడనే యాచెట్టుయొక్క యాకులు త్వరత్వరగా మూసికొనిపోయెను. మఱియు మిక్కిలి భయపడినవానివలె గానవచ్చెను. ' డెస్పాంటెనిస్ అను పేరుగల మఱియొకశోధకు డీచెట్టును అనేకరీతుల బరీక్షించిచూచెను. ఈతడిట్టియొక చిన్న వృక్షమును తనబండిలోనుంచుకొని బయలుదేరెను. బండి కదలినతోడనే ఆచెట్టు ఆకులన్నియు నొకటితరువాతనొకటి మూసికొనెను. కొంతసేపు ఆబండి యటులనే నడచుచుండ నవి విచ్చెను. బండి యాగినతోడనే యవి మరలమూసికొనెను.

మఱియొక విచిత్రమైనచెట్టు అమెరికాదేశములో గలదు. అది పురుగులను బట్టుకొని భక్షించును. ఆకుమీద కీటకము కూర్చుండినతోడనే యాయాకు ముడుచుకొనును. ఆకీటకము చచ్చి దానిశరీరములోని రసమంతయు ఆవృక్ష శరీరములో జీర్ణమయినతరువాత నది మరల దెరచును. తమకు భక్ష్యమైన కీటకములు వచ్చినప్పుడే యాయాకులు మూసికొనును. కీటకమునకు బదులు ఒక చిన్నరాయి యుంచిన నవి మూసికొనవు! అనగా నిదిరాయి, యిది కీటకము అనిన తారతమ్యజ్ఞాన మావృక్షమునకు గలదని యెంచవలసి యున్నది.

ఇట్టి పైవర్ణనవలన వృక్షములు సచేతనములని చదువరులు గ్రహించియుందురు. ఇంతియకాదు. వృక్షములలు సచేతనములగుటయే గాక సచేతనత్వమునకు జనయిత్రులు; సచేతనత్వముకు మూలాధారములు. వృక్షములవలన అచేతనపదా ర్థములకు సచేతనత్వము ప్రాప్తమగుచున్నది. అనగా వృక్షములు ప్రాణములేని వానికి బ్రాణము పోయుచున్నవి. గాలి, నీరు, మన్ను, లవణములు అనుపదార్థములు అచేతనములు (నిరింద్రియములు: Inorganic). ఈపదార్థములను ఆహారముగాగైకొని వృక్షములు వీనిని సేంద్రియ ద్రవ్యములుగా అనగా గాయలు, పండ్లు, ధాన్యములుగా మార్చు చున్నవి. సర్వజీవములకును జీవాధారమైన మూలపదార్థము (Protoplasm) అను ద్రవ్యమును వృక్షములు మొట్టమొదట జడపదార్థములనుండి పుట్టించును. ఇటుల నిర్జీవద్రవ్యములకు సజీవత్వ మొసంగుసామర్థ్యము వృక్షములకుదప్ప మఱి యేజీవులకునులేదు. ఇంతియకాదు, వృక్షములు జంతువులజీవనముకు ముఖ్యాధారము. అదియెట్లన సృష్టిలోనివస్తువు లన్నియు సేంద్రియములు (Organic), నిరింద్రియములు (Inorganic) అని రెండుగా విభజింపబడును. సజీవపదార్థములును వానిచే సృష్టింపబడిన పదార్థములును సేంద్రియములనబడును. ఇతర పదార్థములు నిరింద్రియములు. బియ్యము, గోధుమలు, నూనె, నెయ్యి, శర్కర, ఎముక, మాంసము, దుంపలు, కఱ్ఱ, శంఖము మొదలయినవి సేంద్రియములు. బంగారము, ఇత్తడి, రాయి, గాలి, నీళ్లు, ఉప్పు మొదలయినవి నిరింద్రియములు. నిరింద్రియద్రవ్యములు వృక్షముల యాహారము. ఇట్టి నిరింద్రియద్రవ్యములలోనుండి సేంద్రియద్రవ్యములను వృక్షములుపుట్టించునని పైనజెప్పియున్నాము. జంతువులయాహారము ముఖ్యముగా సేంద్రియద్రవ్యములుగలది. అందు నిరింద్రియద్రవ్యములు మిక్కిలి తక్కువగానుండును. మనుష్యప్రాణియొక్క భక్ష్యభూతపదార్థములను బరీక్షించినయెడల ఉప్పు, నీరు, గాలి యీమూడు పదార్థములే యందు నిరింద్రియములు. మానవుడుభక్షించు బియ్యము, పప్పు, ఫలములు, పాలు, వెన్న మొదలయిన వన్నియు వృక్షములచేగాని జంతువులచే గాని చేయబడిన సేంద్రియద్రవ్యములే. కేవల నిరింద్రియద్రవ్యములు తిని మానవుడు బ్రతుకలేడు. కావున మన జీవ నాధారమునకు వృక్షము లత్యావశ్యకములు. నేడు సృష్టిలోని జంతువులన్నియు నశించినను వృక్షములుకొంతవఱకు బ్రతికియుండగలవు. కాని వృక్షములు నశించె నేని జంతువులన్నియు నొక్క పెట్టున విలయముజెందగలవు. ఇందుచే బృథ్విమీద వృక్షము లేర్పడిన యెన్నియో యుగములకు జంతుసృష్టి ప్రారంభ మయ్యెనని విద్వాంసు లూహించియున్నారు. ఏలయన: శాఖాహారములేక జంతువులు బ్రతుకుట యెట్లు? కొందఱు మాకు శాఖాహారమక్కరలేదు, మేము మాంసాహారము తిని బ్రతుకుదుమని యందురేమో? కాని మన మానవుల కొక్కరికెగాక యన్ని జంతువులకును సేంద్రియాహారమవశ్యకము గనుక క్రిందిజంతువులు బ్రతక నిది మానవులకు మాత్రము మాంస మెచ్చటనుండి రాగలదు? మేకకు దినుటకు గడ్డియుండినగదా దానిమాంసము మానవునికి దొరకుట? ఇట్లు వృక్షములు నిరింద్రియ ద్రవ్యములను దీసికొని వానిని సేంద్రియములు చేయును. జంతువులు ఆ సేంద్రియ ద్రవ్యములనుతిని యందలి సేంద్రియత్వమును గైకొని తమవృద్ధికి నుపయోగపఱచుకొని, మరల వానిని నిరీంద్రియద్రవ్యములుగ మార్చును. ఇట్లు వృక్షములుకూర్చును, మనము వెచ్చింతుము.

