చిన్నయసూరి జీవితము/బాలవ్యాకరణము

వికీసోర్స్ నుండి

8. బాలవ్యాకరణము

నేఁటికాలమున తెనుఁగుభాషకు బాలవ్యాకరణము పరమ ప్రామాణికగ్రంథ మని యాంధ్రవిద్వాంసు లెల్లరు నేకగ్రీవముగా నామోదించి యంగీకరించిన విషయము. బాలవ్యాకరణ మెట్లు ప్రాచీనభాషాసంప్రదాయములను నిలువఁబెట్టినదో, నవీనకాలమున నావ్యాకరణమునుబట్టి భాషాతత్త్వసంప్రదాయములను, భాషాపరిణామములను నెట్లు - తెలిసికొనఁగలమో, యావిషయములన్నియు నెఱుంగుటకు మనము తొలుత నాంధ్రవ్యాకరణములచరిత్ర పరిశీలింపఁదగియున్నది.

ఆంధ్ర, సంస్కృత వ్యాకరణములు

తెనుఁగుభాషకుఁ బ్రాచీన కాలమునుండియు వ్యాకరణములు కలవు. "మాట పుట్టినవెనుక వ్యాకరణము, పాట పుట్టినవెనుక ఛందస్సు" అను నానుడి ననుసరించి భాష యేర్పడిన వెనుకను, కవితారచన కనంతరమునను వ్యాకరణములు రచితములగును. భాష ప్రవాహరూప మైనది. ఇది ప్రజల పలుకుబడిలో శీతోష్ణస్థితి భేదముల ననుసరించి, సాంఘిక వ్యవస్థల ననుసరించి, రాజకీయపరిస్థితుల ననుసరించి క్షణక్షణమును మార్పుఁ జెందుచుండును. అట్టి మార్పుల వలన భాష తన నైసర్గిక స్వరూపమును కోల్పోకుండ భాషాతత్త్వవేత్తలు వ్యాకరణమును రచింతురు. తెనుఁగుభాషకు నట్టివ్యాకరణములు తొలుదొల్త తెనుఁగునందే రచితములైనవి. *[1] వానిలో కేతన రచించిన 'ఆంధ్రభాషాభూషణ' మను వ్యాకరణ మొదటిది. ఆ వెనుక కవులు రచించిన కావ్యములను పరిశీలించి వైయాకరణులు ప్రయోగములను సేకరించి, వానిని ప్రచారమున నున్న వ్యాకరణసూత్రములతో సమన్వయము చేయ నారంభించిరి. వీనికే లక్షణ గ్రంథము లని పేరు. క్రమక్రమముగా తరువాతి పండితులు కవిప్రయుక్తములై లక్షణగ్రంథములచే నంగీకృతములైనవానినే గ్రంథములందు ప్రయోగించుచు కేవల వ్యాకరణము ననుసరించుట మానిరి. అందుచే కేతన వెనుక వ్యాకరణశాస్త్రమే ప్రధానముగాఁ గాక దానితో ఛందశ్శాస్త్రమునుగూడ పండితులు రచించిరి. విన్నకోట పెద్దన ఛందోవ్యాకరణములను రెండిటిని రచించినాఁడు. అనంతుని ఛందస్సున నట్లే ఛందోవిషయము ప్రధానముగను, వ్యాకరణ విషయ మప్రధానముగను నున్నవి. తాతంభట్టు రెండిటినిగూర్చి "కవిచింతామణి, ఛందోదర్పణ" మను రెండుగ్రంథములను రచించెను. ఇవియన్నియు తెనుఁగున పద్యరూపమున రచితములు. అటుపిమ్మట లింగముగుంట తిమ్మన, ముద్దరాజు రామన్న, కూచిమంచి తిమ్మకవి మొదలగు లాక్షణికులు కేవల కవిప్రయోగములనే ప్రమాణీకరించి లక్షణగ్రంథముల రచించిరి.

