ఛందోదర్పణము/ఉపోద్ఘాతము
ఉపోద్ఘాతము
అనంతామాత్యుఁడు
అనంతామాత్యుని చరిత్ర - విమర్శకులకు తెలిసినంతమట్టుకు - ఆంధ్రవిజ్ఞానసర్వస్వములోను, ఆంధ్రకవుల చరిత్రలోను ఉన్నది. చర్వితచర్వణముగా అందులోని విషయములనే మరియొకసారి చర్చించి వ్రాయడ మనవసరము; గనుక వాటిలోని సారాంశములను మాత్రము సంగ్రహించి తెలియజేయుచున్నాను.
అనంతుడు ఆరువేల నియోగి బ్రాహణుడు; కౌండిన్యగోత్రజుడు. ఇతనిముత్తాతయైన బయ్యన్నకు తిక్కనసోమయాజి "భవ్యభారవి” అన్న బిరుదిచ్చెనట. అనంతుడు రచించిన గ్రంథములు 1. భోజరాజీయము, 2. ఛందోదర్పణము, 3. రసార్ణవము. భోజరాజీయములో ఉన్న "సీ. విలసితంబగుకృష్ణవేణా,” అనే పద్యమును బట్టి అనంతుని "తండ్రియైన తిక్కన కృష్ణామండలములోని శ్రీకాకుళమున కొడయఁడైన యంధ్రవల్లభుని సేవ చేయుచుండె”ననిన్ని, రసార్ణవమందున్న “శా. జానొందన్ శకవర్షముల్” అనేపద్యము బట్టి ఇతడు క్రీ. శ. 1435. జనవరి తే 25 దికి రసార్ణవము రచియించి దేవాంకితము చేసినట్లు తెలియవచ్చుచున్నది గనుక, ఇతడు 15-వ శతాబ్దము నడుమ నున్న వాడనిన్ని నిస్సందేహముగా చెప్పవచ్చును.
ఛందోదర్పణములో నాలుగవ ఆశ్వాసము చివర నొకపద్యమందు భోజరాజీయమును మాత్రమే పేర్కొనుటచేత అనంతుడు మొట్టమొదట భోజరాజీయము, తర్వాత ఛందోదర్పణము, అటుపిమ్మట రసార్ణవము రచించిఉండునని ఊహించవచ్చును.
గ్రంధవిశేషము
తెలుగున లక్షణగ్రంథము లనేకముగా ఉన్నవి. వీటిలో అనేకగ్రంథము లింకను అచ్చుపడలేదు. 1917 సం॥న కవిజనాశ్రయము ఆంధ్రసాహిత్యపరిషత్తువారిచే కొత్తగా ప్రకటితమైనది. నేటికి శ్రీ వావిళ్ల. రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారిచే ఈ ఛందోదర్పణము ప్రకటితమైనది. రంగరాట్ ఛందము మొదలయిన గ్రంథములు వీరిచే త్వరలో అచ్చుపడవలసి ఉన్నవి. ఇదివరకు చాలాకాలమయి అచ్చుపడి ప్రచారములో ఉన్నవి సులక్షణసారము, అప్పకవీయము.
వీటిలో కవిజనాశ్రయము ప్రాచీనతమమయి నట్లగపడుచున్న దనిన్ని, ఆ గ్రంథము రచించినవాడు వేములవాడ భీమకవి అనిన్ని, ఆ భీమకవి 12-వ శతాబ్దారంభము వాడగుననిన్ని, శ్రీ జయంతి రామయ్యగారు కవిజనాశ్రయపీఠికలో వ్రాసినారు. “కవిజనాశ్రయము భీమకవివిరచితము కానే కాదని నాకు తోఁచుచున్న" దని వీరేశలింగము పంతులుగారు రామయ్యపంతులుగారి 'పీఠిక' చదివినతర్వాతనే [1]ఆంధ్రకవుల చరిత్రలో వ్రాసినారు. “కవిజనాశ్రయములో చెప్పఁబడిన యతులసంఖ్య యన్నింటికంటెఁ దక్కువది, కావున,నా గ్రంథమె యన్నింటిలోఁ బ్రాచీనమైనదని యూహింపవచ్చును” అని రామయ్యపంతులుగారు 'ఆంతరతమ్య' పరీక్ష చేసి సిద్ధాంతీకరించినారు. అయితే అప్పకవి ఏడువిధములైన సీసభేదములే చెప్పగా అనంతుఁడు పదివిధములైన సీసభేదములను చెప్పినాడుగదా. అంతమాత్రమున అనంతుఁడు అప్పకవి తర్వాతివాడని చెప్పవచ్చునా?
శ్రీ రామయ్యపంతులుగారు సంపాదించిన కవిజనాశ్రయప్రతులు 10. అందులో రెండుమాత్రమే సమగ్రముగా ఉన్నవి. ఆ రెండింటిలోను అవతారిక పద్యములు లేవు; అసమగ్రమైన ఒక్క ప్రతియందు మాత్రమే ఉన్నవి. వాటిలో ఒక పద్యమును బట్టి గ్రంథము భీమకవి రచించియుండునేమో అని అనుమానించుటకు కాస్త అవకాశము లేకపోలేదు, గాని అన్నిప్రతులలోను ఉన్నట్లు చూపిన [2]"జననుత భీమతనూజా,” అనే పద్యమును బట్టి ఏమనవలెను? ఇంతకున్ను ఒక్కప్రతిలో మాత్రమే ఉన్న అవతారిక ఎంతమట్టుకు ప్రమాణముగా గ్రహింపగలము? అందులోనున్న పద్యములు పరిశీలించి చూడగా అసందర్భములుగా ఉన్నవి. మొట్టమొదటి పద్యము అనంతుని ఛందములోనిది.— "ననంతశయనుఁ దోయజనాభున్," అని ఛందోదర్పణములో ఉన్నది, “మురారిభ క్తితో వినుతింతున్,” అని కవిజనాశ్రయములోఉన్నది. “జైనుఁడగుకవి విష్ణుప్రతిపాదకములగు పద్యముల రచించుట యసంభవ” మని “చనుమగణము శ్రీనాథాయనిన” "తగణము శ్రీకృష్ణయనఁగ” ఇటువంటి పద్యములు ప్రక్షిప్తములని వ్రాసినప్పుడు “మురారిభక్తితో వినుతింతున్," అని ఉన్న అవతారికలోని మొదటిపద్యము ప్రక్షిప్తమని చెప్పవలసిఉండును. గణముల కుదాహరణగా విష్ణుపరమైన పదములే ఉండనప్పుడు “మురారిభక్తితో వినుతింతున్" అని ఉండునా? "నిను నీవె పొగడువైఖరి నొనరించెదఁ,” అని కృతిభర్తను గూర్చి కవి వ్రాయునా? కవితావైఖరిని బట్టిచూడగా ఈ అవతారిక ప్రక్షిప్తమని దృఢముగా చెప్పవచ్చును. “రేచనపై.. కవివరులు.. పొగడన్” “నీదు పేర” “ఏ ఛందము సుకవులు బ్రదుకు" ఇటువంటి పదములతోనున్న కవిత్వము ఆధునికకవిత్వముగాని పూర్వకవిత్వమువలె తోచదు.
కొన్ని వ్రాతప్రతులలో "భీమనఛందస్సు” అని గ్రంథనామమున్నది. అయితే వాటిలో రామయ్యపంతులుగారు “ప్రక్షిప్తము”లని తీసివేసిన పద్యము లనేకముగా ఉన్నవి. "పరిగినవిమలయశోభాసురనిరతుఁడు భీమనాగ్రసుతుఁ [3]డఖిలకళాపరిణతుఁ డ య్యెను భూసురవరుఁడు ప్రసాదోదితధ్రువశ్రీయతుఁడై”, “అసమానదాన రవితనయ సమానోన్నతుఁడు యాచకాభరణుఁడు ప్రాణసమానమిత్రుఁ డీకృతికి సహాయుఁడుగా నుదాత్తకీర్తి ప్రీతిన్.” ఈ పద్యము లనన్వయముగా నుండుటచేత నందుఁ బేర్కొనఁబడిన భీమునకును గ్రంథమునకును గల సంబంధ మిట్టిదని నిర్ణయింపవలనుగాక యున్నది" అని శ్రీరామయ్యపంతులుగారు గ్రంథమున చేర్చలేదు. “పై పద్యము లనన్వితములుగావు. గ్రంథమునఁ గూర్చుకొని చూచినచోఁ దేటపడఁగలదు. పాఠము తప్పుగా నున్నప్పుడు సమన్వయ మె ట్లేర్పడును?” అని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ప్రబంధరత్నావళి పీఠికలో ఈవిషయము చర్చించి వ్రాసినారు. భీమకవి కవిజనాశ్రయకర్త కానేరడనియే వారితలంపు. వారు చెప్పినట్లు “వేములవాడ భీమకవి విషయము సర్వమును సందిగ్ధమే యగుచున్నది.”
ఛందోదర్పణకాలమును నిర్ణయించగలిగినట్లు కవిజనాశ్రయకాలమును నిర్ణయించలే మనుట స్పష్టము. అనంతుఁడు భీమకవినిగాని కవిజనాశ్రయమునుగాని ఎరిగిఉన్నట్లు కనబడదు.
అనంతుని ఛందోదర్పణమును ఎదుట నుంచుకొని అప్పకవి కొన్నివృత్తములకు లక్ష్యములు వ్రాసినట్లు స్పష్టముగా కనిపించుచున్నది. మదరేఖ, తోదక, మనోజ్ఞ, ప్రియకాంత, నర్కుటము, శిఖరిణి, పృథ్వి మొదలయిన వృత్తలక్ష్యపద్యములు అనంతుని పద్యములలోని పదములతో కనబడుచున్నవి. వీటిలో ఒక్కటి చూడండి:--
| అజశివశక్రనిరంతరార్చితపద్ద్వయున్ | |
అనంతునిది.
| అజమృడవాసవసంతతార్చితపాదపం | |
అప్పకవిది.
ఈలాగున అనంతుడు కవిజనాశ్రయము ఎదుట నుంచుకొని తన ఛందోదర్పణమును వ్రాసియుండునేమో అని ఎంతపరిశీలించి చూచినను పద్యములలో పోలిక ఎక్కడనయినను కనబడలేదు.
కవిజనాశ్రయముకంటె ఛందోదర్పణము పెద్దగ్రంథము. కవిజనాశ్రయములో సంజ్ఞాధికారమందు గణఫలములు, గణగోత్రములు, గణలింగములు, బీజాక్షరములు మొదలయిన విషయముల గురించి 35 పద్యము లున్నవి. ఛందోదర్పణములో వీటిలో ముఖ్యమైన విషయములు గురించి 6 పద్యములు మాత్రమే ఉన్నవి. గాని వళ్లు, ప్రాసములు, షట్ప్రత్యయములు... వీటిగు రించి ఛందోదర్పణములో ఉన్నన్ని విషయములు కవిజనాశ్రయములో లేవు.
1 “క. పరగగ నిరువదియాఱ.... ” ఛందో. పుట 61; కవి. పు. 52.
2 "క. క్రమమునఁ బ్రస్తారము....” ఛందో. పు. 85; కవి. పు. 76.
3 "సీ. వృత్తంబునకువలె...” ఛందో. పు. 69; కవి. పు. 67.
ఈ మూడుపద్యములు రెండుగ్రంథములందున్ను కనబడుచున్నవి. వీటిలో మొదటివి రెండున్ను ఎవరు చెప్పినవో ఏ గ్రంథములో ఇవి ప్రక్షిప్తము లనవలెనో తెలియదు. మూడవది ఛందోదర్పణములోనిదేగాని కవిజనాశ్రయములోనిది కాదని మరియొకచోట నీపీఠికలోనే తెలియజేసినాను.
అనంతుఁడు 105 సమవృత్తభేదములను 9 విషమవృత్తభేదములను చూపించినాడు. కవిజనాశ్రయములో 123 సమవృత్తభేదములున్ను 6 విషమవృత్తభేదములున్ను ఉన్నవి.
జాత్యుపజాతుల గురించి ఛందోదర్పణములో చెప్పినంత గ్రంథము కవిజనాశ్రయములో లేదు. రగడలు, కళికలు, ఉత్కళికలు వీటినిగుంచి కవిజనాశ్రయకర్త ఏమిన్నీ చెప్పలేదు.
లక్షణగ్రంథములన్నిటిలోను ఛందోవిషయములు ఎక్కువగా వివరించి చెప్పినది అప్పకవీయమే అనుటకు సందేహము లేదు. అందుచేతనే, అప్పకవి,
“క. | ఒక దానికంటే మఱివే | |
క. | ఇది చదివినపిమ్మట మఱి | |
అని వ్రాసుకొన్నాడు. అయితే నిరంకుశాధికారమును వహించినవానివలె తన ఇష్టానిష్టములఁ బట్టి లక్షణములను అతడు శాసించినాడు. శ్రీవావిళ్లవారు ఇప్పుడు త్వరలో అచ్చొత్తించబోయే అప్పకవీయ పీఠికలో అవి తెలియజేయుట ఉండును; గాని, ఇక్కడ చర్చించుట అనవసరము.
గ్రంథప్రచారము
"క్రీ. శ. 16204వ సంవత్సరప్రాంతములందు కవిగాఁ బ్రసిద్ధికెక్కినవాఁడు” అని వీరేశలింగము పంతులుగారు చెప్పిన చిత్రకవి అనంతయ "హరిశ్చంద్రనలోపాఖ్యాన ప్రకాశిక"లో (V. 8.) “క. ప్రథమాంతవిభ క్తులపై ..." అనే ఛందోదర్పణములోని పద్యమును ఉదాహరించినాడు. ఈ పద్యమునే 16-వశతాబ్దాంతమున ఉండినవాడని వీరేశలింగముపంతులుగారు చెప్పిన ముద్ద రాజు రామన్న “రాఘవపాండవీయాదర్శము"లో(I. 2, iii. 65) రెండుచోట్ల ఉదాహరించినాడు. అంతేకాదు “పోణిమి” అని ణకారముగా చెప్పవచ్చుననుటకు, “తీవ తీఁగ యనుచు. ..”' అనేపద్యము అనంతుని ఛందముందున్నట్లు ముద్దరాజు రామన “రాఘవపాండవీయాదర్శము”లో (11.6) చెప్పినాడు; గాని, ఆపద్యము ఛందోదర్పణములో కనబడదు. ఈ పద్యము ఎవ రిదో తెలియదు.“ఇంబు” అనే ప్రయోగమునకు ఆ ఆదర్శములోనే (2.98) “ఇంబడరగా భజసనంబులని యనంతుని ఛందఃప్రయోగము” అని కూడా ఉన్నది. ఇది అప్పకవీయములో లయగ్రాహికి లక్ష్యలక్షణపద్యముగా కనిపించుచున్నది; గాని ఛందోదర్పణములో కానరాదు. అయితే అప్పకవి “పదునేడవశతాబ్దమధ్యమునం దుండిన లక్షణవేత్త” అని వీరేశలింగమువంతులుగారు వ్రాసినారు గదా; అప్పకవి పద్యమును ముద్దరాజు రామన ఎ ట్లుదాహరించియుండును? ఇంతకంటెను ఆశ్చర్యమైనదేమంటే, చిత్రకవి అనంతయగారి హరిశ్చంద్రనలోపాఖ్యానప్రకాశికలో ద్వితీయాశ్వాసాంతమున (శ్రీ వఝల చినసీతారామస్వామిశాస్త్రులవారివిమర్శనముతో కలిసి శ్రీవావిళ్లవారిచే ప్రకటితమైన ప్రతి, పుట.128) నర్కుటవృత్తవ్యాఖ్యలో “ఈవృ త్తమునకే కోకిలకాకమను నామాంతరము కలదు. లక్షణము:— కొలిచెద నాదిదేవు....(అప్పకవీయము. ఆ. 4)" అని ఉన్నది. ఈ గ్రంథము మొదట అచ్చొత్తించిన పూండ్ల రామకృష్ణయ్యగారో పూర్వలేఖకులో అప్పకవీయ పద్యములను ఈవ్యాఖ్యానములలో దూర్చి ఉండవలెను. నేను చూచిన తాటాకుపుస్తకములందు ఇవి కానరాలేదు.