జీవ కణములు.

(The Cell Doctrine)

జడద్రవ్యములన్నియు నెటుల అణువు (Molecules) లచే జేయబడినవో యటులనే జీవశరీరములన్నియు జీవకణము (Cells) లనబడు సూక్ష్మద్రవ్యములచే జేయబడినవి ఏవృక్షముయొక్క శరీరమును పరీక్షించిచూచినను, ఏజంతువుయొక్క శరీరమును శోధించినను, అవి కణమయమైయున్నటుల గానవచ్చును. అనేకమానవులు కూడి యొక సంఘముగాగాని దేశముగాగాని యెటుల నేర్పడునో యటుల నే యనేకకణములసమూహము దేహమనబడును. సాధారణముగా మనకు గానవచ్చెడి జీవులశరీరములన్నియు ననేకకణములతో జేయబడినను, సూక్ష్మదర్శనిచేగాని కానరాని యత్యంత సూక్ష్మజీవులు కొన్ని యేకకణమయమై యుండును. ఇట్టివి యనేకములు జంతువులలోను వృక్షములలోను గలవు. ఇవి జీవులలో మిక్కిలి తక్కువ తరగతివి. కడమ జీవులన్నియు అనేకకణములు గలిగియుండును. ఈ కణములయొక్క యాకారము భిన్నభిన్న జీవులలో భిన్నభిన్న విధముగ నుండును. కొన్ని అఱలవలె జతుష్కోణముగను, గొన్ని పొడవుగను, కొన్ని గుండ్రముగను వివిధా కారములయి యొప్పును. వీనిభిన్నా కారములను ఈగ్రంథముయొక్క 225-వ పుటలోనీయబడిన పటములో జూడనగును. ఇతర ప్రాణుల శరీరమువలెనే మానవప్రాణిశరీరములోని అస్థి, మాంసము, త్వక్, జ్ఞానతంతువులు మొదలయిన యన్ని భాగములును కేవల జీవకణమయమై యున్నవి. ఈ జీవకణములు పని పడినటుల నెల్ల భిన్న భిన్న రూపముల దాల్చుచు, ఒకటితో నొకటి యనేక రీతుల నంటుకొని రక్తము, అస్థి, స్నాయు, మజ్జాదిరూపముల దాల్చి శరీరక్రియ నడపుచున్నవి. శరీరములోని కేశాకారముగల యొకానొకరక్తవాహిక (Artery) ను, బరీక్షించి చూచినయెడల అనేక జీవకణము లొకటినొకటి పొడువుగను గుండ్రముగను అంటుకొని గొట్టముల రూపమును దాల్చి రుధిరాభి సరణమునకు సహాయమొనర్చుచున్నవని కనబడగలదు. కొన్ని జీవకణములు పొడవుగసాగి గుంపుగ గూడి సంకోచ వికాశశీలము గలవి (That can contract and expand) యై కండరములు (కండలు:Muscles) అగును. మఱికొన్ని కణములు ఒకటి చివరనొకటి యంటుకొని టెలిగ్రాం తీగవలె పొడువై జ్ఞానతంతువగును. కొన్ని కణములు ఖనిజపదార్థములను విశేషముగ దీసికొని కఠినత కలవియై అస్థిరూపముదాల్చును. కొన్ని రూక్షములయి వెలువడి త్వ గ్రూపమును ధరించి శరీరరక్షణము జేయును. ఇట్లు వానివానిపనిని అనుసరించి, యీకణములరూపము, వర్ణము (రంగు), ఆకారము, ధర్మములు మాఱి యవి చర్మాస్థిస్నా య్వాదిరూపముల దాల్చును. ఈ చర్మాస్థిమజ్జాజ్ఞానతంతువులు మొదలయినవి శరీరమనురాజ్యముయొక్క వేఱు వేఱు మహకమాలు (Departments)

మనుష్యులందఱును మొదట నొక్కస్వరూపము కలవారలయినను, కాలము, దేశము, శీతోష్ణములు, భోజనములు, ఆచారవ్యవహారములు మొదలయిన భేదములను బట్టి కొందఱు పెద్ద పెదిమలుగల నల్లనిసిద్దీలు (Negroes) అయిరి. కొందఱు పసుపువర్ణమును, నష్ట కేశులును చుట్టుముక్కులునుగల చీనా వారయిరి. కొందఱు తెల్లనిరంగువారును, మార్జాలనయనులును, ఎఱ్ఱ వెండ్రుకలవారును అగు యూరోపుదేశస్థు లయిరి. కొందఱు మనవలె చామనచాయవా రును, నల్లనివెండ్రుకలవారును, అయిరి. ఇట్లు మొదట బూర్తిగ సాధర్మ్యము గల మానవులలో గ్రమక్రమముగ బాహ్యస్వరూపమందును, అంత:స్వరూపమునందును వైధర్మ్యముగలిగి వేఱువేఱు మానవజాతు లేర్పడెను. అటులనే జీవకణములన్నియు మొదట నొక్కటేయైనను క్రమక్రమముగా మారుచుబోయి, విధర్మములుగల అస్థి, చర్మ, స్నాయు మొదలయిన రూపములును దాల్చెను. ఇంతియకాదు ఈజిప్టు దేశములోని నల్లని సిద్దీజాతి స్త్రీని దీసికొనిపోయి లండనులోనుంచినను, నల్లనిశిశువునే కనును, తెల్లనిశిశువును గనదు. ఇది యానువంశిక ధర్మము (Law of Herity). అటులనే గర్భావస్థలో నున్నపుడు మనుష్యునిశరీరము మొదట సమానమగు కణమయమయి యుండును. అందుగొన్ని అనుకూలస్థితి ప్రాప్తమయిన తోడనే, వానియందు సదృశ్యరూపమున నుండు ఆనువంశికధర్మమును బట్టి అస్థిరూపమునే దాల్చును. కొన్ని స్నాయురూపమునే దాల్చును. మఱికొన్ని జ్ఞానతంతు రూపమునే దాల్చును.

పైన జెప్పిన యుదాహరణములన్నియు జంతువుల విషయమైనవి యగుటచే ఈజీవకణములు జంతుశరీరమునందుమాత్ర ముండుననియు, వృక్షములలో నుండవనియు జదువరులు భ్రమపడుదురేమో భ్రమపడవలదు. ఈకణములు వృక్షములందుగూడనుండును. వృక్షముయొక్కవేరు, ప్రకాండము (Stem), కొమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు మొదలయినవన్నియు ఈకణములకలిమిడి వలననే కలుగుచున్నవి.

