|
శ్రీరామాస్తనమండలీమిళితకాశ్మీరార్ద్రవక్షంబుతోఁ
బారావారతరంగసంగతలసత్పర్యంకనాగంబుపైఁ
గారుణ్యామృతపూరపూరితకటాక్షశ్రీలఁ బెంపొందు గం
భీరస్వాంతుఁ డనంతుఁ డాశ్రితజనాభీష్టప్రదుం డెల్లెడన్.
| 1
|
చ. |
అతని దశావతారవిభవాతిశయంబున లోకమెల్ల శా
శ్వత మగుచాడ్పునన్ భజనసమ్యతరల్గదశాక్షరాభిశో
భితమగు వాక్ప్రపంచమది పెద్దయుఁ బ్రస్తుతి నొందనట్టిచో
నతఁడును నమ్మహాక్షరచయంబు జయంబు నొసంగుఁగావుతన్.
| 2
|
క. |
శ్రీవల్లభుయతిగణసం
సేవితపాదారవిందుఁ జింతితఫలదున్
భావజగురునలఘుచ్ఛం
దోవినుతు ననంతశయనుఁ దోయజనాభున్.
| 3
|
క. |
ఛందోరీతిగ విమల
చ్ఛందుఁ డనంతుం డొగిం బ్రశంసించి కృపా
మందిరులగు శ్రీమద్గో
విందగురుప్రభులదయఁ బ్రవీణుండగుచున్.
| 4
|
క. |
విద్యలలోపల నుత్తమ
విద్య కవిత్వంబు మఱి కవిత్వము ఛందో
వేద్యము గావునఁ జెప్పెను
హృద్యంబుగఁ గవితచందమేర్పడఁ గృష్ణా!
| 5
|
గీ. |
పరఁగుఁ గవితగద్యఁపద్యంబు లనఁ బాద
కల్పనంబువలదు గద్యమునకు
పాదనియతినొప్పుఁ బద్యంబు లవియు వృ
త్తములు జాతు లనఁగ నమరుఁ గృష్ణ!
| 6
|
క. |
వృత్తంబులు గణబద్ధము
లుత్తమమగు జాతులెల్ల నొనరఁగ మాత్రా
యత్తంబులు లఘువగుఁ బురు
షోత్తమ యొక మాత్ర గురువు నొదవు ద్విమాత్రన్.
| 7
|
క. |
వివిధముగఁ జాఁపిపలికెడు
నవియును మఱియూఁది పలుకునవియును గురువుల్
భువి నిలిపిపలుకు వర్ణము
లవియెల్లను లఘువులయ్యె నంబుధిశయనా!
| 8
|
క. |
గురు వమరు నూర్ధ్వపుండ్రము
ధరియించినరీతి, లఘువు దనరును హరియొ
క్కరుఁడ పరతత్త్వ మనుచును
సురుచిరముగఁ జుట్టివ్రేల జూపినమాడ్కిన్.
| 9
|
క. |
గోవిందప్రభుఁ డనినన్
గోవిదు లవి మూఁడుమూఁడు గురులఘువులుగా
భావింతురు గురులఘువులు
మోపఁగ మూఁడేసి నిక్కముగ గణములగున్.
| 10
|
క. |
భజన సమయరతగణములు
భజన సమయరతములై సభక్తికమతిఁ బం
కజనాభు నహర్నిశమును
భజించు దిక్పాలగణవిభాతిఁ దనర్చున్.
| 11
|
గీ. |
గురులఘువు లోలిమూఁడేసి కూడిన మన,
లాదిమధ్యావసానంబులందు గురువు
లొంద భజసలు, లఘువు లట్లొంద యరత
లనఁగ నయ్యష్టగణము లొప్పును ముకుంద!
| 12
|
క. |
చను మగణము 'శ్రీనాథా'
యనిన, 'ముకుందా' యనంగ యగణము, రగణం
బన నొప్పు 'మాధవా' యన,
నొనరఁగ 'వైకుంఠ' యనఁగ నొగిఁ దగణమగున్.
| 13
|
క. |
భగణమగు 'విష్ణుఁడ'నఁగా,
సగణితముగ జగణ మగు 'మురారి' యనంగా,
నగణము 'విభుఁ డ'నిపలికిన,
సగణము 'వరదా' యనంగ సత్కృతులందున్.
| 14
|
క. |
గురువును లఘువును లఘువును
గురువును హవలగును, గలలు గురులఘుసంజ్ఞల్
వరుసను గగ లల గణముల
కరయఁగ వర్ణములు ద్విగుణమై యొప్పు హరీ!
| 15
|
క. |
'శౌరి' యనిన హగణంబగుఁ,
జేరి 'హరీ' యనఁగ నుల్లసిల్లును వగణం
బారయఁ 'గృష్ణా' యనినను
ధారుణి గగ మండ్రు, లలము దా 'హరి' యనినన్.
| 16
|
సీ. |
'కమలనాభా' నగగంబు 'కమఠరూప'
నహ 'మసురాంతక' నాఁగ సలల
|
|
|
'మద్రిధర' భలంబు 'భద్రయశా' యన్న
భగురు 'వంభోజాక్ష' మగణలఘువు,
'భువనేశ్వరా' యన్న సవ 'మఘవిద్వేషి'
సహము 'పీతాంబర' సంజ్ఞ తలము,
'కైటభారి' రలంబు 'గజవరదా' యన్న
నవ 'మహిశయన' నా నలలమయ్యె
|
|
ఆ. |
రగణగురువు 'దేవరాజా'యనంగఁ 'బ
ద్మావతీ' యనంగ దగణగురువు
'నరహరీ' యనంగ 'నరహరి' 'నరసింహ'
నాఁగ నొప్పు నగము నలము సలము.