పాఠనిర్ణయము
శ్రీవావిళ్ల వేంకటేశ్వరులుగారు తమవద్దనున్న 14 ప్రతులు శోధించి పాఠనిర్ణయము చేసి గ్రంథ మచ్చొత్తించినారు. వారు నావద్దకుపంపినముద్రితగ్రంథమును, నావద్దనున్న శ్రీ పరవస్తువారిప్రతిని, పరిశీలించి ఈ ఉపోద్ఘాతమును టిప్పణిని వ్రాసినాను. ఛందోవిషయములు
ముఖ్యమైన ఛందోవిషయములు ఈ చిన్నపీఠికలో ఇముడ్చుటకు వీలయినంత మట్టుకు చర్చించి లాక్షణికులలో గల మతభేదములను తెలియజేయుచున్నాను.
వడి
"యతి పర్యాయపదములలో వడియనునది తెలుఁగు; దానివ్యుత్పత్తి యూహ్యము”అని జయంతి రామయ్యపంతులుగారు కవిజనాశ్రయపీఠికలో వ్రాసినారు. వారు వ్రాసినట్లు వడి' 'వళి' అనేవి తెలుగుమాటలనిన్ని వళ్ అనే అఱవమాటతో సంబంధము కలవి అనిన్నీ నాఅభిప్రాయము. యతి, విరతి మొదలయిన పర్యాయపదములతో పాటు వడి(వళి) అనేమాటను లాక్షణికులు వ్యవహరించుచున్నను దీనికి ఒక అర్థవిశేష మున్నట్లు స్పష్టముగా కనిపించుచున్నది. “ఆద్యోవళిః” అనే ఆంధ్రశబ్దచింతామణి సూత్రములోను, అందుకు అనువాదముగా ఉన్న తెలుగు లక్షణగ్రంథములలోని పద్యములందున్ను 'వడి, (వళి) అనే ఉన్నదిగాని 'యతి, విరతి' మొదలైన పర్యాయపదములలో మరియేదీ కనబడదు. చూడండి.
1. “చరణాద్యక్షరమేవడి” కవిజనాశ్రయము.
2. “పాద ప్రథమాక్షరముత్పాదితమగు వళియనంగ” కావ్యాలంకారచూడామణి.
3. “వాసనగల మొదలివ్రాయి వడియనఁబరగున్" ఛందోదర్పణము.
4. “చరణచరణమున కాద్యక్షరములు వళులయ్యె” అప్పకవీయము.
ఈసందర్భమున వడి (వళి) కి బదులుగా యతి, విరతి మొదలయిన పర్యాయపదములలో మరియేదిన్నీ వాడకూడదన్నట్లే తోచును. సంస్కృతశ్లోకములలో పాదములమధ్యమందు విశ్రాంతిమాత్రమే ఉంటుందిగాని తెలుగు పద్యములలో ఉన్నట్లు అక్షరమైత్రిలేదు. గనుకనే కాబోలు వడి (వళి) యను తెలుగుమాట తెలుగు ఛందస్సులలో వాడవలసివచ్చినది. వృత్తి అంటే మార్గమని అర్థము. పద్యపాదము విశ్రాంతి ననుసరించి రెండు భాగములు కాగా ఆభాగముల మొదటి అక్షరములు పాదభాగములకు మార్గములు చూపించిన ట్లుండుటచేతను, మొదటిభాగముయొక్క ప్రథమాక్షరముతో (అనగా పాదాద్యక్షరముతో) రెండవ భాగము మొదటి అక్షరము మైత్రిగలదిగా ఉండవలెనన్న నియమము ఆచారమై ఉన్నది గనుకను, వడి (వళి) అని మీద చూపించిన స్థలములలో లాక్షణికులు ప్రయోగించి ఉందురని నా అభిప్రాయము.
వడిభేదములు
కవిజనాశ్రయము-10
1. స్వరయతులు
వ్యంజనయతులు
2. వర్గయతులు
3. పోలికవడి
4. సరసయతి
కావ్యాలంకారచూడామణి-12
1. స్వరజలు
2. వృద్ధివళులు
3. వర్గజలు
4. ముకారవళి
5. ఇతరేతరవర్గజలు
ఛందోదర్పణము-24
1. స్వరయతులు
2. గూఢస్వరయతి
3. ఋకారస్వరూపయతి
4. రీవిరమము
5. ఌకారయతి
6. వర్గయతి
7. పోలికవడి
8. సరసయతి
అప్పకవీయము-41
1. స్వరమైత్రి
2. స్వరప్రధానయతి
3. లుప్తవిసర్గయతి
4. వృద్ధివళులు
5. ఋవళి
6. ఋత్వసంబంధవళి
7. ఋత్వసామ్యయతి
8. ప్రాణివిరామము
9. వర్గయతులు
10. మువిభక్తి
11. ముకారయతులు
12 సరసవళులు
13. ఋజుయతులు
14. ఊష్మయతులు
5. బిందుయతి
6. ఎక్కటియతి
యుక్తాక్షరయతి
6. సబిందువర్గజలు
7. ఏకతరయతి
9. అనుస్వారయతి
10. మకారయతి
11. ఎక్కటియతి
12. సంయుక్తయతి
13. తద్భవవ్యాజయతి
14. భిన్నయతి
15. దియతి
16. వికల్పయతి
17.యుక్తవికల్పయతి
18. అభేదవిరతి
18. రేఫయుతయతి
15. బిందుయతులు
16. అనుస్వారసంబంధయతులు
17. అనునాసికాక్షరయతులు
18. మవర్ణయతులు
19. ఏకతరయతులు
20. సంయుక్తయతి
21. తద్భవవ్యాజయతి
22. విశేషవళి
23. భిన్నయతి
24. ప్రత్యేకయతులు
25. అంత్యోష్మసంధియతి
26. వికల్పసంధియతి
27. అభేదవిరతులు
28. అభేదవర్గవిరతులు
ఉభయవళులు-
8. ప్రాదియతులు
9. ప్లుతయతులు
10. అఖండ
8. ప్రాదియతులు
9. ద్వ్యక్షరత్ర్యక్షరప్లుతాక్షరవళి
10. ఆదేశవళి
11. దేశీయవళి
12. (మాచన)
(జవరాలు)
19. ప్రాదియతులు
20. కాకుస్వరయతి
21. నిత్యసమాసయతులు
22. ప్రభునామాంతరయతులు
23. విభాగయతులు
24. నిత్యయతులు
29. ప్రాదియతులు
30. కాకుస్వరయతి
31. ప్లుతాక్షరయతి
32. నిత్యసమాసయతులు
33. దేశ్యనిత్యసమాసయతులు
34. నామకఖండయతులు
35. రాగమయతులు
36. విభాగయతులు
37. నిత్యయతులు
38. యుష్మదస్మచ్ఛబ్దయతులు
39. పరరూపయతులు
40. పంచమీవిభక్తియతులు
41. ప్రాసవిశ్రాంతి
1. అ=ఐ=ఔ
2. ఇ=ఎ, ర్(ఇ,ఎ), =ఋ=కృ=వృ
3. ఌ=ల్, ళ్ (ఇ,ఎ)
4. ఉ=ఒ
5. Σక్; (వర్గులకు ఇట్లే);
6. Σచ్=శ్=ష్=స్
7. Σంక్=ఙ్
8. Σంచ్=ఞ్
9.Σంత్=ంట్=న్=ణ్
10. Σంప్=Σంయ్=మ్
11. Σప్(ఉ,ఒ)=మ్(ఉ,ఒ)
(=మైత్రికి గురుతు; హ్రస్వస్వరమునుబట్టి దీర్ఘస్వరమునుకూడా ఉన్నట్లే ఊహించవలెను.)
(ఋకార మే వ్యంజనముపై ఉన్నా విడిగాఉన్న స్వరమువలె పాటించవచ్చును.)
(ఇ ఈ ఎ ఏ లం గూడిన లళలే అని అర్థము.)
(Σ అనునాసికము కాక తక్కిన వర్గాక్షరములు నాలుగన్ను అని తెలియజేసే గురుతు. ఆనాలుగున్ను అన్యోన్యమైత్రి గలవి అని అర్థము.)
(Σయ్ అంటే యరలవశషసహలు 8న్ని)
12. Σప్=వ్
13.ఙ్=న్/=Σ
14. ల్ =ళ్ =డ్
15. హయలకు స్వరమైత్రి వ్యంజనము పాటించకుండా హకార యకారముల
పైని ఉన్నస్వరములకు ప్రత్యేకించి వడి చెప్పవచ్చును.
16. గూఢస్వరవ్యంజనములు వడికోసము పాటింపవచ్చును.
ఉ. దాసోహం' 'అన్యోన్య’లో ‘అ’; ‘వనౌకస'లో ఓ' ‘జగజ్జనకుడు’ లో 'త్'; 'వాగ్ఘరిలో' 'హ్'
17. 'సంయుక్తవ్యంజనములలో ఏవ్యంజనమునకు వడి ఉంచినా చాలును; గాని పాదమున
మూఁడునాలుగుచోట్ల వడి కావలసిన వృత్తములలో స్రగ్ధరాది
వృత్తములలో సర్వత్ర ఏదో ఒక వ్యంజనమునే పాటించవలెను.
18. ఉభయవళులు-అఖండవడి (వీటిని గురించి ప్రత్యేకముగా చర్చచేయవలసినది.)
19. ప్రాసవడి.
పైని ఉదాహరించినవాటిలో 1,4,5,6,7,8,11,15,17 సర్వలాక్షణికసమ్మతములు.
2-వ దానిలో ఇ ఈ ఎ ఏ ఋ ౠలకు మైత్రిమాత్రమే
3-వది అనంతుడు మాత్రమే చెప్పివాడు; తక్కినలాక్షణికులు దీనిని గురించి ఏమీ చెప్పినట్లు కనబడదు. ఋవళిని బట్టి ఌవళి ఒప్పుకోవలసినదే.
9-వ దానిలో Σοత్=న్; Σοట్ =ణ్; అని బిందుయతులకిందను; న్=ణ్ అని సరసయతులకిందను, అందరున్ను చెప్పినారు. ఇవి కాక, Σοత్ =ణ్; Σοట్=న్; Σοత్ = Σοట్ వేరేభేదములుగా అప్పకవి చెప్పినాడు; గాని అనవసరము; బిందుసరసయతులబట్టి ఇవి సాధించవచ్చును.
10-వ దానిలో Σοప=మ అని మాత్రమే బిందుయతికింద అందరును చెప్పినారు. Σοయ=మ అనేమకారయతి అనంతుడు, అప్పకవి చెప్పినారు; విన్నకోట పెద్దన చెప్పలేదు. అప్పకవీయములో ఈవళికి లక్ష్యముగా భీమన చాటుపద్యము (చ. గరళపు...) ఉన్నది. ఈభీమనే కవిజనాశ్రయకర్త అయితే ఈవళిభేదము తన లక్షణగ్రంథములో ఎందుకు పేర్కోలేదో!
12-వ దానిగురించి భారతములో ప్రయోగములున్నా కవిజనాశ్రయములో గాని కావ్యాలంకారచూడామణిలోగాని ఏమీ చెప్పలేదు. అనంతుడు వపలకుమాత్రమే మైత్రి చెప్పి దీనికి 'అభేదవిరతి' అని పేరు పెట్టినాడు. వబలకు అభేదమున్నదిగానీ వపలకు లేదుగదా! గనుక, ఈపేరు వీటికి సార్థకము కాలేదు. అప్పకవి అందుచేతనే వబలకు అభేదవిరతి అనిన్ని Σప వలకు అభేదవర్గయతులనిన్ని పేర్లు పెట్టినాడు. అయితే, రెండవదానిలో మొదటిదికూడా ఇమిడి ఉన్నది గనుక Σపవల మైత్రి (అభేదవర్గయతి) అని ఒక్కటిగా చెప్పితే చాలదా?
13-వ దానిగురించి కవిజనాశ్రయములోగాని కావ్యాలంకారచూడామణిలోగాని ఏమీ కనబడదు. జ్ఞΣలకు మాత్రము వడి అనంతుడు చెప్పినాడు. జ్ఞΣకలకు కూడా వడిగలదని తిక్కనసోమయాజి ప్రయోగ మాధారముగా తీసికొని చెప్పినాడు; గాని సోమయాజి మరియెక్కడను ఇటువంటి ప్రయోగము చేయలేదు. ఈప్రయోగమైనా చేసి ఉండడనిన్ని ఇది సరియైన పాఠముకాదనిన్ని కొందఱి అభిప్రాయము. ఇది సరియైన పాఠమే అయితే తిక్కనసోమయాజిగారి కాలముననే జ్ఞాకు తాలవ్యోచ్చారణ మారి ఇప్పుడున్నట్టు 'గ్యా' అని కంఠ్యోచ్చారణ వచ్చినదని ఊహించవలెను. నన్నయ ఈవడి వాడలేదు; మీద చెప్పిన ప్రయోగముకాక పూర్వకవి ప్రయోగము మరియొంటి కనబడలేదు; గానీ, ఉత్తరాంధ్రకవులు కొందరు వాడినారు.
14-వ దానిగురించి స్పష్టముగా చెప్పినవాడు అప్పకవి. స్పష్టముగా లక్షణము చెప్పకపోయినా, అనంతకవి తాను వ్రాసిన పద్యములో ళడలకు మైత్రిపాటించుటచేత అతని కీమైత్రి ఇష్టమే అని ఊహించవలసి ఉన్నది. (చూ. మూ.1.95) లళకు మైత్రి కలదని ఎక్కటియతి గురించి వ్రాసినపద్యములో చెప్పినాడు. వీటినిగురించి కవిజనాశ్రయములోను కావ్యాలంకారచూడామణిలోను ఏమీ చెప్పియుండలేదు. లళమైత్రికి ఆదిపర్వమందే ప్రయోగ మున్నది. 16-వ దానిలో నాలుగువిషయము లున్నవి. రెండు విధములయిన సంధికార్యములచేత స్వరమున్ను మరి రెండువిధములయిన సంధికార్యములచేత వ్యంజనమున్ను గూఢముగా ఉంటవి. ఈనాలుగు విషయములను నాలుగువిధములైన యతులుగా అప్పకవి పేర్కొన్నాడు: (లుప్తవిసర్గ, వృద్ధి, అంత్యోష్మసంధి, వికల్పసంధి). వీటిలో స్వరసంబంధమైనవి రెండున్ను ఒక్కటిగా చేసి అనంతుడు మూడువిధములయిన యతులు పేర్కొన్నాడు. విన్నకోట పెద్దన వృద్ధివళులగురించే లక్షణమున చెప్పి ఆదేశయతికి లక్ష్యముగా ఇచ్చినపద్యములో లుప్తవిసర్గవళికి కూడా సరిపోయినట్లు 'అన్యోన్య' లో 'గూఢస్వరమునకు 'అ' తో వడి కూర్చినాడు. గూఢముగా ఉన్న వ్యంజనముగూర్చి ఏమీ చెప్పలేదు. కవిజనాశ్రయములో వీటిలో ఏదిన్నీ చెప్పియుండలేదు. నన్నయ భారతమందు కాక తక్కిన కొన్ని పూర్వగ్రంథములందు వీటికి లక్ష్యములు చూపించవచ్చును.
18-వ దానిగుఱించి మతభేదములున్నవి.
సుప్రసిద్ధమైన ప్రయోగములు అనేకముగా ఉండుటచేతను పేరు పొందిన లాక్షణికులలో కొందరి సమ్మతి కలదు గనుకను అఖండవడి ఒప్పుకోక తప్పదని, “తెలుగు” అనేపత్రికలో సం॥9-10 లో నేను వ్రాసిన వ్యాసమును చూడండి.
అఖండవడి ఒప్పుకొన్నతర్వాత ప్రాది మొదలయిన ఉభయవళులు వేరే పేర్కొనుట అనవసరము. కాకుప్లుతము మొదలయినవాటిలో స్వరము ప్రధానము అని చెప్పితే చాలును. అఖం డవడి ఒప్పుకోకపోవుటచేత అనంతుడు కొన్ని ఉభయవళి విభాగములు ఏర్పర్చుకోవలసివచ్చినది. అత డేర్పరచిన విభాగములలో చేరక కొన్ని అఖండవళ్లు కనిపించడముచేత అప్పకవి మఱికొన్నివిభాగము లేర్పర్చవలసివచ్చినది. 12 విధములయిన ఉభయవళ్లు అప్పకవి పేర్కొన్నా వీటిలో దేనికిందనూరాని అఖండవళ్లు కనబడుతూనే ఉన్నవి; ఉ. ఏవార్ధకవడి; ఇంచుగ్వడి; చతుర్థీవిభక్తివడి మొదలయినవి.