ఈజీవకణములు సాధారణముగా నత్యంతసూక్ష్మముగా నుండును. సూక్ష్మదర్శినిసహాయమువలన గాని కానరావు. ఒకానొక జీవులలో నవి యంగుళములో ముప్పాతిక పొడవు పెరుగును.

ఈకణములనుగూర్చి యొక వింత గలదు. ఈ యొక్కొకకణ మొక్కొక యంత్రము అందు నొక్కొక్క దానికి నియమింపబడినపనులు రెండు తననుతాను పోషించుకొనుట; అందుమూలక ముగా శరీరమునంతను పోషించుట. దేశములోని ప్రతిమానవుడును తనను రక్షించుకొనుటయే గాక, దేశరక్షణార్థమైన కొంతపన్ను ఇయ్యవలయును. అటుల నే శరీరమునందలి కణములన్నియు స్వపోషణమును, శరీరపోషణమును చేయవలసియున్నది. అట్లయిన గాని శరీరమంతయు నభివృద్ధి చెంద నేరదు.

ఈ జీవకణములను గుఱించి మఱియొక గొప్ప వింతకలదు. కొన్ని యతి సూక్ష్మజీవులు ఏకకణముగనే యుండునని యిదివఱకు వ్రాసియున్నాము. ఇట్టి యేకకణమయజీవులు జంతువులలోను, వృక్షములలోను గలవు. కడమ జీవు లన్నియు బహుకణమయములు. కాని యివియన్నియు గర్భోత్పత్తి సమయమునందు నేకకణయుతములు గానే యుండి తరువాత గ్రమక్రమముగా కణము లభివృద్ధియై యది బహుకణమయమగును. శుక్లశోణితములు కలసి గర్భోత్పత్తి యైనపుడు మనుజుడు కూడ అతిసూక్ష్మమైన యేకకణముగా నుండును. క్రమక్రమముగా నాకణము ద్విఖండన విధానంబున రెండై, నాల్గయి, యెనిమిదియై, పదియా ఱై, యసంఖ్యకణములుపుట్టి, అందు గొన్నితలగను, కొన్ని చేతులుగను, కొన్ని పొట్టగను, కొన్ని కాళ్లుగను, కొన్ని హృదయముగను, కొన్ని జ్ఞానతంతువులుగను ఏర్పడి, కోట్యానుకోటికణమయంబై, అత్యద్భుత రచనానిర్మాణంబుగలిగి, అనన్యసామాన్యవిజ్ఞానశోభిత మైనమానవశరీర మేర్పడుచున్నది.

మూలపదార్థము.

ఇట్టియద్భుతమైనకణమును విచ్చి యం దేమున్నదియు గనుగొందము. ప్రతికణమునందును మూలపదార్థమను (Protoplasam) నొక ద్రవ్యము కానవచ్చును. ఇది జీవత్వమునకు ముఖ్యాధారమైన పదార్థము. ఈపదార్థమునకును సజీవత్వమునకును అన్వయవ్యాప్తికలదు. అనగా నెచ్చటజీవముండునో అచ్చట మూలపదార్థముండును; ఎచ్చట మూలపదార్థముండునో అచ్చట జీవముండును. ఎక్కువ చుఱుకుదనముగల కణములో (Cell) నిదియెక్కుడుగను, తక్కువ చుఱుకుదనముగల కణములో దక్కువగను ఉండును. చేత నత్వముపోయి కణముకు జడత్వమురాగానే యీమూలపదార్థమును లేకుండబోవును. ఇట్లీమూలపదార్థమనునది సకలజీవులకును మూలాధారమైనది గనుకనే హక్సలే యను ఘనత వహించిన శాస్త్రజ్ఞుడు దీనికి చైతన్యముయొక్క భౌతిక ప్రాతిపదిక (Physical basis of life) మని పేరుపెట్టెను. మూలపదార్థము మిక్కిలి ఘనత్వము (Solidity) గాని, మిక్కిలి ద్రవత్వముగాని చెందని జిగటవంటి యొకపదార్థము. ఇది నీళ్ళతో గలసిన తుమ్మ బంకవలెను, శర్కర పాకమువలెను, ఉండును. ఈ మూలపదార్థ మేయే ద్రవ్యములతో జేయబడినదని రసాయన పృథక్కరణము చేసిచూడగా నిందు ఆమ్లజనము (ప్రాణవాయువు: Oxygen), ఉజ్జనము (Hydrogen), నత్రజనము (Nitrogen), కర్బనము (బొగ్గు Carbon), గంధకము, స్ఫురము (Phosphorous) అనుతత్వద్రవ్యములుమాత్ర మందు గానవచ్చు చున్నవి. ఇట్లు ఈమూలపదార్థము కేవలము రాసాయనిక మిశ్రణము (Chemical compound) అయినందున, శాస్త్రజ్ఞులు కష్టపడినయెడల ఇట్టి పదార్థమును ప్రయోగశాలలో బుట్టింప వచ్చునని తలచిరి. కాని యెక్కుడు సామర్థ్యము గల సూక్ష్మదర్శిని యంత్రముల సహాయమువలన పరీక్షించి పరీక్షించి చూడగా నీ మూలపదార్థమనునది కేవలరాసాయనిక పదార్థముగాక యనేకావయవములుగల యొక యంత్రమనియు, ముడుచుకొనుట, ఆహారమును తినుట, వృద్ధియగుట, సంతానోత్పత్తి మొదలగు జీవలక్షణములన్నియు దీనియందు ఈఅవయవనిర్మాణమువలననే యున్నవనియు దేట తెల్లంబయ్యెను. ఇ ట్లిది జీవయంత్రములలోని యత్యంతసూక్ష్మయంత్రము; ఆదియంత్రము. ఇందులో నుండియే యన్ని జీవములుపుట్టును. ఇది యెటులపుట్టెనన్న విషయ మెవరికిని తెలియదు. ఎన్నియో కోట్ల సంవత్సరములక్రిందట గొన్ని జడపదార్థముల సమ్మేళనము వలన మూలపదార్థము కలిగియుండవచ్చుననియు, అది క్రమక్రమముగా నిప్పుడు మనకు గానవచ్చెడిస్థితికి వచ్చి యుండుననియు గొందఱుశాస్త్రజ్ఞు లూహించెదరు. కాని యివి వట్టియూహ లయియున్నవి. శాస్త్రవిషయములు కావు.