| 17
|
క. |
ద్విత్రిచతుర్గురుభవముల
ధాత్రీధర రెండు [1]మడఁపఁ దక్కినగణముల్
మిత్రేంద్రచంద్రు లనఁ జను
మాత్రాదిగణంబు మొదల మాత్ర లిడంగన్.
| 18
|
క. |
గలనగణము లినుఁ; డింద్రుఁడు
నలనగసలభరత, లింక నగగ నహ సలా
భల భగురు మలఘు సవ సహ
తల రల నవ నలల రగురు తగ లిందుఁ డజా!
| 19
|
గీ. |
ఒక్క నెలవున నెనిమిది యొకట నాల్గు
వెండి లఘువెక్కినవి నాల్గు వీనిలోన
నగణపునరుక్తి నొక్కటి డిగియె నౌల
దొంతి పదునాల్గు నిరువదితొమ్మిదింట.
| 20
|
[2]క. |
జగణము నలమగు గగములు
భగణములగు గలము నగణభావంబుఁ గనున్
సగము నగణ వగణములగుఁ
దగణము భలమగును సంయుతముఁ దీర్చినచోన్!
| 21
|
[3]క. |
మొగిళులు నలమగు నిటులన్
నగణము సగణమగు నిటు లనంగుని తండ్రీ!
తగణము పాళు లనంగా
భగణము వాకిళ్ళు భలము వాకిళులనఁగన్.
| 22
|
. |
నవ్యసుఖప్రదాయి భగణంబు, జకారము రుక్ప్రదంబగున్,
ద్రవ్యముఁ జేయు నా, లయకరంబు స కారము, మా శుభంబు, యా
దివ్యసువర్ణకారి, వెతఁదెచ్చును రేఫ, విభూతినిచ్చుఁ దా,
గావ్యములందు నాదినిడఁ గర్తకు భర్తకు నంబుజోదరా!
| 23
|
. |
భగణము నేలుఁజందురుఁడు, భానుఁడు దా జగణంబు నేలుఁ, దా
నగణము నేలు నిర్జరగణంబుఁ, సమీరణుఁ డేలు నెప్పుడున్
సగణము, నుర్వియేలు మగణంబు, నొగిన్యగణంబుఁ దోయమున్,
రగణముఁ బావకుండుఁ, దగణంబు నభంబును నేలుఁ, గేశవా!
| 24
|
కృత్యాది వర్జనీయ గణములు నక్షరములు
క. |
పుర, శర, రస, గిరి, రుద్రుల
నరయ నకచటతప లిడుట యనుచిత మయ్య
|
|
|
క్షరములును రసభజంబులుఁ
బరిహరణీయంబు లాదిఁ బంకజనాభా!
| 25
|
క. |
మొదలును కఖజలు చఛడలు
దధలును భయశక్షషసలు తగ వుపవర్ణా
స్పదములు గాకుండిన మే
లొదవించును స్వరములెల్ల నుత్సవకారుల్.
| 26
|
క. |
మొదల నభంబులు రెండును
గదిసిన విభవంబు తభసగణసంగతి యొ
ప్పదు రయముల నధికశుభం
బొదవును భయములను హానినొందు నృసింహా!
| 27
|
క. |
ఒనరఁగ శుభవాచకములు
ఘనతరమగు దేవవాచకంబులు నై పే
ర్చినగణములు వర్ణంబులు
ననింద్యములు కృతుల మొదల నహిపతిశయనా!
| 28
|
క. |
ప్రాసం బగు రెండవయది
వాసనగల మొదలి వ్రాయి వడి యనఁబరఁగున్
బ్రాసంబు లన్ని యెడలను
బాసురముగ వడులు పాదపాదముల హరీ!
| 29
|
క. |
ఆదిని గురులఘువులలో
నేది నిలిపె నదియె మొదల నిడి పాదము లు
త్పాదింపవలయు నుపజా
త్యాదుల మిశ్రములఁ దక్క నంబుధిశయనా!
| 30
|
ఆ. |
కుటిలకుంతలములు నిటలంబుపైఁ దూల
నోట లేక ధేనువాటమునకు
నదె యశోదపట్టి కదలెఁ బొమ్మనినఁ బ్రా
సాది తేటపడుఁ బ్రమోద మొసఁగ.
| 31
|
ఆ. |
నందనుతుఁడు నాఁగ సౌందర్యనిధి యన
నమరు బిందుపూర్వకము మొదలను
బక్షిగమనుఁ డన నధోక్షజుఁ డన సంయు
తాక్షరాది చెల్లు నసమగురువు.
| 32
|
ఆ. |
అర్ధబిందుసహిత మగువర్ణమునకుఁ బ్రా
సాది యరయ నిడుదయక్కరంబు
నేఁడు మనకుఁ గల్గినాఁడు లక్ష్మీనాథుఁ
డేఁటి కింక నేఁడు మాట లనఁగ.