19-వ ది గీతాద్యుపజాతులలో తప్ప మరియెక్కడను దీనిప్రయోజనము లేదు గనుకను, అక్షరమైత్రితో సంబంధము లేదు గనుకను, దీనిని పూర్వలాక్షణికులు యతులలో పేర్కొనలేదు. యతికి బదులుగా వచ్చేది గనుక ఇదిన్ని ఒక యతిభేదమే అని అప్పకవి పేర్కొన్నాడు.
అనవసరముగా చెప్పిన యతిభేదములు.
భిన్నయతులు, ప్రత్యేకయతులు: అనంతుఁడు, అప్పకవి పేర్కొన్నారు. 'చేతిది'[4] లో ఉన్న 'తీ'కిన్ని 'దివిజ' లో ఉన్న 'దీ'కిన్ని మైత్రి కలదు; చేతి య దిలో ఉన్న 'యా'కు అకారముతో మైత్రికలదు;‘ధరించె[5]'లో ఉన్న ‘రీ'కి రేఫతో మైత్రి కలదు; ‘ధరియించె’ లోఉన్న ‘యీ'కి ఇకారముతో మైత్రి కలదు; అని ప్రత్యేకముగా కొత్తయతిభేదములవలె ఎందుకు చెప్పవలెనో తెలియదు. చేతిదిలో ఉన్న తకారముపై స్వరము విరుగునన్న భ్రమపడకూడదని చెప్పవలెనంటే, ఆలాగునే చెప్పరాదా? ఇటువంటివి ఇంకా ఉన్నవి; ఎన్నని పేర్కొగలము? ఉ. ఉన్నది, (ఉన్న + అది), ఉన్నవి (ఉన్న +వి), ఉన్నాడు (ఉన్న +వాడు; ఉన్న + ఆడు),[6] చిన్నవి (చిన్న + అవి), రాజవు (రాజు + అవు) ఇటువంటి మాటలు 'చేతిది' వంటివి కావా?
పోషించు, భుజించు మొదలయినవాటిలో మధ్యవర్ణముపై స్వరము విరుగుననుటకు ప్రసిద్ధులయిన పూర్వకవుల ప్రయోగములున్నవి:—
1. సందియం బీరమణీయకాంతి నుప+మింపఁగ.(ఆది ప. V. 155)
2. ఇరవు గదాధార గొని భు+జించుట యొప్పు. (పద్మపు II. 93)
3. ఎక్కబఠించునంతకు వ+రించుట. (పద్మపు. III. 170)
రేఫయుతయతి:— ఈయతిభేదము అనంతు డెందుకు చెప్పినాడో తెలియదు, "తెనుగుమాటలలో ఋకారముండదు; స్రుక్కు, క్రుమ్ము మొదలయిన మాటలలో ఉన్నది రేఫ", అని చెప్పియుండును గాని ఇది యొకయతిభేదముగా చెప్పియుండడని నా అభిప్రాయము, అందుచేతనే పట్టికలో దీనికి వేరేసంఖ్య చూపక 18 అని ఉంచినాను. ఇదికలిపితే అనంతుడు 25 వడి భేదములను పేర్కొన్నాడని చెప్పవలసి ఉంటుంది. 24 వడి భేదములనే అనంతుడు పేర్కొనినట్లు అప్పకవి వ్రాసినాడు.
ఎక్కటి (ఏకతర) వళ్లు: ఇవి లాక్షణికు లందరున్ను చెప్పినారు. ఏ అక్షరమునకు ఆ అక్షరమే వడిగలది అని దీని అర్థము. అటువంటి అక్షరములు 'మయరలవ'లు అని కవిజనాశ్రయములోను, 'మరఱలవ'లు అని కావ్యాలంకారచూడామణిలోను, 'మరఱళవ'లు అని ఛందోదర్పణములోను ఉన్నది.
బిందుయతినిబట్టి, 'మాకు Σοపతోవడి ఉండగా, ‘మ’ ఎట్లు ఎక్కటివడి కాగలదు? సరసయతినిబట్టి అయహలకు వడి చెల్లగా, 'య' ఎట్లు ఎక్కటివడి కాగలదు? డకారముతోను, లకారముతో 'ళా' కు వడి అంగీకరించిన అనంతుడు 'ళా' ఎక్కటివడిగా ఎట్లు చెప్పగలడు?
ఇది అంతా చక్కగా విమర్శించే కాబోలు అప్పకవి, రఱలనే ఏకతరయతులక్రింద పేర్కొన్నాడు.
లాక్షణికులు పాటించిన అక్షరమైత్రి చాలామట్టుకు “తుల్యాస్యప్రయత్నం సావర్ణ్యం” అనే ధర్మమునుబట్టే ఏర్పడ్డదని చెప్పవచ్చును. కాని ఈదిగువ నుదాహరించిన వాటిలో తుల్యాస్యప్రయత్నము పూర్తిగా ఉన్నట్లు కనబడదు.
1. ఇ, ఎ=ఋ. ఋకారము మూర్ధన్యముగదా? తాలవ్యాచ్చులతో ఎట్లు మైత్రికలుగును? అయితే, ఋకారమునకు తాలవ్యోచ్చారణ పూర్వముఉండెను. గనుకనే కృష్ణుఁడు - కిత్తడయినది.[7] రానురాను ఋకారమునకు తాలవ్యోచ్చారణ మారి ఉత్వముతోకలిసిన రేఫోచ్చారణవచ్చినది. ఋౠలు రురూలని తెలుగువారు పలుకుచున్నారు. ఇది అనంతునినాటికే వచ్చినట్లు కనబడుచున్నది. స్రుక్కు రేఫయుతమే గాని 'సృక్కు 'అని ఋకారయుతము కాదని చెప్పినాడు. ఇటువంటిదే ఌవడి.
2. దంత్య ‘ౘౙస' లకు తాలవ్య 'చజశ'లకు మూర్ధన్య 'ష'కారమునకు మైత్రి ఎట్లు సావర్ణ్యమునుబట్టి కలిగినది? వీటిమైత్రికంటె 'సెలవు'లో 'సె'కున్ను 'శలభము'లో ఉన్న 'శ'కున్ను మైత్రి తెలుగువారి ఉచ్చారణబట్టి ఎక్కువగా ఉన్నట్లున్నది. ఇవి అన్నీ ఉష్మములు గనుక వాటికి మైత్రి కలదు అంటే, హకారము కూడా ఊష్మము, ఉపధ్మానీయజిహ్వామూలీయములు కూడా అట్టివే. అంతస్థములయిన “యరలవ”ల కేల మైత్రి లేదు?
3. లఘ్వలఘు యకారములకు తుల్యాస్యప్రయత్నము పూర్తిగాఉన్నదా? 'యామినీ' లోని 'య' 'వచ్చినయప్పుడు'లోని 'య' — ఈ రెండున్ను ఒక్కలాటివా?
4. నణలు భిన్నవర్గములు; అనునాసికత్వమే సామాన్యము; అంటే, తక్కినఅనునాసికలతో ఎందుకు మైత్రికూడదు? తత్సమ తద్భవములలో నణలు మారుచుండును. ఉ. గుణము; గొనము; సావర్ణ్యము కొంతవర కుండబట్టే ఈ రెండును ఒకదాని కొకటి వచ్చునంటే, దడలు ఈలాగునే దేశ్యపదములలో కనిపించును గదా; వాటికి మైత్రి ఎందుకు చెప్పరాదు? ఉ. దొంగ, డొంగ; దాపల; డాపల, సంస్కృతమందు తకార మొకప్పుడు టకార మగునుగదా.
5. లడలు, వ బలకు (వ, Σప) అభేదమన్న కారణముచేత మైత్రి అంగీకరించినప్పుడు, రలల కెందుకు మైత్రి ఉండరాదు! (సరిరము, సలిలము; రేఖ, లేఖ)
6. తెలుగులో గవలు, ‘లన'లు కొన్నిమాటలలో మారుచుండును; ఉ. పగడము, పవడము; తెలుఁగు, తెనుఁగు.
వడిస్థలము
సంస్కృతశ్లోకములలో విశ్రాంతి ప్రధానము; ఖండాద్యక్షరమైత్రి కావలెనన్న నియమము లేదు. తెలుగు పద్యములలో ఖండాద్యక్షరమైత్రి ప్రధానము. విశ్రాంతి (అనగా పదము ముగియవలెనన్న) నియమము లేదు. విశ్రాంతి ఐచ్ఛికముగా ఉండుటవల్ల మేలే కలిగినదని చెప్పవచ్చును. అన్నిపాదములలోను విశ్రాంతి ఒక్కచోటనే ఉండుటకంటె మారుతూ ఉంటే పద్యము రసోచితముగా ఉండుటకు వీలుండును. అక్షరమైత్రి కావలెనని కోరేవారు విశ్రాంతిస్థలమందు వడిపాటించుట మంచిదే కాని విశ్రాంతిస్థలమును నిర్ణయించుటలో రసజ్ఞు లైనకవులు తమస్వాతంత్య్రము చెడగొట్టుకోకూడదని నామతము.
లక్షణసూత్రములు మీరరానివన్నట్లున్నా కవులు కొద్దిగా స్వాతంత్ర్యమును చూపించకపోలేదు. సంస్కృతలాక్షణికులు వృత్తములలో ఎక్కడెక్కడ విశ్రాంతి ఉండవలె నని చెప్పినారో ఆవృత్తములకు సరియైన తెలుగుపద్యములలో ఆయాస్థలములందే వడినియమము సాధారణముగా ఉన్నది; గాని, చాలాచోట్ల తప్పినది. ఉదాహరణములు:
1. భుజంగ ప్రయాతము:-- సంస్కృతమున 6 అక్షరములు తర్వాత[8] తెలుగున 7 తర్వాత వేదము వేంకటరాయశాస్త్రులవారు సంస్కృతపండితులు గనుక సంస్కృతనియమమే పాటించినారు.
2. పంచచామరము: సం. 8; తెలుగు 9.
3. శిఖరిణి:—సం. 6; తె. 12.
4. ఆర్యాదిజాతులు:—చూడండి; మూలము III. 3. 4.
తెలుగుపద్యములలోసే వళిస్థలముల గురించి లాక్షణికులలోను కవులలోను మతభేదమున్నది. చూడండి:—
1. పృథ్వి:— సంస్కృతములో 8. ఈమర్యాద ననుసరించినవారు పెద్దన. అప్పకవి, అనంతుడు, విన్నకోట పెద్దన కవిజనాశ్రయకర్త వీరి మతమున 11 తర్వాత. ఈనియమమును నన్నయ రామరాజభూషణుడు మొదలయిన వారు పాటించినారు. తాతంభొట్లు మతమున 13 తర్వాత.
2. కవిరాజవిరాజితము:— అప్పకవి మొదలయినలాక్షణికులందరిమతమున. పాదాక్షరములలో 8 వది,14 వది, 20 వది మొదటి అక్షరముతో మైత్రి కలవి.
కవిజనాశ్రయములో(చూ. పు. 49) రెండవ పాదమున “ కామనిభా” అనుచోటమాత్రము వడి తప్పినది. గాని, అప్పకవి మొదలయినవారు చెప్పినట్లే ఉన్నది.[9]
కంకంటి పాపన మొదలయిన కవులు కొందరిట్లే వడి పాటించివారు. గాని నన్నయ, పెద్దన, జక్కన మొదలయినవారు కొందరు పాదమధ్యమున ఒక్కచోటనే వడి పాటించినారు.
3. మధ్యాక్కర: — లాక్షణికులందరును మూడుగణముల తర్వాత వడి నియమించినారు. నన్నయ ఒక్కడే నాలుగుగణముల తర్వాత వడి పాటించినకవి. యుద్ధమల్లుని శాసనమందున్న మధ్యాక్కరలలో నాలుగుగణముల తర్వాతనే వళి ఉన్నది.
కొన్నిపద్యములలో తెలుగులాక్షణికు లందరున్ను చెప్పినస్థలముందుగాక మరియొకచోటను వళి ఉంటే ఎక్కువ బాగుగా ఉండునని నాయభిప్రాయము.
1. జలోద్ధతగతి:—సరోరుహదళాక్ష + శాశ్వతయశా (అనంతుడు), తెలుగులాక్షణికు లందరును ఇట్లే వళి పాటించినారు; గాని' సంస్కృతలాక్షణికుల నియమము పాటించుట మంచిదని నేను వ్రాసినది చూడండి.
సరోజనయనా + జలోద్ధతగతిన్
సరూపగతులన్ + జసంబు జసమున్
జరించు; విరతుల్ + షడర్ణములపై
కరీంద్రవరదా + ఖగేంద్రతురగా
2. ప్రమితాక్షరము:— ‘కమనీయ తేజునిన+గణ్యయశున్' అనంతుడు లాక్షణికు లందరును ఇట్లే 8 తర్వాత వడి ఉంచినారు. గాని 6 త ర్వాత వడి ఉంచి నేను వ్రాసినది చూడండి.
జగదేకదేవ + సజసాయుతమై
ద్విగణాంతమందు + విరమం బమరన్
భగవంతుఁ గొల్వ + ప్రమితాక్షరమై
జగమందు నిల్చు + జలజాక్షహరీ
“భక్తజనత్రాత +భతనగాసం
యుక్తములై మౌని+యుతయతుల్ సు—" (అప్పకవి)
తక్కినలాక్షణికులు ఈ వృత్తము పేర్కోలేదు.
సంస్కృతమున ఉన్నట్లు 5 తర్వాత విశ్రాంతి ఉంచి నేను వ్రాసినది చూడండి.
భక్తులఁ గాచే+వనరుహనేత్రున్
సూక్తులఁ బల్కే+సురుచిరగాత్రున్
ముక్తి నొసంగే+మునిజనమిత్రున్
మౌక్తికమాలన్+బలుమఱు గొల్తున్
ప్రాసము
అలంకారతుల్యములైన ప్రాసములు – సుకర, దుష్కర, ద్వి, త్రి, చతుష్ప్రాస, అనుప్రాస, అంత్యప్రాసములు ఏడింటిని అప్పకవి చెప్పినాడు. వీటిలో మొదటిదిగాక తక్కిన ఆరున్ను ఛందోదర్పణములో ఉన్నవి. చతుష్ప్రసముగాక తక్కినఆరున్ను కవిజనాశ్రయములోను, కావ్యాలంకారచూడామణిలోను ఉన్నవి. అయితే కావ్యాలంకారచూడామణిలో చతుష్ప్రాసప్రాసము లక్షణపద్యమందు కనబడకపోయినా దానికి లక్ష్యముగా త్రిప్రాసలక్ష్యపద్యము తర్వాత నొకపద్య మున్నది. ఇది ప్రక్షిప్తము కాబోలు.
ప్రధానప్రాసభేదములలో లళడ ఋక్రాంతప్రాసములపద్యములు మూడు కవిజనాశ్రయములో ఉన్నవి. ఈపద్యములే కావ్యాలంకారచూడామణిలో కూడా ఉన్నవి. ఇవి ఎవరివో తెలియదు. ఇంతకు మించి ప్రాసభేదములు ఈలక్షణగ్రంథములలో లేవు. ఈలక్షణగ్రంథకర్తలు నన్నయ భారతములోని పద్యములందు గల ప్రాసభేదములను చక్కగా పరిశీలించలేదని చెప్పవచ్చును.
అనంతుడు సమప్రాసవిధులు చూపించి మరి పదకొండువిధములైన విశేషప్రాసముల గురించి చెప్పినాడు. (మూలము 10.వ పుట చూడుము.)
అనంతుడు చెప్పిన పండ్రెండువిధములేకాక అతడు చెప్పక విడిచిన మరి యేడు విశేషములు అప్పకవి చెప్పినాడు. అవి ఏవంటే:—
(1) వేఁడు, పండ్లకు.
(2) లోక, (భా)షాకౢప్తకు.
(3) సషలకు.
(4) తమ్ములు, (భ)క్తి మ్ముర (భక్తిన్ + ముర) లకు
(5) దధలకు, ందంథలకు.
(6) లఘ్వలఘు యకారప్రాసము.
(7) లడలకు.