ఇక మనము మూలపదార్థమను యంత్రముయొక్క నిర్మాణమునుగుఱించి కొంత కనుగొందము. మూలపదార్థమనునది యొక సూక్ష్మ బిందువు. బలవంతమైన సూక్ష్మదర్శని బెట్టి చూచినగాని యందలినిర్మాణము మనకు గానరాదు.

ప్రతిమూలపదార్థ బిందువులోను కణద్రవ్యమనియు (Cell substance) జీవ స్థానమనియు (Nucleus) రెండుభాగము లుండును. కణద్రవ్యము వలయొ దీసికొని వానిలోనుండి జీవమునకు ఆవశ్యకములయిన కణద్రవ్యము, రక్తము మొదలయిన ద్రవ్యముల నిర్మించుట. దీనిని ఈశాస్త్రమందు నిర్మాణ జీవనవ్యాపార (Constructive metabolism) మనియెదరు. రెండవది పైనవర్ణించినటుల నిర్మింపబడిన ద్రవ్యముల విఱుగ గొట్టి యందుండి చలనము మొదలయిన జీవనావశ్యకము లయిన శక్తులను వెలువరించుట. దీనిని వినాశ జీవనవ్యాపార మనవచ్చును. ఈ రెండు వ్యాపారములును జీవనమునకు ఆవశ్యకములు. ఇందు మొదటివ్యాపార మాగిపోయి, రెండవ వ్యాపారము మాత్రము నడచుచుండెనేని జీవి కొంతసేపు మాత్రము జీవించి మృతిచెందును. ఈ రెండు వ్యాపారములలో మొదటిది జీవస్థానాథీనము. రెండవది కణద్రవ్యాధీనము. ఏకకణ జీవులను జీవస్థానముగల భాగముగను, జీవస్థానము లేనిభాగముగను రెండు తునకలు చేసినయెడల, జీవస్థానములేని భాగము కొంతకాలము వఱకు చేతనత్వము యొక్క యన్నిలక్షణములును కలిగియుండి, పిదప వృద్ధిగాక మృతినొందును. ఇందుకు గారణ మేమన జీవస్థానములేక కేవలము కణపదార్థముగల భాగమునకు నిర్మాణజీవనవ్యాపారము చేతకాదు. అదివఱకు నిర్మాణవ్యాపారముచే సిద్ధము చేయబడియున్న ద్రవ్యములను దిని చైతన్యమును బుట్టించుకొనుచు కొంతసేపు బ్రతికియుండును. కాని యాద్రవ్యములు కాగానే క్రొత్తవి సంపాదించుకొను సామర్థ్యము లేనందున కరువులో అన్నములేని బీదవానివలె మడయును. జీవస్థానముగల భాగములలో కణద్రవ్యము బహుస్వల్పముగా నున్నను అవి పెఱిగి సంతానోత్పత్తి చేయుచుండును.

ఉత్క్రాంతివాదము.

(The Doctrine of Evolution)

సర్వ జీవములకును మూలపదార్థమే మూలాధార మని చదువరు లిదివఱకే గ్రహించియుందురు. ఈ మూలపదార్థమే యన్ని వృక్షములకును, అన్ని జంతువులకును, కూటస్థ పదార్థమని శాస్త్రజ్ఞుల యభిప్రాయమై యున్నది. అనగా మూలపదార్థముపై అనేక సంస్కారములు జరిగి యీ చతన పదార్థములన్నియు బుట్టినవి. మూలపదార్థ (Protoplasm) మయమైన కణము lలన్నియు మొదట నొక్క రూపముగా నున్న యెడల వికారిణిమొదలు మనుష్యులవఱకు గల జంతుకోటిలో నింత వైధర్మ్య మెందుకు? వాని యంత్రరచన యందును, బాహ్యస్వరూపమునందును ఇంత భేద మెట్లుకలిగెను? అని కొందఱడుగవచ్చును. ఇందుకు, ఒక తలిదండ్రులకు బుట్టిన యన్న దమ్ములలో గొంత పోలిక యున్నను, భేదముండుట మనము చూచుచున్నాము. అన్నదమ్ములకంటె నన్న దమ్ముల కుమారులలో బోలిక తక్కువయై వైధర్మ్య మెక్కువ యగును. ఈప్రకారము తరములు హెచ్చిన కొలదిని పోలిక తగ్గి, వారి స్వరూపములు బొత్తిగా మాఱి, యొకటితో నొకటికి సంబంధము లేనివి యగును. ఇంతియగాక వీరందఱును భిన్నభిన్న దేశములకు బోయి, భిన్న భిన్న వృత్తుల నవలంబించి, భిన్న యాచార వ్యవహారములు గలవారగుదురేని, కొన్ని తరములలో వారు పూర్తిగా మారుదురు. అప్పుడు, వారందఱికి బూర్వమొకప్పు డొక మూలపురుషు డుండెననియు, ఆతనిసంతతివారే వీరందఱనియు జెప్పిన నెవ్వరును నమ్మజాలరు. ఈలాగుననే మూలపదార్థముయొక్క యేకవిధకణములలోనుండి పుట్టిన జీవులన్నియు నానావిధరూపముల దాల్చెను.