| 33
|
ఆ. |
కుఱుచమీఁదిసున్న మఱి తేల వ్రాయఁ బ్రా
సద్వయాది నిట్లు జరగు నచ్యు
తుఁడు సమస్తవల్లభుఁడు నాఁగ నయ్యచ్యు
తుండు సకలవల్లభుండనంగ.
| 34
|
మఱియు ద్వాదశవిధ ప్రాసములు
క. |
సమనామ ప్రాసము ప్రా
సమైత్రి ఋత్రిలును ప్రాది సమలఘువు విక
|
|
|
ల్పము బిందు వర్ధబింబ్వా
ఖ్య ముభయ సంయుక్త సంధిగత సంజ్ఞికముల్.
| 35
|
క. |
అరసున్నలు నెఱసున్నలు
నొరసినవర్ణములు జడ్డయును [4]బ్రాసములై
బెరసినచో సమవర్ణము
లరసి నిలుపవలయుఁ దోయజాసనజనకా!
| 36
|
1. సమప్రాసము:-
క. |
వరువడిఁ బ్రాసములు సమా
క్షరసంశోభితములయినఁ, జాలును మఱి త
త్స్వరవైసాదృశ్యంబులు
పరిహరణీయంబు లందుఁ బంకజనాభా!
| 37
|
ఆ. |
వీఁడె కృష్ణుఁ డల్లవాఁడె ప్రలంబారి
కొండ యెత్తె నితఁ డతండుద్రవ్వె
నొడ్డగెడవుగాఁగ దొడ్డరా జేలెడి
వీడుఁ నాఁగ బ్రాస మీడువచ్చు.
| 38
|
గీ. |
ఆయుపేంద్రుని బొడఁగాంచు టేయుపాయ
మనెడు దీర్ఘాదు లచట హ్రస్వాదు లయిన
నయ్యుపేంద్రుని బొడఁగాంచు టెయ్యుపాయ
మన సమప్రాస మగు నూఁదఁజనదు రహల.
| 39
|
2. ప్రాస మైత్రి:-
గీ. |
లళలు రెండును నొండొంటఁగలసి వచ్చు
నమరు నన్యోన్యమును ఋయుతాయుతములు
బిందుపూర్వమై తమలోనఁ బొందు బమలు
ప్రాసమైత్రికి నిది స్వరూపంబు దెలియ.
| 40
|
ఆ. |
నీలవర్ణు గర్భగోళంబు నందు లో
కంబు లెల్ల నుండు నెమ్మితోడ
శ్రీకినొడయఁ డుజ్జ్వలాకృతి యితఁ డన్నఁ
బ్రాసమైత్రి యిట్లు పరంగుఁ గృష్ణ!
| 41
|
గీ. |
తగ ఋకారాన్వితంబు ద్విత్వంబు గాఁగఁ
బరఁగు నచ్చపుజడ్డతోఁ బ్రాసమైత్రి
యక్కృపానిధి హరిఁగని మ్రొక్కి రనఁగ
సంభృతాశ్రితుఁ డతిశయోజ్జృంభుఁ డనఁగ.
| 42
|
3. ఋ ప్రాసము:-
క. |
అరయ స్వరగణ మయ్యు ఋ
కారము ఋప్రాస మనఁగఁ గదియును రేఫన్
జేరి తనయురముఁ దన్నిన
యాఋషిపాదంబుఁ బిసికె నచ్యుతుఁ డనఁగన్.
| 43
|
గీ. |
తెల్లమిగ ఋకారము యణాదేశవశత
రేఫ యగుఁట బ్రాసంబయ్యె రేఫ కిట్టు
లిదియె పరవర్ణయుత మయ్యెనేని ప్రాస
మైత్రి యగుఁ గాని రేఫసంబంధి గాదు.
| 44
|
4. త్రిప్రాసము:-
గీ. |
సంఖ్యఁ బలుకుత్రికారంబుఁ జనుఁ దకార
సదృశమై త్రికారప్రాససంజ్ఞ గలిగి
యాత్రివిక్రముఁ డభయప్రదాత యనఁగ
వాక్త్రిపథగోజ్జ్వలులు విష్ణుభక్తులనఁగ.
| 45
|
గీ. |
ఈత్రి కారంబునకుఁ దీయ యెసఁగఁ గ్రింది
రేఫ సంప్రసారణమున ఋత్వ మయి తృ
తీయయగు నీత్రికార మర్దించి చూడ
నాతకారంబునకుఁ బ్రాసమయ్యె నచట.
| 46
|
గీ. |
ఇ ఉ ఋ ఌ ల కచ్చు పరమగునేని
య వ ర లాదేశ మగునట్టి య వ ర ల లకు
నడరి ఇ ఉ ఋ ఌ లాదేశ మయ్యెనేని
యది కృతుల సంప్రసారణ మండ్రు బుధులు.
| 47
|
5. ప్రాదిప్రాసము:-
గీ. |
ప్రాదియై యనశబ్దంబు ప్రాణ మగుటఁ
బరఁగ నణలకు వేర్వేఱ ప్రాసమయ్యె
క్షోణిధరుఁ డెత్తె నేనుఁగు ప్రాణ మనఁగ
దానవారాతి వ్రేతలప్రాణ మనఁగ.
| 48
|
6. సమలఘు ప్రాసము:-
గీ. |
ఓలి రేఫతోఁగూడియు నూఁదఁబడక
తేలి తెలుఁగునఁ దమయట్టి వ్రాలతోన
సమలఘుప్రాస మగు ఱెక్కలమరఁబట్టి
విద్రిచె నసురఁ గృష్ణుఁడు దిక్కు లద్రువ ననఁగ.