వీరు ప్రమాణీకరించిన భాష నన్నయభట్టారకాది కవి త్రయమువారి భాషయేకాని వేఱుగాదు. నేఁడు వాఙ్మయమున ప్రసిద్ధికెక్కుచున్న నన్నెచోడ పాల్కురికి సోమనాథాది శివకవుల భాషను వారు గ్రహింపనే లేదు. కాఁబట్టి లక్షణగ్రంథములు విశాలములుగాక సంకుచితములై భాషయొక్క వివిధ పరిణామములలో నొకదానిని మాత్రమే వివరించియున్నవి. కొంతకాలమునకు కవులు లాక్షణికుల నిరంకుశత్వమునకు లోఁబడి వా రంగీకరించిన ప్రయోగములతోనే రచనలఁ గావించుచు వచ్చిరి. ఇందుల కుదాహరణముగా క్రీ. శ. 1656 - వ సంవత్సరమున అప్పకవిచే రచింపఁబడిన అప్పకవీయమును గ్రహింపవచ్చును. తరువాతి రచయితలు అప్పకవీయమునే ప్రమాణముగాఁ గొని ప్రాచీన కవి ప్రయోగములను నిరసించుచు వచ్చిరి. దీనివలన భాషయొక్క స్థిరత్వము క్రమముగా సడలినది.

తెనుఁగువ్యాకరణములు సంస్కృతములో కూడ విరచితములైనవి. వానిలో నన్నయ విరచితమని చెప్పఁబడు 'ఆంధ్ర శబ్దచింతామణి'యు, అథర్వణాచార్యకృతమగు 'అథర్వణ గారికావళి'యు ముఖ్యములు. వీనిలో నాంధ్ర శబ్ద చింతామణి మిక్కిలి ప్రసిద్ధిలోనికి వచ్చినది. దీనికి ఎలకూచి బాలసరస్వతి రచించిన తెలుఁగు టీక ప్రచారములో నున్నది. అప్పకవి 'చింతామణి' నే యాధారముగాఁగొని పద్య కావ్యముగా రచించినాఁడు. కాని యతఁడు సంధి పరిచ్ఛేదమువఱకు మాత్రమే రచించినాఁడు. ఆ వెనుక అహోబలపండితుఁ డను విద్వాంసుఁడు 'కవి శిరోభూషణ' మను పేర నొక విపుల సంస్కృత వ్యాఖ్య రచించినాఁడు. దీని కహోబలపండితీయ మని పేరు. చిన్నయసూరికి ముందుకాలమున పై గ్రంథములన్నియు ప్రామాణికముగ సంగీకృతములై బహుళ ప్రచారములో నున్నవి. ఇవికాక 'వాసుదేవ వృత్తి', 'వైకృతి చంద్రిక' మున్నగు సంస్కృత వ్యాకరణములు తెనుఁగునకుఁ గలవు.

ఆంగ్ల భాషామయ వ్యాకరణములు

సంస్కృతాంధ్ర భాషలలోనున్న వ్యాకరణములు కేవలము తెనుఁగు పండితు లగువారికి, నితరులకు దుర్గ్రాహ్యము లగుటంజేసి యాంగ్లేయుల పరిపాలనా ప్రారంభమున సులభ శైలిలో వ్యాకరణములు రచించుచు వచ్చిరి. దీనికి దారి చూపినవారు కంపెనీవారి కాలమునందలి ఇంగ్లీషు ఉద్యోగస్థులే. వారిలో Carey (క్యేరి), Campbell (క్యాంపుబెల్ - కాంబెల్), Brown (బ్రౌను) అనువారు ముఖ్యులు. వీరి వ్యాకరణములు ముద్రితములై యాకాలమున ప్రథమముగా తెనుఁగు వ్యాకరణము నభ్యసించువారి కుపయుక్తములై యొప్పారుచుండెడివి. కాని యిందలి భాష వ్యావహారికము. వీరి వ్యాకరణములు వ్యవహార భాషకేకాని కవిప్రయుక్తమైన గ్రాంథికమునకుఁగాదు. కావున నివి మిక్కిలి సంకుచిత ప్రయోజనము గలవియై వ్యాకరణాభ్యాస పాటవమును పెంపొందింప లేకపోయినవి.

