చిరస్మరణీయులు, మొదటి భాగం/మజ్నూషా ఫకీర్

వికీసోర్స్ నుండి

4. మజ్నూషా ఫకీర్

( -1787)

ఇండియాలో అడుగిడిన బ్రిటిషర్లు మెల్లగా ప్రజల మీద పెత్తనం, దోపిడికి పాల్పడటం ప్రారంభించేసరికి రగిలిన ఆగ్రహావేశాల నేపద్యంలో 1765లో విజృంభించిన ఫకీర్లు తిరుగుబాటుకు నాయకత్వం వహించిన యోధులు మజ్నూషా ఫకీర్‌.

బెంగాల్‌ పరగణాలోని కాన్పూరు సమీపాన గల మాఖన్‌పూర్‌ గ్రామానికి చెందిన మజ్నూషాను ప్రజలు మంజూ షా అని కూడ పిలుచుకున్నారు. ధార్మిక వ్యవస్థాపరంగా చూస్తే ఈయన మదారి సాంప్రదాయానికి చెందిన ఫకీర్‌. మదారి తెగలో గురు-శిష్య సంబంధాలు చాలా పటిష్టంగా ఉంటాయి.

ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు, అధికారులు, వడ్డీవ్యాపారులు, జమిందారులు చేస్తున్న దోపిడి, దాష్టికాలను గమనించిన గురువు దార్వేష్‌ హమీద్‌ ఆదేశాల మేరకు మజ్నూషా పలు ప్రాంతాలను సందర్శించారు. ఆ సందర్భంగా ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్న ఆయన తన లక్ష్యాయలను ప్రజల ముందుంచగా ఆంగ్లేయుల రాక్షసచర్యలను సహించలేక ప్రజలు, క్షామపీడితులు మజ్నూషా వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు.

ఆనాడు ఈస్ట్‌ ఇండియా కంపెనీ దోపిడీ, పెత్తనాలకు వ్యతిరేకంగా తిరగబడిన ఫకీర్లకు నాగా సన్యాసుల స్నేహహస్తం లభించటంతో ఈ తిరుగుబాట్లను ఫకీర్లు -సన్యాసుల

చిరస్మ రణీయులు 26

తిరుగుబాట్లుగా చరిత్ర నామకరణం చేసింది. నాగా సన్యాసుల నాయకులు భవాని పాథక్‌తో మజ్నూషా సత్సంబంధాలను సాగించారు. జమీందారులు, వడ్డీ వ్యాపారులైన మహాజన్లు, కంపెనీ పాలకులు, అధికారుల మీద దాడులు జరిపి పేదవర్గాల ప్రజలకు ఆర్థిక భారం నుండి విముక్తి కల్గించి కంపెనీ పాలకులను ఖంగు తినిపించారు.

సన్యాసులు-ఫకీర్లను దోపిడీ దొంగలుగా, దుండగులుగా కంపెనీ పాలకులు ముద్రవేసినా ప్రజలు మాత్రం తమ రక్షకులుగా భావించి గౌరవించారు. మజ్నూషా పిలుపునిస్తే ఏ క్షణాన్నైనా వేలాది మంది సాయుదులైన ప్రజలు కంపెనీ బలగాలను ఎదుర్కొనేందుకు రాగలరని కంపెనీ పాలకులకు అధికారులు రాసిన డైరీలు నివేదికలలో స్పష్టంగా పేర్కొన్నారంటే, మజ్నూషా పట్ల ఉన్నా ప్రజాభిమానం అర్థమౌతుంది.

ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనను సవాల్‌ చేస్తూ సాగిన పోరాటాలలో కంపెనీ సాయుధ దాళాల ఉన్నతాధికారులను మజ్నూషా పలుమార్లు మట్టికరిపించారు. ఆయన ధాటికి తట్టుకోలేక కంపెనీ సైన్యాధికారులు బ్రతుకు జీవుడా అంటూ పారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రజల పక్షంగా కార్యకలాపాలను నిర్వహించేందుకు తన పూర్వీకుల గ్రామమైన మస్తాన్‌ఘర్‌ను ఎంచుకుని దశాబ్దాల పాటు విరామమెరుగక తన కార్యక్రమాలను విజయవంతంగా మజ్నూషా నిర్వహించారు.

1786 డిసెంబర్‌ 29న మజ్నూషాను ఎలా గైనాపట్టుకోవాలని బొగ్రా (BOGRA) జిల్లా ముంగ్రా గ్రామంలో విడిది చేసిన లెఫ్ట్ నెంట్ బ్రినాన్స్‌ బలగాలు, ఆయన స్థావరాన్ని చుట్టు ముట్టాయి. ఈ పోరులో మజ్నూషా తీవ్రంగా గాయపడి కదనరంగం నుండి తప్పుకుని మాఖన్‌పూర్‌కు చేరుకున్నారు. మజ్నూషా ను అరెస్టు చేయడానికి ఇంతకంటే మంచి అదను దొరకదని కంపెనీ అధికారులు భారీ సంఖ్యలో సాయుధ బలగాలను దించి, అంగుళం అంగుళం గాలించటం ప్రారంభించారు. పరిస్థితి ప్రమాదకరంగా మారినప్పటికీ, శత్రువు తమను అన్నివైపుల నుండి చుట్టుముట్టి ఉన్నందున, మజ్నూషాను చికిత్స నిమిత్తం మరొక ప్రాంతానికి తరలించటం సహచరు లకు ఏమాత్రం సాధ్యం కాకపోవటం ఆయనకు ప్రాణాంతకమయ్యింది.

సుదీర్గ… పోరాట చరిత్రలో పలుమార్లు శతృవు వలయం నుండి చాకచక్యంగా తప్పించుకున్నఆ యోధాునికి మృత్యువుకు టోకరా ఇవ్వటం ఈసారి సాధ్యమ్ కాలేదు. చివరకు తన పూర్వీకుల గడ్డ మాఖన్‌పూరులోని ప్రియమైన మస్తానఘర్‌లో సహచరులు, అనుచరులు, ప్రియజనుల మధ్య 1787లో మజ్నూషా ఫకీర్‌ కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