| 49
|
7. వికల్పప్రాసము:-
గీ. |
సానునాసికలౌ వర్గహల్లులకుఁ దృ
తీయములు వికల్ప ప్రాసమై యెలర్చు
ప్రాఙ్నగంబుపై రవిదోచెఁ నగ్ని వోలెఁ
బ్రాఙ్ముఖుండై నుతించె నీవాగ్మి యనఁగ.
| 50
|
8. బిందుప్రాసము:-
గీ. |
వేర్చి పొల్లు నకారంబు బిందు వగుచు
మీఁదనున్న ధకారంబు నూఁదఁ బ్రాస
బంధమగుఁ గృష్ణుఁ డుదయించినం ధరిత్రి
యంతయును నిరుపద్రవం బయ్యె ననఁగ.
| 51
|
9. అర్ధబిందుప్రాసము:-
గీ. |
సార్ధబిందువు లై తేలినట్టి పటల
కరయఁ బ్రాసంబు నిర్బిందు వైనఁ జెల్లు
వీఁపు మూఁపులు మఱి తలమోపు లయ్యె
మాట లేఁటికి మేటి తాఁబేఁటి కనఁగ.
| 52
|
10. ఉభయప్రాసము:-
క. |
చూడఁగ లకారరేఫలు
గూడుడకారంబు చను నకుంఠిత గతిఁదో
డ్తోడన నుభయప్రాసము
జాడఁబడును సంయుత ప్రసంగతిఁ గృష్ణా!
| 53
|
ఆ. |
పాఁడి మరగి బ్రతుకువాం డ్రిల వ్రేఁతలు
వాండ్ర వెన్న లేలఁ దండ్రి! యనఁటి
|
|
|
పండు కొఱకు వింత యిండ్లకు బోకు కృ
ష్ణుండ నీకు బ్రాఁతె పండ్లు నిచట.
|
|
గీ. |
రలయుతాయుత ప్రాస మార్గము దలంచి
వాండ్ల లేఁ జూపు మోముఁల దీండ్లమారె
ననుచు రెండును గూర్చిన ననువుఁదప్పు
నండ్రు నిఖిలార్థవిదు లైన దండికవులు.
|
|
11. సంయుతప్రాసము:-
ఆ. |
పాడు నూరు ప్రోలు బహువచనంబులై
పరఁగుచుండు నూఁది పలుకు నపుడు
తేల్చి పలుకునపుడు దీపించు సంయుత
ప్రాస మిరుదెఱఁగుల బద్మనాభ!
| 55
|
ఆ. |
పాళ్ళు మనుజు లెక్క నూళ్ళు గాఁదొడఁగె న
య్యూళ్ళు మిగుల బలసెఁ బ్రోళ్ళు గాఁగ
భాగ్యవంతుఁ డేలుపాళులు నూళులు
ప్రోళు లయ్యె బ్రాతె కూళులిచట.
| 56
|
ఆ. |
తెలుఁగునందు లేదు లలిఁ గ్రిందిసుడి గ్రుచ్చె
గ్రుమ్మెనాఁగ రేఫకొమ్ము గాని
ప్రాసమైత్రి చొరదు దా సంయుత ప్రాస
మగును రేఫయుతము ననుసరించి.
| 57
|
క. |
ఈ క్రిందటి రేఫలుసమమై క్రాలు
చుఁదేలి ప్రాసమగు సంయుక్తం
బా క్రూర నక్ర భయమున, వాక్రువ్వ
దె గజము భక్తవత్సలుననఁగన్.
| 58
|
12. సంధిగతప్రాసము:-
క. |
ధ్రువముగ సంధిజనితరూ
పవిశేషప్రాస మనఁగ బరఁగు పకారం
|
|
|
బవిరళవకార మగు న
య్య వదాఱవపా లెఱుంగ ననఁగ ముకుందా!
| 59
|
క. |
ప్రథమాంత విభక్తులపైఁ
గథితములగు కచటతపలు గసడదవలగున్
బృథివి నివి గజడదబలగుఁ
బ్రథమపు సున్న లగునాంత పదములమీఁదన్.
| 61
|
ఉదాహరణము:-
గీ. |
వాఁడు గనువాఁడు నేకొనువాఁడు డెక్కు
లాఁడు వాఁడు దపోనిధి వాఁడు వెద్ద
చిక్కెఁ గరి మ్రొక్కెఁజెలి వాక్కుఁడక్కు వెట్టె
శౌరిఁ దలఁచేనిన్ బిలిచె నాసంధు లిట్లు.
| 62
|
ఆ. |
ఆయచేత సద్వితీయ దా నిజరూప
మయ్యు నుండుఁ బ్రథమయట్టు లుండుఁ
గ్రతువు గాచె దాశరథి కృష్ణుఁ డొకపర్వ
తమును గొడుగు భంగిఁ దాల్చెననఁగ
| 63
|
గీ. |
అచ్చుమీఁదచ్చున యకార మాయజుండు
కొమ్ము గలహల్లు ప్రథమైనఁ గ్రుంకు నచ్చు
గురుఁడుపేంద్రుండు పెఱచోటఁ గ్రుంకు నొండెఁ
జను నకారంబు జనులందు జనులయందు.