ప్రభుత్వమువారు ఫోర్టుసెంటుజార్జి కోటలో తెనుఁగు నేర్పుటకు ప్రసిద్ధులగు సంస్కృతాంధ్రపండితులను నియమించిరి. వారును వ్యాకరణ రచనమునందుమాత్రము సులభ మగు రీతినే యవలంబించిరి. వ్యాకరణ విషయములు మనస్సునకు పట్ట నట్లుగా రచించుటయే వారి లక్ష్యముకాని పరంపరా యాతమగు భాషా పరిణామమును నిర్వచించుటకును, ప్రాచీన ప్రయోగముల లక్ష్య లక్షణ సమన్వయము చేయుటకును వారు పూనుకొనలేదు. చిన్నయసూరి క్రీ. శ. 1858 లో బాలవ్యాకరణమును ముద్రించునాఁటికి తెనుఁగున పై పండితులు వ్రాసిన యీ క్రింది వ్యాకరణములు ప్రచారములో నుండెడివి.

1. పట్టాభిరామ పండితీయము: వేదము పట్టాభిరామశాస్త్రి కృతము. ఇది యాంధ్రశబ్దచింతామణికి వ్యాఖ్య. ఇతఁడె యాంధ్రశబ్దానుశాసన మను నొక వ్యాకరణము తెనుఁగున పద్యరూపముగ రచించెను. దీని రచనా కాలము 1816.

2. గురుమూర్తిశాస్త్రి వ్యాకరణము: ఇది ఫోర్టుసెంటుజార్జి కళాశాలలో ప్రధానపండితులగు రావిపాటి గురుమూర్తిశాస్త్రి కృతము. దీని రచనా కాలము 1836. ఇది విపులమగు వ్యాకరణము. దీనిని చిన్నయసూరి పాఠము చెప్పియున్నాఁడు. ఆ కాలమున నిది చాల ప్రచారము గాంచినది.

3. ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణము: పుదూరి సీతారామశాస్త్రి కృతము. పేరునుబట్టియే దీని స్వరూపము తెలియఁగలదు. ఇందు ప్రశ్నలును, జవాబులును కలవు. 1852 లో నిది ముద్రితము.

4. ఉదయగిరి శేషయ్యశాస్త్రి వ్యాకరణము: ఇది 1856 లో వెలువడినది. ఇదియును ప్రచారములో నున్న దే. 5. నరసాపుర వ్యాకరణము: దీనిని శ్రీ వేదం వెంకటరమణ శాస్త్రులవారు రచించిరి. వీరు శ్రీవేదం వెంకటరాయశాస్త్రిగారికి జనకులు. వీరు 1856 లో నరసాపురములో నున్నప్పుడు దీనిని ప్రకటించిరి.

ఇవియన్నియు కేవలము తెనుఁగుభాషా సంప్రదాయములను దిక్ప్రదర్శనముగా తెలుపుటకు మాత్రమే యుద్దేశింపఁ బడినవి. ఉత్తమ సాహిత్య విద్య కాధారములగు ప్రాచీన కావ్య రచనలు పరిశీలించుటకు, భాషాలక్షణ పరిపాటి తెలియుటకు సంస్కృత వ్యాకరణ విశేషములు తెలియుట యత్యంతావశ్యకము. తెనుఁగుభాషతో సంస్కృత భాషకు నవినాభావ సంబంధము కలదు. ఆ భాషా వ్యాకరణ పరిపాటిని తెలియనిదే తెలుఁగు కవుల శైలిని గ్రహించుట కష్టతరము. ఇప్పటివలెఁ గాక పూర్వకవులు సంస్కృతమున చక్కని పండితులై తెనుఁగు భాషా సంప్రదాయములను తెలిసికొని రచనలను గావించెడివారు. కాఁబట్టి సంస్కృత వ్యాకరణాభ్యాసము ఆంధ్ర వైయాకరణుల కావశ్యకమై యున్నది.

