చిరస్మరణీయులు, మొదటి భాగం/ముహమ్మద్‌ షేర్‌ అలీ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

63

చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf

23. ముహమ్మద్‌ షేర్‌ అలీ

(1842-1872)

స్వాతంత్య్ర సంగ్రామంలో ఉమ్మడి ఉద్యమాలు, వ్యక్తిగత పోరాటాలూ జమిలిగా సాగాయి. ప్రజలు ఏకోన్ముఖంగా సాగి నిర్వహించిన ఉద్యమాలలో బలమైన స్వేచ్ఛా కాంక్ష వ్యక్తం కాగా, వ్యక్తిగత పోరాటాలలో మాతృదేశం పట్ల ప్రగాఢమైన ప్రేమ, పరాయి పాలకుల పట్ల తిరుగులేని ద్వేషం, అత్యున్నత స్థాయి ధైర్య సాహసాలు బహిర్గతమయ్యాయి. ఈ మేరకు వ్యక్తిగత త్యాగాల బాటన నడిచిన యోధులలో మహమ్మద్‌ షేర్‌ అలీ ఒకరు.

ప్రస్తుత పాకిస్థాన్‌లోని పెషావర్‌లో 1842లో జన్మించిన మహమ్మద్‌ షేర్‌ అలీ చిన్ననాటనే పరాయి పాలకులకు వ్యతిరేకంగా వహాబీ యోధులు సాగిసున్న పోరాటాలతో ఉత్తేజితులయ్యారు. 1863లో పెషావర్‌ నుండి అంబాల వచ్చి స్థిరపడ్డారు. అంబాలలో జరిగిన ఘర్షణల కారణంగా 1868 ఏప్రియల్‌ 2న ఆయనకు ఉరిశిక్ష పడింది. అలీ మంచి ప్రవర్తన వలన ఆ శిక్షను కాస్తా ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులు ద్వీపాంతరవాస శిక్షగా మార్చి 1869లో ఆయనను అండమాన్‌ జైలుకు పంపారు.

ఆ విధంగా అండమాన్‌ జైలుకు చేరుకున్నషేర్‌ అలీ వహాబీ ఉద్యమ కార్యకర్తగా దేశంకోసం, స్వజనుల కోసం ఏమీ చేయకుండానే జైలులో ఇరుక్కుపోయానని మదన పడ్డారు. వహబీ యోధుల మీద ఆంగ్లేయాధికారులు సాగిస్తున్న దామనకాండను ఆయన

చిరస్మ రణీయులు 64

సహించలేకపోయారు. మాతృదేశాన్ని ఆక్రమించుకుని స్వదేశీయుల మీద పెత్తనం చలాయిస్తున్న ఆంగ్లేయుల మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. ఆ లక్ష్యందిశగా తగిన పదకం రూపొందించుకుని, తన ఎత్తుగడలను మార్చి జైలులో మంచిగా ప్రవర్తిస్తూ ఆంగ్లేయాధికారులకు సన్నిహితులయ్యారు. ప్రతిఫలంగా లభించిన స్వేచ్ఛతో జైలులోని ఖైదీలకు క్షవరం చేసేందుకు అంగీకారం పొంది అవసరమైన సామాగ్రి సంపాదించు కున్నారు. ఆ సామాగ్రిలో భాగంగా లభించిన కుర కత్తిని శతృ సంహారానికి ఉపయాగించు కోవాలని నిర్ణయించుకుని, అదను కోసం ఎదురు చూడసాగారు.

1872 ఫిబ్రవరి 8న బ్రిటిష్‌ వైశ్రాయ్‌ లార్డ్‌ మేవ్‌ అండమాన్‌ జైలుకు వచ్చాడు. ఆ అవకాశాన్నివృధాగా పోనివ్వదాలచుకోలేదు. క్షురకర్మ ల సామాగ్రిలో ఉన్న పదునైన కత్తిని తయారుగా ఉంచుకుని షేర్‌ లాగా వేట కోసం కాపుకాశారు. ఆంగ్లేయుడు లార్డ్‌ మేవ్‌ జైలులోని గదులను సందర్శిస్తు వస్తున్న సమయంలో ఆకలిగొన్న సింహంలా మేవ్‌ మీద లంఫిుంచి అతడ్నిహతమార్చి షేర్‌ అలీ తన చిరకాల లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.

ఆ తరువాత జరిగిన విచారణలో లార్డ్‌ మేవ్‌ను అంతం చేసింది తానేనని స్పష్టంగా అంగీకరిస్తూ, నా మాతృభూమి విముక్తి కోసం ఏనాడయితే నేను పోరాట దీక్షచేపట్టానో, ఆనాడే నా ప్రాణం మీద తీపిని వదలుకున్నాను...మన శత్రువులలో ఒకరిని నేను అంతం చేశాను...నేను నా కర్తవ్యాన్నినిర్వహించాను...నా పవిత్ర కార్యంలో భగవంతుని వద్ద మీరంతా నాకు సాక్ష్యం అని షేర్‌ అలీ ప్రకటించారు.

చివరకు విచారణ తంతును పూర్తిచేసిన న్యాయస్థానం షేర్‌ అలీకి మరణదండన విధించింది. ఈ మేరకు 1872లో ఉరిశిక్ష అమలు జరిగిన రోజున ఆయనమాట్లాడుతూ, నేను చేసిన పని పట్ల కించిత్తు బాధపడటంలేదు...ఎంతో గర్విస్తూ, మరణాన్ని స్వీకరిసున్నాను అన్నారు. చివరకు ఏమాత్రం బాధ-భయం లేకుండా ఖురాన్‌ గ్రంథంలోని ఆయత్‌లను మననం చేసుకుంటూ షేర్‌ అలీ ఉరిత్రాడును స్వయంగా స్వీకరించి మృత్యువును ఆనందంగా కౌగలించుకున్నారు.

ఆ యోధుని సాహసాన్ని స్మరిస్తూ, ఆ తరువాతి కాలంలో మాతృదేశ విముక్తి కోసం వలస పాలకులతో పోరాడిన ప్రతి విప్లవకారుడు షేర్‌ అలీ ధైర్యసాహసాలను, నిబద్ధతను ఆదర్శంగా తీసుకున్నాచ్రు అని ప్రముఖ చరిత్రకారుడు శాంతిమోయ్‌ రాయ్‌ తాను రాసిన Freedom Movement and Indian Muslims గ్రంథంలో ముహమ్మద్‌ షేర్‌ అలీకి ఘనంగా నివాళులు అర్పించారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