ఇట్లు జలచరములనియు, స్థలచరములనియు, పక్షులనియు, మృగములనియు భిన్న భిన్న జాతులుగా గానవచ్చెడి జంతువుల సమూహము దేనికది స్వతంత్రముగా బుట్టలేదు. ఇవి యన్నియు నొకటితో నొకటికి సంబంధము గలిగి యొక దానిలో నుండి మఱియొకటియో, లేక ప్రస్తుతమంతరించిన యనేక జాతులలోనుండి యోపుట్టినవని శాస్త్రజ్ఞులు గట్టిగా జెప్పగలరు. ఏక కణమయమైన వికారిణి మొదలు అత్యంతోన్నత జంతువగు మానవును వఱకును క్రిందినుండి పైవఱకు వచ్చెడి రాజభువన సోపానపరంపరవంటి మెట్లుగలవు. ఈ జంతువు లన్నియు గలసి యొక పెద్దగొలుసువంటివి. వేఱు వేఱు జంతువులు ఈగొలుసులోని కడియముల వంటివి. ఈ గొలుసుయొక్క యొక చివరను వికారిణివంటి యేక కణమయములును, మిక్కిలి తక్కువ విజ్ఞానమును చేతనవ్యాపారములును గలజంతువు లుండును. ఇంకొక చివర అసంఖ్యకణములతోను విచిత్ర యంత్రములతోను జేయబడినశరీరము గలిగినట్టియు, అసాధారణబుద్ధివైభవమును విజ్ఞానమును గలిగినట్టియు మానవుడు గలడు. ఈ యిద్దఱి నడుమనుండు జంతువులు క్రమక్రమముగా శరీరరచనయందును, విజ్ఞానమునందును హెచ్చుచు వచ్చును. ఈలాగు అత్యంత హీనమైన యేకకణమయ జంతువు క్రమక్రమముగా నభివృద్ధియై పూర్వముకంటె గొప్పజంతువుగా మాఱుచు మానవునిగా బరిణమించెను. కావున ఈ వాదమునకు బరిణామవాద మనియు, గ్రిందితరగతి జంతువులు పైతరగతిగా మారునని ప్రతిపాదించుటచే ఉత్క్రాంతి వాదమనియు బేరు. మొదటి పేరు మన యాంధ్రదేశమందును, రెండవపేరు మహారాష్ట్రదేశమందును, వాడుకలోనున్నవి. ఈ వాదమును మొట్టమొదట బ్రతిపాదించినది డార్విన్ అను ఇంగ్లీషు శాస్త్రజ్ఞుడు. మానవుడు గూడ ఇతర జంతువుల తో బాటు ఉత్క్రాంతివలన బుట్టినవాడే గాని యిదివఱకు జను లనుకొనినటుల స్వతంత్రముగాను నకస్మాత్తుగాను బుట్టింపబడలేదని యీసిద్ధాంతము చెప్పు చున్నందున నిది యనేక సంవత్సరములవఱకును జనులకు గ్రాహ్యము కాలేదు. కాని దినదినము ఈ వాదమునకు ననుకూలమైన ప్రబల నిదర్శనములు కావచ్చు చున్నందున బ్రస్తుతము శాస్త్రజ్ఞులలో నూటికి దొంబది తొమ్మిదిమందికి గ్రాహ్యమైనది.

ఈ యుత్క్రాంతితత్వమును అనుసరించి చూడగా మిక్కిలి భేదముగాగనబడు సమస్తవృక్షములును, జంతువులును, జ్ఞాతులయి యున్నవని చదువరు లిదివఱకే గ్రహించియుందురు. జ్ఞాతులలో గొందఱు పది దినముల వారును, కొందఱు మూడుదినముల వారును, కొందఱు అశౌచములేని వారును ఉండుట సహజముగదా? చేపలు, పక్షులు, మానవులు మొదలగువారు మిక్కిలి దూరపు జ్ఞాతులుగాన వారి జ్ఞాతిత్వము త్వరగా దెలియదు. వారిలో నొకరి పోలిక లొకరి కున్నను సామాన్య జనులకు దెలియవు. సమీపజ్ఞాతుల బంధుత్వము కొంచ మాలోచించిన దెలియును. సింహము, పులి, చిఱుతపులి, పిల్లి, మొదలయినవన్నియు నొక్క కుటుంబములోనివి యే యని సాధారణముగా గానవచ్చును. కోతులు మానవులకు మిక్కిలి సమీపజ్ఞాతులని వారియాకార సామ్యత వలన దేట పడగలదు. ఇట్టి సమీప బంధుత్వము త్వరగా సామాన్య జనులకు గూడ తెలియును. కాని దూరపు బంధుత్వములగూడ మనకు దెలియని కొన్ని పోలికల ననుసరించి విద్వాంసులు కనిపెట్టియున్నారు. లోపలి ఎముకలను చక్కగ బరిశోధించి, చెపయొక్క ఱెక్కలును, పక్షుల రెక్కలును, చతుష్పాత్ జంతువుల ముందరి కాళ్లును, మానవుల చేతులును నిర్మాణ విధియందు నొక దాని కొకటి బంధువులనియే శాస్త్రజ్ఞులును నిశ్చయించియున్నారు. ఈప్రకారము సమస్తజంతువులయొక్కయు, వృక్షములయొక్కయు శరీర రచనను పరీక్షించి వాని నన్నిటిని వేఱువేఱు నంశములుగా చర్గీకరణము (Classification) చేసి యున్నారు. ఈ వేఱువేఱు నంశములకును ఎడతెగని సంబంధము గలదు. అందుచే గొన్ని యీవంశములోనివా లేక యావంశములోనివా యనికూడ జెప్పుటకు వీలులేదు. ఇంతియకాదు. కొన్ని జీవులు వృక్షజాతిలోనివా లేక జంతుజాతిలోనివా యని నిశ్చయముగ జెప్పుటకు వీలులేదు. ఇట్లు సమస్త జీవులును ఒక దానితో నొకటి యెడ తెగని సంబంధము గలిగియున్నవి. వేఱువేఱుగ స్వతంత్రించిలేవు.