చిన్నయసూరి పై పరిస్థితులను గమనించి సంస్కృతాంధ్ర భాషావ్యాకరణ పద్ధతులను సమన్వయించి నూతన రీతిని బాలవ్యాకరణమును రచించినాఁడు. ఇది బాలవ్యాకరణ మను పేరుతో వెలసినను ప్రౌఢపండితులకు సైతము సుగమము కాదు. ఐనను చిన్నయసూరి దీని కీ పేరు పెట్టుటకు సిద్ధాంతములుగా గ్రహింపఁదగిన విషయములను సూత్రప్రాయ ముగా బాలురు కంఠస్థము చేయుటకు తగినట్లు రచించుటయే కారణము.

ముందు వివరించినట్లుగా బాలవ్యాకరణ రచనకు పూర్వము చిన్నయసూరి యభ్యాస రూపముగా చిన్న చిన్న వ్యాకరణ గ్రంథములను రచించియున్నాఁడు. సంపూర్ణ వ్యాకరణ సూత్రపరిణతికి నీ గ్రంథములు సోపానములవంటివి. వ్యాకరణమును పద్యములలో రచించిన వ్యర్థపదము లే వేవి తొలఁగింపవలసి యుండునో యవి కనుఁగొనవచ్చును. అందుచేతనే సూరి మొదట ఆంధ్రశబ్దానుశాసనమును పద్యములలో వ్రాయుటకుఁ గడంగెను. ఆ వ్యర్థ పదములను విసర్జించి వానిని కొన్ని చిన్న సూత్రములుగా శబ్దలక్షణ సంగ్రహమున రచించెను. వానిలో నేమేని దోషములున్నచో నవి తొలఁగి పోవుటకు వానిని సంస్కృత భాషలో రచించెను. ఈ సంస్కృత సూత్రములు తాను స్వయముగా రచించినవి కాఁబట్టియే బాలవ్యాకరణము చివర సూరి యిట్లు చెప్పియున్నాఁడు:

                "మును మదుపజ్ఞం బగుచును
                  తనరిన వ్యాకృతికి సూత్రతతి యొకకొంతం
                  దెనిఁగించి యిది ఘటించితి
                  ననయము బాలావబోధ మగుభంగిఁ దగన్."

ఇట్లు కంఠోక్తిగా సూరి బాలవ్యాకరణము తన స్వతంత్ర రచన యని చెప్పుచుండఁగా నీ తర్వాత నా రచన మును గూర్చి యొక వివాదము వెలువడినది. అది యేమన: చిన్నయసూరి కాలమున శిష్టు కృష్ణమూర్తిశాస్త్రి యను నొక యుద్దండపండితుఁడు విలసిల్లియుండెను. ఆతఁడు 'హరికారిక' లను నొక సంస్కృత భాషలోనున్న తెనుఁగు వ్యాకరణ సూత్రములకు నొక వ్యాఖ్య రచించెననియు, నా వ్యాఖ్యనంతటిని సూరి తెనుఁగుభాషలో రచించెననునది. దీనికి వారు నుపపత్తి యేమనఁగా కృష్ణమూర్తిశాస్త్రి ప్రాచీన పండితుఁడై నవీనపథకములు తెలియనివాఁడగుటచే 'చందోయి' మొదలగు నుదాహరణములను తన వ్యాకరణములో నిచ్చె ననియు, సూరి నవీనకాలమున విద్యార్థులకు తగినట్టు లౌచిత్యమును పాటించి పాఠము చెప్పవలసినవాఁడగుటచే దానిని కందోయిగా మార్చెననియు నందురు. కాని సూరియే ఒకసూత్రమున యువతీవిటిరజస్వలల పేర్కొనుటచే నిట్టి మార్పు కావించియుండఁ డని మనము చెప్పఁగలుగుచున్నాము. ఈ వాదమునకు ముఖ్యులు కల్లూరి వెంకటరామశాస్త్రిగారు. వీరు గుప్తార్థప్రకాశికయందు పదునాలుగు యుక్తులను వివరించి యిది చిన్నయసూరి కృతము గాదనియు, కృష్ణమూర్తిశాస్త్రిగారి రచనమే యనియు సిద్ధాంతీకరించియున్నారు. ఈసిద్ధాంతమును పూర్తిగ ఖండితమైనది. *[2] కావున నిచ్చట నప్రస్తుతము.