| 64
|
గీ. |
ఓలిఁ గర్మధారయ షష్ఠు లుత్వములుగ
నచ్చు తుద నుండ టనుములౌ నాంధ్ర సంధిఁ
|
|
|
గఱుకుటగచరు ల్గట్టి రక్కజపుటుదధి
వితతయశుఁ డైన రాజునానతి ననంగ.
| 65
|
గీ. |
నుఱులురులు పొల్లు లౌను దెనుంగు నందు
హేమ మిది పదాఱ్వన్నె నల్మోము లతఁడు
ప్రబలి హరిఁ గొల్చియున్న వా ర్పరమ మునులు
గోటిలో నొప్పు సతికిఁ గన్గొన లనంగ.
| 66
|
గీ. |
ద్విత్వమున కాదివర్ణములు తెనుఁగునందు
నూఁదకుండును వలసిన నూఁదియుండు
జానకీ వల్లభుఁడు క్షమాశాలి యనఁగ
దశరథాత్మజుఁడు స్వామి ధాత్రి కనఁగ.
| 67
|
వ. |
మఱియు శబ్దాలంకారవిశేషంబులు ప్రాసంబులు నెట్టి వనిన.
| 68
|
క. |
అమరఁ గడుదుష్కరము ద్వం
ద్వము త్రి చతుష్ప్రాసములును దగ నంత్యప్రా
సమును ననుప్రాసము ననఁ
గ్రమమున షడ్విధము లయ్యెఁ గంసవిదారీ!
| 69
|
1. దుష్కరప్రాసము
క. |
దోఃకీలితమణి కటక యు
రః కలిత రమాభి రామ రంజిత సుజనాం
తః కరణ ఖండితారాశి
రః కందుక యనఁగ దుష్కరప్రాసమగును.
| 70
|
2.ద్వంద్వప్రాసము
క. |
కంజనయన భవభీతివి
భంజన శుకశౌనకాది బహుమునిచేతో
రంజన ద్వంద్వప్రాస మ
నంజను నిప్యాటఁ బల్కిన గృతు లందున్.
| 71
|
3.త్రిప్రాసము
క. |
తానవనీత ప్రియుఁ డన
దానవనిర్మూల నైకతత్పరుఁ డన స
న్మౌనివినుతుఁ డన నతసుర
ధేనువనం గృతులయందు ద్రిప్రాసమగున్.
| 72
|
4. చతుష్ప్రాసము
క. |
వారణవరద నిశాటవి
దారణ వీరావతార ధరణీవలయో
ద్ధారణ విరచిత సత్యవ
ధూరణవిజయ యనఁ దగి చతుష్ప్రాసమగున్.
| 73
|
5.అంత్యప్రాసము
క. |
అగణితవిభస్ఫూర్తీ
నిగమాగమసతతవినుత నిర్మల మూర్తీ
జగదభిరక్షణవర్తీ
యగు నంత్యప్రాస మి ట్లుదంచితకీర్తీ!
| 74
|
క. |
మొదలిటిప్రాసమె కానీ
యిది యంత్యప్రాస మనఁగ నేదటకానీ
కదియింపవలయుఁ దానీ
పదనెఱిఁగిన బుధుఁడు కృతులఁ బరమజ్ఞానీ!
| 75
|
6. అనుప్రాసము
క. |
విప్రప్రకరమునిప్రీ
తిప్రద సుప్రభవ యప్రతిమదోఃప్రభవా
విప్రణుత సుప్రసన్నయ
నుప్రాసప్రణవ మిది మనుప్రియచరితా!
| 76
|
క. |
విరతులు విశ్రాంతులు మఱి
విరామములు విశ్రమములు విశ్రామంబుల్
విరమంబులు యతు లనఁగా
విరమణములు నాఁగ వళ్ళు వెలయు మురారీ!
| 77
|
యతిపంచకము
క. |
స్వరయతులు వర్గయతులును
సరసయతు ల్ప్రకటమైన సంయుక్త యతుల్
పొరిఁ బ్రత్యేకయతులు ననఁ
బరఁగును యతి పంచకంబు పంకజనాభా!
| 78
|
యతిపంచకభేదములు
క. |
స్వరయతులు ప్రాది కాకు
స్వరనిత్యసమానయతులు వర్గయతులు ని
|
|
|
ద్ధరఁ బోలికవడి సంయుత
విరతి యనుస్వారయతులు వెలయు ముకుందా!
| 79
|
క. |
ప్రభునామాంతవిరతియన
విభాగవిరమణము భిన్నశ్రమమును గౌ
స్తుభధర! వికల్పయతి యన
నభేదవిరమణ మనంగ నైదు తెఱంగుల్.
| 80
|
గీ. |
స్వరప్లుతోభయవృద్ధ్యను స్వరవికల్ప
ప్రాద్యభేదసంయుత భిన్నప్రభువిభాగ
కాకు మాదేశనిత్యద్యఖండవర్గ
చక్కటెక్కటిపోలిక సరసయతులు.[5]
| 81
|
టీ. |
స్వర, ప్లుత, ఉభయ, వృద్ధి, అనుస్వార, వికల్ప, ప్రాది, అభేద, సంయుత, భిన్న, ప్రభు విభాగ, కాకు, మాదేశ, నిత్య, ది, అఖండ, వర్గ, చక్కటి, ఎక్కటి, పోలిక, సరస.
