చీనా - జపాను/పీఠిక
పీఠిక
భరతఖండమునకు సన్నిహిత జ్ఞాతులనదగు చీనా, జపాను దేశముల ఆధునిక సంగ్రహ చరిత్రముల నెఱుగవలసిన ఆవశ్యకత ఆంధ్రుల కెంతయో గలదు. ఇందుకై శ్రీ గరిమెళ్ల సత్యనారాయణ గారిని మేము కోరగా, వారు ఈ పొత్తమును వ్రాసి మాకొసంగినందుకెంతయు కృతజ్ఞఉలము.
శ్రీయుత సత్యనారాయణగారిని ఆంధ్రులకు పరిచయము చేయవలసినంత అభాగ్యము మన రాష్ట్రమున కింకను పట్టకున్నను, అతనిని గూర్చి ఒకటి రెండు మాటలిచ్చట వ్రాయుచున్నందుకు పెద్దలు క్షమింతురు గాక ! అతను 1921 లో మన రాజమహేంద్రవరము నందలి గవర్నమెంటు ట్రెయినింగు కాలేజీలో యల్. టి. క్లాసును విడచిపెట్టి, అసహాయోద్యమములోని కుఱికి, "మాకొద్దీతెల్లదొరతనము" మొదలుగా గల అనేక జాతీయ గీతములను వ్రాసి ఆంధ్రులచే పాడించి దేశము నుఱ్ఱూతలూగించిన కవిశిఖామణి. ఆనాటి ప్రభుత్వ వర్గమువారి క్రోధమునకు గుఱియై, సుమారు మూడు సంవత్సరముల దీర్ఘశిక్ష ననుభవించియుండెను. నాటినుండి నేటి వరకును అతనికి మనదేశపు మహిమమును, సదుద్యమములను కీర్తించుచు జనసామాన్యమును ప్రబోధించు చుండుటయే ప్రియతమమగు వ్రతముగ నున్నది. అతను వ్రాసి ప్రకటించిన కీర్తనలకును, ప్రకటించలేక దాచుకోవలసివచ్చిన కృతులకును అంతులేదనవచ్చును. ఆ ప్రవాహమున కదియేసాటి.
ఆంధ్రదిన మాసపత్రికలలో అతను వ్రాయుచుండిన వ్యాసములను బరికించిన వారికి అతని గద్య రచన యొక్క మాధుర్యమును విశాల విషయ పరిజ్ఞానమును తెలిసియేయున్నది. అతను తన పేరును ప్రకటించుకొనకనే "గృహలక్ష్మి", "వాహిని" మొదలగు పత్రికల కొనరించిన వ్యాసరూపక కథారూపక గీతరూపక సేవలు అతీతములు. అయినను అతని సేవలకెల్లయును ఫలము అవసరమున్నన్నాళ్లు ఆదరించబడుటయు, అది తీరిన వెంటనే విస్మరించబడుటయు నగుచున్నది.
1931 లో రాజమహేంద్రవరము నందు రామదాసు కో ఆపరేటివు ఇనిస్టిట్యూటు తరఫున నడుపబడిన గ్రామ పునర్మిర్మాణ తరగతుల కతను ప్రధానాచార్యుడై 80 మంది యువకులకు మంచి శిక్షణము నొసంగిన సంగతి యెల్లరకును దెలియును. ఇటువంటి అనుభవీయుని రచనలు ప్రాథమిక పాఠశాలలలో ప్రవేశపెట్టి, బాలబాలికల డెందముల నుద్దీప్తములు చేసి, భారతదేశము యొక్క ముందు సంతతిని సత్పౌరులుగను, సదాశయులుగను తయారు చేయవలసిన బాధ్యత ప్రస్తుత కాంగ్రెసు మంత్రులపై నున్నదనుటకు సందేహము లేదు. కాంగ్రెసువారికి ప్రభుత్వశాఖలు వశమైనందుకు సత్ఫలము ఇటు వంటివారు నేటివరకు కాంగ్రెసుకు చేయుచున్న సత్సేవలను ప్రభుత్వశాఖల ద్వారా ప్రజలందరిలోనికి ప్రసరింపజేయుటయే కదా !
ఆంధ్రదేశములో కాంగ్రెసు యొక్క అఖండవిజయమునకు వీరి "దేశీయగీతములు"ను ఇతర యెన్నికల పాటలును యెంతో సహాయకరములైనవని యెరుగనివారు లేరు. వీరి రచనలు కాంగ్రెసు విజయమున కెట్లు సహాయభూతములైనవో విద్యాశాఖ మూలముగా కావలసియున్న భావి విజ్ఞాన ప్రపోషణము అంతే సహాయభూతములు కాగలవు. పరమేశ్వరానుగ్రహము వలన ప్రస్తుతోన్నత స్థానముల నధిష్టించుచున్న కాంగ్రెసు నాయకులపై ఇటువంటి వారిని జ్ఞాపకముంచుకొని వీరి విజ్ఞానమును నూతన మార్గముల నుపయోగించుకొనవలసిన బాధ్యత యున్నదని చెప్పుట అప్రస్తుతము కాదు. ప్రస్తుతము మద్రాసునందే ఉండుకొన్న వీరికి ఇటువంటి అవకాశములు కల్పించుట కాంగ్రెసువర్గము వారి కర్తవ్యమై యున్నదని మనవి చేయగోరెదము.
రాజమహేంద్రవరము
1-12-37
హిందూస్తాన్ పబ్లిషింగు కంపెనీ (లిమిటెడ్)