బాలవ్యాకరణ వివరణము

బాలవ్యాకరణమున నీక్రిందిపరిచ్ఛేదములును, సూత్రములును గలవు: -

1. సంజ్ఞాపరిచ్ఛేదము. ఈపరిచ్ఛేదమున వర్ణసమామ్నాయమును భాషావిభేదములును తెలుపఁ బడినవి. సూత్రములు 23
2. సంధిపరిచ్ఛేదము. ఇది సంధులనుగూర్చి తెలుపును. సూత్రములు 55
3. తత్సమపరిచ్ఛేదము. ఇది సంస్కృత సమములనుగూర్చి తెలుపును. సూత్రములు 87
4. ఆచ్ఛికపరిచ్ఛేదము. ఇది అచ్చ తెనుఁగు పదములఁగూర్చి తెలుపును. సూత్రములు 38
5. కారకపరిచ్ఛేదము. ఇందు విభక్తుల కొకదానికి, మరియొకదానికిఁ గల సంబంధము తెలుపఁ బడినది. సూత్రములు 37
6. సమాసపరిచ్ఛేదము. ఇందు సంస్కృతాచ్ఛికమిశ్ర సమాస భేదములు వివరింపఁబడినవి. సూత్రములు 26
7. తద్ధితపరిచ్ఛేదము. ఇది తెనుఁగున విశేష్యప్రత్యయములను తెలుపును. సూత్రములు 28
8. క్రియాపరిచ్ఛేదము. ఇందు తెనుఁగు సంస్కృతధాతువుల నుండి యేర్పడిన క్రియలయొక్క రూపనిష్పత్తి యంతయును వివరింపఁ బడినది. సూత్రములు 124
9. కృదంతపరిచ్ఛేదము. ఇందు క్రియలమీఁద నేర్పడిన విశేష్యములు తెలుపఁబడినవి. సూత్రములు 22
10. ప్రకీర్ణకపరిచ్ఛేదము. ఇందు పూర్వపరిచ్ఛేదములలో వదలి పెట్టఁబడిన విషయములు వివరింపఁ బడినవి. సూత్రములు 25
10 పరిచ్ఛేదములు. సూత్రములు 465

భాషాసంప్రదాయముల నామూలాగ్రముగా పథించి యంతకుముందు లేని సంస్కృతవ్యాకరణపద్దతిని నాలుగువందలయఱువదియైదు సూత్రములతో ప్రామాణికమగు ప్రశస్త వ్యాకరణము పది పరిచ్ఛేదములలో రచించిన చిన్నయసూరి ప్రతిభ యనన్యసామాన్యమైనది కదా! ఈ వ్యాకరణవిశిష్టత నిట్లు నిరూపింపవచ్చును.

1. సూత్రములు సంగ్రహముగ నుండుటవలన కంఠస్థముచేయుట కనుకూలమైయున్నవి.

2. వ్యర్థపదములు లేకుండుటచే వ్యాకరణవిషయము సరిగా గ్రహించుట కనువుగా నున్నది.

3. ఈ వ్యాకరణపఠనవలన సంస్కృతభాషావ్యాకరణ పరిపాటి గ్రహించుటకు వీలు గలిగియున్నది. 4. తెనుఁగువ్యాకరణమునకు శాస్త్రీయమగు వ్యాకరణ పరిభాష (Grammatical technique) యంతకుముందు లేదు. ఈవ్యాకరణమున ఆయాపరిభాషికపదములు సందర్భము ననుసరించి చక్కఁగా వ్యవహృతములైనవి.