ఈ యుత్క్రాంతి వాదములో నింకొక యంశము జక్కగ జ్ఞాపకముంచుకొనవలయును. ప్రస్తుతము మనకు భూమిపై గానవచ్చెడి వృక్షములుగాని జంతువులుగాని యల్లప్పుడును ఇప్పటి శరీరాకారమే కలిగియుండలేదు. వీని శరీర రచనలో గ్రమక్రమముగా మార్పులు గలుగుచు వానికి బ్రస్తుతపు ఆకారమువచ్చినది. ఇందుకు నుదాహరణముగా గుఱ్ఱమునుగుఱించి విచారింతము. ప్రస్తుతము గానవచ్చెడి గుఱ్ఱముల కాలికి నొక్క డెక్కయే కానవచ్చును. కాని యెన్నియో లక్షలకొలది సంవత్సరములకు బూర్వమున్న గుఱ్ఱమునకు నైదు డెక్కలున్న టులను కొంతకాలమునకు అనగా గొన్ని తరముల తరువాత అందొకటి యుపయోగములేమిచే క్రమముగా తగ్గిపోయి నాలుగు నిలిచినటులను, తరువాత క్రమక్రమముగా నవితగ్గి యొకటే యైనటులను, భూగర్భమునందు దొరికిన ఈ మృగముయొక్క యస్థిపంజరములచే నిశ్చయింప బడినది. ఇందుచే నిదిమొదట నైదుడెక్కలుగల మృగముల లోనిదియే యని చెప్పవచ్చును. ఈ లాగుననే యన్ని జంతువులను గుఱించి విచారింప సాగినయెడల కాని వాని బంధుత్వములు తేలగలవు. భూమిమీద మొదటినుండియు నిప్పుడు కానవచ్చెడి వివిధ ఆకారములును వివిధ నిర్మాణములును గల జీవులన్నియు లేవు. మొట్టమొదట అవయవ రహిత మైనమూలపదార్థముండెను. తరువాత వికారిణి వంటి యేకకణప్రాణులు పుట్టెను. ఇవి మిక్కిలిమోటువాడును నగ్నముగా నరణ్యమునందు సంఘములేక యేకాకిగా దిరుగువాడును అగు నడవిమనుష్యునివంటివి. ఇట్టి మనుష్యుడు తనకు గావలయుపనులన్నియు దానే చేసికొనును. భక్ష్యమును సంపాదించుకొనుట, దానిని తినుటకు దగినదానిగా వంటజేసికొనుట, ఇల్లుకట్టుకొనుట, తననుశత్రువునుండి రక్షించుకొనుట మొదలయినపనులన్నియు నెవనికి వాడే చేసికొనుచుండును. అది జంతువర్గములోని వికారిణియొక్క స్థితియు నిట్టిదియే. హెచ్చు తరగతి జంతువులలో స్నాయువులుచేయు శారీరిక సంకోచ వికాసములును, మజ్జా జ్ఞానతంతువులచే గలుగు స్వేచ్ఛాచలనము బాహ్యపదార్థ జ్ఞానము మొదలయిన వన్నియు ఈ యేకకణమే చేయును అని చదువరులు మూలగ్రంథముయొక్క మొదటి ప్రకరణమువలన దెలిసికొన గలరు. ఈ జీవకణమునుండి ద్విఖండవిధానమువలన ననేకకణములు పుట్టుచుండును. ఇందు గొన్ని యొక్క చోట గలసియుండి కొంచెము పైజాతిజీవు లగును. పైన జెప్పిన అరణ్యమానవుని కంటె గొంచెము హెచ్చుతరగతి మానవులు ఒక చోట గలసి యుందురు. వీరు ఎవరిపనులు వారే చేసికొనుచుందురు. ఒక్కచోట కలసి యుందురని యే గాని సంఘ నేమములుగాని, కట్టుబాటులు గాని వారికుండవు. ఎవరికి వారు స్వతంత్రులు. కోయ, చెంచు, ఎఱుకు మొదలయిన యరణ్య జాతు లిట్టివి. జీవసృష్టిలో వీరికి, బోల్చదగినజీవు లనేకములు కలవు. నిలచియున్న నీళ్లలో గానవచ్చెడి పసిరికపోగులు మొదలయిన నిట్టివి. వాని నిర్మాణములో ననేకకణములు కానవచ్చును. అవియన్నియు గలసియున్నను, అందు ప్రతికణమును స్వతంత్రముగా దన భక్ష్యసంపాదనము, ఉదర, భరణము, సంతానవృద్ధి మొదలయినవి చేయుచుండును. జంతువులలో ప్రదాళ కీటకములు (పగడపు పురుగులు) ఇట్టివి. ఒక ప్రకాండమునకు సెట్టు లనేక కొమ్మ లంటుకొని యుండునో యటులనే మధ్య ప్రవాళమున కీ కీటకములన్నియు ---ణాది క్రియలు చేసికొనుచుండును. ఇ ట్లివి తమ జీవనక్రియలు స్వతంత్రముగా జరుపుకొనుచున్నను, ఒక్కచోట గలసి యున్నందున వీని సంఘమును జూచి శత్రువులు వీనిపైకి సాహసించిరా నేరవు. ఇతర యాదిభౌతిక బాధలును వీనిని అంతగా బాధింపవు. నాచు ప్రవాళ కీటకములు గుంపులుకూడి యొక్కచో నున్నందున నీళ్లకుగొట్టుకొనిపోక నిలిచియుండును. అందుకే 'సంఘే శక్తి:' అను వచనముపుట్టినది. స్పాంజుకీటకములుగూడ పైకీటకముల వంటివే. ఈజీవులు వృక్షజాతిలోనివా లేక జంతుజాతిలోనివా యని కొంతకాలము వఱకు శాస్త్రజ్ఞులకు సంశయముండెను. కాని యవి యేకకణమయము లయిన యాదిజంతువుల లోనివే యని. యిప్పుడు నిశ్చయ మైనది. బాజారులో దొరుకు స్పాంజు, ఇట్టిలీటకములయిల్లు. ఈకీటకములు తన జీవనవ్యాపారములన్నియు స్వతంత్రముగా జేసికొను చున్నప్పటకి, అన్నిటికి గావలసిన నీటిని తమ యింటిలోనికి దెచ్చుటయు, అక్కరలేని నీటిని వెలుపలకు బంపుటయు, అను క్రియలన్నియు గలిసిచేయును.

ఒక కణము అనేక కణములుగా జీలి యీకణములన్నియు నొకటితో నొకటికి సంబంధము లేకుండ విడివిడిగా నున్న యెడల ఎన్నటికిని హెచ్చు తరగతి జీవులు పుట్టియుండవు. కొంత కాలమునకు, ఒక కణము చీలి యేర్పడిన యనేక కణములు విడిపోయి స్వతంత్రముగా నుండుట మాని కలిసి యొకటి గానుండును. ఇట్లుండుటయేగాక జీవనమునకై కావలసిన వ్యాపారము లన్నియు అన్ని కణములు చేయుటమాని, కొన్ని కణములు కొన్ని వ్యాపారములును, మఱి కొన్ని కణములు మఱి కొన్ని వ్యాపారములును చేయబూని యీకణములన్నియు గూడి యొక్కజీవియగును. వెలుపల నున్న కణములు శీతోష్ణముల యెడతెగని సహవాసముచే గట్టివై వెలుపలిచర్మముగ నేర్పడును. లోనివి మృదువుగ నుండును. జీవనమునకు గావలసిన పదార్థములను వెలుపలనుండి సంపాదించు పని కొన్ని కణములపై బడినందున నవి క్రమక్రమముగా హస్తాదికర్మేంద్రియములుగా మారును. లోనికణములకు ఆహారముజీర్ణము చేయుపని ప్రాప్తించుటచే నవి జీర్ణకోశాదియాకారములను దాల్చును. ఇట్లు భిన్న భిన్న కణములలో శ్రమవిభాగము (Division of labour) గలిగి జీవులకు హెచ్చుతరగతిప్రాప్తమగును.