|
|
ఆ. |
అగు నకారమునకు నైత్వౌత్వములు వడి
ఈకి ఋత్వమునకు నేత్వ మమరు
నుత్వమునకు నోత్వ మొనరు నీగతి స్వర
యతులు విస్తరిల్లు నబ్జనాభ!
| 82
|
క. |
స్వరములు దీర్ఘము హ్రస్వము
నరయఁగ నొక్కవిధ మెన్న యతులకు సంధ్య
క్షరము లగునచ్చులందు సు
చరితా! హ్రస్వములు లేవు సంస్కృతభాషన్.
| 83
|
క. |
అలఘుచతుస్సంధ్యక్షర
ములలో నై యౌలు దక్క మొదలిటిరెంటన్
దెలుఁగునను హ్రస్వదీర్ఘము
లొలయును నెఏలనంగ నొఓ లనఁగన్.
| 84
|
క. |
క్రియ నై యౌలకు హ్రస్వ
ద్వయము లమరు నాంధ్రభాషితప్రకరలో
నయిదనఁ దగు నైదనుచో
జయకీర్తీ! యవు ననంగఁ జను నౌ ననుచోన్.
| 85
|
గూఢస్వరయతి
గీ. |
స్వరముతుద నుండి లుప్తవిసర్గకోత్వ
మైనస్వరవిరామంబు దాసోఽహ మనగ
నచ్యుతాశ్రితు లుర్వి నన్యోన్యమిత్రు
లనఁగ నమ్ముకుందుండు యశోఽర్థి యనఁగ.
| 86
|
ఋకారస్వరూపయతి
గీ. |
క్షిత ఋకారరూపస్వరయతులు పరఁగు
ఋగ్యజుస్సామవినుతుండు కృష్ణుఁ డనఁగ
వృష్ణికులజుండు కరుణాసమృద్ధుఁ డనఁగ
హేమపీతాంబరుఁడు దేవవృషభుఁ డనఁగ.
| 87
|
క. |
విలన ద్రికారమునువ
ట్రిల రీవిరమంబు శౌరి ఋషులకు శశ్వ
త్సులభుఁ డనఁగ నీయేలకుఁ
దలఁపఁగ రీతోడి విరతి తలకొన దెందున్.
| 88
|
గీ. |
తెల్లముగ ఋకారము యణాదేశశక్తిఁ
గలుగు రేఫయిత్వమునందుఁ గదిసి యతికి
నట్టిరీకి నీయేలతో నన్వయించు
నట్టిసత్త్వంబులే దది హల్లుగాన.
| 89
|
గీ. |
మును ఋకార మీ యేలతో నొనరినట్లు
చేర దొకట యణాదేశకారణమున
ఘనలకారంబ యగును ఌకారవిరతి
కౢప్తి లేదు శౌరిగుణావళికి ననంగ.
| 90
|
క. |
స్వరములు కాదుల నొందిన
నరుదుగ స్వరయతులు దగును బ్రాదులు గాకు
స్వరమును నిత్యసమాసా
క్షరసంధులు రెండు నగు భుజంగమశయనా!
| 91
|
గీ. |
ప్రాదినిత్య సమాసశబ్దములు గాక
పెరపదంబుల పైనచ్చు బెరసినప్పు
డన్నియును స్వరయతులగు సాంబగురుఁడు
శ్రీశుఁ డమరాన్వయాబ్ధి పూర్ణేందుఁ డనఁగ.
| 92
|
క. |
ధర నుపసర్గలు ప్రాన్వప
దురపాభిప్రతిసువిన్యు దుపపర్యధిసమ్
నిరతిపరాజపులిరువది
పరాఙపులు చొరవు తెలుఁగు బాసను నెందున్.
| 93
|
టీ. ప్ర, అను, అవ, దుర్, అప, అభి, ప్రతి, సు, వి, ని, ఉత్, ఉప, పరి, అధి, సమ్, నిర్, అతి, పరా, అఙ్, అపి, అను నివి యిరు వది యుపసర్గలు. వీనిలో పరా, అఙ్, అపి, అన్నవిగాక మిగిలిన పదునేడును బరస్పరసంధి యైనప్పుడు స్వరయతియైనను వ్యంజనయతియైనను బ్రయోగింపఁదగును.
వీని కుదాహరణము:-
ఉ. |
ప్రాంతనిరంతరాన్విత దురంతసమస్తపరాక్రమంబున
త్యంతమదాప్తిశోభన మపాయ ముపాయము వీక్షణంబు ప్ర
త్యంత మభీష్టమధ్యయము స్వాంతము నీత ముదంచితంబుప
ర్యంతమనంగ సంధిలుఁ దిరంబుగ రెంటను బ్రాదులచ్యుతా!
| 94
|
కాకుస్వరయతి:-
క. |
కాకుస్వరయతి యగు నితఁ
డే కదలక జలధిఁ బవ్వళించె ననఁగ బ్ర
శ్నా కలితదీర్ఘ మగు నితఁ
డే కవ్వడి రథముఁ గడపె నిమ్ముల ననఁగన్.
| 95
|
ఆ. |
వలదు కృష్ణ యెఱుఁగవా మున్ను నన్ను నీ
వా విరుద్ధభాష లాడ నేల
లోన నెట్టియలుకలో నాఁగఁ గాకుస్వ
రోక్తి రెంటఁ జెల్లు నొగి ధరిత్రి.