5. ఇంతకుముందున్న వ్యాకరణములు కేవలము తెనుఁగుభాషా సంప్రదాయములను విపులముగా వివరించినవే కాని తెనుఁగునకు, సంస్కృతమునకుఁ గల యవినాభావసంబంధమును గుర్తించి రచితములు కాలేదు. ఇం దాసంబంధము తేట తెల్లముగా నిరూపితమైనది.

6. దీనికి పూర్వవ్యాకరణములు వ్యావహారికభాష నే ప్రధానముగా గ్రహించి వ్రాయఁబడినవి. బాలవ్యాకరణము పండితవ్యవహారమున నున్న గ్రాంథికభాషనే యాధారముగాఁ గొని రచింపఁబడినది.

7. ఈనాఁడు ప్రాచీనప్రయోగములను లక్ష్యలక్షణ సమన్వయము కావించుటకు బాలవ్యాకరణ మెంతో సహాయకారి యగుచున్నది.

8. ఇత:పూర్వవ్యాకరణములం దింత విశదముగ పరిచ్ఛేద విభాగముగాని, సూత్రముల పరస్పర సంబంధముగాని యెందును గానరాదు. దీనివలన వ్యాకరణము నభ్యసించు పాఠకుల -----ష్టమును గంభీరము నగు వ్యాకరణ విషయ మద్దమునందువలె స్వచ్ఛముగా కనఁబడుచున్నది.

ఆంధ్రవాఙ్మయమున నన్నయనాఁటినుండియు నే వ్యాకరణకర్తలును లాక్షణికులును సాధింపలేని వ్యాకరణ రచన మను నొక మహాకార్యమును చిన్నయసూరి మహాసమర్థతతో నిర్వహించి యాచంద్రార్కము తన నామము భాషా ప్రపంచమున ప్రకాశ వంతమగునట్లు నిలుపుకొనినాఁడు. భాషా పాండిత్యమునకు శబ్దశుద్ధి, శబ్దసిద్ధి ప్రధానములు. ఈ రెండు గుణములను సమ్మేళనముచేసి రచనలను గావించి కవులు శాశ్వతమగు కీర్తిని గడించుటకు మార్గదర్శకమైనది బాలవ్యాకరణము. ఇది భాషాకల్పకమునకు నిత్యపరిమళములను వెదజల్లు పారిజాతకుసుమమువలె సర్వకాలములను వాసింపఁగలదు. ఇట్టి రచనఁ గావించిన చిన్నయసూరి పాఠకలోకమునకు, పండిత లోకమునకు ప్రాత:సంస్మరణీయుఁడు గదా!

బాలవ్యాకరణమునే కాక, చిన్నయసూరి భాషాశాస్త్ర ప్రాథమిక విద్యా శిక్షణ కనుకూలమగు రచనలను కావించి యున్నాఁడు. అక్షరాభ్యాసము మొద లాంధ్ర వచన రచనా పరిణతికి నవి తోడ్పడునవి.