యతిప్రాసములు
"యతిప్రాసనియమము త్యజించుట కాంధ్రలోక మంగీకరించునని తోఁపదు” అని జయంతి రామయ్యగారు కవిజనాశ్రయపీఠికలో కొన్నికారణము లిచ్చి సిద్ధాంతము చేసినారు. ఈనియమములను త్యజింపవలయునని గాని త్యజించరాదనిగాని శాసించి నిర్బంధించకూడదనిన్ని, త్యజించదలచుకొన్నవారిని పాటించదలచుకొన్నవారిని సమదృష్టితో చూడవలసినదనిన్ని నాయభిప్రాయము. ఈనియమములు శబ్దాలంకారములవలె ఐచ్ఛికముగా వాడుకోవచ్చును; లేదా ఇవి విడిచిపెట్టి యుక్తివిశేషము ప్రధానముగా పెట్టుకొని రసవంతముగా కావ్యములు చెప్పవచ్చును. సంస్కృతశ్లోకములకు తెలుగుపద్యములలో ఉండవలెనన్న నియమములు లేవు. అంతమాత్రాన కాళిదాసాది మహాకవుల కావ్యములకు ఏమి లోటు కలిగినది? వాటికంటే తెలుగుకావ్యములకు వళ్లవల్లను ప్రాసములవల్లను వచ్చిన ఘనత ఏమి?
"శబ్దస్వరూపము నిర్ణయించుట కత్యంతోపయోగకరము” లని రామయ్యపంతులుగారి అభిప్రాయము. వడిప్రాసములు లేకపోయినా సంస్కృతభాషాశబ్దస్వరూపము వేదకాలమునుండి నేటికిని ఎక్కువ చక్కగా నిర్ణయించవచ్చును గదా. అయితే ఇతరసాధనము లున్నవందురేమో. సూర్యారాయనిఘంటువువంటి నిఘంటువులున్ను, అచ్చు మొదలయిన ఇతరసాధనములున్ను వచ్చుచున్నవిగనుక వడిప్రాసములవంటి సాధనములు శబ్దస్వరూపనిర్ణయమున కిక నవసరమని తోచదు.
“ఆంధ్రవాఙ్మయాభివృద్ధి కీ నియమములు బాధకములుగా ఉండియుండకపోయిన" వని రామయ్యగారి అభిప్రాయము. నన్నయ, తిక్కన మొదలయిన మహాకవులు సయితము వడిప్రాసముల కోసము పొల్లుమాటలు వాడుక చేసినట్లు వందలకొలది ఉదాహరణములు చూపించవచ్చును.
ఇటువంటి నియమములు పాటించవలెనని నిర్బంధముగా ఉన్నంతకాలము ఆంగ్లవాఙ్మయము ఎట్లుండెనో స్వేచ్ఛ కలిగిన తర్వాత (Romantic Period) లో ఎట్లు అభివృద్ధి పొందినదో చూడండి.
పద్యములకు నడక ప్రధానమైనది. పద్యముల కుండవలసిన ఈ ముఖ్యలక్షణమును స్పష్టముగా తెలియజేసేటట్లు లాక్షణికులు కొన్నిచోట్ల సరియైన లక్ష్యలక్షణపద్యములను ఇయ్యలేదని నా యభిప్రాయము. ఈ విషయమును గురించి “తెలుగు”పత్రిక 5, 6, 7, 8 సంచికలలో నేను వ్రాసిన “ఛందోరహస్యదర్పణము”ను చూడండి.
సీసములు
లాక్షణికు లందరిలోను అనంతుడు ఎక్కువగా పదిసీసభేదములను చెప్పినాడు.
1. సమసీసము — (సామాన్యసీసము; విశేషలక్షణమేమీలేదు.)
2. సర్వతఃప్రాససీసము—(అన్ని చరణములలోను ఒకే అక్షరము ప్రాసయతులుగలది. అనగా24 చోట్ల ఒకటే ప్రాసాక్షరము.)
3. అక్కిలిప్రాససీసము—(పెద్దపాదములందుగల 8 ఖండములలోను గీతి నాలుగుపాదములలోను రెండవ అక్షర మొక్కటే అయి ఉండవలెను,అనగా 12 చోట్ల ఒకటే ప్రాసాక్షరము.) 4. సమప్రాససీసము—(నాలుగు పెద్దపాదములందును గీతిలో బేసిపాదముల రెంటను రెండవఅక్షరము ఒక్కటే అయి ఉండవలెను. అనగా ఆరుచోట్ల ఒకప్రాసాక్షరము.)
5. వృత్త ప్రాససీసము— (పెద్దపాదముల నాల్గింటమాత్రమే వృత్తములు కున్నట్లు ప్రాస ముండవలెను.)
6. అవకలిప్రాససీసము— (అన్నిచోట్లను ప్రాసయతినియమముమాత్రమే కలది.)
7, అక్కిలివడిసీసము— (అన్నిచోట్లనువడి నియమమేకలది.)
8. వడిసీసము — (అన్ని చోట్లను వడినియమ ముండవలెను; అంతేకాక పాదాదినున్నవర్ణముతో మైత్రిగల వర్ణములే పాదముపొడవున యతిస్థలములందు రావలెను.)
9. విషమసీసము— (ఉత్సాహ, గీతపద్యమున్ను కలిసినది.)
10. సర్వలఘుసీసము— (ఇందులో ఇంద్రగణములకు బదులుగా అయిదు లఘువుల గణము లుండును.)
వీటిలో 3, 4, 6, 7, 8, 9 —సీసభేదములు కవిజనాశ్రయములోను కావ్యాలంకారచూడామణిలోను ఉన్నవి. అయితే 3 వది సరిగా అనంతుడు చెప్పినట్లు లేదు; 8 పాదములలోను ప్రాసాక్షర మొక్కటయితే చాలును; పెద్దపాదముల పశ్చిమార్థములం దీనియమము లేదు.
ఈ రెండు లక్షణగ్రంథములలోను సీసభేదముల విభాగమున్ను లక్షణములున్ను ఒక్కలాగుననే ఉన్నవి గాని, కవిజనాశ్రయములో రెండేసిభేదముల కొకొక్కపద్యమే ఉన్నందున కావ్యాలంకారచూడామణిలో ఉన్నంత స్పష్టముగా లక్షణము లేదు. రెండు గ్రంథములలోను విషమసీసములుగాక తక్కిన అయి దున్ను సమసీసములని చెప్పియన్నదిగాని సమసీసము ఒకసీసభేదముగా చెప్పలేదు.
“సీ. వృత్తంబునకువలె” అన్న పద్యము కవిజనాశ్రయములోను ఛందోదర్పణములోను ఉన్నది. ఇది సీసభేదముల పేళ్లు గలసీసము; అవకలిసీసమునకు లక్ష్యముగా ఉన్నది. ఇందులో వృత్తప్రాససీసమును సమసీసమును పేర్కొన్నారు. వీటికి కవిజనాశ్రయములో లక్ష్యపద్యములు లేవు; సీసభేదములను పేర్కొన్న గద్య వేరేఉన్నది; ఆగద్యలో ఈ రెండు భేదములు పేర్కొనలేదు. ఈవిషయము లన్నీ చూడగా ఈ పద్యము అనంతునిదే అనిన్ని కవిజనాశ్రయములో ప్రక్షిప్తమనిన్ని ఊహించవచ్చును.
ఈలాగుననే మరికొన్ని పద్యములు కవిజనాశ్రయము వ్రాతప్రతులలో దూరినవి, అని ప్రక్షిప్తములని ఆంధ్రసాహిత్యపరిషత్ప్రకాశితప్రతిలో పుట అడుగున సూచితమై ఉన్నది గాని ఈపద్యముగురించి ఏమియు చెప్పలేదు. పరిష్కర్తలు చూచిన అన్నిప్రతులందును ఈపద్య మున్నది కాబోలు.
అప్పకవీయములో లక్ష్మణపద్యమును బట్టి లక్ష్యములు సరిగా లేవు గనుక కవి అభిప్రాయము స్పష్టముగా తెలియదు. అతడు చెప్పిన సమసీసము, సర్వతఃప్ర్రాససీసము, విషమసీసము, సర్వలఘుసీసము అనంతుడు చెప్పినట్లే ఉన్నవిగాని, అప్పకవి అక్కిలిప్రాససీసమన్నది అనంతుని సమప్రాససీసమునకు సరిపోయినది. అయితే అందుకు లక్ష్యముగా అప్పకవి ఇచ్చిన పద్యములో చివరను “చెలఁగుచుండు వృత్తిప్రాససీసము లిల" అని ఉండుటకు కారణమేమో తెలియదు.
“ఆదినే వడి నిల్పి రావడే పదమెల్లఁ జేయ నయ్యది వడిసీస మనఁగ” అని అప్పకవి అనంతునివలెనే లక్షణము చెప్పి అందుకు లక్ష్యముగా ఇచ్చిన పద్యములో ఆ లక్షణము పాటించలేదు. అనంతుడు అక్కిలివడికి చెప్పిన లక్షణము మాత్రమే పాటించినాడు.
అనంతుడు 'అవకలిప్రాస' మన్నసీసమునకు అప్పకవి అవకలివడిసీసమని పేరుపెట్టినాడు.
ఇంతకున్ను ఎంతమట్టుకు ఈసీసభేదములు కవులు తమకావ్యములలో చూపించినారో విచారణీయము. “సప్తవిధము లివియ శబ్దశాసనుుడి, పంచమామ్నాయఫక్కిలోఁ బల్కెఁగాని, కడమకవు లాఱుసీసము ల్విడిచిపెట్టి చెలఁగి సమసీసపద్యమే చెప్పినారు” అని అప్పకవి వ్రాసినాడు; గాని ఇది సత్యము కాదు.
నన్నయ 13 విధము లయిన సీసములు చెప్పినాడు. వీటిలో రెండుమాత్రమే లాక్షణికులు చెప్పిన సీసభేదములలో ఉన్నవి:- (1) అక్కిలివడిసీసము (2) అవకలిప్రాససీసము. ఈవిషయము “తెలుగు” రెండవసంచికలో చర్చించినాను.
ఆవ్యాసమున చెప్పమరచిన దొకటేమంటే నన్నయసీసములలో రెండు (ఆది. 11. 21; 111. 27) వృత్తప్రాససీసము లున్నవి. అయితే వాటిలో ఒకవిశేషమున్నది. ప్రాసాక్షరము పశ్చిమార్థములందున్ను కలదు.
ఎర్రాప్రెగడ భారతములో నన్నయ చెప్పిన సీసభేదములు కలవు.
భాగవతములో పోతనామాత్యుడు నన్నయవలెనే కొన్నినియమములను పాటించి పలువిధములయిన సీసములను చెప్పినట్లు వావిలికొలను సుబ్బారావుగారు పరిషత్పత్రికలో (సంపుటము 6 పుటలు 417-420) తెలియజేసినారు.
భాగవతము ఏకాదశస్కంధమున 72-వ పద్యము సర్వలఘుసీసము. లాక్షణికులు చెప్పినట్లు ఇందులో ఇంద్ర గణములకు బదులుగా 5 లఘువులగణము అన్నవి. ఇది తెలియక కాబోలు (చూ. ఆనంద ...1904 ముద్రితము) పుట అడుగున ఈసీసము లక్షణసమన్వయముగాక యున్నదని సంప్రతించినవారు వ్రాసినారు.
కూచిమంచి తిమ్మకవి మొదలయినకవులు కొంద రిట్లే సర్వలఘుసీసములు చెప్పినారు. గణపవరపు వేంకటకవిమాత్రము తన ప్రబంధములో నలములయిన ఇంద్రగణములతోనే సీసము వ్రాసినాడు (చూ. 75, 221 పద్యములు.)
ఆర్యలు, గీతులు
పథ్య, విపుల, చపల, ముఖచపల, జఘనచపల అని ఆర్యలు అయిదు. గీతి, ఉపగీతి, ఉద్గీతి, ఆర్యాగీతి అని గీతులు నాలుగు. ఈ తొమ్మిదిన్ని సంస్కృతచ్ఛందములో ఉన్నవి; కందమన్నపేరు దానిలో లేదు గానీ, ఆర్యాగీతిలక్షణము కందపద్యలక్షణమునకు సరిపోయినది. గనుక కందము గీతులలో ఒకటిగా చెప్పవచ్చును గాని అప్పకవి చెప్పినట్లు కందమును ఆర్య లయిదింటిలో చేర్చి కందము లారువిధములని చెప్పుట యుక్తియుక్తముగా లేదు.
సంస్కృతమున ఉన్న ఆర్యలయిదింటికిన్ని సామాన్యలక్షణము:-
“లక్ష్మైతత్ సప్తగణా, గోపేతాభవతి నేహ విషమేజః।
షష్ఠోజశ్చనలఘువా, ప్రథమార్థే నియతమార్యాయాః॥
షష్ఠే ద్వితీయలాత్పర, క్లేన్లేముఖలాచ్చసయతిపద నియమః।
చరమే౽ర్థేపంచమ కే, తస్మాదిహ భవతి షష్ఠోలః॥"
4+4+4
4+4+1|+3|+4+4
4+4+4
4|+4+1|+4+2
అంకెలు మాత్రాసంఖ్యను నిలువుగీతలు యతిస్థానములను తెలియజేయును.
(రెండవపాదము మూడోగణము నలమో జగణమో కావలెను. దానిలో మొదటిలఘువు తర్వాత యతి గనుక 1+3 అని వ్రాయవలసివచ్చినది.) పైని చెప్పిన విషయములు సూత్రప్రాయముగా అనంతుడు III. 3-4 లో చెప్పినాడు. ఈలక్షణము యతిప్రాసనియమములలో కాక తక్కిన విషయములలో సరిపోయినది. కందములో కనబడునట్లు ప్రాసమున్ను సమపాదములలో మూడవగణముతర్వాత వళిన్ని ఉండవలెనని తెలుగులాక్షణికులు చెప్పినారు.
ఇప్పుడు ముద్రితమైన ఛందోదర్పణప్రతిలో ఆర్యాగీతుల లక్ష్యపద్యములు కనబడవు. లాక్షణికుల ఆచారమును అనుసరించి లక్ష్యలక్షణములను ఒక పద్యమందు ఇతరస్థలములలో చూపించిన అనంతుడు ఈఆర్యాగీతులందు మాత్రము చూపించియుండడా! అజ్ఞానముచేత కొందరు లేఖకులు అనంతుని ఆర్యాగీతులను కందములవలె నడిచేటట్లు “సవరించి” రూపుమాపినారు. అనవసరముగా అతికినమాటలు తీసివేసినయెడల వాటిలో లక్ష్యలక్షణములు రెండున్ను స్పష్టముగా కనబడగలవు. చూడండి:-
పథ్యార్య— | బేసులు త్రిగణయుతము లై | |
విపులార్య— | ప్రకటసమపాదముల నిలు | (పుట. 66) |
చపలార్య— | వరుసను ద్వితీయ మంత్యము | (పుట. 66) |
ముఖచపలార్య— | చపలా గణప్రకారం | (పుట. 66) |
జఘనచపలార్య— | మొదలిసగము చపలార్యా | (పుట.67) |
గీతి— | లసదార్యమొదలి సగమున | (పుట.67) |
ఉపగీతి— | ధర నార్యమీఁదిసగమున | (పుట.67) |
ఉద్గీతి— | విదితార్యచరమదళమున్ | (పుట.67) |
అక్కరలు
అక్కరలు దేశ్యజాతులలో చేరినవి. ఇవి కన్నడమందును గలవు. తెలుగు అక్కరలకు కన్నడపు అక్కరలకు చాలామట్టుకు సాదృశ్యమున్ను కొద్దిగా భేదమున్ను ఉన్నది.
నెం
1
2
3
4
5
తెలుగుపేరు
మహాక్కర
మధ్యాక్కర
మధురాక్కర
అంతరాక్కర
అల్పాక్కర
లక్షణము
సూర్య ఇంద్ర చంద్ర
1+ 5+ 1 = 7
ఇం సూ ఇం సూ
2+ 1+ 2+ 1 = 6
సూ ఇం చం
1+ 3+ 1 =5
సూ ఇం చం
1+ 2+ 1 =4
ఇం చం
2+ 1 =3
కన్నడపుపేరు
పిరియక్కర
దొరెయక్కర
నడువణక్కర
ఎడెయక్కర
కిరియక్కర
వీటిలో మహాక్కరకు పిరియక్కర, అంతరాక్కరకు ఎడెయక్కర, అల్పాక్కరకు కిరియక్కర అనేపేళ్లు సరిగా ఉన్నవి. కాని తక్కినవి సరిగా లేవు. అక్కర లయిదింటిలోను పాదమున ఉన్న గణసంఖ్యను బట్టి నడుమ నున్నది గనుక నడువణక్కర అనేపేరు కన్నడమున అన్వర్థముగా ఉన్నది. అయితే లక్షణమును బట్టి దీనికిసరియైన తెలుగు పేరు మధురాక్కర; అర్థమునుబట్టి సరియైన తెలుగు పేరు మధ్యాక్కర. మధ్యాక్కరకు లక్షణమును బట్టి సరియైన కన్నడము పేరు దొరెయక్కర. దొరెయక్కరనగా సమాన భాగములుగల అక్కర అని అర్థము; అంటే పాదము రెండుసమభాగములు చేయగా రెండుసమభాగములలోను గణములు ఒక్కతీరున ఉంటవని అర్థము.