మానవుల సంఘములకును, జీవులకును పోలిక యిదివఱకు మనము కనిపెట్టుచు వచ్చుచున్నాము. ఏమానవ సంఘములో వేఱువేఱు మానవులు వేఱు వేఱు పనులు జేయుచుందురో యది యధిక నాగరీకత జెందిన దని మనము చెప్పవచ్చును. ప్రతి మానవుడును, తన పొలమును తానేదున్నుకొని, తన బట్టలు తానేనేసికొని, తన యిల్లు తానే కట్టుకొను సంఘముకంటె, వ్యవసాయము చేయువారు వేఱుగను, బట్టలు నేయువారు వేఱుగను, ఇండ్లు కట్టువారు వేఱుగను, కుండలు చేయువారు వేఱుగను, కరణము పని చేయువారు వేఱు;గను, ఏర్పడిన గ్రామసంఘము శ్రేష్ఠముగదా ఇటులనే జంతు శరీర రచనను గుఱించి యెఱుగునది. జీవవనవ్యాపారములు చేయుటకు నొక్క యవయవము కల జంతువులకంటె రెండు అవయవములు కల జంతువు శ్రేష్ఠమైనది; అంతకంటె మూడుయవయములు కలది గొప్పది; దానికంటె నాలుగు, అవయవములుకలది యధికమైనది. ఈ లాగుననే యితర హెచ్చు తరగతి జంతువులను గుఱించి యెఱుగవలయును.

పైన వర్ణింప బడినటుల వేఱువేఱు కణములకు వేఱువేఱు పనులేర్పడి క్రమముగ నొకటికంటె శ్రేష్ఠమైన మఱియొకజంతువు పుట్టసాగెను. ఈలాగు జలచరములును, జలస్థల చరములును, కేవల స్థలచారములగు చిన్న జంతువులును, చరుష్పాద్ జంతువులును, మనుష్యులా యేమియనదగు వానరములును, మనుష్యులును, క్రమక్రమముగా నొకదానికంటె నొకటి హెచ్చు తరగతివి యగు జంతువులు భూమిపై బుట్టెను. ఈ ప్రకార మాయుగమున కాయుగమునకు బెద్దపెద్దవియగు జీవు లుదయించుచు సృష్టియందు నుండుట కనర్హమగు, అనేక జంతువులజాతులు పూర్తిగా నశించుచు, గొన్ని జాతులు శరీర రచనయందు నభివృద్ది జెందుచు దుదకు భూమిపై మనుష్యు డుదయించెను. ఈ మానవుండెట్లు ఒక జీవకణములో నుండి బయలుదేరి క్రమముగా ననేక జంతువుల శరీరములను దాల్చి తుద కీరూపమును దాల్చెను. పైని వర్ణించినటు లనేక కణమయమగు జంతువు చేతన సృష్టికి శిరోభూషణమనం దగు మానవుని గా మారుటకు నెన్నియో లక్షలు కోట్లుసంవత్సరములు పట్టినవి. ఇది నూఱు సంవత్సరములలో గాని వేయిసంవత్సరములలో గాని యైన పనిగాదు.

ఇంతవఱకు మేము పరిణామ వాదమును గుఱించి చెప్పిన యంశములకు రుజు వేమైనను కలదా యని చదువరు లడుగవచ్చును. ఇందుకు శాస్త్రజ్ఞులు నలుబది యేబది సంవత్సరములనుండి మిక్కిలి శ్రమపడి, మీకేమి తెలియును? మీకేమి తెలియును? అని గుట్టను, చెట్టును, రాతిని, మృత్తికను, సముద్రమును, జంతువులను, మఱియు భూమి మీది చేతనాచేతనాత్మకమైన సమస్తపదార్థములను అడిగి యడిగి ప్రబలమైన ముగ్గురు సాక్షులను సంపాదించిరి. ఈ ముగ్గురుసాక్షులు నమ్మదగిన వారును, ఒకరితోనొకరికి సంబంధము లేనివారును అయియున్నారు. వా రెవరంటిరేని:-

1. భూగర్భ శాస్త్రము (Geology)

భూమిని త్రవ్విన కొలదిని అందు పొరల క్రింద బొరలు కానవచ్చును. భూమి క్రమముగా బెరిగినందున నిట్టిపొర లేర్పడినవి. క్రిందికి బోయిన కొలదిని పైపొరకంటె గ్రింది పొర పురాతన కాలమును జూపుననుట విదితము. ఆయా పొరలలో ఆకాలమునందు నుండిన వృక్షముల యొక్కయు, జంతువులయొక్కయు శిలారూపమయిన (Fossil) దేహములు కానవచ్చు చున్నవి. వానివలన జంతువులు క్రమక్రమముగా నెట్లు శరీరరచనలో మారినదియు బాగుగ దెలిసికొనవచ్చును. ఈ శిలారూపముల విశేష స్వరూపము, అందువలన మనము చేయదగు అనుమానములు మొదలయిన వానిని గుఱించి మేము ప్రకటింపబోవు భూగర్భశాస్త్రములో బటములతో మిక్కిలి వివరముగా వర్ణింపబడును.

2. పిండోత్పత్తిశాస్త్రము

(Embriology)