అక్షర గుచ్ఛము

బాలురు, బాలికలు ప్రథమమున భాష నేర్చుకొను నపుడు సరియగు వర్ణక్రమమును గుణితమును సక్రమరీతి నభ్యసింపఁజేయుటకై చిన్నయసూరి యకారాదిక్రమమున నీ యక్షర గుచ్ఛమును రచించి ప్రకటించెను. ఇదియును చాల కాలమువఱకు పాఠాశాలలలో ప్రాథమిక విద్యాభ్యాసవరుల కుపయుక్తమై యుండెడిది. ఇందు ముందుగా నచ్చులును, పిమ్మట హల్లులును, ఆ వెనుక నచ్చులతో కూడిన హల్లులు గల చిన్న పదములును తెలుపఁబడినవి. సంస్కృత పదముల యుచ్చా రణమునుబట్టి చక్కగా వ్రాయుటకును తెనుఁగు వ్రాఁతయందు తప్పులు లేకుండ నుండుటకును మిక్కిలి యుపకరించుచున్నది. గుణింత క్రమమునకు వీరు కొన్ని సూత్రములనుకూడ నచ్చటచ్చట రచించిరి. వ్యాకరణ సూత్రములుకూడ కొన్నింటి నచ్చటచ్చటఁ జేర్చిరి. ఇట్లు పదములు తెలిపిన వెనుక క్రియా రూపములు చెప్పఁబడినవి. ఇవి రెండువిధములుగా విభజింపఁబడి యున్నవి: 1. తత్సమ క్రియలు, లేక సంస్కృత సమక్రియలు, 2. వికృతి క్రియలు, లేక దేశ్యక్రియలు. సంస్కృత క్రియలలో ఇతంజంతములు, మతుబంతములు, ఇన్వంతములు, మత్వర్థీయములు, ఆల్వంతములు, భావప్రత్యయాంతములు, తవ్యాంతములు, అనీయంతములు, తుజంతములు, యుడంతములు మొదలగు వ్యాకరణ పారిభాషికము లనేకము లిందు తెలుపఁబడినవి. వికృతి రూపములకు భూత వర్తమాన భవిష్యదర్థక రూపములును చూపఁబడినవి. కేవలము బాలు రుచ్చరింపలేని కష్టతమమైన యుచ్చారణమును సులభ రీతిని గ్రహించుటకు నిందు ప్రయత్నము చేయఁబడియున్నది. ఇది యెంతయు శ్లాఘనీయమై యున్నది. నేఁటి స్వరశాస్త్ర పద్ధతులను, అనగా Phonetic laws ననుసరించి యిది విరచితమైనది. ఈ అక్షరగుచ్ఛము చదువుటచే సంస్కృతాంధ్రముల రెండింటిని చక్కఁగా నలవఱచుకొనవచ్చును. భాషాభ్యాసకులకు నిది ప్రథమ సోపానమువంటిది యని చెప్ప నొప్పును.

విభక్తి బోధిని

భాష నభ్యసించువారు తొలుత నక్షరములను, గుణింతములను నేర్చుకొందురు. ఆ వెనుక పదములు నేర్చుకొందురు. వీని రెండింటికొఱకు చిన్నయసూరి అక్షర గుచ్ఛమును రచించెను. ఇఁక పదములు నేర్చుకొన్న వెనుక నొక పదమునకు మఱియొక పదమునకుఁ గల సంబంధమును తెలిసికొనవలయును. దీనికొఱకు చిన్నయసూరి 'విభక్తి బోధిని' యను గ్రంథమును రచించెను. ఇది సంస్కృతమున శబ్దమంజరి ననుసరించి రచితమైనది. ఇందు తత్సమ శబ్దములకు, ఆచ్ఛిక శబ్దములకు ప్రథమాది సప్త విభక్తులయందు వచ్చు రూపములు చూపఁబడినవి. ఆ పైని సర్వ నామములకుఁగూడ సప్తవిభక్రి రూపములును కనఁబఱుపఁబడినవి. సంస్కృత భాషాభ్యాసకులకు శబ్దమంజరివలె నాంధ్రమున నిది విద్యార్థుల కత్యంతోపకారియై వెలయుచున్నది. దీనినికూడ పాఠశాలలయందు చాలకాలమువఱ కుపయోగించెడివారు. *[3] ఇది ప్రస్తుతము ప్రచారమున లేకున్నను మరల ప్రచారములోనికి తేఁదగినది.

  1. * తెలుఁగులో కావ్యభాషకే - అనఁగా కవిప్రయుక్తభాషకే వ్యాకరణము. "ప్రయోగశరణా వైయాకరణా" అను సూక్తి తెలుఁగు వ్యాకరణమువలనఁ గలిగినది.
  2. * ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక (1927) - ఆంధ్రవిశ్వకళాపరిషత్పండితులగు విద్వాన్ దువ్వూరి వేంకటరమణశాస్త్రిగారి వ్యాసము.
  3. * ఏఁబదేండ్ల క్రిందట - నా చిన్నతనమున మా నాయనగా రీ 'విభక్తి బోధిని' ని శబ్దమంజరివలె వల్లింపఁజేసిరి.