| 96
|
గీ. |
వరుసదీర్ఘాంతసంబుద్ధి వచనయతుల
కమరుఁ గాకుస్వరంబు పరమసహస్ర
నామశోభిత గోపకృష్ణాయనంగ
నమరవందిత గోపకృష్ణా యనంగ
| 97
|
నిత్యసమాసయతి:-
గీ. |
పదము విభజించి చెప్పఁ జొప్పడని యవియు
నన్యశబ్దంబుఁగొని విగ్రహంబుఁ జెప్పు
|
|
|
నవియు నిత్యసమాసమై యతిశయిల్లు
నట్టిసంధుల నచ్చు హల్లైన విరతి.
| 98
|
గీ. |
నాస్తియనక మహి ననంతసంపదలు నా
రాయణుం డొసంగు రమ్యమగుర
సాయనంబు బుధుల కతఁ డన్న నిత్యస
మాసయతుల రెంట నంటియుండు.
| 99
|
వ. |
ఈ నిత్యసమాసయతి పేరఖండయతి.
| 100
|
గీ. |
అఱయనంగను బోవుట కర్థమైన
సంధి నిత్యసమాసోక్తి జరగు రెంట
నసురవీరుల నెల్ల నుక్కఱ వధించె
భానుకులుఁడు రావణుని నేపఱిచె ననఁగ.
| 101
|
గీ. |
ఏని యనుపదంబుతో నాదిపద మంది
సంధి నిత్యయతుల జరగుచుండు
నెట్టి క్రూరకర్ముఁడేని సద్గతి నొందు
నిన్ను నాత్మఁ దలఁచె నేని కృష్ణ!
| 103
|
గీ. |
కదియు వడులు స్వరము కైవడిఁ గాదులు
ఋత్వమునకు నెత్వమెనయు చోటఁ
గృష్ణుఁ డాజిఁ గంసు గెడపె నండ్రార్యులు
కూర్మరూప విమలకోమలాంగ!
| 104
|
వర్గయతి:-
క. |
తలకొని కచటతపంబులు
తలనొక్కొకవ్రాయి తొలఁగఁ దమతమ నాల్గున్
|
|
|
విలసిల్లు వర్గయతు లనఁ
గలికల్మషతిమిరతపన ఘననిభవర్ణా!
| 105
|
పోలికవడి
క. |
వెలసిన పు ఫు బు భు వర్ణం
బులు పోలికవడి ముకారముగ నిడఁ దగు ని
మ్ముల హరిచరణసరోరుహ
ములు నాహృత్సరసియందుఁ బొదలు ననంగన్.
| 106
|
సరసయతి
ఆ. |
ణనలు చెల్లుఁ గమలనాభ యొండొంటికి
నయహ లమరియుండు హస్తివరద
శషస లొందు నండ్రు చఛజఝంబులతోడ
సరసయతు లనంగ జలధిశయన!
| 107
|
సంయుక్తయతి
క. |
ఏ నిను వేఁడెద లక్ష్మీ
క్ష్మానాయక నీవు నన్నుఁ గైకొని యిష్టం
బైనవి యొసఁగుము శుభల
క్ష్మా! నీవాఁడ నన నొప్పు సంయుక్తయతుల్.
| 108
|
క. |
ఒక్కడుగున విశ్రాంతులు
పెక్కగుచో సంయుతములు పెనుపకమును జ
డ్డక్కరమునఁ దానెత్తిన
యక్కరమే యునపవలయు నన్నిటఁ గృష్ణా!
| 109
|
క. |
వడినెలవులలోఁ జేరువ
యెడ నొకసంయుతము నౌలయెడ నొకటినిఁ దా
|
|
|
రిడిరేని కవులు తప్పుట
యొడఁబడదు పృథగ్యతిప్రయోగముల హరీ!
| 110
|
ఉదాహరణము
|
ద్విరదగతి రగడ.
క్ష్మావలయ మంతయు విషాణమున నెత్తుకిటి
మహిమ దలపోయ నక్కజ మనుచు నిట్లనక
క్ష్మావలయ మంతయు విషాణమున నెత్తుకిటి
సత్త్వ మరు దన నొప్పు సంయుక్తయతి చెడక.
| 111
|
|
అట్ల మఱియొకవిధంబగు రగడ.
ఱంపమున వ్రచ్చుగతి వ్రచ్చె నఖముల రిపుని
వక్షము నృసింహుఁ డని రాయువడి సొరదు కృతి
ఱంపమున వ్రచ్చుగతి వ్రచ్చె నఖముల రిపును
రంబు నరసింహుఁ డనఁ గ్రాలు సంయుక్తయతి.
| 112
|
గీ. |
అప్రసిద్ధముల్ ఙఞలు శబ్దాదియందు
ఞాజసంయుక్తి తద్భవవ్యాజమునను
నణలతోఁ బొందు విరతి యాజ్ఞప్తి యనఁగ
జలరుహోదరాశ్రితులు సుజ్ఞాను లనఁగ.
| 113
|
గీ. |
యజ్ఞమునకు జన్న మాజ్ఞప్తి కానతి
యాజ్ఞ కాన సంజ్ఞ కరయ సన్న
విన్నపంబు వెండి విజ్ఞాపనమునకు
జ్ఞాకుఁ దద్భవంబు నా ధరిత్రి.
| 114
|
రేఫయుతయతి
గీ. |
ఆంధ్రలిపిఁ జొప్పడదు ఋకారాన్వితంబు
క్రొత్తగాదు కృష్ణుని వెన్న మ్రుచ్చి మనఁగ
|
|
గీ. |
స్రుక్కఁ డతఁ డాజి నెట్టి విరోధి నైనఁ
గ్రుమ్ము నన రేఫయుతయతి గూడుఁ గాన.
| 115
|
అనుస్వారయతి
గీ. |
భువి ననుస్వారయతి బిందుపూర్వకముగ
ణాకు నిట నాల్గు చెల్లుఁ బాండవసహాయ!