2, 3, అక్కరల పేళ్లలో ఇంతమట్టుకు వైషమ్యమున్నా జయంతి రామయ్యపంతులు గారు అది కనిపెట్టకపోవడమే కాక '... పాదమున కై దేసి గణములుగల యక్కర గణసంఖ్యచే నైదక్కరలకు మధ్యస్థానమున నుండుటచే మధ్యాక్కర మను పేరును నన్వర్థములుగానున్న” వని వ్రాయుట చాలావింతగా ఉన్నది. మధ్యాక్కరపాదములో ఉన్న గణములు ఆరుగాని, ఆయన చెప్పినట్లు అయిదుకాదు. “మధ్యాక్కర” అని అర్థమిచ్చే కన్నడవు నడువణక్కర అనే పేరు అన్వర్థముగా ఉన్నదని కాబోలు వారు చెప్పదలచి అట్లు వ్రాసినారు.
కన్నడవు అక్కరలకున్ను తెలుగు అక్కరలకున్ను లక్షణములో కొద్దిగా భేదములున్నవి.
1. తెలుగు పద్యములలో సూర్యగణము లుండేచోట కన్నడపద్యములలో బ్రహ్మగణము లుంటవి (అనగా నగణ హగణములేకాక గగ, సగణములు కూడాను). తెలుగులో ఇంద్రగణము లుండేచోట కన్నడములో విష్ణుగణము లుంటవి (అనగా నల, నగ, సల, భ, ర, తలేకాక మగణము, సగణగురువు కూడాను). తెలుగులో చంద్రగణము లుండేచోట కన్నడములో రుద్రగణము లుంటవి(అనఁగా నగగ, నహ, సలల, భల, భగ, మల, సవ, సహ, తల, రల, నవ, నలల, రగ, తగలేకాక మగ, సగగములు కూడాను).
2. తెలుగు మధ్యాక్కరకు లక్షణముబట్టి సరిపోయిన కన్నడవు దొరెయక్కరలో చివరనున్న బ్రహ్మగణము అంతమందు గురువుగలదిగా ఉండవలెనన్న నియమమే ఉన్నది. అంటే గగమో సగణమో కావలెను. ఇందులో విష్ణుగణములు మాత్రము 4 గాని, 5 గాని మాత్రలుగల గణము కావలెనన్నారు గనుక తెలుగున ఉన్న ఇంద్రగణములే అగును.
నాగవర్మ కన్నడఛందములో లక్ష్యముగా ఇచ్చిన యక్కరలలో పాదాదినుండే బ్రహ్మగణములు మూడుమాత్రల గణములుగానే ఉన్నవి; గాని దొరెయక్కరలలో నడుమనున్న బ్రహ్మగణములు కొన్ని గగములున్ను, కొన్ని సగణములున్ను అయి ఉన్నవి.
3. కన్నడ పిరియక్కరల సరిపాదములందు 6 వ గణము బ్రహ్మగణము కావలెనన్న నియమమున్నది. అటువంటి విశేషలక్షణము మహాక్కరలందున్నట్లు కవిజనాశ్రయములో చెప్పలేదు. “రెండును నాలుగుసగు వాసరంబున నర్కుఁడైన, నాదరంబుననెడ సొచ్చునని మహాక్కరంబలుకుదు రార్యులెల్ల” అని అనంతుడును, "రెండవచోట నాలవచోటఁ జిత్రభానుగణంబు గదియుచుండు” అని అప్పకవీయములోను ఉన్నది. ఈవిశేషలక్షణము తెలుగు లాక్షణికుల మతమున ఐచ్ఛికముగా ఉన్నట్లు కనబడుచున్నది.
తెలుగు లాక్షణికులు అందరును ఒక్కలాగుననే మధ్యాక్కరకు లక్షణము చెప్పినారు. (ప్రతిపాదమునను రెండు ఇంద్ర గణములు, ఒక సూర్యగణము, రెండు ఇంద్రగణములు, ఒక సూర్యగణము ఉండును. అన్ని అందరున్ను మూడవగణము తర్వాతనే వడి నియమించినారు.
నన్నయ మధ్యాక్కరపాదములలో నాల్గవగణము తర్వాత వడి కనిపించుచున్నది. యుద్ధమల్లుని శాసనాక్కరలలో సైతము నాల్గవగణము తర్వాతనే వడి ఉండడముచేత పూర్వము అట్లే వడిస్థాన ముండేదని ఊహించవలసి ఉన్నది. తిక్కన మధ్యాక్కరలు చెప్పలేదు. ఎర్రాప్రెగడ మూడవగణము తర్వాతనే వడి పాటించినాడు. మరి యేకవిన్నీ మధ్యాక్కరలు చెప్పినట్టు కనబడదు. లాక్షణికులు ఎర్రాప్రెగ్గడ పాటించిన వడి గురించే చెప్పినారు గాని నన్నయపాటించిన వడి గురించి చెప్పలేదు.
నన్నయ మధ్యాక్కరలకున్ను తెలుగులాక్షణికులు చెప్పిన మధ్యాక్కరలకున్ను వడిస్థలములోనే భేదమున్నదా లేక గణములలో సయితము భేదమున్నదా? ఇటువంటి ప్రశ్న పుట్టుటకు కారణ మేమంటే, పాఠభేదములు అనేకముగా ఉన్నవి. నన్నయ ఎట్లు వ్రాసి ఉండునో తెలుసుకొనుట కష్టముగా ఉన్నది. వాటిలో అనేకపాదములందు గణములతీరు తెలుగులాక్షణికులు చెప్పినట్లు లేదు. భారతము పరిష్కరించి అచ్చు వేయించినవారు తెలుగులాక్షణికుల మతము ననుసరించి సవరించినారు. ఎంతో శ్రమపడి వారు ఆలాగున సవరించి అచ్చువేయించినా అచ్చుపుస్తకములలో కొన్ని పాదములందు గణములతీరు తెలుగులాక్షణికులు చెప్పినట్లు లేదు. చూడండి:—(వేమూరివారు ప్రకటించినది.)
(1) తనదివ్యశక్తి నప్పాశముల విడిచి + తన్మునినాథు (ఆది. VII.112)
(2) నంగురుకుల హానికరుఁడయి ధారుణీ + నాథనీసుతుఁడు (సభా. II. 188)
(3) సమరంగ ధర్మువురక్షించుఁ బ్రీతి+నని శత్రులందు (ఆర. I. 225)
(4) గలుగు టెరిఁగి యుపాయపూర్వమునఁ +గడఁగి తత్సిద్ధి (ఆర. I. 284)
(5) అరుణసరోరుహదళమృదులంబు + లైనయి తరుణి (ఆర. III. 299)
(6) పరఁగ నాకారణమున నిట్టి దుఃఖ +భారము దాల్చె (ఆర. III. 299.)
(7) నరిగె నీశానుదిక్కునకు నీయనుజుఁ + డనిలవేగమున (ఆర. III. 373)
(8) తోనేఁగెనుత్తరముమించి ధర్మని + త్యుఁడు ధర్మజుండు (ఆర. IV. 3) (9) పదుండ్ర బోలెడు సుతులనూర్వురఁ + బడయంగవలతొ (10) పదుండ్ర నూర్వుర కెనయగుసుతులఁ + బడయంగ వలతోొ (ఆర. II. 349)
వ్రాతప్రతులు చూచినయెడల మరి కొన్నిపాదములలో ఈలాగుననే గణములతీరు లాక్షణికులు చెప్పినదానికి భిన్నముగా గనబడును.
కొన్నిచోట్ల చాలావ్రాతప్రతులలో ఒక్కలాగుననే ఉన్నపాఠము అచ్చుపడ్డపుస్తకములలో కనబడకపోవుటచేతను, అచ్చుపడ్డపుస్తకములలో ఉన్న పాఠము నన్నయ వాగ్వ్యవహారమునకు విరుద్ధముగా ఉండడముచేతను పరిష్కర్తలు తెలుగులాక్షణికులమతము ననుసరించి నన్నయపాఠములను దిద్దినారని ఊహించవలసి ఉన్నది. చూడండి:-
(1) నీపరోక్షంబున రాజుగావలె + నెమ్మినిట్లీఁగ (ఆది. 1V. 175)
(2) ఏమేము మున్ను పూజింపుదుము రుద్రు + నిందని వేడ్క (ఆర. II. 255)
'కావలె' 'పూజిందుము' వంటి ప్రయోగములు మరియెచ్చటను నన్నయభారతముందు కనబడవు. ఇవి ఇటీవలి కవులు వాడినారు గాని పూర్వకవిప్రయోగములు కావు; గనుక 'కావలయు' 'పూజింతుము' అనే నన్నయ వాడి ఉండును. అయిదారు వ్రాతప్రతులలో ఇట్లే ఉన్నది. 'కావలయు', 'పూజింతుము' అని ఉన్నయెడల మీద చూపించిన 10 పాదములవలెనే ఈ రెండుపాదములలోను గణములతీరు లాక్షణికులు చెప్పినవిధమున ఉండదు, చూడండి:-
(1) నీపరోక్షంబున రాజుగావలయు + - నెమ్మినిట్లిఁగ (వ్రాతప్రతులు)
(2) ఏమేము మున్నుపూజింతుము రుద్రు + నిందని వేడ్క (వ్రాతప్రతులు)
ఈలాగున పరిశీలించి చూచిన యెడల నన్నయ మధ్యాక్కరలు తెలుగులాక్షణికులు చెప్పిన లక్షణమునకు కొంచెము విరుద్ధముగా ఉన్నవి. అయితే నన్నయ మధ్యాక్కరలకు వేరేలక్షణము చెప్పగలమా?
ఈవిషయము కొంతవరకు విమర్శించినవారు, టేకుమళ్ల రాజగోపాలరావుగారు, శ్రీ వఝల చినసీతారామస్వామి శాస్త్రులవారు మొదలయినవారు.
వీరిలో శాస్త్రులవారు [10]ఒక క్రొత్తమార్గ మవలంబించి నన్నయమధ్యాక్కరలకు లక్షణసమన్వయము చేయబోయినారు గనుక వారు చెప్పినది మొట్టమొదట విమర్శించవలసి ఉన్నది.
శాస్త్రులవారు అవలంబించిన మార్గమునకు యుద్ధమల్లునిశాసనములోని మధ్యాక్కరలే ఆధారము. ఆశాసనములో అరసున్నలు లేవు. అవి పూర్వకాలపులిపిలో లేనేలేవు. లేకపోవుట పూర్వకాలపు లేఖనసంప్రదాయము. అర్ధానుస్వారము లుండదగినచోటకూడా పూర్ణానుస్వారములే ఉన్నా వాటికి పూర్వ మందున్న హ్రస్వాక్షరము ఛందోనియమములకు సరిపడునట్లు ఊదిపలుకుటగాని తేల్చిపలుకుటగాని సంప్రదాయవిరుద్ధము కాదు, ఇందుకు దృష్టాంతముగా చూడండి:—
"అనిన వసిష్ఠుణ్ణిట్లనియె నన్తధనంబును నట్టి రాజ్యంబుం” అని శాసనములో ఉన్నట్లు పూర్వలేఖనసంప్రదాయమును అనుసరించి ఉన్న ఈచంపకమాలాపాదము, "అనిన వసిష్ఠుఁ డిట్ల నియె+నంత ధనంబును నట్టి రాజ్యముం" అని చదువవలెను.
ఆలాగుననే, “గనిమల్లణ్డెత్తించె గుడియు మఠంబునుం గార్తికేయునకు” అని యుద్ధమల్లుని శాసనాక్కరపాదమును తెలుగులాక్షణికులు చెప్పిన లక్షణము కనుసరించి,
“గనిమమల్లఁ | డెత్తించె | గుడియు | మఠమునుఁ | గార్తికేయునకు” అని చదివి గణవిభజన చేయవచ్చును.
అయితే ఇప్పుడు శాస్త్రులవారు చేసిన దేమంటే, :— పైని చూపినట్లే గణవిభజన చేసి అర్ధానుస్వారములకు బదులుగా పూర్ణానుస్వారములే ఉంచి అప్పుడు నిలువుగీతల నడుమను ఏగణములు ఏర్పడునో అవికూడా సూర్యేంద్రగణములుగా పరిగణించవలెను అన్నారు. తెలుగులాక్షణికులమతమున పైపాదములో 'నల, త, న, నల, ర, న' గణము లుండునంటే, శాస్త్రిగారు 'నగ, త, న, జగ, ర, న' గణము లున్నవని అంటున్నారు.
ఈలాగుననే శాసనములోని మధ్యాక్కరల పాదములకు గణవిభజనము చేసి శాసనగృహీతగణప్రస్తారము చూపించి, ఆ ప్రస్తారముబట్టి ఏర్పడిన “ఇనేంద్రగణములభేదము నంగీకరించి గ్రహించినచో, నిటీవలి మన తెనుఁగులాక్షణికులు గ్రహించిన మధ్యాక్కరలక్షణమె పై శాసనాక్కరలకును గుదురుపడును” అని వ్రాసినారు.
వీరిప్పుడు క్రొత్తగా తెచ్చిపెట్టిన గణములు (IUI, IUU, IUUU, IUIU, IUUI, IUII[11]). కర్ణాటలాక్షణికులు తమ బ్రహ్మ విష్ణు గణములందుగాని, తెలుగులాక్షణికులు తమ సూర్యేంద్రగణములందుగాని వీటిని చేర్చుకోలేదు. తెలుగులాక్షణికులు గ్రహించిన సూర్యేంద్రగణములు మార్చి ఆ తెనుగులాక్షణికులు గ్రహించిన మధ్యాక్కరలక్షణమె పై శాసనాక్కరలకు కుదురుపడును అని శాస్త్రులవారు వాదించుటవల్ల లక్షణసమన్వయము సిద్ధించినదా? సూర్యేంద్రగణముల గురించి తెనుగులాక్షణికులు చెప్పిన లక్షణము కేవలము మధ్యాక్కరలకోసమై[12] మార్చి హ్రస్వాక్షరములకు పరమందున్న పూర్వానుస్వారములను వీలయినచోట్ల అర్ధానుస్వారములుగా పరిగణించే పూర్వసంప్రదాయమును పరిత్యజించి శాస్త్రులవారు ఒక క్రొత్తమార్గమును అవలంబించుటవల్ల ప్రయోజనమేమైనా ఉంటే ఆక్షేపణముండకూడదు. వారిమార్గ మవలంబించవలసినదే అవును. శాసనాక్కరల లక్షణము చెప్పడమే ప్రయోజనమంటే, వారీలాగున క్రొత్తమార్గ మవలంబించవలసినంత అవసరము కనబడదు. ఇదివరకున్న సంప్రదాయమును, ఇదివరకు తెలుగు లాక్షణికులు చెప్పిన లక్షణమును (యతివిషయము తప్ప) అనుసరించి చూచినయెడల శాసనములోని మధ్యాక్కరలు సిద్ధలక్షణసమన్వితములై ఉన్నవి.
అయితే నన్నయ మధ్యాక్కరల లక్షణము కనుగొనుట కష్టముగా ఉన్నది గనుక వాటిలక్షణము నిరూపించడమే యోజనముగా తలచి శాస్త్రిగారు ఈ వాద మవలంబించినారంటే, సంతోషమే, కాని, వారి మనోరథము నెరవేరినట్టు కనబడదు.
| "అరుణసరోరుహదళమృదులంబులైన యత్తరుణి” | |
ఈ పాదములు లొంగలేదని వారే ఒప్పుకొన్నారు.
| “అవసరజ్ఞుడైన వేదవ్యాసు డేతెంచె నంత నత్తపసి | |
ఇది తమవద్దనున్న “ప్రతులలోఁ బ్రాచీనపుఁబ్రతిలోని” దని చూపించి “ఈ పద్యము వెనుక నే నుదాహరించిన శాసనాక్కరల లక్షణమునకు లొంగియే యున్న ”దని వ్రాసినారు.
ఇందులో 3–వ పాదము ఎట్లు లొంగియున్నదో తెలియదు. “తపశియ న్నువపొడ వునల్లని దీర్ఘ॥ తనువు(ను) । జూచి.”