గర్భధారణ సమయమునుండి జననము వఱకు పిండముయొక్క మార్పులను గనిపెట్టి వర్ణించెడి శాస్త్రమునకు పిండోత్పత్తిశాస్త్రమని పేరు. ఈశాస్త్ర జ్ఞులు ఒక్క మానవ పిండమునే పరీక్షింపక సమస్త జంతువుల పిండములను పరీక్షించిరి. పిండోత్పత్తి సమయమునుండి శిశువుపుట్టువఱకును వీనియభివృద్ధిజూచిన, అవి పూర్వము ఉత్క్రాంతి మార్గమున నేయేరూపములను ధరించెనో, యాయారూపములను కొంతకాలమువఱకైనను ధరించును అని తెలియుచున్నది. ఏనుగు, పంది, ఆవు, కోతి, మానవుడు మొదలగు నత్యంతభిన్నా కారములు గల జంతువులన్నియు బిండోత్పత్తిసమయమున ఏక కణమయములయి యేకా కారములుగనుండును. పిండోత్పత్తియైన తరువాత గొన్ని దినములవఱకును ఈపిండములన్నియు సమానముగానేవృద్ధి జెందును. ఇందుమానవపిండమునుగుఱించి కొంచెము విచారింతము. మొట్ట మొదట నీ పిండ మేక కణమై యుండును. అప్పుడు వానిని ఏక కణమయములగు వికారిణి వంటి యాదిమ జంతువులతో బోల్చవచ్చును. తరువాత ఈ ఏకకణము రెండు కణములుగాను, అవి నాలుగు, ఎనిమిది, పదియాఱు, ఈ లాగున నభివృద్ధియై యొకటి నొకటిని అంటుకొని ముద్దవలె నుండును. అప్పు డాపిండమును, ప్రవాళ కీటకములతోగాని, బూజు కుక్క గొడుగులతో గాని కొంతవఱకు పోల్చవచ్చును. ఈ ప్రకార మీ పిండ మభివృద్ధియైన కొలదిని హెచ్చుతరగతి జంతువుల స్వరూపములను దాల్చుచు తుదకది మనుష్యాకృతి దాల్చును. ఇటులనే యితర ప్రాణులను గుఱించియు నెఱుగునది.

3. శరీర స్థూలనిర్మాణ శాస్త్రము.

(Anatomy)

ఈశాస్త్ర మిచ్చెడిసాక్ష్యము పరిణామవాదమునకు మిక్కిలి యనుకూలమైనది. హెచ్చుతరగతి జంతువు లన్నిటి యొక్క నిర్మాణమునందును శరీరము నిలువబడి యుండు నిమిత్తమై యాధారముగా అస్థిపంజరము (Skeleton) ఉండును. ఇంటికిని బందిరికిని స్తంభము లెటువంటివో యీయస్థులును శరీరమున కటువంటివి. వేఱువేఱు విధమైన కండరములు (Muscles) ఈ యస్థులను జోడించును. ఇవి యన్నియు జర్మచక్షువులకు గానవచ్చును. వీనిని గుఱించి వివరించెడు శాస్త్రమునకు శరీర స్థూలనిర్మాణశాస్త్రమని పేరు. వేఱువేఱు జంతువుల స్థూల శరీర నిర్మాణములను పోల్చిచూచెడు శాస్త్రమునకు స్థూలనిర్మాణ తాతతమ్యశాస్త్రము (Comparative Anatomy) అని పేరు.

ఈయస్థులలోని సామ్యముల గనిపెట్టినయెడల ఏయేజంతువుల కెట్టిసంబంధముకలదో స్పష్టముగ దెలియును. పైమాంసము, చర్మములవలన వేఱు వేఱుగా గానవచ్చినను, లోపలిఎముకల బరీక్షించినయెడల, పక్షి రెక్క, కోతికాలు, మనుష్యుని చెయ్యి ఈ మూడును ఒక విధమైనవియేయని తేలగలదు. కొన్ని కోతుల యస్థిపంజరములను, మానవును యస్థిపంజరమును ఒక్కచోట నుంచి చూచిన యెడల ఈ ప్రాణుల కన్నింటికిని మిక్కిలిదగ్గిర సంబంధము కలదని స్పష్ట పడగలదు.

జీవశాస్త్రమును అభ్యసించు విధము.

పైని పేర్కొన బడిన యంశములన్నియు జ్ఞాపకముంచుకొని యీ గ్రంథ మంతయు జదివిన యెడల నది చక్కగ బోధపడ గలదు. జీవశాస్త్రము ద్విభాగాత్మకమని యిదివఱకే చెప్పియున్నాము. ఇప్పు డీగ్రంథమునందు జంతువులు కొన్నియు వృక్షములు కొన్నియు నొక దానిప్రక్కనొకటి వర్ణింప బడుచు వానికి గలసంబంధ బాంధవ్యములును, తారతమ్యములును సూచింపబడినవి. అందు జంతువులకు వృక్షములకు గల సంబంధములు 1-వ పుట మొదలు 218-వ పుటవఱకు నుండు మొదటిభాగమున వర్ణింపబడినది. వృక్షజాతుల గూర్చిన ప్రత్యేక విషయములు 214-వ పుట మొదలు 321-వ పుట వఱకు రెండవభాగమును వ్రాయబడినవి.

ఈ జీవశాస్త్రమే గాక యేభౌతిక శాస్త్రమైనను శ్రద్ధతో జదువనిది బోధపడ నేరదు. శాస్త్రములు కథలవంటివికావు. సులభ శైలిన వ్రాయబడినను విషయప్రవేశము లేనివారికి నవి మొదట గొంచెము కఠినముగా నుండును. కాని యంతమాత్రమున దానిని విడవకూడదు. తెలియనివాక్యమును మిగుల శ్రద్ధతో రెండుమూడు పర్యాయములు చదువవలెను. మొదట చదివిన యంశమును గట్టిపఱచుకొని ముందుకు పోవలయును. అటుల చేయక మొదట చది విన దానిని మరచి ముందుకుఁ బోయిన యెడల రెండును బోధపడనేరవు. ఒకానొకప్పడు ఎన్ని పర్యాయములు చదివినను బోధపడనివాక్యము లున్నయెడల అచ్చట పెన్‌సిలుతో గుర్తులు పెట్టుకొని పుస్తకమంతయుఁ బూర్తిచేసినతరువాత వానిని తిరిగిచదివినయెడలఁ బూర్వపర సంబంధములను బట్టి యవి బోధ పడగలవు. ఈగ్రంథములో పర్ణింపబడిన పదార్థయలలో ననేకము లత్యంతసూక్ష్మములు, చర్మ చక్షువులకుఁ గానరావు కావున సూక్ష్మదర్శిని యనుదివ్యదృష్టిని సంపాదించి యిందువర్ణింపఁ బడినపదార్ధముల బ్రత్యక్షముగఁ జూచుచు శాస్త్రమునభ్యసించినయెడల నది యధికసులభముగను అధికత్వరలోను బోధ పడtగలదు, సూక్ష్మదర్శనియొక్కపటము ఈ గ్రంథారంభమున నీయబడినది. ధాని వర్ణనకై 338-వ పుటయందలి పరిశిష్టము చూడనగు.

కె.వి.లక్ష్మనరావు

సంపాదకుడు