నాకు నిట నాల్గు చెల్లుఁ గందర్పజనక!
మాకు నిటనాల్గు చెల్లు సంపదలరాజ!
| 116
|
మకారయతి
గీ. |
యరలవలు శషసహలు నాదిబిందు
యుతములై మకారవిరామయుక్తిఁ దనరు
మారుతాత్మజుఁ డరిదిసంయమి యనంగ
మదనజనకుఁడు దనుజసంహరుఁ డనంగ.
| 117
|
ఎక్కటియతి
క. |
ధర నెక్కటివళ్లైతగు
ళరమఱవలు వానిలోఁ దొలంగక(జెలంగును) లాకున్
సరి ళా యన విశ్రమవే
ళ రమాధిప రెండునుం గలసి వర్తించున్.
| 118
|
గీ. |
మరునితండ్రి లోకమహితుండు యాదవ
రాజసింహ మూర్తి రక్షకుండు
ఱాఁగవేలు పనఁగ ఱంపిల్లు నెక్కటి
వళ్ళు నాఁగ నిట్లు వనజనాభ!
| 119
|
గీ. |
ఒరుల నన్నమ్మ యనుచోట నూఁదఁబడక
ద్వివిధ మగుఁ బ్రభునామాంతరవిరమణంబు
|
|
|
మహి నయోధ్యకు రాజు రామన యనంగ
నతనిపట్టపుదేవి సీతమ యనంగ.
| 120
|
గీ. |
సంఖ్యకుం బరిమాణసంజ్ఞకుఁ దనర్చు
శబ్దములపై విభాగోక్తి సరణి సంఘ
టించినప్పుడు యతులు రెండేసియగు ను
పేంద్రుఁ డిచ్చునర్థము మోపెఁడేసి యనఁగ.
| 121
|
క. |
అంచితతిలకము శౌరి ధ
రించె ననఁగ జగణమధ్య రేఫవిరతి యౌ
నంచితతిలకము హరి ధరి
యించె ననఁగ భిన్న విరతి నిత్వమువచ్చెన్.
| 122
|
గీ. |
అట ఇకారాంతపదముమీఁదటి దికార
మది యనంగ నవ్వల భిన్న యతికిఁ జెల్లు
దివిజవిభవంబు శౌరిచేతిది యనంగ
నసురనాశంబు హరిచేతియది యనంగ.
| 123
|
వికల్పయతి
గీ. |
హయుతమై పొల్లుల వికల్పయతులు చెల్లు
దేవకీనందనుఁడు జగద్ధితుఁ డనంగ
హలధరుఁడు సంగరాంగణోద్ధతుఁ డనంగ
నవని మోచినయవి కకుబ్భస్తులనఁగ.
| 124
|
యుక్తవికల్పయతి
గీ. |
నలి ఙకారహ ల్లితరానునాసికాఖ్యఁ
గదిసి తత్పంచమముగా వికల్పవిరతిఁ
గలుగుఁ జక్రి వల్లవసుదృఙ్మథుఁ డనంగఁ
గమలనేత్రుండు సకలదిఙ్మహితుఁ డనఁగ.
| 125
|
క. |
ప్రకట పకార వకార
ద్వికమునకుం జను నభేదవిరతి నిశాట
ప్రకర మెరిసె రామునిపా
వకశరమున జనకసుత నెపంబున ననఁగన్.
| 126
|
గీ. |
చెల్లుబడివళ్ళు ప్రాసము ల్చెప్పఁబడియె
నిందుఁ బూర్వప్రయోగంబు లెఱిఁగి యెవ్వి
బహుళమై తోఁచెనవి యొనర్పంగవలయు
నవ్యకావ్యప్రియోక్తుల నలిననాభ!
| 127
|
క. |
వరగణవర్ణము దీర్ఘ
స్వరమగుచో గణయుగంబు చను యతుల సుధా
కరకరగుణగతి శరరుచి
గిరిగజరుద్రాదిసంజ్ఞ కేశవనాథా!
| 128
|
క. |
ఎన్నిట యతి రావలె నని
రన్నిట సంస్కృతమునందు నగు విచ్ఛేదం
బెన్నిట యతిరావలె నని
రన్నిటఁ దెలుఁగునకు మొదలియక్షర మమరున్.
| 129
|
గద్యము. |
ఇది శ్రీవాణీప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్యతనూభవ సుకవిజనవిధేయ అనంతనామధేయ ప్రణీతంబైన ఛందోదర్పణమునందు గద్యపద్యాదికావ్యలక్షణంబును గురులఘునిర్ణయంబును గణనిరూపణంబును బ్రాసయతి విశేషంబులును బరిగణనసంజ్ఞయు నన్నది ప్రథమాశ్వాసము.
|
|