ఇందులో సూర్యగణముగా ఉండవలసిన 3వ గణము, ఇంద్రగణముగా ఉండవలసిన 4-వ గణము ఎట్లు కుదిరినవి?
మరియొక విషయము:——అర్ధానుస్వారములు ఉండదగినచోట్లకూడా పూర్ణానుస్వారములే పాటించవలె నన్నవాదము శాసనాక్కరల లక్షణము నిరూపించుటకా? నన్నయమధ్యాక్కరల లక్షణము నిరూపించుటకా?
పై పద్యములో మొదటి పాదము శాసనలేఖనసంప్రదాయమును బట్టి, “అవసరజ్ఞుణ్డైన వేదవ్యాసుణ్డె తెఞ్చె నన్త నత్తపసి" అని వ్రాయవలెను. ఇట్లున్నప్పుడు ఇది శాసనాక్కరల లక్షణమునకు ఎట్లు లొంగినది?
నన్నయ మధ్యాక్కరలకోసము ఒక విధమైన లేఖనసంప్రదాయమున్ను శాసనాక్కరలకోసము మరియొకవిధమైన సంప్రదాయమున్ను గ్రహించవలె ననుటకు తగిన ఆవశ్యకత కనబడదు. నన్నయ వ్రాసిన తాటాకులపుస్తకము మనకు చిక్కదు; గానీ, శాసనకాలమునకున్ను నన్నయకాలమునకున్ను అట్టే అంతరము లేనందున ఆకాలపు లేఖనక్రమము శాసనములోనున్నట్లు ఉండవచ్చునని ఊహించుట తప్పుకాదు.
ఈ విషయములన్నీ విమర్శించి చూడగా శాస్త్రులవారు సూచించిన మార్గము నన్నయమధ్యాక్కరల లక్షణము తెలుసు కొనుటకు ఉపయోగించలేదు. మొత్తమునిూద వారు చెప్పినట్లు, “దిద్దుబాట్లు లేనట్టియుఁ దప్పులకుప్పలు కానట్టియుఁ బ్రతులు దుర్లభంబులై యుండుటచేత నన్నపార్యుని యక్కరలవైఖరి నిర్ణయింప శక్యము గాకున్నది.” అనుట ఇప్పటివరకు నిజమే. అయినను విమర్శించి ఊహించుటకు వల్లనయినంతమట్టుకు సంభావ్యమైన లక్షణము నిరూపించుటకు మనము యత్నించవచ్చును.
నన్నయ కన్నడలక్షణము ననుకరించి ఉండునని తేకుమళ్ల రాజగోపాలరావు పంతులుగారు ఊహించిరి. ఇది నాకు సమ్మతమే. అయితే అందువల్ల మధ్యాక్కరపాదములో మూడవగణము గగమైనా సగణమైనా కూడా కావచ్చును అని మాత్రమే తేలినది. ఎందుచేతనంటే: కన్నడమువారు మధ్యాక్కరకు 4,5 మాత్రల విష్ణుగణములే ఉండవలెనని చెప్పుటచేత అవి మనవారు చెప్పిన ఇంద్రగణములే అయినవి. చివరగణము గుర్వంతమైన అజగణము కావలెనని కన్నడము వారు చెప్పినారు; గాని నన్నయ దానిని పాటించినట్టు కనబడదని వారే ఒప్పుకోవలసివచ్చినది అని బొడ్డపాటి రాజన్నపంతులుగారు ఆక్షేపించినారు. గాని ఈ ఆక్షేపణమునకు సమాధానము చెప్పవచ్చును. సంస్కృతములో ఉన్నట్లే కన్నడములో కూడా పాదాంతవర్ణము లఘువైనా కావలసినప్పుడు గురువుగా పాటించవచ్చును గనుక తక్కినవిషయములలో కన్నడలక్షణమును నన్నయ అనుకరించినాడని చెప్పినప్పుడు ఈవిషయములో కూడా అతడు అనుకరించి ఉండవచ్చును అని చెప్పుట తప్పుకాదు. దీనిని బట్టి,
| |
ఇటువంటి పాదములకు లక్షణము కుదిరినది.
ఇంతవరకే రాజగోపాలరావు పంతులుగారు చెప్పినసమాధానము నాకు తోడుపడినది. లక్షణసమన్వయము (అనగా మనతెలుగువారు చెప్పినలక్షణముబట్టి) కాలేదని నేను పైని చూపించిన పాదములలో ఇంకా కొన్ని ఉండిపోయినవి. అటువంటిపాదములకు రాజగోపాలరావుగారు సమాధానము ఏమి చెప్పినట్లు కనబడదు. నేను చూచిననాలుగైదు ప్రతులలోను అచ్చుపడ్డప్రతులలోను ఆపాఠములు కనిపించుచుండుటచేత అవి నన్నయపాఠములే అయి ఉండుననుట తప్పుకాదు.
అయితే ఇవి ఎట్లు లక్షణసమన్వితములు కాగలవు? ఇందుకు నేను చెప్పేసమాధానమేమంటే కన్నడ పిరియక్కరలోను తెలుగు మహాక్కరలోను ఒక సూర్యగణము సామాన్యలక్షణము చొప్పున ఉండవలసిన స్థలమందేకాక 2-వ స్థలమందైనా 4–వ స్థలమందైనా ఉండవచ్చును అని ఉన్నది గదా. అట్లే ఈమధ్యాక్కరలోకూడా కవికి స్వాతంత్ర్యముండెనేమో. నన్నయపాటించిన యతిస్థలమునకు పూర్వము రెండుఇంద్రగణములు ఒక సూర్యగణము మరియొక ఇంద్రగణము ఉండవలెనని గదా అనుకొంటున్నాము. ఆసూర్యగణము మూడవచోటనే కాక మరియొకస్థలమునందైనా ఉండవచ్చునని నన్నయ అభిప్రాయమేమో! చూడండి:--
| తనదివ్య శక్తిన ప్పాశముల్ విడిచి + తన్మునినాథు | |
ఇట్లు సమాధానము చెప్పి ఇటువంటి పాదములకు లక్షణము నిరూపించవచ్చును గాని ఇదమిత్థమని చెప్పలేము. చాలా వ్రాతప్రతులు జాగ్రత్తగా పరిశీలించి విమర్శించవలసి ఉన్నది.
“పదుండ్ర బోలెడు...” (ఆర. II. 343) ఈపద్యమున మొదటి రెండు చరణములలోను జగణమున్నది. ఇది మనవారు చెప్పిన సూర్యేంద్రచంద్రగణములలో గాని, కన్నడమువారు చెప్పిన బ్రహ్మవిష్ణురుద్రగణములలోగాని చేరలేదు. "పదుగురు” అన్న పాఠము కొందరిచ్చినారు.
షత్ప్రత్యయములు
అనంతుడు షత్ప్రత్యయములను సూత్రప్రాయముగా చెప్పినాడు. విద్యార్థులకు సులభముగాను స్పష్టముగాను బోధపడవలెనని వాటిని వివరించి వ్రాస్తున్నాను.
1. ప్రస్తారము (చూ. మూ. iii. 66)
UUUUU1
IUUUU2
UIUUU3
IIUUU4
UUIUU5
IUIUUU6
UIIUU7
IIIUU8
UUUIU9
IUUIU10
UIUIU11
IIUIU12
UUIIU13
IUIIIU14
UIIIU15
IIIIU16
UUUUI17
IUUUI18
UIUUI19
IIUUI20
UUIUI21
IUIUI22
UIIUI23
IIIUI24
UUUII25
IUUII26
UIUII27
IIUII28
UUIII29
IUIII30
UIIII31
IIIII32
ఈ 32లో చివరను గురువు గలవి 16, లఘువు గలవి 16; నాలుగోఛందము ప్రస్తరిస్తే చివరను U గలవి 8, లఘువు గలవి 8; మూడోఛందములో చివరను U గలవి 4, లఘువు గలవి 4; రెండోఛందములో చివరను U గలవి 2, లఘువు గలవి 2; ఈవిషయములన్నీ మీదిపట్టికలో చూచుకోవచ్చును.
2. నష్టలబ్ధి (చూ. మూ. IV. 67
9వ ఛందమున పుట్టిన 13 వ వృత్తమునకు గణము లేవి?
13 రెండుచే భాగించి, భాగించగా వచ్చినలబ్ధమును (అరలు నిండుగా చేసుకొంటూ) మరల రెండుచేత భాగించవలెను. ఈలాగున భాగించుకొంటూ వెళ్లవలెను బేసిసంఖ్య భాగించినప్పుడు గురువున్ను సరిసంఖ్య భాగించినప్పుడు లఘువున్ను పెట్టవలెను.
లబ్ధము ఒకటికాగానే బేసిసంఖ్య గనుకను ఎన్నిసార్లు భాగించినా ఒకటేవచ్చును గనుకను గురువులే పెట్టవలెను.
9వ ఛందమున పుట్టినవృత్తములలో పాదమునకు 9 అక్షరము లుండును. గనుక అందుపుట్టిన 13వ వృత్తమునకు గణములు:-
UUU UUI IUU
త, య, మ
3. ఉర్దిష్టము. (చూ. మూ. III. 68) UUIIU ఈ గణములు గలది ఎన్నోఛందములో ఎన్నోవృత్తము? అయిదు అక్షరములు గనుక అయిదో ఛందము, (సుప్రతిష్ఠ). ఈ అయిదుస్థలములలోను మొదటిదానికింద 1, రెండవదానికింద 2, 3 వ దానికింద 4, 4 వ దానికింద 8, 5 వ దానికింద 16 ఇట్లు ద్విగుణముగా లెక్క వేసుకొని లఘువులకిందనున్న లెక్కలనే మొ త్తముచేసి ఒకటి కలపగా వృత్తసంఖ్య ఏర్పడును.
UUIIU
124816
4+8+1=13
4. వృత్తసంఖ్య (చూ.మూ. III. 39)
5 వ ఛందమున ఎన్ని వృత్తములు పుట్టినవి?
5వ ఛందమున పుట్టిన వృత్తములలో పాదమునకు అయిదక్షరములున్నవి. వాటిలో ప్రతి అక్షరమున్ను గురువో లఘువో కావలెను గనుక అయిదుసార్లు 2 ఇబ్బడించిన యెడల ఎంతవచ్చునో అన్నివృత్తములు పుట్టును 2x2x2x2x2 = 32
ఆలాగుననే 12 వ ఛందమున 212=4096 వృత్తములు పుట్టినవి. 26 వ ఛందమున 226=67108864 వృత్తములు పుట్టినవి.
సమవృత్తముల వెరను (చూ.మూ. III. 77) ఈ 26 ఛందములలోను పుట్టిన వృత్తము లన్నీ ఎన్ని? 21+22+23+24...225 + 226 227-2=134217726
5. లగక్రియచక్రము (చూ. మూ. III. 70–71)
1+1
1+2+1
1 + 3 + 3 + 1
1 + 4 + 6+ 4 + 1
1 5 10 10 5 1
కనబడే 1,5,10,5,1 అనేఅంకెల అర్థమేమంటే, ఒక్కలఘువైనా లేక అన్నీ గురువులు గలవృత్తము 1; ఒక్క లఘువుమాత్రమే కలవృత్తములు 5; రెండులఘువులు కలవి 10; మూడులఘువులు కలవి 10; నాలుగులఘువులుకలవి 5; అయిదున్ను లఘువులే అయినవృత్తము 1; మొత్తము 32.
ఈలాగుననే మీది వరుసలలో మొదటిఛందమునుండి నాలుగోఛందమువరకు పైని చెప్పిన విషయముల వివరణ ఉన్నది.
అయితే మీది వరుసను బట్టి కిందివరుస వేసుకొంటూ ఉంటేనేగాని 8వ ఛందములోనో 16 వ ఛందములోనో మరి యేదైనా ఛందములో ఈవృత్తములసంఖ్యలు తెలియజేయుట కష్టము; గనుక, ఇంగ్లీషుబడులలో చదువుకొనే విద్యార్థులు ఈవిషయములను తెలుసుకొనుటకు ఒక సులభమైన మార్గమున్నది. దీనినిబట్టి అడిగిన ఛందముగురించి ఈవిషయములు వెంటనే చెప్పగలము ఉ॥ పదియవ ఛందములో ఎన్నెన్నిలఘువుల వృత్తము లెన్నెన్ని ఉన్నవి?
(గు+ల)10=1గు10 + 10గు9ల1 + 45గు8ల2 +120గు7ల3 + 210గు6ల4 + 252గు5ల5 + 210గు4ల6 + 120గు3ల7 + 45గు2ల8 + 19గు1ల9 + 1ల10 1గు10 అంటే 10న్ని గురువులే అయినవృత్తము ఒకటి
10గు9 అంటే 9గురువులున్ను 1 లఘువున్ను అయినవి 10
45గు8ల2 అంటే 8 గురువులు 2 లఘువులున్ను ఉన్నవి 45
ఈలాగుననే కడమవి తెలుసుకోవచ్చును. 6. సగణలగక్రియ శకటచక్రము (చూ.మూ. III.72-76
1 | ఇది పాదములో అన్నీ గురువులే కలవృత్తము (1)
2 | 3 | 5 | 9 | 17 |ఇవి 1 లఘువుగలవృత్తములు (5)
4 | 7 | 13 | 25 | 6 | 11 | 21 | 10 | 19 | 18 | ఇవి 2 లఘువులు గలవి (10)
8 | 15 | 29 |14 | 27 | 25 | 12 |23 | 22 | 20 | ఇవి 3 లఘువులు గలవి (10)
16 | 31 | 30 | 28 | 24 | ఇవి 4 లఘువులుగల వృత్తములు (5)
32 | ఇది 5 లఘువులు గల వృత్తము.
ఈ చక్రము వేసేపద్ధతి: —
నిలువుగా ఉన్న మొదటిఆరుగళ్లలోను−1,2,4,8,16,32 ఇట్లు సంఖ్యలు ద్విగుణముగా వేయవలెను. తర్వాత అడ్డుగా ప్రతిసంఖ్య ద్విగుణముచేసి ఒకటి కొట్టివేస్తూ అట్లుచేయగా వచ్చిన సంఖ్యప్రక్కను మళ్లీ అట్లే చేస్తూ వేయవలెను. ఈఛందమున 32 వృత్తములకంటే ఎక్కువ పుట్టవు గనుక 32కు మించే సంఖ్య వేయరాదు. ఇట్లు చేసినత ర్వాత పైచాలున ఉన్న సంఖ్యలు క్రింది చాలున ద్విగుణముచేసి వేయవలెను. ఈసంఖ్యలలో ప్రతిదానిప్రక్కను అది ద్విగుణము చేసి ఒకటి కొట్టివేయగా వచ్చిన సంఖ్య వేయవలెను. దాని ప్రక్కను మళ్లీ అదేవిధముగా సంఖ్యలు వేస్తూ ఉండవలెను. ఎన్నో ఛందమునకు ఈ చక్రము వేస్తున్నామో చూచుకొని అందులో ఎన్ని వృత్తములు పుట్టినవో ఆసంఖ్యకు మించకుండా అంకెలు వేసుకొంటూ వెళ్లవలెను.
కొన్నివృత్తముల లక్షణమును లాక్షణికులు వివిధముగా చెప్పినారు, చూడండి:-
1. క్రౌంచపదము.
1. క్రౌంచపదా బ్మౌస్మౌ నననా న్గావిషు శరవసుమునివిరతిరిహ భవేత్
UII UUU IIU UII III III III III U
భ మ స భ న న న న గ
(ఇది సంస్కృతవృత్తలక్షణము. 25వ ఛందము 16776391వ వృత్తము)
2. శీతకరోర్వీవాతశ + శాంకర్ యుగమితమరపురనివహదకడియోళ్ (ఇది కన్నడపద్యలక్షణము. ఇందులో విశేషము:— ప్రతిపంక్తిలోను ప్రాసయతి. తక్కినలక్షణము సంస్కృతమం దున్నట్లే ఉన్నది)
3. పంచశరాభా + నంచిత పుణ్యా + భమసభనననయ + పరిమితమైనన్ (కవిజనాశ్రయము)
4. ప్రాంచిక తేజః + కుంచితవైరీ + భమసభనననయ + పరిచితరీతిన్ (కావ్యాలం కారచూడామణి.)
5. కాంచనభూషా + సంచయ మొప్పన్ + ఘనకుచభరమునఁ+గవునసియాడన్ (ఛందోదర్పణము).
పై మూడింటిలో (3, 4, 5) లక్షణము మారినది. ఈలాక్షణికులు దీనిని 24వ ఛందమునందు పుట్టిన 4193479 వ వృత్తముగా చెప్పినారు. సంస్కృతములోను కన్నడములోను పాదాంతమున ఉన్న IIU మార్చి UU చేసినారు. మాత్రలసంఖ్య ఒక్కటే గనుక నడకలో భేదము కనబడదు. కన్నడపద్యమువలెనే ప్రతిపాదమునందును ప్రాసయతి ఉన్నది; అంతేకాక తెలుగుపద్యముల సంప్రదాయ మనుసరించి మొదటి అక్షరముతో రెండుచోట్ల వడి ఉన్నది.
6. పంచముకేశుం డిచ్చిన భాస్వ + ద్వరమున మనమున +బవరముగోరన్
వంచనతో బాణాసురుహ స్త + వ్రజములు..................................
(ఇది అప్పకవిది. తక్కిన లాక్షణికులు చెప్పిన ప్రాసయతి ఇతడు పాటించలేదు.)
7. తావులు విూరం + బూవుల వానల్ + దఱుచుగఁ గురియఁగ + దతఘనభేరుల్ (ఇది కంకంటి పాపరాజు ఉత్తరరామాయణములోనిది. అప్పకవి కాక తక్కిన తెలుగులాక్షణికులు చెప్పినట్లే ఉన్నది. 8. చంచులనాస్వా+దించుచు లేఁదూం+డ్ల కరువుప్రియలకు+నలఁచుచు మైరో
మాంచము. ... (నన్నెచోడుని కుమారసంభవము.)
కావు గనుక ఇందులో విశేష మేమంటే అప్పకవికాక, తక్కిన తెలుగులాక్షణికులున్ను కన్నడలాక్షణికులున్ను చెప్పినట్లు పాదములందు ప్రాసయతి ఉన్నది; కాని తెలుగు లాక్షణికులు చెప్పిన వడినియమము పూర్తిగా లేదు. పాదద్వితీయార్థమునగల విశ్రమస్థానముల రెంటను ఉన్నవడి అక్షరములు తమలో తాము మైత్రి గలవేగాని పాదాద్యక్షరముతో మైత్రి గలవి కావు గనుక నన్నెచోడునిపద్యము వృత్తముకాదనిన్ని మాత్రాపద్యమనిన్ని సీనమువలె నున్నదనిన్ని అందుచేత “ఇది నన్నెచోడుని ప్రాచీనత కొకగొప్పకారణ” మనిన్ని మా. రామకృష్ణకవిగారు వ్రాసినారు. వృత్తముల కుండవలసిన ముఖ్యలక్షణము ఉన్నది గదా ఇది వృత్తముకాదని కవిగారు ఎట్లు చెప్పగలరు? నాలుగు పాదములందున్ను గణము లొకేతీరున ఉన్నవి. (మాత్రాపద్యములందు
అన్ని పాదములలోను గణము లొక్కరీతిగా నుండనక్కరలేదు.) తెలుగుకన్నడపద్యముల సంప్రదాయ మనుసరించి నాలుగు పాదములలోను ద్వితీయస్థలమున ప్రాసమున్నది. లయగ్రాహి మొదలయిన ఉద్ధరమాలావృత్తములలో ఉన్నట్లు ప్రతిపాదమున కొంతవరకు ప్రాసయతి ఉన్నది. జాత్యుపజాతులు మొదలయిన దేశ్యపద్యములలో చేరదు. ఇది ఒక రీతి క్రౌంచపదము; దీనికి సరియైనలక్షణము ఏలాక్షణికుడున్ను చెప్పలేదు. II త్రిభంగి.
ఈ గ్రంథమందు మూలమున (చూ. II. 134) త్రిభంగి వృత్తము అచ్చుతప్పులతో నిండియున్నది. సరియైన పాఠము: —
| నననన ననసస + లును భమసగలును + | |
పాదమునకు 34 అక్షరములు; 42 మాత్రలు; పూర్వార్ధమున ప్రాసనియతి, పశ్చిమార్ధమున మూడుచోట్ల అంత్యప్రాసనియమము ఉన్నవి. కావ్యాలంకారచూడామణి అప్పకవీయములలో సైతము ఇట్లే ఉన్నది. కానీ, కవిజనాశ్రయములోని త్రిభంగి ఇందుకు భిన్నముగా ఉన్నది.
| ననననలును నసభములును సగయుక్తము లైనన్ | |
ఇందులో పాదమునకు 28 అక్షరములు; 36 మాత్రలు ఉన్నవి. పాదమున ప్రాసయతి నియమములేదు; మూడుచోట్ల అంత్య ప్రాసనియమము మాత్రమున్నది.
నడక
కోట్లకొలది వృత్తములు పుట్టినా లాక్షణికులు సుమారు 200 వృత్తములకంటే ఎక్కువ పేర్కోలేదు. వాటిలో సుమారు 30 కంటే ఎక్కువగా కవులు వాడడములేదు. ఎందుచేత? లాక్షణికులు చెప్పిన లక్ష్యలక్షణపద్యములు చూచినా కొన్నివృత్తములనడక తెలియదు. పద్యములనడక ఏలక్షణముబట్టి ఉండునో ఆలక్షణరహస్యము తెలిసినయెడల వేలకొలది కొత్తకొత్తవృత్తములను ప్రస్తరించి తీయవచ్చును. ఆరహస్యము తెలియకపోవుటకు మన గణవిభజనసంప్రదాయము ముఖ్యమైన కారణము. మూడేసిఅక్షరములు గణమంటే గణవిభజన పద్యము నడక బట్టి ఉండడ మసంభవము. నడక బట్టి గణవిభజనము ఉంటేనేగాని గణవిభజన ప్రయోజనము కనబడదు. కొన్నివృత్తములు చక్కగా నడిపించుటకు వీలున్నా లాక్షణికులు తమలక్ష్యపద్యములు వ్రాసినట్లు వ్రాయకపోవడముచేత కవు లావృత్తములను చెప్పడములేదు. అందుకు అనేక ఉదాహరణములు చూపించవచ్చునుగాని ఈ పీఠికలో అవకాశము చాలదు గనుక మూడు మాత్రమే చూపిస్తున్నాను.
(I) పాలాశదళము (దీనికే 'త్వరితగతి' యనికూడా పేరున్నది.)
| అదనదనున హరినుతు+లమరు ధరఁ బాలా | |
(అప్పకవి)
ఇంతకంటె అనంతుడు చెప్పినది బాగున్నదిగాని అందులో రెండవపాదము నాల్గవపాదము నడకచెడి యున్నవి (చూ. మూ. II.84) ఎట్లుండినయెడల నడక బాగుండునో తెలియజేస్తున్నాను:—
| అయిదులము లయిదులము; +లయిదులములున్ గా | |
2. విచికిలిత
| ప్రవిలయసమయమునను బద + పడి జలనిధినడుము స | |
(అప్పకవి)
ఇటుంటి లక్ష్యలక్షణపద్యముబట్టి దీనినడక ఎట్లు తెలుసుకోగలము? ఇందులో 21 లఘువులున్ను చివరను గురువున్ను ఉన్నవి గనుక “తిశ్రగతి”ని[15] నడిపించవచ్చును. ఏడుహగణములున్ను గురువున్ను కలది సుగంధి ఏడునగణములున్ను గురువున్ను కలది విచికిలిత హగణనగణములలో ఏవైనా ఏడున్ను గురువున్ను గలది ఉత్సాహము. విచికిలిత నడక ఎట్లుండదగునో చూడండి:—
| మునుల వలపు నబల బలము + ముదిమి సొగసు కలసిరుల్ | |
3. తురగము
| ననననసజజగలు తిథివిరమ + ణం బ గున్దురగంబునన్ | |
(అప్పకవి)
దీని నడకతీరు ఈలక్ష్యమును బట్టి కనుగొనుట శక్యమా?
| ననల యుగళము హభము రగణము + నాల్గుపంక్తుల నొప్పగాఁ | |
ఈలాగున లక్ష్యలక్షణపద్య మున్నయెడల ఈతురగవృత్తము తరళ మత్తకోకిల కరిబృంహిత వృత్తములవలె నడుచునని సులభముగా తెలుసుకోవచ్చును.
జాగ్రత్తగా విమర్శించి చూచినయెడల చక్కగా నడిచే పద్యములన్నీ ఏదో ఒకతాళమునకో ఒకలయకో సరిపడి ఉంటవి. విషయము బోధపడెవలెనని కొన్ని మాత్రమే ఉదాహరిస్తున్నాను.
1. తిశ్రగతిని నడిచేవి (అనగా మూడుమాత్రలగణములు గలవి) ఉత్సాహము, సుగంధి, విచికిలిత మొదలయినవి.
2. తిశ్రగతిని ఎదురుగా నడిచేవి (అనఁగా మృదంగవాద్యములో ఎదురువాద్యమువలె నడిచేవి) వీటిలో లఘువు తర్వాత గురువువచ్చును.
సుకాంతి, ప్రమాణి, పంచచామరము మొదలయినవి.
ఉ. “ఇదే యసిన్ మదాన్వితున్ సుదేవున్ వధించెదన్”
3. చతురస్రగతిని నడిచేవి (అనగా నాలుగుమాత్రలగణములు గలవి మత్త, తోదకము, ప్రకరణకలిత, మానిని, కవిరాజవిరాజితము, సరసిజము, క్రౌంచపదము మొదలయినవి; ఇవి గాక ఇంకా ఈగతిని నడిచే వృత్తములు వేలకొలది ప్రస్తరించి తీయవచ్చును.
ఇందుకు తార్కాణముగా పదియవఛందములో చతురస్రగతిని నడిచేపద్యము లెన్నిగలవో చూడండి:—
ఈ ఛందములో 16 మాత్రలుండి గుర్వంతముగా ఉండే వృత్తములు 126. వీటిలో నూరుపద్యములు చక్కగా నడుచును. అన్నీ ఇక్కడ చూపించుట కవకాశములేదు గనుక కొన్ని మాత్రమే చూపిస్తున్నాను.
వృత్తసంఖ్య
(1)IIII UU UU UU నలగగగాగాల్ + నాళీకాక్షా(16)
(2)UII IIU UU UU క్రాలునుభసముల్ + గాగాల్ పంక్తిన్ (31)
(3) UU IIII UU UU గాపై నలగగ+గంబుల్ రెండున్ (61)
(4) UU UII IIU UU క్రాలున్ గాభస + గగముల్ పంక్తిన్(121)
(5) UU UU IIII UU గాగా నల్గాల్ + క్రమమున నిల్చున్ (241)
(6) UU UU UII IIU పంక్తిన్ గాగా+భంబుసగణమున్ (481)
(7) IIU IIU UU UU ససగా గగముల్ + సాగున్ శౌరీ(28)
(8) UII UII UU UU భాగగగాల్ చను + పాదంబందున్(53)
(9) UU IIU IIU UU గాసా గగముల్ +గలుగున్ బంక్తిన్(109)
(10) UU UII UII UU గాభా గాలయి + గ్రాలున్ శౌరీ(217)
(11) UU UU IIU IIU శౌరీ గాగా + ససముల్ వరలున్(433)
4. చతురస్రగతిని ఎదురుగా నడిచేవి. (అనగా జగణములు గలవి) ప్రమితాక్షరము, జలోద్ధతగతి, మంజుభాషిణి మొదలయినవి.
5. ఖండగతిని నడిచేవి (అనగా 5 మాత్రల గణములు గలవి). త్వరితగతి, పద్మనాభము, లయగ్రాహి, దండకము మొదలయినవి.
6. ఖండగతిని ఎదురుగా నడిచేవి. (అనగా యగణములు గలవి). భుజంగప్రయాతము ఇటువంటివి అనేకముగా లేవు.
7. రూపక తాళమునకు సరిపడే వృత్తములు (అనగా మాత్రలకు విరుగుతూ నడిచేవి).
మదరేఖావృత్తము:— ఇట్టివి అనేకముగా లేవు; గాని, కావలసినన్ని సులభముగా కల్పించవచ్చును. చూడండి:-
I. | అనుసారిణి యనువృత్తం + బగునతివృతి యను ఛందం | |
II. | రూపక మనుతాళంబున + ద్రుతలఘువులు చనుచుండున్ | |
III. | నలగముపై సగ మొప్పున్ + నలగమముల్ జోడింపన్ | |
IV. | క్రాలున్ తల నలలల మస + గంబుల్ పాదములందున్ | |
V. | కల్యాణిన్ మనలలలస + గభగంబుల్ పాదములన్ | |
ఈలాగున క్రొత్తక్రొత్తవృత్తములను ఎన్నైనా తీయవచ్చును.
8. మిశ్రగతిని నడిచేవి (అనగా 3+4 మాత్రలకు విరుగుతూ నడిచేవి).
మత్తకోకిల, తరళ, తురగము మొదలయినవృత్తములు; వృషభగమన, హరిణగతిరగడలు (గురుజాడ అప్పారావు గారి ముత్యాలసరములు మొదలయిన పద్యము లీగతిని నడుచును).
9. త్రిపుటతాళమునకు (చతురస్రగతి తిశ్రజాతి త్రిపుట 4(3+2+4)=28) ఉత్పలమాల, చంపకమాల నడుచును.
10. ఆదితాళమునకు (చతురస్రగతి చతురస్రజాతి త్రిపుట) కందము, సరసిజము, క్రౌంచపదము మొదలయినవి.
ఈలాగున ఇంకా విమర్శించి చెప్పవచ్చును.
పాదమందుండే అక్షరముల సంఖ్యబట్టి ఛందము లేర్చరిచి ఆఛందములలో ఒకొక్కటి ప్రస్తరించి వృత్తములు కల్పించడమువల్ల ప్రయోజనము విశేషముగా కనబడలేదు. అంతకంటె శ్రుతి కింపుకొలిపే నడకకు ఆధారమైన లక్షణముబట్టి తిశ్రగతిచ్ఛందము, చతురస్రగతిచ్ఛందము మొదలయిన ఛందము లేర్పరిచి పద్యములు చెప్పుటవల్లను ప్రయోజనము విశేషముగా ఉండుననిన్ని అట్లు ఏర్పడిన పద్యములు తెలుగుభాషకు అమరి ఉండుననిన్ని నాయభిప్రాయము. వృత్తములలో ప్రతిపాదములోను గణములు ఒక్కలాగుననే ఉండవలెనన్న నిర్బంధ మున్నది. దానివల్ల ప్రయోజనమేమో!
అయితే లయకు సులువుగా విరిగేటట్లున్న పద్యములకంటె లయ ఉండిన్నీ కనబడకుండా ఉండేపద్యములు అప్రతిహత మైన నడకకు అనుకూలముగా ఉంటవి. ఇటువంటివి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము. ఇవి ఏదో ఒక తాళమునకు లొంగే ఉన్నవి.
ఉత్పలమాల చంపకమాల పాదములు చతురస్రగతి చతురస్రజాతి త్రిపటతాళమునకు సరిపోవును. శార్దూలమత్తేభములు మఠ్యతాళమునకు చదువవచ్చును.
ఇటువంటివృత్తములు విశేషముగా లేవు. ప్రస్తరించి కల్పించుట కూడా కష్టముగానే ఉన్నది. శోధనకోసము నేను వ్రాసినవాటిలో ఒకటి చూపిస్తున్నాను.
కవికాంత
| శూరుఁడు వీర్యపరాక్రమోన్నతుఁడు + | |
ఇది ఆకృతి యనే 22 వ ఛందమున పుట్టిన 141279 వ వృత్తము. ప్రతిపాదము చతురస్రగతి ఆదితాళమునకు సరిపోవును. పరిచితిగలవృత్తములవలె చదువబోయినవారికి నడక చెడినదన్నభ్రమ కలుగును గాని రెండు మూడు సార్లు చదివిన పిమ్మట దీనినడక పట్టుపడగలదు. దీనిలో మొదటనున్న భగణము నలముగాను యతిస్థానమందున్న మగణము సగముగాను మార్చి క్రొత్తవృత్తములు చేసుకోవచ్చును; దీనివలెనే నడిచేవృత్తములు మరికొన్ని చెప్పవచ్చును.
ఈకవికాంతాపాదములు చతురస్రగతి చతురస్రజాతి త్రిపుటతాళమునకు (అనగా క్రియకు నాలుగు అక్షరములు చొప్పున ఆదితాళము 4 x ( 4 + 2 +2)=32 నరిగా నడుచును.[16]
టిప్పణి
1.7. “లఘువగు...యొకమాత్ర; గురువు నొదవు ద్విమాత్రన్" ఈ విషయమును గూర్చి జయంతి రామయ్యపంతులుగారు వ్రాసినది అశాస్త్రీయము.
“వ్యంజన మర్ధమాత్ర యనున్యాయముచే 'వనిత' అనునప్పుడు 'తన్' అనుగురువు సార్థమాత్రక మగును; 'అనగాన్’ అనుచో “గాన్” అనుగురువు సార్థద్విమాత్రకమగును” అని వ్రాసినారు.
ఈసందర్భమున “మాత్రా”పరిమాణము అచ్చునుగూర్చి చెప్పవలెనుగాని వ్యంజనమును గూర్చి చెప్పకూడదు. అచ్చులబట్టి (syllables) అక్షరము లేర్పడును గాని, వ్యంజనములబట్టి ఏర్పడవు. 'భ్రన్’ లో ఎన్నివ్యంజనములున్నా అచ్చు ఒక్కటే గనుక అది ఒక్క (syllable) అక్షరమనే చెప్పవలెను.
‘వనిత' అనునప్పుడు చివరనున్న హ్రస్వాచ్చుపై నిల్చిన నకారపొల్లు ద్విగుణోచ్చారణ కలదియని చెప్పవలెను; గాని దానికి మాత్రాపరిమాణము చెప్పకూడదు, 'అనగాన్' అనునప్పుడు దీర్ఘాచ్చుపై నున్న నకారపొల్లుకు ఈద్విగుణోచ్ఛారణము లేదు. ఎంతమట్టుకు అజ్ దీర్ఘోచ్చారణప్రయత్నము ఎక్కువై ఉంటుందో అంతమట్టుకు వ్యంజనద్విగుణోచ్చారణ ప్రయత్నముతగ్గును. గనుక ‘త’న్ ‘తాన్’ ‘తంత్’ ‘తాంత్ 'వీటి అన్నిటిలోను తకారముపై నున్న అచ్చు రెండుమాత్రల గురువేగాని భిన్నముకాదు. అయితే వీటిలో వ్యంజనమునకు పూర్వమందున్న హ్రస్వాచ్చు ఎందుకు రెండుమాత్రల గురువైనదంటే: ఎప్పుడైనా ఉచ్ఛారణప్రయత్నమును బట్టి అచ్చుకు మాత్రాపరిణామము చెప్పవలెను. 'తన్' అనునప్పుడు తకారముమీది అకారము ఉచ్చరించినప్పుడు వెంటనే నకారోచ్చారణ చేయవలసి వచ్చుటచేత స్వరోచ్చారణప్రయత్నము ద్విగుణమైనది. అందుచేత 'తన్' రెండుమాత్రల గురువుగా చెప్పవలెను.
I. 20 ఈపద్యములో నాల్గవపాదము చక్కగా అర్థము కాలేదు. “నగణ పునరుక్తి నొక్కటి డిగియె” అంటే చంద్రగణ ములు ప్రస్తరింపగా కడపటి IIIII (నలలము) ఒక లఘువు తక్కువగా రెండునగణములని అర్థముకావలెను.
“ఇరువది తొమ్మిదింట” అంటే అర్థము పొసగలేదు.
21-22. "ఈ పద్యములకు నర్థము సంశయముగా నున్న”దని 6 వ పుట అడుగున మూలములో ఉన్నది. అయితే 21వ పద్యము పరవస్తువారి ప్రతిలో.
క. | జగణము నలుగు గగములు | |
అని ఉన్నది. దీని అర్థము స్పష్టము. IUI=IIII; UU=UII; UI=III; IIUU=IIIIU; UUI=UIII.
22వ పద్యము పైపద్యములోని విషయములకు ఉదాహరణములు గలది గాని అర్థము పొసగలేదు.
| మొగిళులు నలమగు, నిటులన్ | |
అని ఉంటే అర్థము కావచ్చును. పరవస్తువారిప్రతిలో మొదటిపాదమున్ను, రెండవపాదములో యతిస్థానమువరకున్ను నే నుదాహరించినట్లే ఉన్నది; తర్వాత మూలములో ఉన్నట్లే ఉన్నది.
67. “దశరథాత్మజుఁడు స్వామి ధాత్రి కనఁగ" ఇందులో ద్విత్వమునకు పూర్వమందున్నది గనుక 'డు' ఊది పలుకవలెననిన్ని గురువుగా పలుకవలెననిన్ని అనంతుడు వ్రాసినాడు; గాని ఇది ఇతరలాక్షణికుల సమ్మతము కాదు. తెలుగులో పదాదినున్న ద్వి త్వమునుబట్టి వ్యస్తముగా ఉన్న పూర్వపదాంతవర్ణము గురువుకాదని తక్కినలాక్షణికుల మతము. 94. టీక వ్యావహారిక భాషలోనే ఉన్నది.
"... యిరువదిన్ని... స్వరయతియైనాను, వ్యంజనయతియైనాను ప్రయోగించతగును" అనే ఉన్నది. ఇందులోనే కాదు. అప్పకవీయము మొదలయినలాక్షణికగ్రంథము లన్నింటిలోను ఇట్లే వాడక భాషను టీకలు వ్రాసినారు. అనవసరముగా నిరాధారముగాను భాషమార్చి అచ్చువేయడము ఆచారమైనది.
101. ఈ పద్యము మూలములో తప్పుగా ఉన్నది. సరియైనపాఠము:-
"తే. | అఱ యనంగను బోవుట + కర్థమైన | |
ఈ పాఠము అప్పకవీయములో ఉన్నది. (చూ. వావిళ్లవారి ప్రతి పు. 142)
IV. 22 వ పద్యమైన తర్వాత పరవస్తువారిప్రతిలో ఈక్రిందిపద్య మున్నది.
| కోమటీంద్రునాఁగ భూమితీరనఁ బలు | |
IV. 107 “తనరఁగ అఆ ఇఈ లనఁగా ఉఊలు నాఁగ....' ఈ పద్యములో హ్రస్వాక్షరములే అయినా 'అ' 'ఇ' 'ఉ' 'ఋ' గురువర్ణములుగానే ఉచ్చరించవలెను. అది ఎట్లు జరుగునంటే: ఈహ్రస్వాక్షరము లుచ్చరించిన తర్వాత ఏకలఘుమాత్రాకాలము ఊపిరి ఆపి, ఆ బిగపట్టి పైవర్ణము లుచ్చరించుటచేత, ఈహ్రస్వాక్షరోచ్ఛారణలో ద్విమాత్రోచ్చారణప్రయత్నము జరిగినది.
అంతేకాని పరమందున్న 'ఆ' అనే అచ్చు ద్విత్వాక్షరమువలె ఉచ్చరించుటచేత పూర్వమందున 'ఆ' గురువు అగునని జయంతి రామయ్యపంతులు గారు చెప్పిన సమాధానము అశాస్త్రీయము. అచ్చువిషయమున ద్విత్వాక్షరోచ్చారణమంటే దీర్ఘోచ్చారణమని చెప్పవలెనేకాని వ్యంజనముల విషయమై చెప్పిన అ ర్థముపొసగదు. ద్విత్వవ్యంజనమునకు పూర్వమందున్న హ్రస్వాచ్చు గురువు కాగలదుగాని కేవల దీర్ఘాచ్చునకు పూర్వమందున్నహ్రస్వాచ్చు గురువు కాలేదు.
ఈ ఛందోదర్పణమునకు ముఖబంధనముగా ఉపోద్ఘాతమును వ్రాయవలసినది అని నన్ను కోరి గౌరవించినందుకును ఛందోవిషయముల గూర్చి నా యభిప్రాయములను తెలియజేయుటకు నా కవకాశము ఇచ్చినందుకును నా మిత్రులు బ్రహ్మశ్రీ. వావిళ్ల, వేంకటేశ్వరులుగారికి నాకృతజ్ఞతావందనములను సమర్పించుకొంటున్నాను.
ఇట్లు
పర్లాకిమిడి.
గిడుగు వెంకట సీతాపతి
1-6-1921.
పర్లాకిమిడి రాజావారి కాలేజీలో లెక్చెరరు.
- ↑ 1917- పుట 362, ఆంధ్రకవులచరిత్ర, రెండవకూర్పు.
- ↑ సంజ్ఞా -88
- ↑ ఈ భీమనాగ్రసుతుఁడు ‘అగస్త్యభ్రాత’ లాటివాడు; ఎవరో తెలియదు. "భీమన ఛందస్సన్న" పేరు గలిగి మనకు కనబడుచున్న వ్రాతప్రతులలోని గ్రంథము రచించినవాడు భీమనాగ్రసుతుడు; గాని, భీమనకాడు. వ్రాతప్రతులన్నిటిలోను భీమనఛందస్సు కలగూరగంపగా ఉన్నది. తక్కినఛందోగ్రంథములలోని లక్షణములున్ను ఉత్తరాంధ్రకావ్యములలోని లక్ష్యములున్ను ఉన్నవి. కొన్నిటిలో భీమనమతము స్పష్టముగా నిరాకృతమయి ఉన్నది. ఈ భీమనాగ్రసుతుడో, ఆపేరిటివాడు వేరేమరియొకడో, 'సర్వలక్షణసార' మనుగ్రంథము రచించినట్టు తంజావూరి సరస్వతీమహల్ పుస్తకాలయములో 327-వ నెంబరుగుల వ్రాతప్రతినిబట్టి కనబడుచున్నది. అందులో "పరగిన విమలయశోభాసురచరితుఁడ భీమనాగ్రసుతుఁడ” అని గ్రంథకర్త వ్రాసుకొన్న పద్యమున్ను ఇంకా 'భీమనఛందస్సు'లో ఉన్నట్లే అనేకపద్యములున్ను ఉన్నవి. 17-వ శతాబ్దారంభము నాటి మల్లన రచించిన చంద్రభానుచరిత్రలోని పద్యమున్ను ఇంకా మరికొన్ని కావ్యములలోని పద్యములున్ను ఉదాహృతమై ఉన్నవి. దీనినిబట్టి చూడగా భీమన 16వ శతాబ్దాంతమునాటివాడు కావలెను. కళింగదేశము రాజయిన రాజరాజు 11 వశతాబ్దము వాడుగదా? ఈ భీమన ఆరాజరాజును తనకవితామహిమచేత గద్దెమీదనుండి పడద్రోసి తిరిగీ గద్దె నెక్కించడము ఎట్లు సంభవమగును? ఈకవితామహిమానువర్నముగల రెండు చాటుపద్యములు మాత్రమే ఆధారముగా చేసుకొని భీమన రాజరాజనాటివాడనిన్ని భీమనఛందస్సు ప్రాచీనతమమయినదనిన్ని చెప్పుటకు శ్రీరామయ్యపంతులుగారు సాహసించడము వింతగా ఉన్నది. కవిజనాశ్రయములోనివి కావని తమకు తోచినవి ప్రక్షిప్తములని చెప్పి కొన్ని, చెప్పక కొన్ని, గాలించి తీసివేసి, కొంతభాస తమకు తోచినట్లు మార్చి, భీమనఛందస్సులో మిగిలి ఉన్న పద్యాలు 'అసలు' కవిజనాశ్రయమని పంతులుగారు ప్రకటించినారు. ఇది ఆంధ్రసారస్వతమునకు కొంత ఉపచరించినదని కృతిజ్ఞతతో ఒప్పుకుంటూ, ఈ గ్రంథము మరికొన్ని ప్రతులసాయమున చక్కగా విమర్శించి సంప్రతించి అచ్చొత్తించుట అగత్యమని తెలియజేయుచున్నాను. పంతులుగారి పరిష్కరణములోని దోషములు రెండువిధము లయినవి. i. గ్రంథములో చేరకూడని పద్యములు చేర్చినారు. ఉదా. 1. సంజ్ఞా. 90, 91, 92 ఇవి కావ్యాలంకారచూడామణియందున్న పద్యములు “ప్రక్షిప్తము లైనవేమో యని సంశయింపఁదగియున్న” దని కిందను వ్రాస్తూ గ్రంథమున చేర్చివారు. 2. ఉత్తమగండచ్ఛందములోనిది, “సభలం జెప్పిన” అనేపద్యము (46). ఇందులోని విషయములు పూర్వపద్యములలోని (38, 39) విషయములకు విరుద్ధముగా ఉన్నవి. 3. అవతారిక పద్యములు. అనంతచ్ఛందములోని పద్యములు; ii. గ్రంథములో చేరవలసినవి విడిచినారు: ఉదా. విశ్రాంతివిరతి అనేకందమునకు బదులుగా “రేచనకీర్తి గలుగు” అనేమాటలు గల గీతపద్యము చేర్చుకోవలసియుండెను. ఇంకా ఇటువంటివి ఉన్నవి.
- ↑ చూ. అప్పక. అనంత. 123.
- ↑ చూ. అప్పక, అనంత. 123.
- ↑ శృంగారనైష. III. 120. టీ. “నముచి దమనుండు పుత్తించినాడు"లో యతి తప్పని బ్ర॥ వేదము వేంకటరాయశాస్త్రులవారు దిద్దినారుగాని, ఈపాఠమే వ్రాతప్రతులలో ఉన్నది. తిక్కన ఇట్టి యతులు వాడినారు. చూ, శాంతి. II. 87. “నాకు దక్షిణగా నిచ్చివాఁడవింక; అశ్వ 1. 45 నాదు గుఱుతు సెప్పినా రెవ్వరనినను." గనుక తప్పుకాదు.
- ↑ ప్రాకృతభాషలలోను, పాలీలోను ఋకారము కొన్నియెడల ఇకారమయినది. అరవములో కృ=కిరు, తెలుగులోను, కన్నడములోను కృ=క్రి.
- ↑ కొందరు లాక్షణికులు ఎన్ని అక్షరములయిన తర్వాత వడి ఉండునో ఆసంఖ్య తెలియజేతురు. కొందరు ఎన్నవఅక్షరము వడి గలదో ఆసంఖ్య తెలియజేతురు. సంకేతభేదమేగాని, స్థితి ఒకటే.
- ↑ జయంతి రామయ్యపంతులుగారిచే పరిశోధితమై ఆంధ్రసాహిత్యపరిషత్తువారిచే ప్రకటితమైనప్రతిలో “కామనిభా” అని ఉన్నది; గాని నావద్దనున్న ప్రతిలో “రామనిభా” అని ఉన్నది. పరిష్కర్తలు తమవద్ద నున్న ప్రతులలోని పాఠము నిచ్చివారుకాబోలు. కవిజనాశ్రయములో వడి గురించి లక్షణమున ఏమి చెప్పియుండలేదు; గాని లక్ష్యలక్షణపద్యములో అప్పకవి చెప్పినట్లు మొదటిపాదమున వళ్లు ఉండడము చేత రెండవపాదమునకూడా అట్లే ఉండవలెనని తోచును.
- ↑ ఆంధ్రచ్ఛందస్సులు, ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక సంపుటం 8 సంచిక 2.
- ↑ వారివాదము ననుసరించి 'IUI' కూడా ఇంద్రగణములలో ఉండవలెను. పు. 88 లో ఉన్న ప్రస్తారపట్టికలో లేదు; వ్రాయమరచినారో? అచ్చుతప్పో? వారిమతమున శాసనాక్కరలలో “క్రమంబున| దానిక..."అనేపాదమం దీగణమున్నది.
- ↑ శాస్త్రులవారు క్రొత్తగా తెచ్చిపెట్టిన ఇనేంద్రగణములు సీవములు మొదలయిన తక్కిన తెలుగుపద్యములందు ఉపచరించునా?
- ↑ 'కరుఁడయి' అని కొన్నిప్రతులలో ఉన్నది; గానీ కరుఁడై అనియైనను ఉండవచ్చును.
- ↑ 'రక్షించుఁ బ్రీతి' అని కొన్ని అచ్చుప్రతులలో ఉన్నది గాని వ్రాతప్రతులలో అనుప్వారమున్నది.
- ↑ అనగా మూడుమాత్రలకు విరుగుతూ ఉంటుందని అర్థము. త్రి+అస్ర=త్ర్యస్య అని ఉండవలెను గాని సంగీతపుస్తకములలోని వ్యవహారము ననుసరించి 'తిశ్ర' అని వాడినాను.
- ↑ ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో “ఛందోరహస్యదర్పణము — పద్యరచనావ్యవస్థ” అను పేరుగలవ్యాసములో ఇక్కడ సంగ్రహించి చెప్పిన విషయములు కొన్ని విపులముగా చర్చించినాను.